సంపాదకీయం
పాకిస్తాన్‌లో ‘వ్యవస్థ’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాకిస్తాన్‌లోని ‘అల్పసంఖ్య’ మతాల ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరసించడం హర్షణీయం. దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌లోని హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను గురించి, హత్యాకాండను గురించి మన ప్రభుత్వాలు పట్టించుకొనకపోవడం చరిత్ర. నరేంద్ర మోదీ ఇప్పుడు పట్టించుకున్నాడు. పట్టించుకోవలసిందిగా కాంగ్రెస్ పార్టీకి సలహా కూడ ఇచ్చాడు. పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్య మతాల’వారిపై జరుగుతున్న దౌర్జన్యకాండను నిరసించాలని కాంగ్రెస్‌కు సలహా ఇచ్చాడు! 1947 ఆగస్టు 15వ తేదీన పాకిస్తాన్‌లో ‘అల్పసంఖ్య’ ప్రజలుగా మారిన ‘హిందూ మతాల’ వారిపై అప్పటి నుంచి ఇప్పటివరకు జిహాదీలు ఘోరమైన అత్యాచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ అత్యాచారాలకు, హత్యాకాండకు రెండున్నర లక్షల మంది బలైపోవడం చరిత్ర! తప్పించుకున్న దాదాపు ఎనబయి లక్షల మంది హిందూ మతాల వారు 1947వ, 1948వ సంవత్సరాలలో మన దేశంలోకి శరణార్థులుగా వచ్చేశారు. ఫలితంగా 1947వ సంవత్సరం నాటి పాకిస్తాన్ జనాభాలో ఇరవై నాలుగు శాతం ఉండిన హిందూ మతాల వారి సంఖ్య 1948 నాటికి ఒకటిన్నర శాతానికి పడిపోయింది. 1947లో పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో క్రీస్తుశకం 712 నాటికి వంద శాతం ప్రజలు హిందువులే! 1947 నాటికి హిందూ మతాల వారి సంఖ్య ఇరవై శాతానికి దిగజారిపోవడానికి కారణం స్పష్టం! 712లో విదేశాల నుంచి ‘ఇస్లాం’ ‘అఖండ భారత్’లో ప్రవేశించింది. పాకిస్తాన్‌గా ఆ తరువాత ఏర్పడిన ‘అఖండ భారత్’ ప్రాంతంలో ఇస్లాం మతస్థుల సంఖ్య డెబ్బయి నాలుగు శాతం కావడానికి దారితీసిన చారిత్రక నేపథ్యం కూడ స్పష్టం!! మొదట అరబ్బీ జిహాదీలు కొన్ని వేల మంది హిందూ మతాల వారిని ‘ఇస్లాం’లోకి బలవంతంగా మార్చారు. అలా మారినవారు తరువాతి తరంలో మరికొన్ని లక్షల మంది హిందూ మతాల వారిని ‘ఇస్లాం’లోకి మార్చారు. ఇలా అనేక తరాలపాటు దాదాపు పనె్నండు వందల ఏళ్లపాటు మతం మార్పిడులు జరిగాయి. ఫలితంగా 1947లో పాకిస్తాన్‌గా ఏర్పడిన ‘అఖండ భారత్’ ప్రాంతంలో ‘ఇస్లాం’ జనాభా పెరిగింది! అనాదిగా అక్కడ నివసించిన హిందూ మతాల వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది! వేద మతాలు బౌద్ధం, జైనం, సిక్కు మతం వంటివి ఈ అనాది స్వజాతీయ హిందూ మతాలు! ఎన్ని మతాలు ఉండినప్పటికీ ‘అఖండ భారత్’లో సర్వమత సమభావ వ్యవస్థ వికసించింది. విదేశాల నుంచి ‘ఇస్లాం’ప్రవేశించిన తరువాత కూడ ఈ వ్యవస్థ భంగపడలేదు! కానీ ‘జిహాదీ’లు ఈ ‘సర్వమత సమభావ వ్యవస్థ’ను అంగీకరించలేదు. ఎందుకంటె అన్ని ఇతర మతాలను నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా ప్రతిష్టించడం జిహాదీల లక్ష్యం... ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఆ తరువాత ‘పాకిస్తాన్’గా ఏర్పడిన అఖండ భారత ప్రాంతంలో ‘జిహాదీ’లు 712 నుంచి శతాబ్దుల పాటు ‘‘ఇస్లామేతర’’ మతాల వారిని నిర్మూలించారు. 1947 నాటికి ఆ ప్రాంతంలో ఇస్లాం మతస్థుల సంఖ్యాధిక్యం ఏర్పడడానికి ఇదీ కారణం! సర్వమత సమభావ వ్యవస్థకూ, జిహాదీ ఏకమత ఉన్మాద లక్ష్యానికీ మధ్య జరిగిన శతాబ్దుల పోరాటంలో ‘సర్వమత సమభావ వ్యవస్థ’ ఓడిపోయింది. ఓడిపోయినచోట పాకిస్తాన్ ఏర్పడింది!
