సంపాదకీయం
‘విక్రమ’ విన్యాసం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన ‘విమాన వాహక యుద్ధనౌక‘ ‘విక్రమాదిత్య’ అరేబియా సముద్ర జలాలలో భద్రతా యాత్రకు ఉపక్రమించడం చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి దురాక్రమణను ప్రతిఘటించడంలో భాగం. ఈ విమాన వాహక యుద్ధ నౌక-ఎయిర్ క్రాఫ్ట్ కారియర్‌లో నిహితమై ఉన్న విమాన ప్రాంగణంనుంచి పైకి దూసుకెళ్లిన ‘మిగ్-29కె’ విమానాలు అరేబియా సముద్ర గగన తలంపై విన్యాసాలు చేయడం గత శుక్రవారం ఆవిష్కృతమైన దృశ్యం... నౌకాదళం ఉప ప్రధాన అధికారి ఎమ్.ఎస్.పవార్ ఆధ్వర్యవంలో జరిగిన ఈ విన్యాసాలకు వారంరోజులుగా ‘చైనా పాకిస్తాన్’దళాలు ‘అరేబియా’ప్రాంతంలో నిర్వహిస్తున్న నౌకా విన్యాసాలు నేపథ్యం. ‘‘సముద్ర రక్షకులు- సీగార్డియన్స్- 2020’’అన్న పేరుతో తొమ్మిది రోజులు ‘చైనా పాకిస్తాన్’ల యుద్ధనౌకలు, జలాంతర్గాములు అరేబియా సముద్రంలో నిర్వహించిన విన్యాసాలు మన సరిహద్దులలో ఉద్రిక్తతను కొనసాగించాలన్న వ్యూహంలో భాగం. ఈ వ్యూహంలో భాగంగానే టిబెట్‌లో చైనా ప్రభుత్వం ఇదే సమయంలో సైనిక విన్యాసాలు జరిపింది. మన ఉత్తరపు సరిహద్దులకు సమీపంలో జరిగిన ఈ విన్యాసాలు టిబెట్ ప్రజలను ప్రత్యేకించి టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులను భయవిభ్రాంతికి గురిచేసే కార్యక్రమం! మన ఉత్తరపు సరిహద్దులవద్ద ‘‘ఊహాగానాల’’ను ఆవిష్కరించడం కూడ ఈ ‘టిబెట్ విన్యాసాల’ లక్ష్యం. ఈ విన్యాసాలలో భాగంగా టిబెట్‌లో ‘క్షిపణి ప్రయోగాల’కు మరో స్థావరాన్ని ఏర్పాటుచేసిందట! అరేబియా సముద్రంలోను, హిందూ మహాసాగరంలోను దొంగతనాలు చేస్తున్న, వాణిజ్య నౌకలను అపహరించుకొనిపోతున్న ‘ఓడ దొంగల’కు సోమాలియా దేశపు తూర్పుతీరం ప్రధాన స్థావరం. ఈ దొంగలకూ పాకిస్తానీ, అఫ్ఘానీ ‘తాలిబన్’ జిహాదీలకు అనుసంధానం ఏర్పడి ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’’-ఐఎస్‌ఐ- ఈ అనుసంధానం ఏర్పరచింది. ఓడ దొంగలను, ఓడ దొంగల ముసుగులోని జిహాదీ బీభత్సకారులను ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దశాబ్దికి పైగా ఈ ‘తస్కరులు ముష్కరులు’ మన లక్షద్వీపాలకు అత్యంత సమీపంలోఉన్న మాల్‌దీవులలోని నిర్జన ద్వీపాలలోకి చొఱబడిపోయారన్న ప్రచారం జరిగింది. పాకిస్తాన్‌కు అత్యంత సమీపంలోని పర్షియా సింధుశాఖ ప్రాంతంనుంచి ఎఱ్ఱసముద్రానికి, అరేబియా సముద్రానికి ‘సంగమ స్థలి’అయిన ‘ఏడెన్’ సింధుశాఖ వరకు ఈ ‘జిహాదీ’ల కలాపాలు విస్తరించాయి. ఏడెన్ సింధుశాఖకు ఎగువన ఉన్న - ఉత్తరంగా ఉన్న-యెమెన్ తాలిబన్ల స్థావరం. ఏడెన్ సింధుశాఖకు దిగువన దక్షిణంగా ఉన్న సోమాలియా ఓడ దొంగల స్థావరం. ఇదీ ఓడ దొంగలకు, జిహాదీలకు మధ్యగల భౌతిక అనుసంధానం. ఇలా మాల్‌దీవులనుంచి పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని ‘గ్వాడార్’ ఓడ రేవు వరకు విస్తరించిన సముద్రంలో పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ మూకలు, ఓడ దొంగల ముసుగులోని జిహాదీ హంతకులు ఏళ్లతరబడి కలాపాలు సాగిస్తున్నారు. ఈ ఓడ దొంగలను అదుపుచేసే ‘నెపం’తో చైనా యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో విన్యాసాలు ప్రారంభించాయి. ఈ విన్యాసాలు ‘‘తోడేళ్లతో కలసి తరమడం, కుందేళ్లతో కలసి పారిపోవడం’’వంటివి! మన ‘విక్రమాదిత్య’ విమాన వాహక నౌకను అరేబియా సముద్రంలో నెలకొల్పవలసి రావడానికి ‘చైనా పాకిస్తాన్’లు వ్యవస్థీకరించిన ఈ ఉమ్మడి ప్రమాదం నేపథ్యం...
