సంపాదకీయం

‘వినియోగ’ నిష్ఠ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంప్లాంటెడ్ కాంటాక్ట్ లెన్స్- ఐసీఎల్- ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందిన నయన చికిత్స. దృష్టి మాంద్యాన్ని తొలగించి నిశిత దృష్టిని కలిగించడానికి వీలుగా ఈ ‘లెన్స్’ను కంటిగుడ్డులో అమర్చుతున్నారు. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి వంటి లోపాలు అపవాదాలు మాత్రమే. ఈ లోపాన్ని అతిగమించడానికి వీలుగా కంటి అద్దాలను అమర్చుకోవడం నేత్ర చికిత్సలో భాగం. ఇలా కుంభాకార, పుటాకార కటకాలను కంటి అద్దాలుగా అమర్చుకోవడం ప్రస్తుతం పాతపడిన పద్ధతి. దృష్టి దోషం నివారించుకోదలచిన వారు ప్రధానంగా ‘కాంటాక్ట్ లెన్స్’- కంటిగుడ్డుకు అతుక్కునే కటకం-లను అమర్చుకోవడం దశాబ్దుల క్రితమే మొదలైంది. కంటిగుడ్డుపై ఇలా ‘కటకం’ అమర్చుకోవడం అద్దాలను- సులోచనాలను- ధరించడం కంటె ఎక్కువ సౌలభ్యం. జీవన సౌలభ్య విస్తరణలో ఇదంతా భాగం. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా వికసించింది. కంటిగుడ్డుపై అమర్చుకునే కటకాన్ని మాటిమాటికీ తీసి మళ్లీ ధరిస్తూ ఉండాలి. నిద్రించే సమయంలో తీసేయాలి. అందువల్ల ‘లెన్స్’ను కంటిగుడ్డు లోపల అమర్చే మరింత అధునాతన చికిత్సా పద్ధతి ఆవిష్కృతమైంది. ఇలా ‘లోపల అమర్చిన’- ఇంప్లాంటెడ్- కటకం- లెన్స్- శాశ్వతంగా కంటిగుడ్డులోపల ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు కాని, రోజుకు రెండు మూడుసార్లు కాని తొలగించి మళ్లీ అమర్చుకోవలసిన అవసరం లేదు. ఒకసారి ఈ ‘నయన నిక్షిప్తలిప్త కటకం’- ఇంప్లాంటెడ్ కాంటాక్ట్ లెన్స్- రెండు కళ్లలోను గుడ్డులోపల అమర్చుకున్నట్టయితే దృష్టి లోపం సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. కళ్లకు ‘్భతద్దాల’ను ధరించనవసరం లేదట, కటకాలను మాటిమాటికీ బయటికి తీసి మళ్లీ అమర్చుకొనవలసిన పని లేదట! అందువల్ల కంటిచూపు సమస్య ఉన్నవారిలో అధికాధికులు ప్రధానంగా యువజనులు ఈ ‘ఐసీఎల్’ ప్రక్రియను అవలంబిస్తున్నారు. ఇలా కటకాన్ని కంటిగుడ్డులోనికి నిక్షిప్తం చేయడం గొప్ప వైద్య ప్రక్రియ. మహానగరాలలోను మహా ప్రత్యేక సదుపాయాలు- సూపర్ స్పెషాలిటీస్- ఉన్న వైద్యశాలల్లోను ఈ ‘నిక్షిప్త ప్రక్రియ’ను నిర్వహిస్తున్నారు. రెండుకళ్లకు అమర్చుకునే ఈ ‘ఐసీఎల్’ ఖరీదు లక్షా ముప్పయి వేల నుంచి లక్షా యాబయి వేల రూపాయల వరకూ ఉందట! ఇవి మన దేశంలో తయారైన కటకాలు. కానీ వీటిని విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారట. విదేశీయ కటకాల ఖరీదు లక్షా డెబ్బయి వేల నుంచి రెండు లక్షల రూపాయల మధ్య ఉందట! పదిమంది చికిత్సార్థులలో తొమ్మిది మంది విదేశీయ కటకాలను అమర్చుకొనడానికి మొగ్గు చూపుతున్నారట. నలబయి వేలు లేదా యాబయి వేల రూపాయలను ఎక్కువగా చెల్లించి అయినా సరే భారతీయ కటకాలు గాక విదేశీయ కటకాలను కొనడానికి చికిత్సార్థులు ఉత్సాహపడుతుండడం అసలు సంగతి. మన ఉత్పత్తుల పట్ల కంటె విదేశీయ ఉత్పత్తుల పట్ల మనకు మక్కువ ఎక్కువ, విశ్వాసం అధికం! ఇదీ మన సమాజ సమష్టి స్వభావం. వందమందిలో ఒకరు ఈ సమష్టి స్వభావానికి భిన్నంగా ఉండవచ్చు..
