సంపాదకీయం

‘సమీకృతి’కి శుభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వభూమీయ మంగళకర
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ సుప్రభాత
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
తూర్పువైపు చూస్తున్నవి..
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణిని వెలిగిస్తున్నవి....
బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన భరతజాతి ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా ఏర్పడి డెబ్బయి ఏళ్లు అయింది. క్రీస్తుశకం 1947 ఆగస్టు పదహైదవ తేదీన బ్రిటన్‌వారి శతాబ్దుల బీభత్స పాలన ముగిసింది, భారత రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పరిషత్ ఆమోదించింది, 1950 జనవరి 26న ఈ నూతన సర్వతంత్ర స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఆవిర్భవించింది! ఈ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటుకావడం సనాతన భారత జాతీయ చరిత్రలో మరో కొత్త అధ్యాయం... ఈ డెబ్బయి ఏళ్ల రాజ్యాంగ ప్రక్రియ యుగయుగాల జాతీయ ప్రస్థానక్రమంలో వర్తమాన దృశ్యం, భవిష్యత్ ప్రగతి దిశానిర్దేశకం... వైయక్తిక జీవనంలో డెబ్బయి ఏళ్లు సుదీర్ఘ కాలఖండం, జాతీయ జీవనంలో డెబ్బయి ఏళ్లు సుదీర్ఖ కాలఖండం కాదు! కానీ శతాబ్దులపాటు విదేశీయ బీభత్సకాండకు, దురాక్రమణకు, బీభత్స పాలనకు గురిఅయి, స్వాతంత్య్రాన్ని సార్వభౌమ అధికారాన్ని పునరుద్ధరించుకొని పునఃప్రస్థాన ప్రక్రియను ఆరంభించిన జాతి చరిత్రలో ప్రతి దినం, ప్రతి సంవత్సరం కూడ సమీక్షకు గురికావడం సహజం... డెబ్బయి ఏళ్లు పూర్తిచేసుకున్న ఈ వర్తమాన రాజ్యాంగ వ్యవస్థకు ఆదివారం డెబ్బయి ఒకటవ వార్షికోత్సవం జరుగుతుండడం ఈ శుభంకర సమీక్షలో భాగం! సనాతన జాతి యుగయుగాల అస్తిత్వానికి సరికొత్త ధ్రువీకరణ పత్రం రాజ్యాంగం! ‘సనాతనం’అని అంటే ‘శాశ్వతం’అని అర్థం. భారత జాతి ఇలా ఆద్యంత రహితమైన శాశ్వత జాతి! ఇదీ చారిత్రక వాస్తవం! ‘‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’’- భూమి తల్లి, నేను ఆమె బిడ్డను- అన్న శాశ్వత సత్యం భారత జాతీయ వికసనానికి భూమిక! అనాదిగా ఈ వాస్తవాన్ని భారతీయులు గుర్తించారు. అందువల్ల మన జాతి శాశ్వతమైనది, తుది మొదలు లేనిది!! ఈ వాస్తవ స్ఫురణకు సముచిత సందర్భం గణతంత్ర దినోత్సవం...
మానవీయ సంస్కారాలు జనజీవన వ్యవహార నిహితంకావడం సహజమైన విజయం! ఈ విజయం భారత జాతీయ ప్రవృత్తికావడం తరతరాల చరిత్ర! మానవీయ సంస్కారాలు భరతభూమిపై అంకురించి, పల్లవించి, పుష్పించి ప్రపంచమంతటా పరిమళించడం చరిత్ర. ఈ ‘సంస్కార ప్రసారం’వల్లనే భరతమాత ప్రపంచ ప్రజలకు మార్గదర్శిని అయింది, విశ్వగురువైంది! ‘‘అన్నము పెట్టిన జాతి హత్యలు చేయని జాతి భరతజాతి...’’ యుగయుగాల చరిత్ర ఇందుకు ధ్రువీకరణ! ఇతర జాతులపై భారత జాతి దాడి చేయలేదు, ఇతర దేశాలను ఇతర జాతుల భావజాలాన్ని ధ్వంసం చేయలేదు! సర్వమత సమభావం సృష్టిగత సకల వైవిధ్య సమభావం అనాదిగా హైందవ జాతి ప్రవృత్తికావడం ఇందుకు నిదర్శనం! దాడులకు బలై ప్రాణావశిష్టులై తండోప తండాలుగా మన దేశానికి వచ్చిన శరణార్థులకు, వివిధ దేశాల అన్నార్తులకు భారత జాతి ఆశ్రయం ఇచ్చింది, శాశ్వత ఆవాసాన్ని కల్పించింది! ఆర్థిక ప్రగతి, సాంస్కృతిక సుగతి మానవ జీవన రథానికి రెండు చక్రాలన్న పాఠాన్ని ప్రపంచానికి భరతజాతి నేర్పింది!! స్వాతంత్య్ర పునరుద్ధరణ తరువాత ఈ స్వజాతీయ ప్రవృత్తి ప్రపంచానికి ప్రభావితం చేసిందా? చేస్తోందా?? అన్నది గణతంత్ర దినోత్సవ సమీక్షా ఇతివృత్తం! ఆహార ధాన్యాలకోసం అమెరికాను, ఆస్ట్రేలియాను ‘దేబిరించిన స్థితి’ బ్రిటన్ దురాక్రమణ ముగిసినప్పటి స్థితి! శతాబ్దుల విదేశీయ దురాక్రమణకు ఫలితం ఇది. ప్రపంచంలో ఆరవ అతి పెద్ద ఆర్థికశక్తిగా అవతరించడం గణతంత్ర విజయానికి ఒక ప్రతీక మాత్రమే! అంతరిక్ష పరిశోధన రంగంలో మన పతాకం చందమామను స్పృశించగలగింది... అంతర్జాతీయ యోగ దినోత్సవం, ‘సౌరశక్తి మండల దేశాల సమాఖ్య’ ఏర్పడడం జాతీయ మానవీయ సంస్కారాలు అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితంచేస్తున్న విశ్వగురుత్వం!
