సంపాదకీయం
‘విభజన’ వారసత్వం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శరణార్థుల శిబిరంలో
పురుడు పోసుకున్న శిశువు,
ఆకాశపు నీడలందు
ఆటలాడు చిన్ని శిశువు,
తరతరాల చారిత్రక
సహనానికి సింధువు...
సంధించడు, చిందించడు
ఒక నిరసన బిందువు!
అఖండ భారతదేశ విభజన వల్ల లక్షల మంది స్వజాతీయులు స్వదేశంలోనే శరణార్థులుగా జీవించవలసి వస్తోంది, లక్షల మంది తరతరాల తమ ‘జన్మస్థలాల’ను వదలిపెట్టి పారిపోవలసి వచ్చింది! 1947లోబ్రిటన్ దురాక్రమిత భారతదేశం మూడుముక్కలు కావడం వల్ల దాదాపు మూడు కోట్ల మంది స్వజాతీయులు నిలువ నీడను కోల్పోవడం కొనసాగుతున్న చరిత్ర! 1947 కంటె పూర్వం కూడ వివిధ సమయాలలో అఖండ భారతదేశం ముక్కలైన ధ్యాస కూడ ఇప్పుడు సన్నగిల్లిపోయింది. అఫ్ఘానిస్థాన్, బర్మా వంటివి 1947 కంటె ముందే అఖండ భారతదేశం నుంచి విడిపోయాయి. మతోన్మాద ‘జిహాదీ’ వ్యవస్థలు ఏర్పడి ఉన్న అప్ఘానిస్థాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇస్లామేతర మతాలవారు, హిందూ జాతీయ మతాలవారు నిరంతరం తరిమివేతకు గురి అవుతుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ మూడు దేశాల నుంచి ఇలా తరిమివేతకు గురి అయినవారు ‘అవశేష భారత్’ అయిన మన దేశంలోకి తరలిరావడం సహజం! సహజమన్నది మానవీయ హృదయం ఉన్నవారికి తెలిసిన వాస్తవం. మన దేశంలో వారికి ఆశ్రయం, స్థిర నివాసం లభించకపోతే వారంతా- తరిమివేతకు గురిఅయిన వారు- అరేబియా సముద్రంలో దూకాలి, బంగాళాఖాతంలో దూకాలి. అఖండ భారత విభజన జరిగిన వెంటనే పశ్చిమ పాకిస్తాన్ నుంచి దాదాపు ఎనబయి లక్షల హిందువులు తరిమివేతకు గురిఅయినారు. వారందరూ అవశేష భారత్‌లోకి వచ్చి స్థిరపడినారు, భారతీయ పౌరులయ్యారు. ఇస్లాం మతోన్మాద జిహాదీల దాడులను సహించి కొన్ని లక్షల మంది హిందువులు 1947లో పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. ఈ అవశేష హిందువులను నిశే్శషం చేయడానికి ఏడు దశాబ్దులుగా ‘జిహాదీ’లు దాడులు చేస్తూనే ఉన్నారు. అందువల్ల పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అవశేష హిందువులు పాకిస్తాన్ నుంచి పారిపోయి మన దేశానికి ప్రతి ఏటా వస్తూనే ఉన్నారు. ఇలాంటి నిస్సహాయులకు- ‘అఖండ భారత్’ యథాతథంగా కొనసాగి ఉంటే, సహజంగానే మన దేశపు పౌరులుగా మనగలిగిన ఈ ‘స్వదేశ శరణార్థుల’కు మన దేశపు పౌరసత్వం కల్పించడం న్యాయం! పౌరసత్వపు చట్టాన్ని సవరించడం ద్వారా పాకిస్తాన్ నుంచి తరిమివేతకు గురయిన ఈ హిందువులకు, పార్సీలకు, ఇస్లాం మతేతరులకు మన దేశ పౌరసత్వం కల్పించడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి కూడ హిందువులు తరిమివేతకు గురిఅవుతూనే ఉన్నారు. 1971వరకు ఇలా తరిమివేతకు గురిఅయిన వారికి మన దేశంలో ఆశ్రయం, పౌరసత్వం లభించింది. ఆ తరువాత కథ మారింది!
ఈ మూడు దేశాల నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన శరణార్థులు దాదాపు ముప్పయి రెండు వేలమంది. వీరందరూ 2014 డిసెంబర్ 31వ తేదీకి పూర్వం మన దేశంలోకి శరణార్థులై వచ్చినవారు. వీరికి మన దేశపు పౌరసత్వం ఇనే్నళ్లుగా లభించకపోవడం మానవత్వానికి మాయని మచ్చ! ఇప్పుడైన ‘పౌరసత్వ సవరణ ప్రతిపాదన’- సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్- కాబ్- ద్వారా వీరందరికీ పౌరసత్వం లభిస్తోంది. ఇందుకు జాతి యావత్తూ హర్షం ప్రకటిస్తోంది. కానీ కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండడం విస్మయకరం. ప్రతిపక్షాల వ్యతిరేకత కారణంగానే గతంలో లోక్‌సభ ఆమోదించిన ఈ ‘బిల్లు’కు ఆ తరువాత కాలదోషం పట్టింది. సోమవారం మరోసారి ఈ బిల్లును లోక్‌సభలో ప్రభుత్వం ప్రతిపాదించనుంది. ఈసారి మాత్రం బిల్లుకు రాజ్యసభ కూడ ఆమోదం తెలిపే అవకాశం ఉంది! అందువల్ల భారతీయ పౌరసత్వం కోసం ఏళ్లతరబడి వేచి ఉన్న ఈ ‘త్రిదేశ నిర్వాసితులు’ మన దేశ పౌరులు కానున్నారు. ఈ సమస్య మొత్తం దేశ విభజనతో ముడివడి ఉంది, ‘సర్వమత సమభావ’ రాజ్యాంగ వ్యవస్థతో ముడివడి ఉంది. ‘అఖండ భారత్’ అనాదిగా అన్ని మతాల వారికీ సమానత్వం ప్రసాదించింది. హైందవ జాతీయ తత్త్వం వివిధ మతాల సంపుటం, సర్వమత సమభావం.. ఇదీ ఈ దేశపు చరిత్ర. దేశ విభజన తరువాత ‘అవశేష భారత్’ అయిన మన దేశంలో- అఖండ భారత్‌లో అనాదిగా వికసించిన- సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతోంది. అందువల్లనే మన దేశం నుంచి ఏ మతం వారు కాని ప్రాణభయంతో పాకిస్తాన్‌కో, అఫ్ఘానిస్థాన్‌కో, బంగ్లాదేశ్‌కో పారిపోవడం లేదు. కానీ ‘ఏకమత ఇస్లాం రాజ్యాంగ వ్యవస్థలు’గా అవతరించిన అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి అల్పసంఖ్య మతస్థులు అంటే ఇస్లాం మతేతరులు నిరంతరం బహిష్కృతులవుతున్నారు...