‘సర్వమత సమభావ వ్యవస్థ’ మిగిలిన ప్రాంతం ‘అవశేష భారత్’గా కొనసాగుతోంది! ఇదీ పాకిస్తాన్‌కూ మన దేశానికీ మధ్యకల తేడా!! ఇక్కడ సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ ఉంది. అందువల్ల ‘ఇస్లాం’ సహా అన్ని మతాలవారు ఇక్కడ హాయిగా జీవిస్తున్నారు. అక్కడ -పాకిస్తాన్‌లో- సర్వమత సమభావ వ్యవస్థ లేదు, ‘ఇస్లాం’ ఏక మత రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడి ఉంది. అందువల్ల ‘‘ఇస్లాం మతేతరులు’’ అక్కడ బతికి బట్టకట్టలేకపోతున్నారు! 1948 నాటికి - మన దేశానికి ఎనబయి లక్షల మంది హిందువులతో పారిపోయి వచ్చేసిన తరువాత- మిగిలిన ఒకటిన్నర శాతం హిందువులను ‘సున్న శాతం’ చేయడానికి ‘జిహాదీ’లు యత్నిస్తూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో కూడ ఇదే రీతిలో ఇస్లామేతరులను నిర్మూలించే కార్యక్రమం నడుస్తోంది. అఫ్ఘానిస్థాన్‌లో ‘హైందవ నిర్మూలనం’ దాదాపు పూర్తయింది! ఇదంతా ‘అఖండ భారత’ విభజన వల్ల సంభవించిన వైపరీత్యం. దేశ విభజనకు అంగీకరించి, అఖండ భారతదేశపు భూభాగంలో దాదాపు మూడవ వంతు పాకిస్తాన్‌గా ఏర్పడడానికి, పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో ‘సర్వమత సమభావ సమాజం’ అంతరించిపోవడానికి దోహదం చేసింది ‘కాంగ్రెస్ ఉద్యమ సంస్థ’! కాంగ్రెస్ ఉద్యమ సంస్థ ‘రాజకీయ రూపం’ దాల్చి 1947 నుంచి దశాబ్దుల పాటు దేశాన్ని పాలించింది. అందువల్ల కాంగ్రెస్‌కు బాగా తెలుసు... నిన్న, నేడు పాకిస్తాన్ నుంచి ఇస్లామేతరులు మన దేశానికి శరణార్థులై వస్తుండడానికి కారణం పాకిస్తాన్‌లోను మిగిలిన రెండు దేశాల- అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లు-లోను ‘సర్వమత సమభావ వ్యవస్థ’ నశించడం!
