సంపాదకీయం
పెట్టుబడుల ప్రహేళిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమెజాన్- అన్న విదేశీయ వాణిజ్య సంస్థ పెట్టుబడుల గురించి కేంద్ర వాణిజ్య పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు ‘బహుళ జాతీయ వాణిజ్య’- మల్టీ నేషనల్- అవినీతి విస్తరిస్తూ ఉండడం వికృతమైన నేపథ్యం! ‘నేపథ్యం’ సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒక ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఎమ్‌ఎన్‌సి-ను మన ప్రభుత్వ ప్రతినిధి పేరుపెట్టి, విమర్శించడం మాత్రం హర్షణీయ పరిణామం. ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- మొదలయిన తరువాత ఇరవై ఆరేళ్లుగా మన దేశం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దోపిడీకి యథేచ్ఛా విహార భూమి కావడం నడుస్తున్న వైచిత్రి. విదేశీయ వాణిజ్య సంస్థలు పెట్టుబడులను పెడుతున్నాయన్నది జరుగుతున్న ప్రచారం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుములను గట్టిగా బిగించి ఈ ప్రచార కార్యక్రమంలో హోరెత్తిస్తుండడం అనునిత్య దృశ్యం... ఈ విదేశీయ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా లాభాలను మూటకట్టుకొని తమ దేశాలకు తరలించుకొని పోతుండడం బహిరంగ రహస్యం! సక్రమ లాభాలతో సంతృప్తి చెందని సంస్థలు అక్రమ లాభాలకు కూడ పాలుపడుతుండడం కూడ బహిరంగ రహస్యం. కృత్రిమంగా వ్యయం పెరిగినట్టు చూపించి నష్టాలు వస్తున్నట్టు నిర్ధారించడం ‘బహుళ జాతీయ వాణిజ్య’ ప్రవృత్తి! ఈ ప్రవృత్తి భారతీయ సంస్థల చిత్తవృత్తిని కూడ ఆవహించడం ప్రపంచీకరణ ప్రభావం! అందువల్ల అధికాధిక స్వదేశీయ సంస్థలకు సైతం ‘‘అక్రమ లాభాలు’’అన్న లక్ష్యాన్ని సాధించడం మాత్రమే సర్వస్వం అయిపోయింది! మానవత్వం, మానవీయ సంస్కారం, భూతదయ, సామాజిక బాధ్యత, ప్రజల అవసరాలు, దేశంపట్ల మమకారం వంటి విలువలు ‘‘స్వేచ్ఛా వాణిజ్య ప్రాంగణం’’లో నిలువ నీడలేక నిర్వాసితులైపోయాయి. ప్రపంచీకరణ మన దేశంలోను ఇతర ప్రవర్థమాన దేశాలలోను ప్రతిష్ఠాపించిన ఈ ‘‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’-మార్కెట్ ఎకానమీ-కు ప్రాతిపదిక వస్తువుల ‘‘లభ్యత, గిరాకీ’’- సప్లయ్ అండ్ డిమాండ్- మాత్రమే!! ఈ వ్యవస్థను కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశాబ్దులకు పైగా ‘‘సమానం’’గా పెంచిపోషించాయి. రక్షణ, విద్య, తదితర అనేక రంగాలలో కాంగ్రెస్ విధానానికి ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించి అంతర్జాతీయ సమాజంలో దేశప్రతిష్ఠను ‘్భజపా’ ప్రభుత్వం పెంచగలిగింది- గత ఐదేళ్లలో!! కానీ ‘కాంగ్రెస్’ ఆర్థిక వాణిజ్య నీతిని ‘్భజపా’ ప్రభుత్వం మరింత చిత్తశుద్ధితో అమలుజరుపుతోండడం ‘ప్రపంచీకరణ’ ప్రభావం! విదేశీయ సంస్థల పెట్టుబడులకోసం ‘‘దేబిరించడం’’తపించడం, తహతహలాడిపోవడం ఈ ఉభయ పక్షాల నిర్వహణలోని ప్రభుత్వాల నిర్వహణల మధ్యకల సమానత్వం... అందువల్ల అమెజాన్ సంస్థ అక్రమాలకు ఒడిగట్టిన ‘్ధ్వని’కేంద్రమంత్రి నోట ప్రతి ధ్వనించడం ఆనందకరమైన ఆశ్చర్యం...!
కేరళ ప్రాంతంలోని అడవులలోకి విదేశాలనుంచి కొన్ని కొత్త మొక్కలు వచ్చిపడినాయట. దశాబ్దులుగా ఈ కొత్త మొక్కలు పెరిగినచోట మరో మొక్క పెరగడం లేదు. యుగయుగాలుగా ఆ అడవులలో పెరిగిన స్వజాతీయ వృక్షజాలాన్ని ఈ కొత్త మొక్కలు నిర్మూలించాయన్నది ధ్రువపడిన సత్యం! ఇదే రీతిలో విదేశాలనుంచి వ్యాపించిన ‘బహుళ జాతీయ సంస్థలు’ వాణిజ్య పారిశ్రామిక రంగాలలోని స్వదేశీయ సంస్థలను క్రమంగా దిగమింగి వేస్తున్నాయి. అలా అనేక స్వదేశీయ సంస్థలను ‘దిగమింగిన’ అమెరికావారి ‘అమెజాన్’సంస్థ ప్రస్తుతం పంపిణీ రంగంలో ఆధిపత్యం సాధించింది. ‘ఫ్లిప్‌కార్టు’అన్న భారతీయ సంస్థ కూడ పంపిణీ రంగంలో ‘అమెజాన్’కు పోటీగా ఎదిగింది. అయితే ‘వాల్‌మార్ట్’అన్న మరో అమెరికా సంస్థ ఈ ‘ ఫ్లిప్‌కార్టు’ను స్వాధీనం చేసుకొంది. ఇలా స్వాధీనం చేసుకున్న - టేకింగ్ ఓవర్- ప్రక్రియలో భాగంగా ‘వాల్‌మార్ట్’ సంస్థవారు చాలా తెలివిగా ‘ఫ్లిప్‌కార్టు’ సంస్థలోని ఇద్దరు ప్రధాన భాగస్వాముల మధ్య విబేధాలు కల్పించారు, ఒక భాగస్వామిని సంస్థనుంచి వెళ్లగొట్టగలిగారు. ఆ తరువాత మిగిలిన భాగస్వామిని కూడ వెళ్లగొట్టడానికి రంగం సిద్ధంచేశారు. ఫలితంగా పంపిణీ రంగంలో ఈ రెండు విదేశీయ సంస్థల- ఫ్లిప్‌కార్టును కొనేసిన వాల్‌మార్ట్‌కు, అమెజాన్‌కు ఎదురులేని స్థితి ఏర్పడి ఉంది! చిల్లర దుకాణాల వ్యాపారులు దేశమంతటా తమ దుకాణాలను మూసివేయవలసిన దుస్థితి దాపురించింది. ఎందుకంటె ఈ విదేశీయ సంస్థలు ‘‘ఇంటికి సరుకును చేర్చే’’- హోమ్ డెలివరీ-కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. పెద్ద పట్టణాలలోను, నగరాలలోను ఈ ‘‘హోమ్ డెలివరీ’’ నిత్యకృత్యమైంది. మొదట ‘‘బట్టలు ఉతికే యంత్రాలు’’- వాషింగ్ మిషన్, దృశ్యశ్రవణ పరికరాలు, తదితర గృహోపకరణాలతో మొదలైన ఈ ఇంటికి తెచ్చిఇచ్చే- హోమ్ డెలివరీ-కార్యక్రమం క్రమంగా ఉప్పు, పప్పు, జీడిపప్పు, చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు వంటి భోజన సామగ్రిని ‘‘చేరవేయడానికి’’విస్తరించింది. డబ్బు ఎక్కువయినవారు ఇళ్లలో వంట చేసుకోనక్కరలేదు. ‘అంతర్జాల ప్రసారం’-ఆన్‌లైన్-లో ‘‘ఆర్డరిస్తే’’చాలు, భోజనం కూడ ఇంటికి వచ్చేస్తోంది!!
