సంపాదకీయం
‘చెదలెక్కిన’ చికిత్స!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేశంలో తగినంత మంది శిశువైద్యులు- పీడియాట్రీసియన్స్- లేరన్నది బయటపడిన చేదు నిజం. గుజరాత్‌లోను, రాజస్థాన్‌లోను వైద్యశాలలలో వందల సంఖ్యలో శిశువులు మరణిస్తుండడం ఈ విచిత్ర ‘కఠోర వాస్తవం’ ఆవిష్కృతం కావడానికి సమకాలీన మాధ్యమం... మందులు లేని వైద్యశాలలలో రోగులు పడికాపులు పడడం గతం, పుష్కలంగా మందులు లభిస్తుండడం వర్తమానం. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ - మల్టీ నేషనల్ కార్పొరేషన్స్- ఎమ్‌ఎన్‌సిలు- విదేశాలనుంచి చొఱబడిపోయిన తరువాత మందులకు, ఉపకరణాలకు లోటు లేదు! భారీగా విదేశాలనుంచి దిగుమతి అయిపోతుండడం ‘ప్రపంచీకరణ’ వాణిజ్య వ్యవస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ‘ఆయుష్మాన్ భారత్’వంటి పథకాలను అమలుచేస్తున్నాయి. అందువల్ల ‘ప్రభుత్వేతర వాణిజ్య వైద్యశాలలు’- కార్పొరేట్ హాస్పిటల్స్- భారీగా దండుకుంటున్నాయి. ఈ ‘సార్వజన వైద్య’ సహాయ పథకాలవల్ల ప్రధానంగా లాభపడుతున్నది ‘‘కార్పొరేట్’’ వైద్యశాలల నిర్వాహకులు! ప్రభుత్వ వైద్యశాలలలో మాత్రమే అమలుజరుగవలసిన వైద్యసేవలను సైతం ‘‘పేర్లు మార్చి’’ కార్పొరేట్ వైద్యశాలల కామందులు కాజేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పథకాలను అమలు జరిపించడంలో వైద్య చికిత్సార్థుల- పేషెంట్స్-కూ, వైద్యశాలలకూ, ప్రభుత్వ యంత్రాంగాలకు మధ్య ‘అనుసంధానకర్త’లుగా అభినయ విన్యాసాలుచేస్తున్న తథాకథిత- సోకాల్డ్- స్వచ్ఛంద సంస్థలు ‘దళారీ’లుగా మారి ఉండడం కూడ నడుస్తున్న విన్యాసం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులు ‘కోరడా’లను ఝులిపిస్తూనే ఉన్నారు, అవినీతికి నిలయాలైన వైద్యశాలల నిర్వాహకులు దోచుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వ వైద్యశాలలలో నిర్లక్ష్యం, లంచగొండితనం పుట్టలు పెరగడం గతం. ‘కార్పొరేట్’ వైద్యశాలలు క్రూరత్వానికి, దోపిడీకి నిలయాలు కావడం వర్తమానం! ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలల ప్రాధాన్యం తగ్గిపోయింది! అందువల్ల ప్రభుత్వ వైద్యశాలలలో వైద్యుల కొరత ఏర్పడి ఉండవచ్చు! మందులకు కొరత లేదు కాని వైద్యుల కొరత ఏర్పడిందట... అర్హులైన వైద్యులు ప్రతిభావంతులు అమెరికాకు, ఇతర దేశాలకు తరలిపోవడం చరిత్ర... కానీ ‘కార్పొరేట్’ వైద్యశాలలు విస్తరించిపోయిన తరువాత వైద్యులకు సైతం కొరత లేదన్నది జరుగుతున్న ప్రచారం. అందువల్లనే దేశంలో శిశువైద్యులకు కొరత ఏర్పడిందన్న ‘నిర్ధారణ’ విస్మయకరం! దేశంలో రెండు లక్షల మంది ‘శిశు వైద్యుల’ అవసరం ఉందట. కానీ కేవలం ఇరవై ఐదు వేల మంది శిశువైద్యులు మాత్రమే ఉన్నారట. ‘‘్భరత ఆరోగ్యసేవల ప్రదాతల సంఘం’’- అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా- అన్న సంస్థవారు ఈ నిర్ధారణ చేశారట. రాజస్థాన్‌లోను, గుజరాత్‌లోను జరిగిపోతున్న శిశు మరణాలకు వైద్యులకొరత కారణమా? లేక ఉన్న వైద్యుల నిర్లక్ష్యం కారణమా?? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు!
