సంపాదకీయం
‘మహా’ పతనం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వివిధ పక్షాల సైద్ధాంతిక పతనం మహారాష్టలో నడుస్తున్న రాజకీయానికి ప్రాతిపదిక. ఘోరమైన అవకాశవాదం నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమ ఆర్భాటానికి ఇతివృత్తం! ‘జనాదేశం’ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన మార్గదర్శకమన్నది గతమైపోయింది, హతమైపోయింది.. జనాదేశాన్ని నిర్లజ్జగా, నిర్భయంగా ఉల్లంఘించవచ్చునన్నది మహారాష్టలో ప్రభుత్వ నిర్మాణ ప్రహసనాన్ని ప్రదర్శించిన, ప్రదర్శిస్తున్న రాజకీయ పక్షాలవారు నిరూపించిన ‘నీతి’! భారతీయ జనతాపార్టీ, శివసేన, జాతీయ భావ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ ప్రదర్శించిన నాలుగు స్తంభాల ఆటలో ప్రజాస్వామ్య ధర్మం నాలుగు కాళ్లూ విరిగిపోయి కూలబడి ఉన్న విషాద దృశ్యం వికృతంగా ఆవిష్కృతవౌతోంది. ఈ వికృత దృశ్యం సిద్ధాంతబద్ధ విరోధుల మధ్య సిగ్గులేని పొత్తు.. ఈ వికృత దృశ్యం మంత్రివర్గ నిర్మాణం.. ఈ వికృత దృశ్యం ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్న ‘విశ్వాస’ అభినయం.. ఐదు నెలలు కూడ కొత్త మంత్రివర్గం కొనసాగక పోవచ్చన్నది ఈ నాలుగు పార్టీల అంతరంగంలోని అభిప్రాయం. ఈ కఠోర వాస్తవాన్ని దాచి మూడు పార్టీల కృత్రిమ కూటమి వారు కృతక విశ్వాసాన్ని అభినయిస్తున్నారు. ఈ అబద్ధాన్ని జనం నమ్మడం లేదని ఈ ‘కూటమి’ వారికి తెలుసు! జనాదేశాన్ని ధిక్కరించి కూటమిని కట్టిన శివసేన, జాతీయభావ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ మత ప్రదాతల- వోటర్‌ల-ను ఇలా వెక్కిరిస్తున్నారు! భారతీయ జనతాపార్టీకి చెందిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలన్నది, శివసేనకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలన్నది గత నెలలో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ద్వారా ప్రస్ఫుటించిన ‘జనాదేశం’! ఈ జనాదేశం వమ్మయిపోవడం మూడు పార్టీల కూటమికి కృత్రిమ రూపం! ‘హిందుత్వం ఈ దేశపు వౌలిక అస్తిత్వం, ఈ దేశపు జాతీయ తత్త్వం’-అన్న వాస్తవం ఇన్ని సంవత్సరాలుగా శివసేన వికాసానికి సైద్ధాంతిక భూమిక! కాంగ్రెస్ అధిష్ఠానం ఈ సిద్ధాంతాన్ని మతోన్మాదంగా చిత్రీకరించడం దశాబ్దుల చరిత్ర. కాంగ్రెస్ దృష్టిలో ‘శివసేన అంటే మతోన్మాద రాజకీయ బీభత్సం..’. శివసేన దృష్టిలో ‘కాంగ్రెస్ అంటే జాతీయభావ వ్యతిరేక వైపరీత్యం..’. ఈ సైద్ధాంతిక ఘర్షణకు దశాబ్దుల తరబడి మహారాష్ట్ర రాజకీయ యుద్ధరంగం! ‘పాయసానికి ఉమ్మెత్త గింజలతో తిరగమోత పెట్టినట్టు’ ఈ రెండు పార్టీలు ఇప్పుడు జట్టుకట్టాయి. ఏది పరమాన్నం? ఏది ఉమ్మెత్త గింజల పోపు?- అన్న మీమాంస ఇప్పుడు అర్థం లేనిది.. ఈ రెండు పక్షాలకు ‘వారధి’గా మారిన శరత్ పవార్ నాయకత్వంలోని ‘‘జాతీయ భావ కాంగ్రెస్’’ సిద్ధాంతానికి ఏళ్లక్రితమే విడాకులిచ్చింది! కాంగ్రెస్ నుంచి శరత్ పవార్ వర్గం దాదాపు ఇరవై ఏళ్లక్రితం చీలిపోయి ‘జాతీయ భావ కాంగ్రెస్ పక్షం’- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- గా అవతరించడానికి ఏకైక కారణం భారతదేశపు జాతీయ తత్త్వం.