ఇలా శరణార్థులై వచ్చినవారికి మన దేశం పౌరసత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ వారు, ఇతర ప్రతిపక్షాల వారు పాకిస్తాన్‌లో ‘మైనారిటీ’లపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యాకాండను పట్టించుకోవడం లేదు, దశాబ్దులుగా పట్టించుకోలేదు!! ఇదంతా దేశ విభజనతో, అఖండ భారత్ విభజనతో ముడివడి ఉన్న సమస్య కనుక పాకిస్తాన్‌లోని, మిగిలిన రెండు దేశాలలోని ‘అల్పసంఖ్య’ మతాల వారి గురించి పట్టించుకోవడం మన ప్రభుత్వాల, రాజకీయ పక్షాల నైతిక బాధ్యత మాత్రమే కాదు దౌత్య ధర్మం కూడ! పాకిస్తాన్‌లోను, అఫ్ఘానిస్థాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడినట్టయితే ఆ దేశాలలోని ‘అల్పసంఖ్య’ మతాల వారు అక్కడనే జీవించగలరు, పారిపోయి మన దేశానికి రావలసిన అవసరమే ఉండదు. జమ్మూ కశ్మీర్‌లో అక్రమంగా జోక్యం కలిగించుకొనడానికి పాకిస్తాన్ పదే పదే యత్నిస్తోంది! జమ్మూ కశ్మీర్‌లో మన ప్రభుత్వం ప్రజల ‘‘మానవ అధికారాల’’కు భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం దాదాపు ప్రతి సంవత్సరం ‘ఐక్యరాజ్యసమితి’లో తీర్మానాన్ని ప్రతిపాదిస్తోంది. తీర్మానాలు వీగిపోవడం వేఱు... కానీ కశ్మీర్‌లో మన ప్రభుత్వం ప్రజల హక్కులకు భంగం కలిగించడం లేదు. ‘‘జరగని’’ హక్కుల ఉల్లంఘన ‘‘జరిగినట్టు’’గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేయగలగడం ప్రస్తుతాంశం! అలాంటిది పాకిస్తాన్‌లో దశాబ్దుల తరబడి ‘మైనారిటీ’-అల్పసంఖ్య-మతాల ప్రజలకు జరుగుతున్న ఘోరమైన అన్యాయాల గురించి మన ప్రభుత్వం ‘ఐక్యరాజ్యసమితి’లో ఎందుకని ఫిర్యాదు చేయడం లేదు? ఇలా ఫిర్యాదు చేయడం జరిగితే పాకిస్తాన్‌లో ‘మైనారిటీ’లు అనుభవిస్తున్న కడగండ్ల గురించి ప్రపంచ సమాజానికి తెలిసి వస్తుంది! దక్షిణ ఆఫ్రికా వంటి దేశాలలో ‘వర్ణవివక్ష’ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రపంచ సమాజం ఇస్లాం మత రాజ్యాలను ‘సర్వమత సమభావ వ్యవస్థ’లుగా ఏర్పడాలని కోరాలి, ఇందుకోసం కృషి చేయాలి! ఇందుకు ప్రధానంగా పూనుకోవలసింది మన ప్రభుత్వం...
మన దేశంలోని అనేక రాజకీయ పక్షాల వారు వివిధ దేశాల అంతర్గత వైపరీత్యల గురించి అప్పుడప్పుడు ఆర్భాటం చేస్తున్నారు. ఇదంతా మానవీయ కార్యక్రమం... కానీ పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను ‘అల్పసంఖ్య’ ప్రజలపై జరుగుతున్న బీభత్సకాండ గురించి ఈ పక్షాలు నోరెత్తడం లేదు. ప్రధానమంత్రి గురువారం కాంగ్రెస్ పార్టీకి చెప్పిన హితవుకు ఇదీ నేపథ్యం... పాకిస్తాన్‌లోని హిందువుల కడగండ్ల గురించి 2012 మే నెల రెండవ తేదీన భారతీయ జనతాపార్టీ నాయకుడు మురళీమనోహర్ జోషి లోక్‌సభలో ప్రస్తావించాడు. అప్పటి విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్.కృష్ణ ‘మైనారిటీ’లను రక్షించవలసిందిగా పాకిస్తాన్‌కు ‘సభలో’ విజ్ఞప్తిచేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఈ సంగతి గుర్తుకు వచ్చిన దాఖలా లేదు... నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తికి ఇదీ కారణం! పాకిస్తాన్ తీరును ప్రతిపక్షాల వారు ఇప్పుడైనా నిరసిస్తారా?