సంపాదకీయం

ఊహాన్ ‘పాఠం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కరోనా వైరస్’ మరో విచిత్రమైన వ్యాధి. చైనాలో బయటపడిన ఈ భయంకర ‘రోగ ధాతువు’- వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను హడలెత్తిస్తుండడం నడుస్తున్న వ్యథ! చిత్ర విచిత్రమైన వ్యాధులు ప్రపంచ జనజీవనాన్ని ఆవహించి అతలకుతలం చేస్తుండడం దాదాపు నాలుగు దశాబ్దులుగా ఆగని వ్యథ. ‘కరోనా రోగధాతు’ వైపరీత్యం చైనాలోని ‘ఊహాన్’ నగరంలో ఒకరిని బలికొన్న కొద్దిరోజులకే చైనాలోని అనేక ప్రాంతాలకు వ్యాపించడమేకాక నేపాల్ తదితర దేశాలకు కూడ విస్తరించి పోయిందన్న ప్రచారం జరుగుతోంది. చైనాలో నూట పాతిక మందికి పైగా ఈ వ్యాధికి బలికావడం ఈ వ్యాధి వ్యాపించిపోతున్న భయంకర వేగానికి నిదర్శనం. గతంలో బయటపడిన వివిధ విచిత్ర వ్యాధులు ఇంత వేగంగా విస్తరించలేదు. చైనాలో ప్రస్తుతం దాదాపు పదహైదువందల మందికి ఈ ‘కరోనా’ జబ్బు సోకిందట! చైనాలోని ‘ఊహాన్’లోను ఇతర ప్రాంతాలలోను ఉన్న వందల భారతీయ విద్యార్థులను, ఇతరులను మన ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్వదేశానికి తరలించుకొని రావడానికి యత్నిస్తోంది. వివిధ దేశాలనుంచి చైనాకు రాకపోకలు నిలచిపోవడం విమానయాన సేవలు రద్దుకావడం విస్తరిస్తున్న ‘‘విలయాని’’కి ప్రతీక! విలయం విశ్రమించడం ఖాయం! కానీ మరో ‘విలయం’ముంచుకొని రాదన్న విశ్వాసం లేదు!! దశాబ్దుల చరిత్ర ఇందుకు నిదర్శనం! వైద్య చికిత్సల, ఔషధ రూపకల్పనల ఆధునిక ప్రామాణిక పటిమ పెరుగుతుండడం పరిణామక్రమం, చిత్ర విచిత్ర వికృత విషరోగాలు కొత్తకొత్తవి పుట్టుకొని వస్తుండడం సమాంతర విపరిణామం! జీవజాల సమాహారమైన ప్రకృతిలో మానవుడు సర్వశ్రేష్ఠ జీవవైవిధ్యం! ఈ సర్వశ్రేష్ఠత్వం మిగిలిన వైవిధ్యాల పరిరక్షణకు దోహదం చేయడం ప్రకృతిలో నిహితమైఉన్న సహజ లక్షణం! ఈ ‘సర్వశ్రేష్ఠ వైవిధ్యం’ ఇతర వైవిధ్యాలను పరిమార్చడం అపవాదం- ఎక్సెప్షన్-! కానీ గత వంద, రెండువందల ఏళ్లలో విశ్వవ్యాప్తంగా ఈ ‘అపవాద వికృతి’ ప్రకృతిని పరిమార్చడం ‘విలాసం’- ఫ్యాషన్- అయిపోయింది! ప్రకృతిని పరిమార్చుతున్న మానవ జీవన విధానం భస్మాసుర ప్రవృత్తివలె విస్తరించడం గత శతాబ్ది చరిత్ర! ప్రకృతిలో జీవ వైవిధ్యం విస్తరించడానికి బదులు జీవ వైవిధ్యం క్రమంగా విచ్ఛిన్నంకావడం ఈ చరిత్ర... అనవసరంగా ఒక చెట్టును కూల్చివేయడంవల్ల వైవిధ్య విచ్ఛిత్తి... ఒక జంతువును వేటాడి వెన్నంటి చంపడం జీవవైవిధ్య విచ్ఛిత్తి!! జంతుజాలం, వృక్షజాలం పరస్పరం పరిపోషకాలు! ఈ పరిపోషకత్వం పరస్పర విధ్వంసంగా మారిపోవడం ప్రాకృతిక వైపరీత్యం. ఈ వైపరీత్యం వల్లనే ఊహించని చిత్ర విచిత్ర వ్యాధులు ఉత్పన్నవౌతున్నాయి! ప్రకృతికి అనుగుణంగా లేని మానవ జీవన ‘విలాసం’ ఇలాంటి వైపరీత్యాలకు కారణం అవుతున్న అభినవ భస్మాసుర స్వభావం! ‘విచ్ఛిన్నం’చేస్తున్న మానవుడు భస్మాసురుని వలె భంగపడుతున్నాడు! ఈ భంగపాటునకు ‘‘ఊహాన్ వ్యాధి’’ మరో నిదర్శనం...