‘విక్రమాదిత్య’ అరేబియా ప్రవేశానికి కొద్దిరోజుల ముందుగా చైనావారి ‘షాణ్‌డోంగ్’ సముద్ర ప్రవేశం చేసింది. ‘షాణ్‌డోంగ్’ చైనా స్వయంగా నిర్మించుకున్న విమాన వాహక యుద్ధనౌక. ఇంతవరకు చైనాకుండిన ఒకే ఒక విమాన వాహక యుద్ధనౌక ‘లియా ఓనింగ్’ను ‘ఉక్రెయిన్’దేశంనుంచి కొనుగోలు చేశారట. ఈ ‘లియా ఓనింగ్’ను ఉక్రెయిన్ కొన్నాళ్లు ఉపయోగించిన తరువాత చైనాకు అమ్మింది. ఇప్పుడు చైనా సొంతంగా కొత్త ‘విమాన వాహక యుద్ధనౌక’ను నిర్మించుకోవడం సముద్రాలలో చైనా జరుపుతున్న వ్యూహాత్మక విస్తరణలో భాగం. ప్రశాంత మహాసాగర- పసిఫిక్ ఓషన్- ప్రాంతం చైనా సమీపంలో విస్తరించి ఉంది. అందువల్ల చైనాకు దక్షిణంగాను, వియత్నామ్‌కు తూర్పుగాను విస్తరించి ఉన్న సముద్ర జలాలలోను, చైనాకు తూర్పుగాను జపాన్‌కు దక్షిణంగాను విస్తరించిన సముద్ర జలాలలోను ఉద్రిక్తతలు ఉద్ధృతమయ్యాయి. ఈ ఉద్రిక్తతలకు కారణం ఈ ‘అంతర్జాతీయ జలమండలాల’ను చైనా తన ‘ఆర్థిక జల మండలం’- ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్- గాను సార్వభౌమ జలాల- టెర్రిటోరియల్ వాటర్స్-గాను ప్రకటించుకొనడానికి యత్నిస్తుండడం, వియత్నామ్‌కు తూర్పుగా ఉన్న సముద్ర జలాలలో మన దేశం చమురు, ఇంధన వాయువులను అనే్వషించకుండా దశాబ్దికి పైగా చైనా నిరోధించింది. వియత్నామ్ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ చైనా మాత్రం ఈ ‘అనే్వషణ’ను అడ్డుకుంటోంది. నిజానికి వియత్నాం అభ్యర్థన మేరకు మాత్రమే మన దేశం చమురు, ఇంధన వాయువుల అనే్వషణకు పూనుకొంది. ఇలా తమ దేశపు సమీపంలోని, తమవి కాని సముద్ర జలాలలో మన వాణిజ్య కలాపాలను సైతం చైనా సహించడం లేదు...