ఈ జాతీయతత్త్వం సిద్ధాంతాన్ని సోనియాగాంధీ అధ్యక్షతను అంగీకరించడం ద్వారా కాంగ్రెస్ సంస్థ నీరుకార్చివేయడం చరిత్ర.. 1998 మార్చి వరకు సీతారామ్ కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడు. పి.వి.నరసింహారావు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత 1997 జూన్‌లో కేసరి అధ్యక్షుడయ్యాడు. 1998 మార్చి 14వ తేదీన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షుడు సీతారామ్‌కేసరి. కానీ ఇతర కార్యవర్గ సభ్యులు సీతారామ్ కేసరిని అధ్యక్ష స్థానం నుంచి పక్కకు ఈడ్చేశారు. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టు ప్రకటించారు. అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఎంపిక అయినట్టు ప్రకటించారు. ఎన్నిక అయిన అధ్యక్షుడిని ఆయన పదవీ కాలం పూర్తికాకమునుపే ఇలా దౌర్జన్య పూరితంగా పదవి నుంచి తొలగించిన ‘కాంగ్రెస్ కార్యవర్గం’ చర్య దేశ విదేశాలలోని ప్రజాస్వామ్య భావ నిష్ఠులకు దిగ్భ్రాంతిని కొలిపింది. కాంగ్రెస్ కార్యకర్తలను విస్మయచకితులను చేసింది. అలా కేసరి తొలగిన అధ్యక్ష స్థానాన్ని వెంటనే సోనియాగాంధీ అలంకరించింది. ఇదీ కాంగ్రెస్‌లోని సంస్థాగత ప్రజాస్వామ్య చరిత్ర.. ఈ చరిత్రను శరత్ పవార్ వంటివారు వ్యతిరేకించారు. ఆయన ‘కొత్త కాంగ్రెస్’ను పెట్టడానికి అదీ అంకురార్పణ.. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానమంత్రి పదవులను మన దేశంలో పుట్టిపెరిగినవారు మాత్రమే నిర్వహించాలని ఇతర దేశాలలో పుట్టిపెరిగి భారతీయ పౌరసత్వం పొందినవారు ఈ పదవులను చేపట్టరాదన్న నిబంధనను విధించాలని శరత్ పవార్ వర్గీయులు వాదించారు. ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించాలని శరత్ పవార్, ఆయన సహచరులు కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదన పట్ల అలిగిన సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది. ఆమె అలక తీర్చడం కోసం 1999 మే 20న కాంగ్రెస్ కార్యవర్గం వారు పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. శరత్ పవార్ ‘జాతీయభావ కాంగ్రెస్’ను ఆరంభించడానికి ‘జాతీయ నిష్ఠ’ ఇలా ప్రధాన కారణం! ఆ తరువాత శరత్ పవార్ పార్టీవారు కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలోను, మహారాష్టల్రోను జట్టుకట్టడం ‘జాతీయ నిష్ఠ’ నీరుకారిన పరిణామం! ఇలా ఈ రెండు ‘కాంగ్రెస్’లూ సైద్ధాంతికంగా ఇప్పటికే దివాలా తీశాయి. వీటితో చేరిన ‘శివసేన’ ఇప్పుడు సైద్ధాంతిక శిఖరం నుంచి అవకాశవాదపు పాతాళ గహ్వరంలోకి పడిపోయింది... ఎవరికి బాధ? మతప్రదాతలు మన్నిస్తారా??
