సంపాదకీయం
‘సౌలభ్యం’ ఎవరికి??
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్‌డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుదల వేగం గురించి అధికార, అనధికార కథనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. ఇలా మారిపోతుండడం ‘ప్రపంచీకరణ’ విస్తరింపచేస్తున్న మాయాజాలంలో భాగం! ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- కల్పిస్తున్న ‘ప్రగతి భ్రాంతి’లో భాగం... ప్రపంచీకరణ ముదురుకొద్దీ విదేశీయ, అంతర్ జాతీయ సంస్థల అక్రమ ప్రమేయం పెరుగుతోంది! ఈ ‘సంస్థలు’ అధ్యయనం పేరుతో, పరిశోధక నిర్ధారణల పేరుతో మన అంతర్గత ఆర్థిక వ్యవస్థలోకి చొఱబడుతున్నాయి, మన ‘జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల మందగించిపోతుండడం గురించి ‘ఆందోళన’ను ఆవిష్కరిస్తున్నాయి. మన ప్రభుత్వం మరిన్ని ఆర్థిక సంస్కరణలను జరపాలన్నది ఈ విదేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల బెదిరింపులోని ఇతివృత్తం! ఆర్థిక వాణిజ్య రంగాలలో ప్రభుత్వ ప్రమేయం పూర్తిగా తగ్గిపోయి ప్రభుత్వేతర సంస్థల ఆధిపత్యం పెరిగిపోవడం ఈ ‘సంస్కరణల’ స్వభావం. ఇలాంటి ‘సంస్కరణలు’ ‘ప్రపంచీకరణ’ మొదలయిన తరువాత ఇరవై ఆరేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘‘పెట్టుబడుల ఉపసంహరణ’’- డిస్ ఇనె్వస్ట్‌మెంట్- పేరుతో ‘ప్రభుత్వరంగ వాణిజ్య పారిశ్రామిక సంస్థల’ను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించే కార్యక్రమాన్ని అతివేగంగా అమలుజరపడం ఈ ఇరవై ఆరేళ్ల చరిత్ర. ఇప్పుడు రైలుమార్గాలను నిర్మించే కార్యక్రమాన్ని సైతం ప్రభుత్వేతరులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇలా ప్రభుత్వపు ఆస్తులను వాణిజ్యపు వాటాలను ‘అమ్మిపారేయడం’వల్ల లభించిన సొమ్ము ఖర్చయిపోయింది. ఆర్థిక వాణిజ్య వ్యవస్థలలో ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోయింది, ప్రభుత్వేతరుల ప్రమేయం పెరిగింది! ఈ ప్రభుత్వేతరులు స్వదేశీయ సంస్థలైనంత కాలం ‘ప్రగతి’గతిని ప్రభుత్వం నియంత్రించ గలిగింది, నిర్దేశించ గలిగింది! కానీ ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-ను వ్యవస్థీకరించిన తరువాత విదేశీయ సంస్థలు- మన దేశం పట్ల మక్కువ లేని, మన దేశాన్ని దోచుకొని వెళ్లడం లక్ష్యమైన విదేశీయ సంస్థలు- మన ఆర్థిక వాణిజ్య రంగాలలోకి చొఱబడిపోయాయి. ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ విస్తరణ ఫలితంగానే మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ పెరుగుదల వేగం క్రమంగా తగ్గిపోయింది! గతంలో సాలీనా తొమ్మిది శాతం పెరిగిన ‘జిడిపి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం- 2019-2020-లో ఐదు శాతం పెరుగుదల స్థాయికి దిగజారడానికి కారణం ‘ప్రపంచీకరణ’. కానీ ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ‘ప్రపంచీకరణ’ గుదిబండను క్రమంగా దించుకొనడానికి ప్రభుత్వాలు ఇప్పటికీ సిద్ధంగా లేవు! ఇదీ ‘బహుళ జాతీయ వాణిజ్య’ మారీచ మృగ మాయాజాలం! ఇప్పుడు ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’- ఇంటర్ నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎమ్‌ఎఫ్-వారు ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ‘జిడిపి’ ప్రగతి ఐదు శాతం కంటె కూడ తక్కువన్న ‘అంచనా’ను ఆవిష్కరించింది!