కానీ, మన దేశానికి సమీపంలో ఉన్న, మన దేశం చుట్టూ ఉన్న సముద్ర జలాలలోకి మాత్రం చైనా చొఱబడిపోయింది! ‘అంతర్జాతీయ సముద్ర గర్భ సాధికార సంస్థ’- ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ-వారు మన దేశానికి నైరృతిగా విస్తరించిన హిందూసాగర ప్రాంతంలో ‘అనే్వషణ’లు జరపడానికి దాదాపు పదేళ్లక్రితం చైనాకు అనుమతినిచ్చింది. అంతకు పూర్వం దాదాపు పదేళ్లు ప్రయత్నించినప్పటికీ ఈ ‘అనే్వషణ’లకు అనుమతి సాధించడంలో మన దేశం విఫలమైంది. చైనా ‘చొఱబాటు’నకు ఈ మన దశాబ్దుల వైఫల్యం కూడ ఒక ప్రధాన కారణం! ఇప్పుడు మన ప్రభుత్వం మేలుకొంది. చైనా వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని రచించగలుగుతోంది. అయినప్పటికీ చైనా విస్తరణ ఆగడం లేదు. శ్రీలంకలోని ఓడరేవులు చైనా యుద్ధస్థావరాలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ ‘విస్తరణ’ను అరికట్టడంలో మన ప్రభుత్వానికి ఇప్పటికీ సాధ్యం కావడంలేదు. ఎందుకంటె, శ్రీలంక ప్రభుత్వం మాటిమాటికీ మాట మార్చుతోంది!! చైనాను దూరంగా ఉంచుతోంది! పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’ఓడరేవును చైనా తన సైనిక స్థావరంగా మార్చుకొంది. దశాబ్దికి పైగా మన ప్రభుత్వం ఈ ప్రమాదం గురించి పట్టించుకోలేదు, గత ఐదేళ్లుగా పట్టించుకొంది. గ్వాడార్ ఓడరేవు పర్షియా సింధుశాఖకు సమీపంలో ఉంది. సింధుశాఖకు ఉత్తరంగా పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌కు పశ్చిమంగా ఇరాన్ విస్తరించి ఉంది. అందువల్ల ఇరాన్‌లోని ‘చౌబహార్’ ఓడరేవును అభివృద్ధిచేసే పథకాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. ‘గ్వాడార్’వ్యూహానికి ‘చౌబహార్’ ప్రతి వ్యూహం కాగలదన్న భావం వ్యాపించింది. కానీ ఇరాన్ ప్రభుత్వం ‘నమ్మక ద్రోహం’చేస్తుండడం మన సముద్ర భద్రతకు విఘాతకరమైన విపరిణామం. ‘చౌబహార్’ ఓడరేవు సమీప ప్రాంతాలను ఇరాన్ ప్రభుత్వం చైనాకు, పాకిస్తాన్‌కు ‘‘అప్పగించడం’’ ఈ నమ్మక ద్రోహం. అంటే తన దురాక్రమణ వ్యూహాన్ని మన ప్రభుత్వం ప్రతిఘటించడంతో చైనా కొత్త వ్యూహాన్ని అమలుజరుపుతోంది! ‘చౌబహార్’లో చైనా, పాకిస్తాన్‌లో ప్రవేశించడం మాత్రమేకాదు, ‘‘చైనా-పాకిస్తాన్ ఆర్థిక ప్రాంగణ పథకం’’లో ఇరాన్‌కు భాగస్వామ్యం లభించింది. ఈ పథకం పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్‌లో అమలుజరుగుతోంది. అందువల్ల మన ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది...
హిందూ మహాసాగర ప్రాంతంలో చైనా నౌకాదళ విస్తరణకు ‘జిబౌటీ’లో ఆ దేశానికి స్థావరం ఏర్పడడం మరో నిదర్శనం. ‘జిబౌటీ’ ఏడెన్ సింధుశాఖ సమీపంలో, ఎఱ్ఱ సముద్రపు దక్షిణతీరంలో ఆఫ్రికా ఖండంలో నెలకొని ఉంది. మన ప్రభుత్వం దీన్ని ప్రతిఘటించడానికి పూనుకొనడం మన భద్రతకు బలంచేకూర్చుతున్న మరో పరిణామం. ‘మడగాస్కర్’లోని మన దౌత్య కార్యాలయంలో ‘రక్షణ’విభాగాన్ని ఏర్పాటుచేయడం ఈ ప్రతిఘటన. మడగాస్కర్ ఆఫ్రికా ఖండం తూర్పుతీరానికి సమీపంలో నెలకొని ఉన్న ద్వీపం...