ఇలా అల్పసంఖ్య మతస్థులకు పై మూడు దేశాలలోను ద్వితీయ, తృతీయ, చతుర్థశ్రేణి ఆదరణ మాత్రమే లభిస్తోంది. పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను అవశేష హిందువులపై ఇప్పటికీ జిహాదీ బీభత్సకారులు వివిధ అత్యాచారాలు జరుపుతూనే ఉన్నారు. హిందూ యువతులను ‘జిహాదీ’లు అపహరించుకొని వెడుతున్నారు. వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, వారికి ఇష్టంలేని ‘జిహాదీ’ యువకులతో ‘పెళ్లి’ జరిపిస్తున్నారు. వాయువ్య సరిహద్దు ప్రాంతంలో సిక్కుల నుంచి జుట్టు పన్ను వసూలుచేశారు. లక్షల రూపాయల ‘‘పన్ను’’చెల్లించలేని ‘సిక్కులు’ ‘వాయువ్య సరిహద్దు’నుంచి పాకిస్తాన్‌లోకి ఇతర ప్రాంతాలకు వెళ్లారు, మన దేశంలోకి వస్తున్నారు. బలూచిస్థాన్‌లో మిగిలి ఉన్న నాలుగైదు దేవాలయాలను ‘జిహాదీ’లు ధ్వంసం చేశారు. అర్చకులను దేవాలయ ధర్మాధికారులను అపహరించారు. సింధు ప్రాంతంలో ఐదు ఆరు ఏళ్ల బాలికలను సైతం లైంగిక అత్యాచారాలకు గురిచేయడం ‘జిహాదీ’ల రాక్షసత్వానికి, పాశవికత్వానికి పరాకాష్ఠ. ఇలాంటి బీభత్సకాండ బంగ్లాదేశ్‌లో కూడ జరుగుతోంది. 1999లో ‘తాలిబన్లు’ ధ్వంసం చేసిన బౌద్ధ ఆరామాలను, బుద్ధ విగ్రహాలను అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ఇంతవరకు పునరుద్ధరించలేదు. ఈ బీభత్సకాండకు ప్రతి ఏటా వందల మంది హిందువులు బలి అవుతూనే ఉన్నారు, తప్పించుకొని మన దేశంలోకి వస్తూనే ఉన్నారు. ఇలాంటి నిస్సహాయ శరణార్థులకు మన దేశంలోనే పౌరసత్వం లభించకపోతే ఇతర దేశాలలో ఎలా లభిస్తుంది? ‘కాబ్’ను వ్యతిరేకిస్తున్నవారు, రాజకీయ పక్షాలవారు సమాధానం చెప్పాలి! ఇలా ప్రాణావశిష్టులైన మన దేశానికి వచ్చిన కేవలం కొన్ని వేల మందికి కూడ మన దేశపు పౌరసత్వం కల్పించరాదని వాదిస్తున్న రాజకీయ జీవులు, మన దేశంలోకి ఏళ్లతరబడి దొంగచాటుగా చొరబడుతున్న అక్రమ ప్రవేశకులకు మాత్రం పౌరసత్వం కల్పించాలని వాంఛిస్తున్నారు. దేశహితం పట్ల ఈ రాజకీయ జీవుల ‘నిష్ఠ’ ఎంత?? దేశ వ్యతిరేకులైన అక్రమ ప్రవేశకులను, లక్షల మందిని దేశం నుండి వెళ్లగొట్టరాదని ఈ రాజకీయ జీవులు ఆర్భాటిస్తున్నారు. అదే ‘నోటి’తోనే ‘నిస్సహాయ శరణార్థుల’ను కేవలం వేల మందిని దేశ పౌరులుగా అంగీకరించరాదని వాపోతున్నారు..
వాస్తవాలనే సూర్యకిరణాలను చూసి విలపిస్తున్న గుడ్లగూబల వంటివారి వ్యతిరేకతను అతిగమించి ‘కాబ్’ పార్లమెంటులో గట్టెక్కడం ఖాయం..! ఇలా 2014నకు పూర్వం వచ్చిన శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించడం హర్షణీయం. కానీ ఆ తరువాత వచ్చిన శరణార్థుల మాటేమిటి? వారికి సైతం పౌరసత్వం కల్పించడం మానవత్వం..