సంపాదకీయం

అజ్ఞానపు గీటురాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ దేశాలలో ‘జాతీయ భావనిష్ఠ’ పెరుగుతుండడం పట్ల జార్జి సోరోస్ అనే ఘరానా వ్యాపారవేత్త వ్యక్తం చేసిన ‘ఆందోళన’కు మన దేశంలో గొప్ప ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మన దేశంలో ‘హైందవ జాతీయతా నిష్ఠ పెరుగుతుండడం’ ఈ పెట్టుబడిదారునికి తీవ్రమైన బాధను కలిగిస్తోందట! ‘దావోస్’ నగరంలో జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక’- వరల్డ్ ఎకనామిక్ ఫోరం- సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా జార్జి సోరోస్ అనేవాడు తన అజ్ఞానాన్ని, ఆందోళనను ఇలా ఆవిష్కరించాడు. ఆవిష్కరిస్తే ఆవిష్కరించాడు. కానీ ఇతగాడిని మన దేశంలోని అనేకమంది రాజకీయవేత్తలు ‘అనుసరణీయుడు’గా భావిస్తుండడమే విస్మయకరం! ఈ జాతీయ తత్త్వ నిష్ఠ పెరగడం పట్ల ‘ఐరోపా సమాఖ్య’వారు కూడ మన దేశంపై విషం కక్కుతున్నారు!! వికృత తాండవం చేస్తున్నారు! మన దేశంలో ‘సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ’కు భంగం వాటిల్లుతున్నట్టు మరోవైపు జరుగుతున్న ప్రచారం కూడ ఆశ్చర్యకరం కాదు! అవకాశం దొరికినప్పుడల్లా మన జాతీయ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, అవమానించడానికి దశాబ్దుల తరబడి అమలుజరుగుతున్న కుట్రలో ఈ ప్రచారం భాగం! అంతర్గతంగా దేశ విద్రోహశక్తులు, అంతర్జాతీయంగా భారత వ్యతిరేక శక్తులు ఈ కుట్రను కొనసాగిస్తున్నాయి. ఈ అంతర్గత, బాహ్యశక్తుల పట్ల చక్కటి సమన్వయం ఏర్పడి ఉండడం బహిరంగ రహస్యం! నిజానికి మన దేశం ప్రపంచంలో ‘నిజమైన సర్వమత సమభావ వ్యవస్థ’ పరిఢవిల్లుతున్న అతి కొద్ది దేశాలలో అగ్రస్థానంలో ఉంది. అనేక దేశాలలో ఆధికారికంగా ఏకమత- థియోక్రటిక్- రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. ఈ దేశాలలో అల్పసంఖ్య మతాల వారికి అస్తిత్వం లేదు, వారు తృతీయ, చతుర్థ శ్రేణి పౌరులుగా జీవించవలసి వస్తోంది. ఇలాంటి దేశాలలో పెచ్చుపెరుగుతున్న అధిక సంఖ్యాకుల మతోన్మాదం గురించి ఐరోపా సమాఖ్య దశాబ్దులుగా పట్టించుకోవడం లేదు. ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో ‘సర్వమత సమభావం’ మచ్చుకైనా కనిపించదు! కానీ అమెరికా, చైనా, రష్యా, ఐరోపా సమాఖ్య వంటి ‘తథాకథిత’- సోకాల్డ్- సర్వమత సమభావ దేశాల ప్రభుత్వాలు ‘ఇస్లాం మత రాజ్యకూటమి’ని నిరసించడం లేదు, అభిశంసించడం లేదు. సర్వమత సమభావ వ్యవస్థను ఏర్పాటుచేసుకొమ్మని ఈ ‘ఇస్లాం ఏకమత రాజ్యాంగ వ్యవస్థ’ఉన్న దేశాలకు సలహాచెప్పడం లేదు! జార్జి సోరోస్ వంటి సంపన్నులకు నిజానికి ‘సర్వమత సమభావ’- సెక్యులర్- ధ్యాస లేదు. వారి లక్ష్యం ప్రపంచమంతటా వాణిజ్య సామ్రాజ్యాలు నిర్మించుకోవడం... ఈ ‘ప్రపంచీకరణ’ను వివిధ దేశాలలో పెరుగుతున్న ‘జాతీయతానిష్ఠ’ నిర్మూలించగలదన్నది సోరోస్ వంటి వారి భయం...