అన్ని ఇంద్రియాలలోను కన్ను ప్రధానమైనది- ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’! అందువల్ల కటకాల విషయంలో అతి జాగ్రత్త పడడం సహజం. మన దేశంలో తయారైన వాటికంటె విదేశీయ కటకాల వల్లనే దృష్టి సౌలభ్యం మరింత విస్తరిస్తుందన్న విశ్వాసం కలగడం సహజం కావచ్చు. కానీ అన్ని జీవన రంగాలను ఈ విశ్వాసం ఆవహించి ఉండడం మన ‘జాతీయ వైపరీత్యం’! సంచారవాణి ఉపకరణం- మొబైల్ ఫోన్ పీస్- మొదలుకొని ‘సారసత్తుల’- సేమ్యాల- వరకు, గోడకంటించె టెలివిజన్ సెట్టు మొదలు గోళ్లు కత్తిరించుకునే ఉపకరణం వరకు- ఏ వస్తువునైనా కొంటున్నవారిలో అత్యధికులు విదేశీయ ఉత్పత్తులకు ప్రాథమ్యాన్ని, ప్రాధాన్యాన్ని ఇస్తుండడం, భారతీయ ఉత్పత్తుల పట్ల ‘తేలిక’తనాన్ని ప్రదర్శిస్తుండడం మన దేశంలో నిత్య జీవన వ్యవహారం అయిపోయింది. ప్రమాణాలు, మన్నిక అధికంగా ఉన్నట్టు భావిస్తున్న విదేశీయ వస్తువులను మాత్రమే కాదు నాసిరకం చైనా తదితర విదేశీయ సామగ్రిని సైతం మనవారు విరివిగా కొనేస్తుండడం నడుస్తున్న కథ.. ఈ వైపరీత్యం మన జాతీయ అస్తిత్వపు ‘వేరు’ను పురుగు వలె తొలచి వేస్తుండడం డెబ్బయి ఏళ్ల వ్యథ.. బ్రిటన్ విముక్త భారతదేశానికి కొత్త రాజ్యాంగం రూపొంది డెబ్బయి ఏళ్లయ్యింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరిగిన పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని కొన్ని రాజకీయ పక్షాలు బహిష్కరించాయట. దీనికి గొప్ప ప్రచారం జరిగింది. కానీ దశాబ్దుల తరబడి దేశ ప్రజల్లో అధికాధికులు- కొందరు తెలిసి, కొందరు తెలియక- భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కఠోర వాస్తవానికి మాత్రం ప్రచారం లేదు. అంతరిక్షానికి చంద్రమండలానికి కుజగ్రహానికి ‘నౌక’లను పంపించగలుగుతున్నాము. కానీ బస్సులను, మోటారు సైకిళ్లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ బస్సులు మన రహదారులకు పనికిరావని నిగ్గు తేలినప్పటికీ సిగ్గులేని ప్రభుత్వాలు ఈ బస్సులను దిగుమతి చేయిస్తూనే ఉన్నాయి..
