సంపాదకీయం
దేశీయ వస్తునిష్ఠ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వదేశీయ జీవన స్ఫూర్తిని పెంపొందించవలసిన అవసరం గురించి ప్రధానమంత్రి తన ‘మనసులోని మాట’ కార్యక్రమంలో ప్రస్తావించడం అంతర్జాతీయ పరిణామక్రమానికి అనుగుణం... వివిధ దేశాలు తమ ‘‘జాతీయ ఆర్థిక ప్రయోజన పరిరక్షణ’’ విధానాలను అనుసరిస్తూ ఉండడం నరేంద్ర మోదీ ఆదివారం ‘ఆకాశవాణి’ద్వారా, ‘దూరదర్శన్’ద్వారా ఆవిష్కరించిన ‘మనసులోని మాట’కు నేపథ్యం! స్వదేశీయ జీవన స్ఫూర్తిని పెంపొందించడంలో స్వదేశీయ వస్తువులను విరివిగా వినియోగించడం భాగం. స్వదేశీయ వస్తువులను విరివిగా కొని వాడాలన్నది దేశ ప్రజలకు నరేంద్ర మోదీ వివరించిన మనసులోని మాట! ఇలా స్వదేశీయ ఉత్పత్తులను కొని వినియోగించడం తమ సహచర ప్రజల పట్ల భారతీయులు నిర్వహించవలసిన కర్తవ్యమన్నది మోదీ ‘మనసులోని మాట...’ కనీసం డెబ్బయి ఐదవ స్వాతంత్య్ర వార్షికోత్సవం జరిగే వరకైనా ఈ స్వదేశీయ వస్తువినియోగం పెరగాలన్నది మోదీ ‘మనసులోని మాట’! క్రీస్తుశకం 1947 ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశం బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తం అయింది. 2022 ఆగస్టులో ఈ ‘విముక్తి’వజ్రోత్సవాలు- డెబ్బయి ఐదవ సంవత్సరోత్సవాలు- జరుగనున్నాయి. బ్రిటన్ రాజకీయ దురాక్రమణకు వాణిజ్య దురాక్రమణ పూర్వరంగం. చాపకింది విషం వలె బ్రిటన్‌వారి ‘ఈస్టిండియా కంపెనీ’ వాణిజ్య దురాక్రమణ సాగించింది. క్రీస్తుశకం 1601నుంచి మొదలైన ఈ వాణిజ్య దురాక్రమణ ఫలితంగా వందల వేల కోట్ల రూపాయల మన సంపదను బ్రిటన్‌వారు దోచుకున్నారు. బ్రిటన్ కంటె ముందు, బ్రిటన్ తరువాత మన దేశంలో చొఱబడిన ఐరోపా దేశాల వాణిజ్య సంస్థలు మన దేశ ప్రజలను దోచుకొనడంలో బ్రిటన్ ‘సంస్థ’తో పోటీ పడడం రెండు శతాబ్దుల చరిత్ర... వాణిజ్య స్పర్థ రాజకీయ ఆధిపత్య సమరంగా మారింది. మన దేశంపై రాజకీయ ఆధిపత్యం సాధించడానికి పోర్చుగీసు, డచ్చి-నెదర్‌లాండ్స్-, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు తన్నుకోవడం అచరిత్ర. ‘తోడేళ్ల’కు ‘గుంటనక్కల’కు మధ్య జరిగిన ఆ ఆధిపత్య సమరంలో బ్రిటన్ ‘‘జయించింది’’, మన దేశంపై ఆధిపత్యం సాధించింది. 1757లో జరిగిన ‘ప్లాసీ’యుద్ధంవరకు ఐరోపా దేశాలు, ఆ తరువాత కేవలం బ్రిటన్ మన దేశాన్ని కొల్లగొట్టాయి. అలా కొల్లగొట్టిన సంపద ఐరోపాలోని ‘‘పారిశ్రామిక’’ విప్లవానికి మూలధనంగా ఉపయోగపడింది. దారిద్య్రంతో అలమటిస్తుండిన ఐరోపా దేశాలు, సముద్రపు దొంగలకు నిలయమైన దేశాలు క్రమంగా సంపన్న దేశాలుగా మారడానికి, సర్వసమృద్ధ సంపన్నమై ఉండిన మన దేశం నిరుపేద దేశంగా మారడానికి ప్రధాన కారణం శతాబ్దుల ఈ దోపిడీ!! మన పరిశ్రమలు, మన ఉత్పత్తులు, మన వస్తువులు మూతపడినాయి, మూలపడినాయి. బ్రిటన్ వస్తువులు ఐరోపా వస్తువులు మన దేశంలోనికి వెల్లువెత్తాయి. ఈ వెల్లువ ఇప్పటికీ ఆగడం లేదు! ఈ ఐరోపా వాణిజ్య దురాక్రమణకు మరింత విస్తృతి ‘‘ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-!! పాతికేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ‘ప్రపంచీకరణ’ శత్రు దేశమైన చైనా మన దేశాన్ని దోపిడీ చేయడానికి ఉపయోగపడింది. చైనా వస్తువులను కొంటున్న భారతీయులు తమ ఇంటి గోడలను కూల్చుకుంటున్న ‘గునపాలు...’. నరేంద్ర మోదీ పిలుపునకు ఇదంతా ‘‘చారిత్రక అనివార్యం...’’