రోగ క్రిములు- బాక్టీరియా-, రోగధాతువులు- వైరస్- వ్యాపించిన తరువాత చికిత్స మొదలుపెట్టడం, నిరోధక ఔషధ- వ్యాక్సిన్- సామగ్రిని తయారుచేయడం ‘విపత్తు’ను ఎదుర్కొనడంలో మానవ సాఫల్యానికి నిదర్శనం. కానీ అసలు ఈ విచిత్ర వ్యాధులు, వికృత వ్యాధులు ఉత్పన్నం కాకుండా, వ్యాపించకుండా నిరోధించ లేకపోవడానికి కారణం ఏమిటన్నది ‘మీమాంస’... దీనికి సమాధానం ప్రకృతిలో ‘సమన్వయం’ పెరగడం! ఈ సమన్వయం, ఈ సంతులనం!! గాయపడిన ప్రకృతికి ‘స్వస్థత’ మళ్లీ ఏర్పడేవరకు బహుశా ఈ వైపరీత్యాలు కొనసాగుతూనే ఉంటాయి. క్రీస్తుశకం 1970వ దశకం చివరిలో ‘మెదడువాపు వ్యాధి’ మొదలైంది. రోగ నిరోధకం-వ్యాక్సిన్- ఏర్పడింది. ‘‘సంక్రమిత నిరోధశక్తి హీనత’’- అక్వయిర్డ్ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రమ్- ఎయిడ్స్- వ్యాధి 1980నుంచి ప్రపంచాన్ని ముంచెత్తుతోంది! ఈ వ్యాధిని ఇప్పటికీ పూర్తిగా నిర్మూలించలేకపోవడం ‘చికిత్స’కున్న పరిమితికి నిదర్శనం. ‘సూకర వ్యాధి’- స్వయిన్‌ఫ్లూ- మొదలైంది. ‘గవోన్మాద’- మాడ్‌కౌ- వ్యాధి వ్యాపించింది! ఆఫ్రికాలోను, ఇతర ఖండాలలోను ఇలా చిత్ర విచిత్ర వ్యాధులు ప్రబలి ప్రపంచ దేశాలకు వ్యాపించిన భయంకర స్మృతులు చెఱగిపోక మునుపే ఇప్పుడీ ‘ఊహాన్’వ్యాధి ప్రపంచ ప్రజలను భయవిభ్రాంతికి గురిచేస్తోంది!!