ప్రగతి వేగం తగ్గిందన్న కేంద్ర ప్రభుత్వం వారి నిర్ధారణకు ఇదంతా నేపథ్యం. భారతీయతను ‘విదేశీయ విలాసం’- ఫారిన్ ఫాషన్- దిగమింగుతుండడం ఈ నేపథ్యం. ప్రగతి వేగం తగ్గినప్పటికీ ఆర్థిక మాంద్యం ఏర్పడలేదన్నది ప్రభుత్వ నిర్ధారణ. అనేక సందర్భాల్లో మన ప్రభుత్వ నిర్ధారణలు విదేశీయ ‘పరపతి నిర్ణాయక’ సంస్థల బెదిరింపుల ప్రాతిపదికగా జరిగిపోతున్నాయి. ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’, ‘మూడీస్’ వంటి పేర్లతో చెలామణి అవుతున్న కొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద ఆర్థిక సంస్థలు నిజానికి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’కు దళారీలు మాత్రమే! ఈ సంస్థలు తరచూ వివిధ దేశాల ‘పరపతి స్థాయి’- సావరిన్ రేటింగ్-లను నిర్ణయించి ప్రచారం చేస్తున్నాయి. సంస్కరణలు చేపట్టి తీరాలని లేకుంటే ‘మీ పరపతి స్థాయిని తగ్గించి వేస్తామని’ ఈ దళారీ సంస్థలు మన దేశాన్ని అనేక ప్రవర్ధమాన దేశాలను బెదిరిస్తుండడం నడుస్తున్న అంతర్జాతీయ వైపరీత్యం. కానీ మన ఆర్థిక స్థాయిని మన ప్రభుత్వం మాత్రమే స్వదేశీయ ధ్యాసతో నిర్ధారించాలి. విదేశీయ నిర్థారణలను అంగీకరించడం కూడ విదేశీయ వస్తువుల పట్ల వ్యామోహం వంటిది. వినియోగదారుల వ్యామోహం ‘వస్తు’ నిష్ఠమైనది. ఈ అంతర్జాతీయ పరపతి సంస్థల నిర్ణయాలను చైనా పట్టించుకొనడం లేదు. ఎందుకంటె చైనా విదేశాల నుంచి తమ దేశానికి పెట్టుబడులు రావాలని కోరడం లేదు. విదేశాల పెట్టుబడుల కోసం దేబిరించకపోవడం మన ప్రభుత్వ విధానం కావాలి. ఇది జరిగినపుడు మన దేశంలోని వినియోగదారులకు కూడ విదేశీయ ఉత్పత్తుల పట్ల, భావజాలం పట్ల, విలాసాల- ఫాషన్స్- పట్ల వ్యామోహం క్రమంగా తగ్గిపోతుంది. విదేశాలు మన కంటె గొప్పవి అన్న ఆత్మన్యూనత, జాతీయ ఆత్మన్యూనత అంతరించిపోతుంది..
‘అది విదేశీయ సంస్థ తయారు చేసిన సబ్బు, అది నాకు వద్దు, నాకు స్వదేశీయ సంస్థల సబ్బులు కావాలి!’ అని ఒక వినియోగదారుడు అన్నాడు.. ‘గాంధీ మహాత్ముని తర్వాత నినే్న చూస్తున్నాను.. స్వదేశీయ వస్తువులను కొనేవాడిని..!’ అని దుకాణం దారుడు ఎగతాళి చేశాడు. ‘అయితే నువ్వు గాడ్సేవా?’ అని వినియోగదారుడు రెట్టించాడు. మాటల యుద్ధం మొదలైంది.. ఇటీవల ఒక మహానగరంలోని ఒక గల్లీలో ఆవిష్కృతమైన దృశ్యం ఇది! మహాత్ముని ఉద్యమ సమయంలో వందల గ్రామాల్లో స్వదేశీయ కార్యకర్తలు విదేశీయ వస్తువిక్రయశాలల ముందు నేలపై పడుకొని నిరసనలు తెలిపారు. అలాంటి నిరసన ఉద్యమకారులను దుకాణం దారులు ఎగతాళి చేయలేదు. ఉద్యమకారులకు దుకాణం దారులు భయపడినారు. ఇప్పుడు స్వదేశీయ వస్తునిష్ఠను యద్దేవా చేస్తున్నారు.. ఇదేనా గాంధీకి నూట యాబయ్యవ వత్సర ఉత్సవ నివాళి...??