‘జాతీయ తత్త్వం’ కులమత ప్రాంత భాషా వైవిధ్యాలకు అతీతమైన దేశ ప్రజల సమష్టి అస్తిత్వం! ఈ వాస్తవాన్ని భారతీయులు అనాదిగా గుర్తించారు. అందువల్లనే ఈ దేశంలో ‘హైందవ జాతీయతత్త్వం’ కులమత భాషా ప్రాంతీయ వైవిధ్యాలకు అతీతంగా వికసించింది. ఈ వైవిధ్యాలు, అసంఖ్యాక ఇతర వైవిధ్యాలు హైందవ జాతీయ తత్త్వంలో భాగమయ్యాయి. హైందవ జాతీయ తత్త్వం లేదా భారత జాతీయ తత్త్వం ఇలా అనాదిగా సర్వమత సమాహారంగా, సర్వమత సమభావ స్వభావంగా, సర్వభాషా వైవిధ్య సంపుటంగా, అసంఖ్యాక వైవిధ్యాల సమన్వయంగా వికసించింది. ఈ వికాసానికి ఏ ఒక్క మతం కాని, భాష కాని ప్రాతిపదిక కాలేదు. మాతృభూమి పట్ల కల మమకారం ఈ జాతీయ వికాస ప్రక్రియకు భూమిక! అందువల్లనే ఈ మాతృభూమి పట్ల మమకారం, మాతృసంస్కృతి పట్ల నిష్ఠ నిబద్ధత కలిగిన అనేక మతాలవారు ఒకే ‘జాతి’గా వికసించడం తరతరాల భారత చరిత్ర. ఈ చరిత్ర భారతదేశం వెలుపల ప్రాంతాలలోని అనేక దేశాల మేధావులకు ప్రధానంగా ఐరోపా వారికి, ఐరోపా సంతతి వారికి చాలా కాలం తెలీదు. ఐరోపా జన సముదాయాలకు తెలిసింది ‘నాగరికము’- సివిలిజేషన్- మాత్రమే! ఈ ‘సివిలిజేషన్’కు ఏకైక ప్రాతిపదిక ‘మతం’కావడం రెండువేల ఏళ్ల ఐరోపా చరిత్ర, అమెరికా చరిత్ర, ఆస్ట్రేలియా చరిత్ర! అందువల్ల ఈ దేశాల మేధావులు తమ తెలిసిన ‘మతం’ గీటురాయిపై ‘సర్వమత సమభావ స్వభావయుతమైన’ హైందవ జాతీయతత్త్వాన్ని నిగ్గుతేల్చుతున్నారు. ఫలితంగా వారి దృష్టిలో ‘హైందవ జాతీయ తత్త్వం’ మతోన్మాదంగా కన్పిస్తోంది. ఇది ‘ఐరోపా’అజ్ఞానం! జార్జి సోరోస్ అలాంటి అజ్ఞాని! ఈ అజ్ఞాని మన దేశంలో రాజకీయవేత్తలలో కొందరికి మహావిజ్ఞానిగా కన్పించడం జాతీయ వైపరీత్యం..
జార్జిసోరోస్ వంటి పెట్టుబడిదారుల అసలు బాధ వేఱు! ‘ప్రపంచీకరణ’కు ‘జాతీయ భావ నిష్ఠ’అవరోధంగా మారి ఉండడం ఈ బాధ! ‘ప్రపంచీకరణ’ను ప్రారంభించిన అమెరికా, ఐరోపా దేశాలు ‘జాతీయ భావనిష్ఠ’ నశించిపోవాలని ‘అంతర్జాతీయత’ వర్ధిల్లాలని కలలు కన్నారు. ‘జాతీయతత్త్వం’ ఇటువంటిది. ‘అంతర్ జాతీయ తత్త్వం’ పల్లె వంటిది. ‘ఇళ్లన్నీ బాగుండాలి- పల్లె బాగుండాలి’ అన్నది అనాదిగా భారతీయమైన మానవీయమైన అంతర్ జాతీయ తత్త్వం! కానీ ‘ఇళ్ల’-జాతీయతత్త్వం- ను కూలగొట్టి ‘పల్లె’ను ఒకే ‘సత్రం’లాగా నిర్మించాలని గతంలో ‘కమ్యూనిస్టులు’యత్నించారు, ప్రస్తుతం ‘ప్రపంచీకరణ’ పేరుతో సంపన్న దేశాల పెట్టుబడిదారులు యత్నిస్తున్నారు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలవారు యత్నిస్తున్నారు! ‘సత్రం’పై తమకే ‘గుత్త పెత్తనం’ దక్కుతుందని విశ్వసించిన అమెరికా, ఐరోపా దేశాల రాజకీయవేత్తలు ‘సత్రం’పై చైనావారి ఆధిపత్యం పెరగడంతో కంగుతింటున్నారు. డొనాల్డ్ ట్రంప్-అమెరికా అధ్యక్షుడు- వంటి రాజకీయవేత్తలు ‘ప్రపంచీకరణ’ను, ప్రపంచీకరణ శక్తులను పదే పదే నిరసిస్తున్నారు! ‘‘్భవిష్యత్తు ప్రపంచీకరణ శక్తుల-గ్లోబలిస్ట్‌లు-ది కాదని, జాతీయశక్తుల- పేట్రియాట్స్-దేనని ట్రంప్ గత కొన్ని నెలలుగా పదే పదే ప్రకటించాడు. ‘ఐరోపా సమాఖ్య’నుంచి బ్రిటన్ వైదొలగడం కూడ ‘ప్రపంచీకరణ’శక్తులకు మరో ఎదురుదెబ్బ! ఫలితంగా అమెరికాలోను, ఐరోపాలోను రాజకీయ ‘జాతీయవాదుల’కు, వాణిజ్య ‘అంతర్ జాతీయ’ వాదులకు మధ్య వైరుధ్యాలు రాజుకుంటున్నాయి! ‘జాతీయ తత్త్వం’ దేశదేశాలలో బలపడితే తమ వాణిజ్య సామ్రాజ్యాలు కూలిపోతాయని సోరోస్ వంటి ‘ప్రపంచీకరణ’వాదులు పెట్టుబడిదారులు హడలిపోతున్నారు...
సోరోస్ వంటి అజ్ఞానులు, ప్రపంచీకరణ పేరుతో ప్రవర్ధమాన దేశాలను దోపిడీ చేస్తున్నవారు ‘సర్వమత సమభావ తత్త్వాని’కి సనాతన ప్రతినిధి అయిన హైందవ జాతీయతత్త్వం గురించి చేసిన వ్యతిరేక వ్యాఖ్యలను మన దేశంలోని రాజకీయ మేధావులు పరమ ప్రమాణంగా స్వీకరించడం విచిత్రమైన వ్యవహారం! అన్ని మతాల సమానత్వం అన్ని మతాల సమన్వయ తత్త్వం హైందవ జాతీయ తత్త్వం లేదా భారత జాతీయ తత్త్వం. ఈ వాస్తవాన్ని సోరోస్ వంటి వారు- సూర్యుని చూడలేని గుడ్లగూబ వలె- చూడడం లేదు!!