సంపాదకీయం

ప్రకృతి పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుల అస్తిత్వానికి మాత్రమేకాదు, సకల జీవజాలం మనుగడకు సనాతన ప్రాతిపదిక పుడమి తల్లి... భూమి లేనట్టయితే ఏమీ ఉండదన్నది ఈ సనాతన ప్రాతిపదిక! ‘సనాతనం’ అని అంటే శాశ్వతమైనది- ఎటర్నల్- అని అర్థం. ఈ పుడమి ప్రాధాన్యాన్ని గుర్తించినవారు భారతీయులు! అనాదిగా ‘‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి నేను ఆమె బిడ్డను- అన్న వాస్తవం హైందవ జాతీయ జీవన వాస్తవం కావడం నడుస్తున్న చరిత్ర, యుగయుగాల చరిత్ర. భూమి ప్రాతిపదికగానే మిగిలిన నాలుగు ప్రాకృతిక శక్తులను పరిగణించడం సాపేక్ష- రిలెటివ్- సత్యం! నేల, నీరు, నిప్పు, గాలి, నింగి ఐదు ప్రాకృతిక శక్తులు. ఈ ‘పంచ భూతాల సమష్టి ప్రకృతి...’ ప్రకృతిలో మానవుడు సర్వశ్రేష్ఠుడు, సముత్కర్ష విచక్షణ ధీదితుడు! ఈ సముత్కర్ష స్థితి కారణంగానే మానవుడు ప్రకృతివల్ల అత్యధిక ప్రయోజనం పొందగలుగుతున్నాడు. ఈ అధికారంతోపాటు ఈ ప్రకృతిని పరిరక్షించవలసిన బాధ్యత కూడ మానవునిది! మానవుడు ఈ బాధ్యతను నిర్వర్తించినట్టయితే మిగిలిన జంతుజాలంతోపాటు వృక్షజాలం, సమస్త జీవజాలం మనుగడ సాగించగలదు. ఈ బాధ్యతా నిర్వహణ సమాజ సమష్టి జీవన నిహితం కావడం యుగయుగాల హైందవ జాతీయ తత్త్వం, భారతీయ జనమానస క్షేత్రం! ‘‘ఆత్మవత్ సర్వభూతాని...’’- సమస్త ప్రాణులను తనవలెనే- సంభావించాలన్న సృష్టిగత వాస్తవం తరతరాలుగా హైందవ జాతీయ సమాజ నిహితమైంది! అందువల్ల చెట్టుపట్ల, పుట్టపట్ల, చెఱువుకట్టపట్ల, కొండ గట్టు పట్ల మమకారం కలిగి ఉండడం మానవుని సహజ స్వభావం! ఈ మమకారం ప్రకృతి పట్ల మానవుని అద్వైత స్థితి. ప్రకృతినుంచి మానవుడు భిన్నం కాదు. అందువల్ల చెట్టును రక్షించడం, ప్రకృతిని రక్షించడం మానవుని స్వీయ రక్షణ మాత్రమే! ఈ వాస్తవం హైందవ జీవన స్థితం కావడం పరంపర... ఈ ‘పరంపర’లో ఒక ప్రతీక మకర సంక్రాంతి!! భూమిని ప్రకృతిని రక్షించుకోవాలన్న ధ్యాస పదిలం కావడానికి ప్రాతిపదిక మకర సంక్రాంతి... పుడమితల్లికి ఏటేటా కృతజ్ఞతను ఆవిష్కరించడం మకర సంక్రాంతి!! ఈ ‘పుడమి’ పాడి పంటలను సమకూర్చుతున్న వ్యవసాయ భూమి, ఈ ‘పుడమి’ ఆకుపచ్చని పరిమళాలతో పరవశింపచేస్తున్న అటవీ భూమి. ఈ ‘పుడమి’ మానవుని నిజమైన మానవునిగా నిలబెట్టగలిగే సంస్కార సమాహారం అంకురిస్తున్న సాంస్కృతిక భూమి! ఈ ‘పుడమి’ తుది మొదలులేకుండా జాతిని పెంచిపోషిస్తున్న మాతృభూమి...