విదేశీయ సంస్థలను చిల్లర వ్యాపారంలో పెట్టుబడులను పెట్టడానికి అనుమతించడంవల్ల జరిగిపోతున్న పంపిణీ ప్రహసనం ఇది. ‘‘మా కూతురు, మా కోడలు రోజుకో వస్తువును ‘ఆన్‌లైన్ ఆర్డర్’ద్వారా తెప్పించుకుంటున్నారు’’అని తల్లిదండ్రులు తరచు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా తెచ్చిపెడుతున్నది ‘అమెజాన్’సంస్థ! ఈ రెండు మాత్రమే ఇలా వికృత విశ్వరూపం ధరించడానికి ప్రభుత్వాలు దోహదం చేశాయి, చేస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌వారి పెట్టుబడుల డొల్లతనాన్ని పీయూష్ గోయల్ ఆవిష్కరించాడు. కానీ ఇనే్నళ్లుగా అమెజాన్, మాన్‌సాంటో, వాల్‌మార్ట్, ఉబర్ వంటి సంస్థల ‘‘అక్రమాలు అప్రతిహతంగా ఎలా కొనసాగుతున్నాయి’’. నెజల్ సంస్థవారి విష రసాయన పూరిత ‘‘సేమ్యా’’-నూడుల్స్-లను నిషేధించారు, మళ్లీ అనుమతించారు. ‘పెప్సీ’, ‘కోలా’సంస్థల వాణిజ్య బీభత్సం కొనసాగుతూనే ఉంది! ఇప్పుడు ముంబయిలో జరిగిన ‘అమెజాన్’వారి ‘సంత’-ఈవెంట్-కు తన ‘‘భాగస్వామిని’’-పార్టనర్- లారెన్ సాంఛెఝతో కలసి విచ్చేసిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెఝోస్ ‘‘మనదేశంలో కొత్తగా దాదాపు ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతున్నట్టు’’ప్రకటించాడట! ఆర్థిక దాస్యం ముంచెత్తుతుండడంతోపాటు మన జీవన ‘పరిభాష’మారిపోతుండడం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ ‘‘సువర్ణశోభల’’ మాయాజాలం... ‘పార్టనర్’అన్న పదం ఒక ఉదాహరణ మాత్రమే! వాణిజ్య భాగస్వామా? జీవిత భాగస్వామా? ‘సహజీవన’ భాగస్వామా? శృంగార భాగస్వామా? అన్నది విడని ప్రహేళిక... ఇలాంటి ‘పార్టనర్’, ‘కంపానియన్’వంటి పదజాలాన్ని మనవాళ్లు విరివిగా వాడుతుండడం ప్రపంచీకరణ ప్రభావం!
ఈ ‘అమెజాన్’సంస్థ భారీ నష్టాలతో నడుస్తోందట. అందువల్ల ఈ నష్టాన్ని పూడ్చడానికి మాత్రమే ఈ ఏడువేల కోట్ల రూపాయలను వినియోగిస్తున్నారన్నది కేంద్రమంత్రి వెల్లడించిన వాస్తవం! ఇంత ‘‘గొప్ప’’సంస్థకు ఇంత పెద్ద నష్టం ఎలా సంభవించిందన్నది పీయూష్ గోయల్ ఆశ్చర్యంతో అడిగిన ప్రశ్న! ఈ ప్రశ్నకు సమాధానం ‘అమెజాన్’వారు చెప్పవలసి ఉంది... కానీ ‘అమెజాన్’, ‘వాల్‌మార్ట్’ వంటి విదేశీయ సంస్థలు ‘చిల్లర వ్యాపారాన్ని’కొల్లగొట్టడానికి, ఇంటింటికీ వస్తువులను పంపిణీ చేయడానికి ఎందుకు అనుమతిని కొనసాగిస్తున్నారన్నది ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చిల్లర వ్యాపారంలో విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అనుమతిని ఇవ్వరాదన్నది 2014వ సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల వరకు ‘భాజపా’ విధానం... ఆ విధానం ఏమైంది??