మన దేశపు వస్తువులను సమృద్ధిగా మనం పెంచుకోవడం మాత్రమేకాక విశ్వమంతటా ఉండిన విపణి వీథులకు ఎగుమతి చేయడం శతాబ్దుల పూర్వంనాటి కథ. బ్రిటన్ దురాక్రమణ నడికొనే నాటికి అంతర్జాతీయ వాణిజ్యంలో ‘అఖండ భారత్’ వాటా నలబయి శాతం... ప్రస్తుతం ‘అవశేష భారత్’ వాటా నాలుగు శాతం కంటె తగ్గిపోవడానికి కారణం శతాబ్దులపాటు కొనసాగిన విదేశీయ దురాక్రమణ!! అగ్గిపెట్టె వంటి చిన్ని డబ్బాలో పట్టేవిధంగా పెద్ద ‘చీర’ను నేయగలిగిన వస్త్ర కళారీతి మనది. మన వస్త్రాలు విదేశాలకు విరివిగా ఎగుమతి అయ్యేవి! ఈ కళారీతిని, వస్త్ర పరిశ్రమను బ్రిటన్ దురాక్రమణకారులు ‘హత్య’చేశారు!! బ్రిటన్‌లో తయారయిన ఓడలు పదహైదు ఏళ్లలో పాడయిపోయేవి. పనికిరాకుండా పోయేవి. భారతీయులు నిర్మించిన ఓడలు పాతికేళ్లపాటు చక్కగా పనిచేసేవి, స్వల్పంగా మరమ్మత్తులు చేసిన తరువాత మరో పాతికేళ్లు పనిచేసేవి! ఈ నౌకా నిర్మాణ పరిశ్రమను బ్రిటన్ బీభత్సకారులు ధ్వంసంచేశారు! మన దేశపు ఉక్కు ‘డమాస్కస్’ ఉక్కుగా ప్రసిద్ధం కావడం సహస్రాబ్దుల చరిత్ర... దేశమంతటా మరీ ప్రధానంగా తెలుగుసీమలలో గ్రామగ్రామాన ‘కొలిమి’బట్టీలు ఉండేవి. ఈ కొలిమి బట్టీలలో అత్యంత మన్నికయిన ‘ఉక్కు’తయారయ్యేది. వికేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థకు అలా పల్లెపల్లెలో వెలసిన ‘‘చిట్టి ఉక్కు కర్మాగారాలు’’- కొలిమి బట్టీలు- చారిత్రిక సాక్ష్యం. ఈ మేలిమి ఉక్కు సిరియా దేశంలోని ‘డమాస్కస్’కు ఎగుమతి అయ్యేది. అక్కడినుంచి ప్రపంచంలో వివిధ దేశాలకు సరఫరాఅయ్యేది... ఈ చారిత్రక ధ్యాస కూడ ప్రస్తుతం మిగిలి లేదు!!