మకర సంక్రాంతి ప్రతి సంవత్సరం ఖగోళంలో పునరావృత్తం అవుతున్న మధుర విక్రాంతికి ప్రతీక! భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ పరిభ్రమణం కారణంగా సూర్యుడు, భూమినుంచి చూసినప్పుడు, ఆరు నెలలు దక్షిణంగాను ఆరునెలలు ఉత్తరంగాను ‘సంచలనం’చేస్తున్న ఖగోళ వాస్తవం దృశ్యమానం అవుతోంది. సూర్యుని ఈ ‘సాపేక్ష చలనం’- రిలెటివ్ మూవ్‌మెంట్-వల్ల దక్షిణాయనం, ఉత్తరాయణం ఏర్పడుతున్నాయి. ‘అయనం’అంటే కదలిక, ప్రస్థానం! ‘్భమధ్య రేఖ’ సున్న ‘్భగ’ల- జీరో డిగ్రీ- అక్షాంశం! భూమధ్య రేఖకు ఇరువైపులా ఇరవై మూడున్నర ‘డిగ్రీ’ల మేర- అంటే నలబయి ఏడు ‘డిగ్రీల’మేర- అంతరిక్షంలో ఇరవై ఏడు నక్షత్ర సమూహాలు విస్తరించి ఉన్నాయి. ‘అశ్వని’నుంచి ‘రేవతి’ వరకు ఈ నక్షత్ర సమూహాలు విస్తరించి ఉన్నాయి. ‘సౌలభ్యం’కోసం ఈ ‘ఇరవై ఏడు’ నక్షత్ర సమూహాలను పనె్నండు రాసులుగా విభజించడం కూడ ఖగోళ వాస్తవం. ఇది కూడ సాపేక్షం... ఈ నక్షత్రాలు, నక్షత్ర సమూహాలైన ‘రాసు’లు భూమికి ‘సాపేక్షం’గా ప్రతిరోజు ఉదయించి అస్తమిస్తున్నాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం...అన్నవి పనె్నండు రాసులు. ఈ పనె్నండు రాసులలో ప్రతి రాసి భూమికి సాపేక్షంగా నెలరోజులపాటు సూర్యునితో కలసి ఉదయిస్తున్నాయి. సూర్యుడు మేష రాసితో కలసి ఉదయించడానికి ఆరంభ ‘మేష’ సంక్రాంతి... ఇలా పనె్నండు రాసులతో సూర్యుని ‘‘కలయిక’’ పనె్నండు సంక్రాంతులు. ఇలా సూర్యుడు పనె్నండు రాసులతో- నెల చొప్పున- ఉదయించడం పూర్తయ్యేసరికి ‘సౌరమాన’ సంవత్సరం పూర్తవుతోంది! భూమధ్య రేఖకు దక్షిణంగా ఇరవై మూడున్నర ‘డిగ్రీ’ల అక్షాంశం మీద ‘మకర రాసి’-కాప్రీకార్న్- నక్షత్ర సమూహం నెలకొని ఉంది. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ఇరవైమూడు ‘డిగ్రీ’ల అక్షాంశంపై అంతరిక్షంలో ‘కర్కటక’రాసి నక్షత్ర సముదాయం నెలకొని ఉండడం సృష్టి నిహితమైన ఖగోళ వాస్తవం! ఈ సనాతన వాస్తవాన్ని హైందవ జాతి అనాదిగా గుర్తించడం ‘మకర సంక్రాంతి’ ఉత్సవ నిర్వహణకు తార్కికమైన ప్రాతిపదిక...
సూర్యుడు ‘కర్కాటక’ రాసితోపాటు ఉదయించడం మొదలుకావడం కర్కాటక సంక్రాంతి... అప్పటినుంచి ఆరు సంక్రాంతులపాటు- ఆరునెలలపాటు- సూర్యుడు ‘‘సాపేక్షంగా’’ దక్షిణదిక్ ‘ప్రచలనం’ చేస్తున్నాడు. ఇది దక్షిణాయనం. ఈ ఆరునెలలపాటు భూమిపై ‘ఉత్తరార్థగోళం’లో రాత్రి నిడివి- చీకటి నిడివి-క్రమంగా పెరుగుతుంది. చలిముదరడం ‘‘ఉహుహూ అని లోకము వణకిపోవడం’’ దక్షిణాయనం పరాకాష్ఠ. కర్కాటక రాసి నుంచి ‘‘బయలుదేరిన’’ సూర్యుడు ఆరు నెలల తరువాత ‘మకర రాసి’ని ‘‘చేరడం’’తో దక్షిణాయనం పూర్తవుతుంది. ‘మకర రాసి’తో కలిసి- సాపేక్షంగా- సూర్యుడు ఉదయించడానికి ఆరంభం మకర సంక్రాంతి!
