సంపాదకీయం

‘రెక్కలు’ తుంచకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను ప్రభుత్వేతరులకు అమ్మివేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం మిక్కిలి దురదృష్టకరం. నష్టాలతో నడుస్తున్న కారణంగా ప్రభుత్వం అమ్మివేస్తున్న వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో ‘ఎయిర్ ఇండియా’ ఒకటి మాత్రమే! ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- మొదలయిన తరువాత ఇరవై ఆరు ఏళ్లలో ‘ప్రభుత్వరంగ’ వాణిజ్య పారిశ్రామిక సంస్థలు భారీ నష్టాలతో నడుస్తుండడం కొత్త విషయం కాదు! కానీ ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వేతరులకు అప్పగించడంలో ‘విచక్షణ’నిహితమై ఉండాలి! కేంద్ర ప్రభుత్వ సార్వభౌమ అధికారం ఈ ‘విచక్షణ’! ఈ విచక్షణ పరిధిలో ఎన్ని ఆర్థిక ప్రయోగాలైనా జరుగవచ్చు! ఒక ప్రయోగం విఫలమైతే మరో ప్రయోగం చేయవచ్చు! ప్రభుత్వరంగం విఫలమైతే, ‘ప్రభుత్వ ప్రభుత్వేతర’ భాగస్వామ్య రంగాన్ని ప్రోత్సహించవచ్చు! అది విఫలమైతే, మళ్లీ ‘ప్రభుత్వ రంగం’ప్రాధాన్యాన్ని పునరుద్ధరించవచ్చు, లేదా ప్రభుత్వేతర రంగానికి సకల విధ పారిశ్రామిక వాణిజ్య సేవా కార్యకలాపాలను అప్పగించవచ్చు! కానీ ఈ ప్రక్రియను నిర్దేశించే, నియంత్రించే, పరివర్తనం చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి! ఈ పరిధిలోను, జాతీయ సార్వభౌమ అధికారం పట్ల నిబద్ధతతోను ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించే పారిశ్రామిక వాణిజ్య కలాపాలు దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేయగలవు. కానీ ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైన తరువాత సార్వభౌమ దేశాలకున్న ఈ ‘జాతీయ అధికారం’ ప్రభుత్వ విచక్షణ అంతరించిపోయాయి, అంతరించిపోతున్నాయి. అందువల్ల ‘వాణిజ్య పారిశ్రామిక ప్రక్రియ’ను గతంలోవలె నియంత్రించ లేకపోతున్నాయి. ఈ ‘నియంత్రించే’అధికారం ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- డబుల్‌యుటిఓ- వరల్డ్‌ట్రేడ్ ఆర్గనైజేషన్-కు సంక్రమించడం ‘ప్రపంచీకరణ’! ‘ప్రపంచీకరణ’ ఫలితంగా ఏర్పడి ఉన్న ‘స్వేచ్ఛావిపణి’పై సార్వభౌమ ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం ఉండరాదన్నది ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’వారి నిబంధన! ‘లభ్యత’-సప్లయ్-, గిరాకీ-డిమాండ్- ప్రాతిపదికగా ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- స్వయం నియంత్రితం కావాలట! అందువల్ల విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలను మన దేశంలోకి చేర్చడానికి మాత్రమే మన ప్రభుత్వానికి అధికారం ఉంది. మన దేశ హితానికి వ్యతిరేకంగా వ్యవహరించే ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’లను దేశంనుంచి వెళ్లగొట్టడం మాత్రం మన ప్రభుత్వంవల్ల కాదు... ఎందుకంటె మధ్యవర్తిత్వ న్యాయస్థానాలు, ప్రపంచ వాణిజ్య సంస్థలు ఈ వెళ్లగొట్టే ప్రక్రియను అంగీకరించాలి!