బ్రిటన్ విముక్త దేశానికి కొత్త రాజ్యాంగం ఏర్పడడం ‘చారిత్రక రాజ్యాంగ సమీకృతి’కి పునరావృత్తి! వివిధ సమయాలలో అఖండ భారతమంతటా ఒకే సమీకృత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం చరిత్ర... ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ కొన్ని సహస్రాబ్దులు పరిఢవిల్లడం, విచ్ఛిన్నం కావడం, మళ్లీ ఏర్పడడం... ఇలా ‘పునరావృత్తి’జరగడం ‘అఖండ భారత ఖండం’లో పూర్వయుగాల చరిత్ర. ఈ కలియుగం ప్రారంభం నాటినుంచి, అంతకు పూర్వ వేయి సంవత్సరాలనుంచి దేశమంతటికీ వర్తించిన ‘సమీకృత రాజ్యాంగ వ్యవస్థ’కొనసాగడం చరిత్ర! కలియుగం ముప్పయి ఎనిమిదవ శతాబ్దివరకు, అంటే క్రీస్తుశకం ఏడవ శతాబ్ది ఆరంభంవరకు ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ కొనసాగింది! మధ్యమధ్య కొన్ని ఏళ్లపాటు ఈ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, మళ్లీ పునరుద్ధరణ జరగడం ఆ ముప్పయి ఎనిమిది శతాబ్దుల చరిత్ర. ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థ నేటి ‘సమాఖ్య’-ఫెడరల్- రాజ్యాంగ వ్యవస్థకు పూర్వరూపం- కేంద్ర ప్రభుత్వం వలె ‘సామ్రాజ్యం’ ప్రాంతీయ ప్రభుత్వాల వలె ‘రాజ్యం’ పనిచేయడం ఈ రాజ్యాంగ సమీకృతి. కలియుగ ప్రారంభానికి పూర్వం వెయ్యేళ్లనుంచి ఈ సమీకృత రాజ్యంగ వ్యవస్థ ‘గిరివ్రజం’ రాజధానిగా పరిఢవిల్లింది. కలియుగం 2775వ సంవత్సరం వరకు అంటే క్రీస్తునకు పూర్వం 327వ సంవత్సరం వరకు ‘గిరివ్రజం’ అఖండ భారత రాజధాని! గిరివ్రజం కేంద్రంగా మగధ సామ్రాజ్యం విస్తరించడం సమీకృత రాజ్యాంగ వ్యవస్థ! ఈ సామ్రాజ్యంలో ‘అఖండ భారత్’లోని యాబయి ఆరు రాజ్యాలు భాగమయ్యాయి! కలియుగం ఆరంభ సమయంనుంచి కొంతకాలంపాటు ‘హస్తినాపురం’- నేటి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సమీప ప్రాంతం- ఇంద్రప్రస్థం- నేటి ఢిల్లీ- రాజధానులుగా విలసిల్లినప్పటికీ మళ్లీ ‘గిరివ్రజం’ కేంద్ర స్థానం కలిగింది. ‘ఇంద్రప్రస్థం’, ‘హస్తినాపురం’ రాజధానులుగా ఉండిన సమయంలో ‘కురువంశం’వారు భారత సమ్రాట్టులు! ‘గిరివ్రజం’ రాజధానిగా బృహద్రథ, ప్రద్యోత, శిశునాగ, నంద, వౌర్య, శుంగ, కాణ్వ, ఆంధ్ర శాతవాహన వంశాలవారు ‘అఖండ భారత సమీకృత రాజ్యాంగ వ్యవస్థ’కు ఆధ్వర్యవం వహించడం చరిత్ర కలియుగం 2775లో రాజధాని ‘గిరివ్రజం’నుండి ‘పాటలీపుత్ర’ నగరానికి మారింది. గుప్తవంశంవారు పాటలీపుత్రం కేంద్రంగా భారత దేశాన్ని పాలించారు. కలియుగం 3020లో - క్రీస్తుపూర్వం 82వ సంవత్సరంలో- రాజధాని ‘ఉజ్జయిని’కి మారింది. ఉజ్జయిని కేంద్రంగా శకకర్తలైన విక్రముడు, శాలివాహనుడు దేశాన్ని పాలించాడు. ఈ ‘ప్రమర వంశం’లోని భోజమహారాజు అఖండ భారతాన్ని పాలించిన చివరి సమ్రాట్టు! ఆ తరువాత దాదాపు పదునాలుగు శతాబ్దులపాటు ఈ ‘సమీకృత రాజ్యాంగ వ్యవస్థ’ విచ్ఛిన్నమైంది, దేశం విదేశీయ దురాక్రమణ పాలైంది, ముక్కలు చెక్కలైంది...
దేశ విభజన తరువాత ‘అవశేష’ భారత్‌లో మళ్లీ సమీకృత స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం అందువల్ల చారిత్రక పునరావృత్తి! మరుగున పడిపోయిన, బ్రిటన్ పాలకులు ధ్వంసంచేసిన ఈ చారిత్రిక ‘సమీకృత రాజ్యాంగ’ స్మృతుల సమాహారం ఈ గణతంత్ర శుభోత్సవేళ ప్రస్ఫుటించడం జాతీయ ప్రస్థాన క్రమం.