అప్పటినుంచి సూర్యుడు ఆరునెలలు ‘ఉత్తర దిశాప్రస్థానం’ చేస్తున్నాడు. ఆరు నెలల తరువాత సూర్యుడు మళ్లీ ‘కర్కాటక’ రాసిని చేరేవరకు ఉత్తరాయణం! ఈ ఉత్తరాయణం ఆరునెలలూ భూమిపై ఉత్తర్థాగోళంలో పగటి నిడివి- వెలుగు నిడివి క్రమంగా పెరుగుతుంది. ‘రాత్రి’ కాలవ్యవధి- చీకటి కాల వ్యవధి- క్రమంగా తగ్గుతుంది. మన దేశం ఉత్తరార్థ గోళంలో ఉంది. అందువల్ల ‘వెలుగు’ను అభిలషించే భారత జాతి, చీకటిని నిరసించే భారత జాతి మకర సంక్రాంతిని శుభ సంకేతంగా వెలుగుల చిహ్నంగా అనాదిగా గుర్తించారు! ఇలా మకర సంక్రాంతి విశ్వవ్యవస్థలో సహజంగా సంభవిస్తున్న వెలుగుల విక్రాంతి, మధురకాంతుల విప్లవం! సృష్టిగత వాస్తవాలను సమాజస్థిత జీవన వ్యవహారంగా మలచుకున్న భారతీయులు అనాదిగా ఇలా మకర సంక్రాంతినాడు ‘వెలుగుల ప్రదాత’అయిన సూర్యుడికి కృతజ్ఞతలను సమావిష్కరిస్తున్నారు. హైందవ జీవన విధానం విశ్వవ్యవస్థలో ఇలా నిరంతరం అనుసంధానం కావడం అద్వైతం... ఈ అద్వైత ధ్యాసను మకర సంక్రాంతి పెంపొందిస్తోంది! అందువల్ల మకర సంక్రాంతి పుడమి పండుగ, ప్రకృతి పండుగ, సహజ కాంతి శోభల పండుగ, భూమిపై ఉన్న ఉత్తరార్థ గోళంలోని ప్రజలందరికీ పండుగ!
కాలుష్య వలయంలో బందీ అయిన పుడమితల్లి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతుండడం నడుస్తున్న వ్యథ...మకర సంక్రాంతి స్ఫూర్తిని నిలదీస్తున్న వ్యథ! మానవులు ప్రకృతి పట్ల తన కర్తవ్యాన్ని క్రమంగా విస్మరించడం ఈ వ్యథకు శతాబ్దుల నేపథ్యం! అడవులను, ఆవులను ధ్వంసం చేయడం పుడమిపై నెలకొన్న ‘‘సహజ కాలుష్య నిరోధక వ్యవస్థ’’ ధ్వంసమైపోయింది. గోమయం- ఆవుపేడ, గోమూత్రం ఎరువులుగా వాడిన సమయంలో, అడవుల ఆకులను ఎరువులుగా వాడిన సమయంతో భూమి పాలకంకుల పరిమళాలతో పరవసించింది! ‘గోమయం’ వాసనలకు మురిసిపోయిన ‘వానపాములు’ భూమిని నిరంతరం దున్ని పరిపుష్టం చేశాయి. కానీ గోసంతతి హత్యలకు గురిఅయింది. గోమయం కరవైంది. అడవులు నశించినచోట ఆకులు కరవయ్యాయి. ఫలితంగా కృత్రిమ విష రసాయనాలు ‘ఎరువులు’గా వ్యవసాయ భూమిపై కొలువుతీరాయి. ఈ విషాల వాసనలు భరించలేని ‘వానపాములు’- అర్త్ వార్మ్స్- భూగర్భంలోకి పారిపోయి ముప్పయి అడుగుల లోతున దాక్కుంటున్నాయట! అందువల్ల భూమికి రక్షణ అంటే గోసంతతి రక్షణ, అడవుల సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ!! సూర్యోదయ సమయంలో పల్లెపల్లెలో, నగర వాటికలలో వృక్షాలపై ఉడుతలు, పిచ్చుకలు, చిలుకలు, గోరువంకలు నిరంతరం కొలువుతీరడం నిజమైన మకర సంక్రాంతి! సూర్యాస్తమయ సమయంలో ఆవులు లేగ దూడలకోసం పరుగుతీస్తున్న దృశ్యాలు పుడమిపై ఆవిష్కృతం కావడం మకర సంక్రాంతి...