కుక్కుట వ్యాధి- చికెన్ గునియా- విహంగ రుగ్మత- బర్డ్ఫ్లూ- పేరుతో వందల కోట్ల కోళ్ళను, బాతులను, ఇతర పక్షులను ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించారు. ‘సూకర వ్యాధి’ సోకగానే కోట్ల పందులను చంపేశారు... ‘గవోన్మాదం’-ఆవులకు పిచ్చి- ప్రబలగానే ఐరోపాలో కొన్ని లక్షల ఆవులను, గోసంతతిని నిర్మూలించారు! ఆవులకు తినిపించే ‘దాణా’లో కోడిగుడ్ల పెంకులు, ఎముకలు, ఇతర పశుమాంస పదార్థాలు కలసినందున ఆ ‘దాణా’తిన్న ఆవులకు ఈ వ్యాధి సంక్రమించినట్టు ప్రచారం జరిగింది. కానీ మిగిలిన వ్యాధులు ఎందుకు పుట్టుకొచ్చాయన్నదానికి పరిశోధకులు సమాధానాలు ఇంకా కనిపెట్టవలసి ఉంది! పశువులనుంచి, పక్షులనుంచి ఈ వ్యాధులు మానవులకు సంక్రమించాయి. ఇప్పుడు ‘‘ఊహాన్ వ్యాధి’’కి కారణాలను జీవవైవిధ్య శాస్తవ్రేత్తలు కొందరు నిర్ధారించారట! కానీ ఈ ‘నిర్ధారణ’ను మరికొందరు శాస్తవ్రేత్తలు నిరాకరించడం కూడ అప్పుడే సంభవించింది! ‘‘కర్మణో గహనో గతిః’’- క్రియకు సంభవించే ప్రతిక్రియ గతి ఊహకు అందనిది- అని మన ప్రాచీనులు చెప్పినట్టు ప్రకృతి విధ్వంసక ‘‘ప్రక్రియ’’కు ‘‘ప్రతిక్రియ’’ ఏవిధంగా సంభవిస్తూ ఉందో ఎవరు చెప్పగలరు?? ఊహాగానాలు ‘‘శాస్త్ర నిర్ధారణలు’’గా చెలామణి కావడం మరో వైపరీత్యం!! ఎఱువుల విష రసాయనాలు, క్రిమిసంహార విషాలు, యంత్ర వధశాలలు, శీతల పానీయ ఉత్పత్తి కేంద్రాలు, పారిశ్రామిక వ్యర్థాలు ప్రకృతిని పాడుచేశాయి. పాత ‘క్రిములు’ నశించాయి, కొత్త క్రిములు పుట్టాయి, పుట్టలుగా, గుట్టలుగా విస్తరించాయి! ‘‘ఎండోసల్ఫాన్’’అన్న క్రిమిసంహార రసాయనం పంటలపై విషప్రభావం చూపినట్టు పదేళ్ల క్రితం ధ్రువపడింది. కేరళలో ‘ఎండో సల్ఫాన్’ ప్రభావగ్రస్తమైన కూరగాయలను తిన్నవారు చిత్ర విచిత్ర వ్యాధులకు గురిఅయ్యారట! గర్భస్థ శిశువులు సైతం విచిత్ర శారీరక మానసిక వ్యాధులకు గురిఅయ్యారట!! జీవజన్యు పరివర్తన - జెనటిక్ మాడిఫికేషన్- జిఎమ్-ప్రక్రియ ద్వారా తయారవుతున్న ‘మహాసంకర’ వ్యవసాయ ఉత్పత్తులు ప్రకృతిని మరింతగా రుగ్మతకు గురిచేస్తున్నాయి. వ్యాధిగ్రస్త ప్రకృతి మానవులను వ్యాధిగ్రస్తులను చేస్తోంది!! ‘ఊహాన్ వ్యాధి’ మరో ఉదాహరణ మాత్రమే!!
ఆస్ట్రేలియాలో ‘టేకు’వంటి గట్టి కలపనిచ్చే చెట్లు చాలా ఎత్తునకు పెరుగుతూ ఉన్నాయట! కానీ ఈ మహావృక్ష జాతి అంతరించిపోతూ ఉందట. ఉన్న చెట్లు మాత్రమే పెరుగుతున్నాయట! కొత్తగా ఈ ‘జాతి’ మొక్కలు మొలవడం లేదట! పరిశీలకులు, పరిశోధకులు చేసిన నిర్ధారణ జంతుజాలం మధ్య, వృక్షజాలం మధ్య ఉన్న ‘సనాతన’ సమన్వయ సంబంధాన్ని ధ్రువపరిచాయి. ఈ చెట్ల పండ్లను, విత్తనాలను ఒక జాతి పక్షులు భోంచేస్తాయి. అలా ఆ పక్షులు తిని, విసర్జించిన విత్తనాలు మాత్రమే మొలకెత్తుతాయట! చెట్లనుంచి నేరుగా భూమిపై పడిన విత్తనాలు మొలకెత్తవు. అంకురించ లేవు. ఆ పక్షులు తిన్న తరువాత పక్షుల కడుపునుంచి బయటపడిన విత్తనాలు మాత్రమే అంకురించగలవు... కానీ ఆస్ట్రేలియాలో ఈ పక్షులను ఏళ్లతరబడి మానవులు వేటాడి తినేశారట... ఆ పక్షులు అంతరించిపోయాయట...!! శాస్తవ్రేత్తలు ఆ పక్షులకోసం వెదకుతున్నారట...