ఇలా జాతీయ ఆర్థిక సార్వభౌమ అధికారాన్ని ‘ప్రపంచీకరణ’వ్యవస్థ హరించి వేయగలదని క్రీస్తుశకం 1990వ దశకం ఆరంభంలోనే స్పష్టమైంది, ప్రచారమైంది. మొత్తం ప్రపంచం ఒకే ఆర్థిక వాణిజ్య వ్యవస్థగా అనుసంధానం కావడం ‘ప్రపంచీకరణ’. ఈ ఏకీకృత వాణిజ్య ప్రాంగణంలో ‘అసమానుల’మధ్య పోటీ ఆరంభమైంది. ఫలితంగా విదేశీయ సంస్థల పోటీని తట్టుకొనలేని మన దేశంలోని ‘ప్రభుత్వేతర సంస్థలు’ క్రమంగా మూతపడిపోతున్నాయి. ప్రతి రంగం ఒకటి రెండు లేదా మూడు నాలుగు విదేశీయ సంస్థలు మాత్రమే ఆధిపత్యం వహిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ఈ విదేశీయ సంస్థలు పెట్టుబడులు పెద్దగా అవసరం లేని అనవసర వస్తు ఉత్పాదక రంగంలోను, సేవల రంగంలోను ప్రధానంగా చొఱబడిపోయాయి. మన స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల వేగం నానాటికీ మందగించిపోతుండడానికి కారణం ఇదీ! ‘స్థూల జాతీయ ఉత్పత్తి’లో వ్యవసాయం వాటా కేవలం పదహైదు శాతం. పారిశ్రామిక ఉత్పత్తుల వాటా ఇరవై తొమ్మిది శాతం! మిగిలిన యాబయి ఆరు శాతం ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- సేవల- సర్వీసెస్- రంగంనుంచి లభిస్తోంది! సేవల రంగంలో పెరిగే ‘ఉత్పత్తి’ కృత్రిమ ప్రగతికి చిహ్నం, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు మాత్రమే వాస్తవ ప్రగతికి, వౌలిక ప్రగతికి కొలమానం! కానీ బహుళ జాతీయ సంస్థలు మన దేశంలో చేస్తున్న ‘‘అప్పడాలు, సేమ్యాలు, ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు’’వంటి పారిశ్రామిక ఉత్పత్తులు అనవసరమైనవి. వీటిని స్వదేశీయ సంస్థలు తయారుచేయగలవు. పెట్టుబడుల భ్రమలో చిక్కిన ప్రభుత్వాలు విదేశీయ సంస్థలు ఈ ఉత్పత్తుల రంగంలోకి చొఱబడడానికి వీలుకల్పించింది. స్వదేశీయ సంస్థలు మూతపడినాయి, పడుతున్నాయి! సేవల రంగంలో ప్రధానంగా ‘పంపిణీ’, రాకపోకల రంగంలో విదేశీయ సంస్థలదే పెత్తనం! ఈ స్థితిలో సేవల రంగంలోని అతిపెద్ద సంస్థలలో ఒకటైన ‘ఎయిర్ ఇండియా’ను సైతం మరో విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’కు లేదా విదేశీయ సంస్థలకు అమ్మివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ‘అంతర్గత ఆర్థిక వ్యవస్థ’పై మరో పిడుగుపాటు!
‘ప్రపంచీకరణ’ వ్యవస్థితం కావడానికి పూర్వం లాభాలతో నడచిన ప్రభుత్వరంగ సంస్థలు ‘ప్రపంచీకరణ’ విస్తరించిన తరువాత నష్టాలతో నడవడానికి కారణం ఏమిటన్నది ‘విచక్షణ’...! బొగ్గు, సిమెంటు, ఉక్కు, ఎఱువులు, విద్యుత్తు, ఇంధన తైలం, ఇంధన వాయువు వంటి వౌలిక పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి వీలుగా ఆ రంగాలలో మాత్రమే ‘విదేశీయ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యాన్ని’-్ఫరిన్ డైరక్ట్ ఇనె్వస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ- అనుమతించనున్నట్టు 1990వ దశకంలో ప్రభుత్వ నిర్వాహకులు పదే పదే ప్రకటించారు! కానీ ఈ వౌలిక రంగాలలో విదేశాల పెట్టుబడుల ప్రభావం దాదాపు శూన్యం! ఉత్పత్తులు జరిగినచోట కూడా ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయలేదు. మన దేశంలోనే అమ్ముతున్నారు. మన దేశం వివిధ దేశాల వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే ‘సంత’గా మారిపోవడం ప్రపంచీకరణ! ఈ వౌలిక వైపరీత్యాన్ని తొలగించడానికి వీలుగా ప్రభుత్వంవారు విదేశీయ సంస్థల కొత్త ‘చొఱబాటు’ను నిరోధించాలి! కానీ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తోంది! ‘జిడిపి’వేగం తగ్గడానికి కారణం ఈ రోగాన్ని పెంచుతున్న చికిత్స...
పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు భారీగా పన్నుల రాయితీలను ప్రకటించడంవల్ల కేంద్ర ప్రభుత్వానికి నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయిందట! ప్రభుత్వం ఇలాంటి నష్టాల గురించి ఆలోచించడం లేదు. కానీ ‘ఎయిర్ ఇండియా’వల్ల ఏర్పడుతున్న సాలుసరి తొమ్మిదివేల కోట్ల రూపాయల నష్టాన్ని మాత్రం ప్రభుత్వం భరించలేదట! ముప్పయి లక్షల కోట్ల రూపాయల- దాదాపు- వార్షిక వ్యయంచేస్తున్న ప్రభుత్వం ముప్పయి వేల మందికి ‘ఉద్యోగం’ కల్పిస్తున్న ‘ఎయిర్ సంస్థ’కోసం అదనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయల ఖర్చును భరించలేదా?? వ్రతం చెడినా ఫలితం దక్కడం లేదు. ‘సంస్థ’ అప్పులలో మూడింట రెండువంతులు- దాదాపు యాబయి ఆరు వేల కోట్ల రూపాయలు- కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందట. కొనుగోలుదారులకు ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయల ‘రాయితీ’ని ప్రకటించే బదులు, వార్షిక నష్టాన్ని మరికొన్ని ఏళ్లు భరించవచ్చు కదా! ఈలోగా సంస్థ పనితీరును, ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చు! ‘ఎయిర్ ఇండియా’ను ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’ సంస్థలను అమ్మివేయడాన్ని నిరోధించాలని కోరుతూ తాను ‘న్యాయ యాచిక’ను దాఖలు చేయనున్నట్టు భారతీయ జనతాపార్టీ నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యంస్వామి ప్రకటించడం, అందువల్ల, హర్షణీయం...