ప్రపంచీకరణ ఫలితంగా మన నెత్తికెక్కిన ‘స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- తరతరాల ‘‘మానవీయ వాణిజ్య వ్యవస్థ’ అవశేషాలను సైతం తుడిచిపెట్టేసింది! విదేశీయ బీభత్సపాలన ఫలితంగా వికేంద్రీకృత మానవీయ వాణిజ్య వ్యవస్థ భగ్నమైంది. ‘ప్రపంచీకరణ’ నడికొన్న తరువాత ఈ ‘మానవీయ ఆర్థిక వ్యవస్థ’, ‘వికేంద్రీకృత వాణిజ్య వ్యవస్థ’ల సుదూర స్మృతులు సైతం చెఱగిపోతున్నాయి. సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం దశాబ్దులుగా నిర్మూలనకు గురిఅయింది. ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నప్పటికీ ఫలితాలు ప్రస్ఫుటించడం లేదు. ఇదే కథ ‘వాణిజ్య పారిశ్రామిక రంగాల’లో పునరావృత్తం కానుంది! మానవీయ సంస్కార స్పర్శలేని ‘మార్కెట్ ఎకానమీ’ని వదిలించుకొని, మానవీయ ‘ఎకానమీ’ని పునరుద్ధరించడానికి భవిష్యత్తులో ఎప్పుడైన ప్రయత్నం జరిగితే ఆ ‘మార్పు’తేవడంలో ఎదురుకానున్న భయంకరమైన అవరోధాలు ఈ ‘పునరావృత్తి’ ప్రస్తుతానికి మాత్రం మానవత్వం లేని ‘మార్కెట్ ఎకానమీ’ మననెత్తినెక్కి తొక్కుతోంది! ప్రజల సమష్టి అవసరాలు ప్రాతిపదికగాకాక కేవలం వస్తు ‘లభ్యత’-సప్లయి-, వస్తువులకున్న గిరాకీ- డిమాండ్- ప్రాతిపదికగా మాత్రమే ధరలు నిర్ధారణ కావడం ‘మార్కెట్ ఎకానమీ’! అందువల్ల ధరల నియంత్రణకు కాని, ద్రవ్యోల్బణం నియంత్రణకు కాని ప్రభుత్వం ప్రయత్నించరాదట! ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకున్నప్పటికీ ‘‘మార్కెట్ ఎకానమీ’’ స్ఫూర్తి దెబ్బతింటుందట! మన దేశానికి ‘‘మార్కెట్ ఎకానమీ’’అన్న ‘ముద్ర’లేనట్టయితే విదేశీయ సంస్థలు మన దేశంలో పెట్టుబడులను పెట్టబోవట! ఇదీ భయం! ప్రపంచీకరణ శక్తులైన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మూక ఉమ్మడిగా భయాన్ని వ్యాపింపచేశాయి!