ధ్యాస మిగిలినవారు బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరంలో విదేశీయ వస్తువులను బహిష్కరించ వలసిందిగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపులకు ప్రతిధ్వని నరేంద్ర మోదీ ఆదివారం ఇచ్చిన పిలుపు! స్వదేశ ఉత్పత్తులతో బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమర చరిత్ర ముడివడి ఉంది. 1905-1906లో ‘స్వదేశీయ’ఉద్యమం ఉద్ధృతంగా సాగింది! బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్, విపినచంద్రపాల్- లాల్ బాల్ పాల్- నాయకత్రయం స్వదేశీయ వస్తునిష్ఠను పెంపొందించడం ద్వారా స్వాతంత్య్ర భావనిష్ఠను మరింతగా ప్రజ్వలింపచేశారు. విదేశీయ వస్త్రాలను, వస్తువులను జనం ధ్వంసంచేయడం, దగ్ధం చేయడం అచరిత్ర. ఈ నాయకత్రయం స్ఫూర్తితో గాంధీ మహాత్ముడు స్వదేశీయ వస్తుస్ఫూర్తిని పునఃప్రజ్వలనం చేశాడు. ‘రాట్నం’మీద ప్రతి ఒక్కరూ నూలు వడకడం స్వదేశీయ వస్తువినియోగ పునరుద్ధరణకు గాంధీ ప్రచారం చేసిన మాధ్యమం... ఈ స్వదేశీయ వస్తునిష్ఠను ప్రచారంచేయడం బ్రిటన్ వ్యతిరేక సమరంలో ప్రధాన అంశంగా మారింది! శ్రీరామ్ అనే యువకుడు గాంధీ మహాత్ముని స్ఫూర్తితో సాగించిన ‘స్వదేశీయ’ ఉద్యమం ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్.కె.నారాయణ్ రచించిన ‘‘మహాత్ముని అనుమతికోసం’’- ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’-అన్న నవలకు ఇతివృత్తం.
‘‘ఆ పల్లెలో ఉండిన ఒకే ఒక దుకాణం వద్దకు శ్రీరామ్ వెళ్లాడు. అరటి పండ్లు కొని తిన్నాడు. సోడా నీరు తాగాడు... ‘నా దుకాణంలో మంచి బిసకత్తులు ఉన్నాయి. కొంటావా?? అని అడిగాడు దుకాణందారుడు!’అవి ఇంగ్లాండు నుంచి దిగుమతి అయినవా??’- అని అడిగాడు శ్రీరామ్! ‘అవి శ్రేష్ఠమైన ఇంగ్లాండు బిస్కెట్లు’-అని దుకాణందారుడు సమాధానం చెప్పాడు... ‘నీకు సిగ్గులేదా?’- అని శ్రీరామ్ దుకాణందారుడిని నిలదీశాడు!! ఆ తరువాత మాటల యుద్ధం తీవ్రంగా సాగింది. ఆ విదేశీయ బిసకత్తులను దుకాణందారుడు వెంటనే ధ్వంసంచేయాలని కోరుతూ శ్రీరామ్ సత్యాగ్రహం చేశాడు. దుకాణం ముందు మట్టిలో పడుకున్నాడు... ఆర్.కె.నారాయణ్ వివరించిన ఈ ఘటన వేల, లక్షల వాస్తవ ఘటనలకు అద్దం...
పడుకొని నిద్రపోతున్నవారు ప్రధానం యువజనులు నిద్రలేచి విదేశీయ వస్తువులకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన సమయం ఇది. ‘ప్రపంచీకరణ’ పేరుతో నడుస్తున్న విదేశీయ వాణిజ్య సామ్రాజ్యవాదులనుంచి దేశానికి విముక్తి లభించాలి!! పాతికేళ్ల క్రితం ‘‘సరిహద్దులు’’లేని ‘ప్రపంచీకరణ’ను ప్రచారంచేసిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల ప్రభుత్వాలు ప్రస్తుతం ‘ప్రపంచీకరణ’ను వ్యతిరేకిస్తున్నాయి. ‘‘రాబోయే రోజులలో దేశభక్తులదే ఆధిపత్యం, ‘ప్రపంచీకరణ’రక్తుల- గ్లోబలిస్టుల-ది కాదు!’’అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే అంటున్నాడు. శతాబ్దులపాటు ప్రపంచ దేశాలను కొల్లగొట్టిన బ్రిటన్‌కు ఇప్పుడు తమ దేశాన్ని ఇతర దేశాలు కొల్లగొడతాయన్న భయం పట్టుకొంది... అందువల్ల ‘ఐరోపా సమాఖ్య’నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తోంది! అందువల్ల దాదాపు అన్ని దేశాలతోను మళ్లీ ఉవ్వెత్తున జాతీయభావ తరంగాలు లేస్తున్నాయి. ‘‘మన జాతి బాగుపడాలి, ప్రతి జాతి బాగుపడాలి... ఇలా ప్రతి దేశం తమ జాతీయ సాంస్కృతిక భూమికపై ప్రగతిని వికసింపచేసుకొనడమే నిజమైన అంతర్జాతీయ హితం’’... భారతీయులు అనాదిగా కోరుతున్న ‘ప్రపంచ కుటుంబం’- వసుంధరా పరివారం- ‘వసుదైవ కుటుంబం’ ఇదీ!!