అవకాశవాదపు పరుగుపందెంలో తాము వెనుక పడలేదని నిరూపించడానికి ‘్భజపా’ విఫలయత్నం చేయడం మహారాష్టల్రో నడుస్తున్న భ్రష్ట రాజకీయానికి సర్వసమగ్రత్వాన్ని సంతరించిపెట్టిన విపరిణామం. ఐదేళ్లపాటు స్వచ్ఛమైన పరిపాలనను సమకూర్చి మంచి పేరుతెచ్చుకున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. ఈ ఐదేళ్ల స్వచ్ఛతకు ‘భాజపా’ అధిష్ఠానం నడిపిన ‘అర్ధరాత్రి నాటకం’ వల్ల మచ్చ ఏర్పడింది. మహాభారత యుద్ధంలో ధర్మం వైపున పోరాడిన ఘటోత్కచుడు రాత్రి యుద్ధానికి బలి అయిపోయినట్టుగా, ‘అధిష్ఠానం’ నడిపిన ‘నిశాతంత్రానికి’ దేవేంద్ర ఫడ్నవీస్ ‘ఎఱ’అయ్యాడు. ఐదేళ్ల మంచి పేరుకు ఈ ‘మూడురోజుల ముచ్చట’ గొప్ప అపవాదం! ‘భాజపా’ప్రభుత్వం ఫడ్నవీస్ నాయకత్వంలో కొనసాగాలన్నది మహారాష్ట్ర ప్రజలు అక్టోబర్ 24న ఇచ్చిన తీర్పు. శివసేనతో పొత్తులేకుండా 2014లో పోటీచేసిన ‘భాజపా’ 288 స్థానాల శాసనసభలో 122 చోట్ల విజయం సాధించింది. ఈ ఎన్నికలలో కూడ భాజపా ఒంటరిగానే రంగంలోకి దిగి ఉంటే ఐదేళ్ల మంచి పరిపాలనకు సార్థకత చేకూరి ఉండేది. భాజపాకు 145 స్థానాలు లేదా అంతకంటె ఎక్కువ స్థానాలు లభించి ఉండేవి. అది జరగకపోవడం ఫడ్నవీస్ దురదృష్టం. శివసేనతో పొత్తువల్ల కేవలం 162చోట్ల ‘భాజపా’ పోటీ చేసింది. ఇది ‘భాజపా’ నేర్వవలసిన గుణపాఠం. క్రమంగా ప్రాంతీయ పక్షాలతో పొత్తులకు స్వస్తిచెప్పాలన్నది ఈ పాఠం! ‘శివసేన’ మాట తప్పడం వల్ల ‘భాజపా’ నైతిక ప్రతిష్ఠ పెరిగింది. 23వ తేదీ రాత్రివరకు ఈ నైతిక ప్రతిష్ఠ పెరుగుతూనే వచ్చింది! కానీ ‘‘యుద్ధప్రాతిపదిక’’పై ‘భాజపా’ అధిష్ఠానం నడిపిన ‘అర్ధరాత్రి నాటకం’వల్ల అవకాశవాదపు కళంకం దాపురించింది! అర్ధరాత్రి రెండుగంటల సమయంలో మహారాష్ట్ర గవర్నర్‌ను, రాష్టప్రతిని ‘నిద్రలేపిన’ భాజపా అధిష్ఠాన తంత్రం రాజ్యాంగ చరిత్రలో మరో వైపరీత్యం!!
అతి పెద్ద పార్టీగా అవతరించిన ‘భాజపా’ నాయకుడైన ఫడ్నవీస్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఈనెల 10న గవర్నర్ ఆహ్వానించాడు. ఫడ్నవీస్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించి ఉండాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి. శాసనసభను సమావేశపరచి ఉండాలి. విశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఉండాలి. చర్చ సందర్భంగా శివసేన చేసిన విశ్వాస ఘాతుకాన్ని ఎండగట్టి ఉండవచ్చు! ‘భాజపా’ ప్రతిష్ఠ పెరిగి ఉండేది. అది జరగలేదు. ‘భాజపా’చేసిన వ్యూహాత్మకమైన మొదటి తప్పిదం అది! అజిత్ పవార్‌ను నమ్మి 23వ తేదీన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం మరో తప్పిదం! ఇప్పుడైన ఫడ్నవీస్ రాజీనామా చేసి ఉండరాదు. శాసనసభలో బుధవారం విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఉండాలి. తీర్మానం నెగ్గదు. కానీ ‘ప్రత్యర్థి కూటమి’ సైద్ధాంతిక పతనాన్ని చర్చించడానికి ఫడ్నవీస్‌కు అవకాశం దొరికి ఉండేది... ఇది కూడ జరగలేదు!