ప్రభుత్వ ప్రమేయం లేని ‘మార్కెట్ ఎకానమీ’ ఫలితంగా ఘరానా వాణిజ్య సంస్థల, ప్రత్యేకించి విదేశీయ వాణిజ్య సంస్థల ఆధిపత్యం జనజీవన వ్యవహారాన్ని నియంత్రిస్తోంది! ‘వాణిజ్య సౌలభ్యం’- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్- మన దేశంలో పెరిగిపోయిందన్నది ప్రభుత్వం విదేశీయ సంస్థలకు కల్పించిన, కల్పిస్తున్న విశ్వాసం! అందువల్ల మన దేశంలో పెట్టుబడులు పెట్టాలన్నది ‘విదేశీయ సంస్థల’కు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తి! కానీ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ చిల్లర వ్యాపారంలో, పంపిణీ రంగంలో చొఱబడడంవల్ల దేశ ప్రజల ‘జీవన సౌలభ్యం’- ఈజ్ ఆఫ్ లివింగ్- దెబ్బతినిపోయింది! బహుళ జాతీయ సంస్థలు మన తిండిని, మన వేషధారణను, మన రాకపోకలను, మన జీవన ప్రవృత్తిని నియంత్రిస్తున్నాయి. జీవన సౌలభ్యం భంగపడుతున్నప్పటికీ ‘మార్కెట్ ఎకానమీ’ హోదా లభించడం పట్ల మన ప్రభుత్వాలు మురిసిపోతున్నాయి. ‘బహుళ జాతీయ వాణిజ్యం’ కృత్రిమ కొరతలను సృష్టించి కృత్రిమంగా గిరాకీని పెంచుకుంటోంది. ఉల్లిపాయల- ఎఱ్ఱగడ్డల- ఉల్లిగడ్డల- ధరలు పెరిగిన తీరునకు ఈ కృత్రిమ కొరత కారణం. ఎవ్వరూ నిరూపించలేకపోవడం ‘స్వేచ్ఛా విపణి’ మాయ! నూట ముప్పయి రూపాయలు కిలో చొప్పున చిల్లర దుకాణాలలో, రైతుబజారులలో ఉల్లిగడ్డలను అమ్మారు. కిలో కొనలేని వారు వంద గ్రాముల ఉల్లిపాయలను కొనడం ‘‘జీవన సౌలభ్యం...’’ వంద గ్రాములకు పదిహేను రూపాయలను దుకాణందారు వసూలుచేశాడు. ఈ ఎఱ్ఱగడ్డలను కిలో రెండువందల రూపాయల చొప్పున కూడ అక్కడెక్కడో అమ్మారట! అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోడం ‘నిర్వాహకుల’ స్వేచ్ఛావిపణి నిష్ఠకు నిదర్శనం! కేంద్ర ప్రభుత్వం మాత్రం కలుగజేసుకుంది, ఉల్లిగడ్డలను భారీగా దిగుమతి చేసింది. అయితే ఇలా ప్రభుత్వం దిగుమతి చేసిన సరకు అమ్ముడుపోవడం లేదు. దిగుమతి అయిన ఉల్లిగడ్డలలో ఎనబయి శాతం కేంద్ర ప్రభుత్వం వారి గిడ్డంగులలో ‘కుళ్ల’డానికి ఎదురుచూస్తున్నాయట! విదేశీయ సరకు వచ్చేసరికి ‘దాచిన’ ఉల్లిపాయలను వ్యాపారులు విడుదల చేశారన్నది బహిరంగ రహస్యం! ఇదీ ‘మార్కెట్ ఎకానమీ’... యాబయి రూపాయలకు కిలో చొప్పున ‘ఉల్లి’ని అమ్మారు. జనం భారీగా కొన్నారట! మరుసటిరోజున మళ్లీ ‘ఉల్లి’ కిలో డెబ్బయి రూపాయలన్నది ‘మార్కెట్’ నిర్ధారణ! వాణిజ్య అక్రమాల ముందు ‘పాలనం’ చతికిలపడి ఉంది, మోకరిల్లుతోంది!!
ఇలా మోకరిల్లడం ప్రపంచీకరణ! ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-కు స్వస్తి చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిస్తున్నాడు. ‘ప్రపంచీకరణ’ను ప్రపంచ ప్రజల నెత్తికెత్తిన అమెరికా పాతికేళ్ల తరువాత ఇలా మాట మార్చింది! మన ప్రభుత్వం మాత్రం ఇంకా మేలుకొనడం లేదు! జిడిపి పెరుగుదలకు ‘ప్రపంచీకరణ’ ప్రధాన అవరోధమన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు...