సంపాదకీయం

న్యాయం కోసం నిరీక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపాన్ని సంతరించుకోరాదు.. అదే జరిగితే న్యాయం తన సహజ గుణాన్ని కోల్పోతుంది.. సత్వర న్యాయం అంటూ ఎక్కడా ఉండదు.. కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న సమయం, అందులో జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాని పరిస్థితి, వైఖరిని మనం పునఃపరిశీలించాల్సి ఉంది.. తక్షణ న్యాయం ఎప్పుడూ సాధ్యం కాదు..’- అంటూ సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే చేసిన వ్యాఖ్యలు మన న్యాయవ్యవస్థలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘దిశ’ ఘటనలో నిందితులను బహిరంగంగా ఉరి తీయాల్సిందేనని దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటిన నేపథ్యంలో జస్టిస్ బోబ్డే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ తరహా సంచలనాత్మక సంఘటనలు జరిగినపుడు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలంటూ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడడం, ప్రజల ‘డిమాండ్’ను నెరవేర్చేందుకు పోలీసులు ‘ఎన్‌కౌంటర్’ చేయడం, కోర్టు తీర్పులు రాకుండా ఇలా ‘శిక్ష’లు అమలు జరపడం అన్యాయమని మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రకటించడం, బాధిత కుటుంబాలకు సకాలంలో న్యాయం దక్కాలంటే చట్టాలను సవరించాలనడం మన దేశంలో పరిపాటిగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న ‘క్రిమినల్ జస్టిస్’ వ్యవస్థను పునఃసమీక్షించాలనడంలో ఎలాంటి అనుమానం లేదని, వ్యాజ్యాలను వేగవంతంగా పరిష్కరించేందుకు వీలుగా న్యాయ వ్యవస్థ స్వీయ దిద్దుబాటు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా సర్వోన్నత న్యాయమూర్తి పేర్కొన్నారు. సత్వర న్యాయం అసాధ్యమని ఆయన చెబుతూనే, సకాలంలో న్యాయం అందించడానికి సాంకేతిక విద్యను ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలన్నారు. వేగవంతంగా న్యాయం అందించడానికి సుప్రీం కోర్టు ఇటీవలే అధికారిక మొబైల్ అప్లికేషన్, కృత్రిమ మేధ ఆధారంగా అనువాదం చేసే ‘సుప్రీం కోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్‌వేర్- సువాస్’ను ఆవిష్కరించిందని, దీనివల్ల సర్వోన్నత న్యాయస్థానం వ్యవహారాలు దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి సైతం అందుబాటులోకి వచ్చాయని జస్టిస్ బోబ్డే గుర్తు చేశారు. వ్యాజ్యాల విచారణలోను, న్యాయాన్ని అందించడంలోనూ జాప్యం జరుగుతోందన్న వాస్తవాన్ని ఆయన అంగీకరిస్తూనే- న్యాయం ప్రతీకార రూపం దాల్చితే అది తన సహజ రూపాన్ని కోల్పోతుందన్నారు.
మరోవైపు ‘దిశ’ ఘటన ఆందోళనల నేపథ్యంలోనే రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ- ‘రేపిస్టులకు క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు’ అని కుండబద్దలు కొట్టారు. సామాన్యుడికి న్యాయం దూరం అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. న్యాయ ప్రక్రియ అనేక కారణాల వల్ల సామాన్యుడికి అందనంత దూరంలో ఉందంటూ సాక్షాత్తూ భారత రాష్టప్రతి ఆందోళన చెందడం న్యాయ వ్యవస్థలోని సవాళ్లను ఎత్తిచూపుతోంది. కింది స్థాయి నుంచి సుప్రీం కోర్టు వరకూ భారీ సంఖ్యలో కేసులు పేరుకొని పోవడానికి సవాలక్ష కారణాలున్నా, సమస్య తీవ్రతను వెంటనే గుర్తించాలన్న హితవు రాష్టప్రతి ఆవేదనలో నిహితమై ఉంది. ముఖ్యంగా హైకోర్టుల్లో, సుప్రీం కోర్టులో న్యాయ ప్రక్రియ సామాన్య కక్షిదారులకు అందుబాటులోకి లేకుండా పోయిందన్నది నిష్ఠుర సత్యం. ‘పాత రోజుల్లో ఎవరైనా రాజభవనాల వద్దకు వచ్చి గంట మోగించి, రాజుకు తమ బాధలు చెప్పుకొనేవారని మనం చదువుకున్నాం.. ప్రస్తుతం సామాన్యులు, నిరుపేదలు న్యాయం కోసం తమ గోడును చెప్పుకొనే పరిస్థితి ఉందా? న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని రాజ్యాంగ ప్రవేశికలోనే ఉంది.. మహాత్మా గాంధీ సైతం ఇదే అంశంపై పలుసార్లు ఆవేదన చెందారు.. ఉచిత న్యాయ సహాయాన్ని పేదవర్గాలకు అందుబాటులో ఉంచాలి..’ అంటూ రాష్టప్రతి కోవింద్ చెప్పిన మాటలతో పాలకులు ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
‘దిశ’ ఘటనలో నలుగురు నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో ‘రాక్షస సంహారం జరిగింది..’ అంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో జనం సంబరాలు చేసుకున్నారు. ఈ కేసు ఇంకా కోర్టు గుమ్మం ఎక్కకముందే, ఎలాంటి తీర్పు వెలువడక ముందే నిందితులను పోలీసులు కాల్చిచంపడం పట్ల మానవ హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ పూర్వాపరాలు, పోలీసుల ‘చర్య’ పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. మరోవైపు మిగతా కేసుల్లోనూ ఇలాగే ‘సత్వర న్యాయం’ అందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇతర హత్యాచార కేసుల్లోనూ నిందితులను కాల్చిచంపాలన్న ప్రతీకారేచ్ఛ రగులుతోంది. తెలంగాణలోని ఆసిఫాబాద్, హాజీపూర్, వరంగల్, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నమోదైన రేప్ కేసుల్లో ‘తక్షణ న్యాయం’ కావాలంటూ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘సత్వర న్యాయం’ కోసం వివిధ రాష్ట్రాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లు పాటిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ర్యాలీలు, రాస్తారోకోలు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తే సరిపోదని, నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. రేపిస్టులను తమకు అప్పగిస్తే తామే ‘శిక్ష’లు అమలు చేస్తామంటూ ఆందోళనకారులు ఉద్యమబాట పడుతున్నారు. అత్యాచార కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు సీసీ కెమెరాలను, నిఘా వ్యవస్థను విస్తృతం చేస్తామని పాలకులు ఇస్తున్న హామీలు జనం ఆగ్రహావేశాలను చల్లార్చడం లేదు. ‘కంటికి కన్ను- పంటికి పన్ను’ అన్నట్టు రేపిస్టులను పోలీసులు తక్షణం ఎన్‌కౌంటర్ చేయాలని లేదా నిందితులను తమకు అప్పగిస్తే తామే శిక్షలు వేస్తామన్న స్వరం ఇపుడు జనం నుంచి బలంగా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఏమై ఉంటుందన్నది మన పాలకులకు, న్యాయవ్యవస్థకు తెలిసిందే. ‘రేపిస్టులకు మరణ దండన అమలు జరగాల్సిందే.. కానీ అది కోర్టు తీర్పు ద్వారా జరగాలి.. ఎన్‌కౌంటర్లు పరిష్కారం కావు.. చట్టం తనపని తాను చేసుకుపోతుంది..’ అని పాలకులు తీరుబడిగా చెబుతున్న మాటలు బాధిత కుటుంబాలకు సాంత్వన కలిగించడం లేదు. అత్యాచారం, హత్య ఘటనల్లో ప్రభుత్వం, పోలీసుల తీరు వివక్ష పూరితంగా ఉంటోందని కొన్ని సామాజిక వర్గాల నేతలు ఆరోపించడం మరో విపరిణామం. సకాలంలో స్పందించని పోలీసుల కారణంగానే ‘దిశ’ లాంటి ఘటనలు జరుగుతున్నాయని, తమ తప్పును కప్పిపుచ్చుకొనేందుకు, జనాగ్రహాన్ని చల్లార్చేందుకు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం సరికాదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణ న్యాయం సాధ్యం కానట్టే, వ్యాజ్యాల విచారణలో నిరంతర జాప్యం కూడా తగదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
‘నిమిషానికో అకృత్యం.. దండనలో జాప్యం..’ అన్నట్టు మన వ్యవస్థలు దీనావస్థలో ఉన్నాయి. ఘనమైన ప్రజాస్వామ్యంలో మనం చేసుకున్న చట్టాలే మన మహిళలకు న్యాయం చేయలేకపోతున్నాయి. ఆడవాళ్లపై ఎడతెగని అఘాయిత్యాలు మన నాగరికతను, న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ‘నిర్భయ’ వంటి సంచలనాత్మక కేసుల్లో న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా అవి అమలు కావడం లేదు. కోర్టు తీర్పులు వెలువడినప్పటికీ అప్పీళ్లు, క్షమాభిక్షల వెసులుబాట్లతో న్యాయం జరగడంలో విపరీత జాప్యం అనివార్యమవుతోంది. అనేక సందర్భాల్లో కోర్టుల జోక్యంతో తప్ప బాధితులకు రక్షణ, చట్టబద్ధ విచారణ జరగని పరిస్థితులు నెలకొన్నాయి. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్య వైఖరి, పాలకులు- అధికారుల విపరీత ధోరణుల ఫలితంగా న్యాయం దూరమవుతోంది. ఎన్‌కౌంటర్లతో అత్యాచారాలు ఆగిపోతాయని ఎవరూ భరోసా ఇవ్వలేరు. మహిళలను గౌరవించే సంస్కృతికి, కుటుంబ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్న పరిస్థితులను చక్కదిద్దాలి. ఇందుకు నైతిక విలువలతో కూడిన విద్యను పిల్లలకు నేర్పాలి. మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించే సినిమాలు-టీవీ సీరియళ్లు , అంతర్జాలంలో అశ్లీల వెబ్‌సైట్లకు యువత బానిసలు కాకుండా సమాజమే జాగ్రత్త వహించాలి. ఇవి జరగనంత వరకూ హత్యాచారాలు నిత్యకృత్యం కావడం, న్యాయం కోసం బాధితులు నిరీక్షించడం తప్పదు..!