వివిధ ప్రాంతాలలోని ‘ఆసుపత్రుల’లో నవ జాత శిశువులు, చికిత్సకోసం చేరిన శిశువులు చనిపోయి ఉండడం గురించి ఏళ్లతరబడి ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌లోను, రాజస్థాన్‌లోను ఇటీవల జరిగిన శిశు మరణాలు పరాకాష్ఠ. రాజస్థాన్‌లోని కోట నగరంలోని ‘జెకెలోన్’అన్న వైద్యశాలలో ముప్పయి ఐదు రోజులుగా ప్రతిరోజూ ‘‘అంతుపట్టని’’ శిశు మరణాలు సంభవించాయి. దాదాపు నూట పది మంది శిశువులు ఈ కాలవ్యవధిలో అకాల మృత్యువు పాలయ్యారు. అయినప్పటికీ వైద్యశాల నిర్వాహకులు కాని, ప్రభుత్వాలు కాని నిరోధక చర్యలు తీసుకోకపోవడం వైఫల్యం మాత్రమే కాదు క్రూరమైన నిర్లక్ష్యం కూడ. ఈ క్రూరమైన నిర్లక్ష్యం ఎవరిదన్న విషయమై వారాల తరబడి రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. గుజరాత్‌లోని రెండు ప్రధాన వైద్యశాలలలో డిసెంబర్‌లో నూట తొంబయి తొమ్మిది మంది శిశువులు మరణించడం సమాంతర వైపరీత్యం. రాజకోట, అహమ్మదాబాద్ నగరాలలోని వైద్యశాలలలో ఈ మరణాలు సంభవించాయట. అక్టోబర్, నవంబర్ మాసాలలో రాజ్‌కోటలోని వైద్యశాలలలో రెండువందల అరవై తొమ్మిది మంది శిశువులు, అహ్మదాబాద్‌లోని వైద్యశాలలలో ఇదే కాలవ్యవధిలో రెండు వందల యాబయి ముగ్గురు శిశువులు మరణించడం మానవత్వం నిండిన గుండెల వారిని కలచివేస్తున్న విషాదం! కోట వైద్యశాలలో జరిగిన మరణాలకు తమ ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉందని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పైలట్ స్వయంగా ప్రకటించడం నిర్లక్ష్యం నిహితమై ఉన్న ప్రభుత్వ వ్యవస్థకు సరికొత్త ధ్రువీకరణ. ఈ ‘కోట’వైద్యశాల ప్రాంగణంలో పందులు యధేచ్ఛగా విహరిస్తున్నాయట...
ఇలా ‘నిర్లక్ష్యం’, ‘క్రూరత్వం’, ‘లంచగొండితనం’ వీటన్నింటికీ మించి ప్రజల హృదయ క్షేత్రాన్ని ఆవహించిన ‘తరతరాల’ పట్టించుకోనితనం వైద్య రంగాన్ని మాత్రమే కాదు, సకల జీవన రంగాలను సంక్షుభితం చేస్తున్నాయి. ‘వ్యాపార సౌలభ్యం’ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- గురించి ప్రభుత్వాలు హోరెత్తిస్తున్నాయి, మన దేశంలో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సౌలభ్యం పెరిగిందని బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు విశ్వాసం కలిగిస్తున్నాయి. ఇలా ‘విశ్వాసం’నిండిన ‘బహుళ జాతీయ సంస్థలు’ దేశంలోకి చొఱబడిపోతుండడం ఇరవై ఆరేళ్ల ‘ప్రపంచీకరణ’ చరిత్ర! వాణిజ్య సౌలభ్యం పెరగడంలో ‘బహుళ సంస్థలు’ ప్రధానంగా విదేశీయ వ్యాపారపు ‘ముఠాలు’ మనలను దోపిడీ చేయడం మొదలైంది. ఈ దోపిడీ చేసే ప్రవృత్తి స్వదేశీయ వాణిజ్య సంస్థలను కూడ ఆవహించడం ‘ప్రపంచీకరణ’ ఫలితం... ఫలితంగా ‘జీవన సౌలభ్యం’ అడుగంటిపోతోంది! ‘‘గిరాకీ, లభ్యత’’- డిమాండ్, సప్లయ్- ప్రాతిపదికగా సామాజిక వ్యవస్థ నడుస్తోంది. ప్రజల అవసరం, జన జీవన సౌలభ్యం వంటి వాటికి ప్రాధాన్యం లేదు. అందువల్ల దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర వాణిజ్య రంగంలో మాత్రమేకాక సకల జీవన రంగాలలోను ‘‘లభ్యత- గిరాకీ’’ ప్రాతిపదికగా వ్యవస్థలు వికసించాయి, వికసిస్తున్నాయి... ఈ వికసన ప్రవృత్తికి ‘బుద్ధి’పెద్దది, అందువల్ల దోపిడీ చేయగలుగుతోంది... ఈ వికసన క్రమానికి ‘హృదయం’లేదు. అందువల్ల విద్యావంతులను, వైద్యులను, అధికారులను, రాజకీయ వేత్తలను ‘క్రౌర్యం’ ఆవహించి ఉంది! ‘ప్రపంచీకరణ’ మొదలుకాక పూర్వం దశాబ్దుల క్రితమే అత్యధిక శాతం ఉన్నత విద్యావంతులు అవినీతిపరులు కావడం చరిత్ర... ఈ చరిత్రకు బ్రిటన్ దురాక్రమణ సమయంలో అంకురార్పణ జరిగింది. ‘హృదయం’లేని బుద్ధిజీవులు విస్తరించడం బ్రిటన్ వారి విద్యావ్యవస్థ ఫలితం! అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఉన్నత వైద్యులకు, అధికారులకు ‘నైతిక ధ్యాస’ లేకపోవడానికి ఇదీ కారణం... నైతిక ధ్యాస లేనివారు ‘అవినీతి’ని అతి సహజమైన సంప్రదాయంగా, జీవన వ్యవహారంగా వ్యవస్థీకరించారు... అరవై ఏళ్ల క్రితం కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘‘దమయంతీ స్వయంవరము’’అన్న సాంఘిక నవలను వ్రాశాడు. ఆ ‘నవల’లో కథానాయకుడి కుమారుడికి చేయి విరిగింది, ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. ‘‘ఆ ఆసుపత్రిలో ఒకాయన ఉన్నాడు, పెద్ద డాక్టరు... ఆయన ఈ శస్తచ్రికిత్సలో మహానుభావుడని ప్రతీతి... ఆయన నాలుగువందల దాకా అడిగాడు, చివరికి రెండువందలకి దిగేటప్పటికి నా పూర్వ ఋషులు దిగి వచ్చారు. రెండువందలు చేతిలో పొయ్యాయి. చికిత్స బల్లమీదికి ఎక్కాలి...’’ ఇది ఏడు దశాబ్దులనాటి ప్రభుత్వ వైద్యశాలల తీరు. కానీ ప్రభుత్వేతర వైద్యశాలలు మొదలైన తరువాత ‘పరిభాష’ మారింది. ‘లంచం’అన్నది క్రమంగా ‘శుల్కం’-్ఫజ్-గా మారింది. ప్రభుత్వం మళ్లీ చెల్లిస్తుంది కనక రోగులకూ బాధ లేదు, వైద్యశాలల నిర్వాహకులకూ బాధ లేదు. అందువల్ల వైద్యశాలలవారు ఎంత దోచుకున్నప్పటికీ ఎవరికీ పట్టడం లేదు... ఇది సాధారణ వ్యవహారం. ప్రభుత్వం అప్పుడప్పుడు చర్య తీసుకొంటోంది. ఇది ‘అపవాదం’- ఎక్సెప్షన్- మాత్రమే! అక్రమాలు జరుపుతున్న 171 వైద్యశాలలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అభియోగాలను నమోదు చేసిందట... అపవాదం!