సంపాదకీయం
నిధులు చాలని రక్షణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన సరిహద్దుల పరిరక్షణకు తగినన్ని నిధులు కేటాయించక పోవడం దశాబ్దుల వైపరీత్యం. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఆరంభం కానున్న ఆర్థిక సంవత్సరంలో కూడ ఈ వైపరీత్యం కొనసాగనుంది. చైనా దురాక్రమణ వ్యూహం మన ఉత్తర- ఉపరితల- సరిహద్దులలో మాత్రమేకాక, మూడువైపుల విస్తరించి ఉన్న సముద్ర జలాలలో కూడ ఉచ్చులను బిగిస్తుండడం ఈ వైపరీత్యాన్ని మరింత ప్రస్ఫుటంచేస్తున్న విపరిణామం! చైనా ఆధికారికంగా చేస్తున్న సైనిక వ్యయం మన సైనిక వ్యయంకంటె దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. కానీ అధికార గణాంకాలవల్ల వెల్లడి అవుతున్న దానికంటె చాలా ఎక్కువ మొత్తాన్ని చైనా ప్రభుత్వం సైనిక, ఆయుధ పాటవం పెంపొందించుకొనడానికి చైనా ప్రభుత్వం కేటాయిస్తోందని ఐరోపా, అమెరికా ప్రభుత్వాల నిఘా విభాగాలు ఏళ్లతరబడి ప్రచారం చేస్తున్నాయి. బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉన్న మన దేశంలో ప్రభుత్వ విధానాలలో కార్యక్రమాలలో పారదర్శకత్వం నిహితమై ఉంది. ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ నెలకొని ఉన్న చైనాలో ఈ పారదర్శకత్వం లేదు. చైనా ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించడం లేదు, ప్రజల నియంత్రణలో లేదు. అందువల్ల చైనా ప్రభుత్వం బహిరంగంగాను, రహస్యంగాను సైనిక వ్యయం చేయగలదు. బహిరంగంగా-ఆధికారికంగా చైనా చేస్తున్న సైనిక వ్యయం వెల్లడి అవుతోంది. రహస్యంగా చైనా చేస్తున్న సైనిక వ్యయం వెల్లడికావడం లేదు. ఇదంతా అంతర్జాతీయ సమాజాన్ని చైనా వంచిస్తున్న తీరునకు నిదర్శనం. చిన్న దేశాలు ప్రవర్థమాన దేశాలు తమ ‘స్థూల జాతీయ ఉత్పత్తి’లో నాలుగు శాతంతో సమానమైన మొత్తాన్ని రక్షణ సైనిక వ్యయంకోసం ఖర్చుచేయవలసి వస్తోంది. ఆయా దేశాల రక్షణకు ఇది అనివార్యం కూడ! పాకిస్తాన్ ఈ పరిమితిని కూడ అతిక్రమించి తన ‘స్థూల జాతీయ ఉత్పత్తిలో ఐదు శాతంతో సమానమైన మొత్తాన్ని సైనిక వ్యయంకోసం ఖర్చుచేస్తోంది. పాకిస్తాన్ చిన్న దేశమూ కాదు, పెద్ద దేశమూ కాదు, కానీ దారిద్య్రగ్రస్తమై ఉన్న దేశం! అందువల్ల పాకిస్తాన్ వ్యయాన్ని పట్టించుకోనక్కర లేకపోవచ్చు! సంపన్న దేశాలు తమ ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్-లో ఒకటిన్నర, రెండు శాతానికి సమానమైన దానికంటె ఎక్కువ మొత్తాన్ని రక్షణకు కేటాయించరాదన్నది అంతర్జాతీయ ఆదర్శం. కానీ చైనా తన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’లో రెండున్నర శాతంతో సమానమైన మొత్తాన్ని సైనిక వ్యయం చేస్తోంది! ఇది అధికార వ్యయం. అనధికార వ్యయం ఎంత? అన్నది వెల్లడికావడం లేదు. మనది ప్రవర్థమాన దేశం, చైనా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-జిడిపి-తో పోలిస్తే మన ‘జిడిపి’ చాలా తక్కువ. అయినప్పటికీ మన ప్రభుత్వం మన ‘జిడిపి’లో ఒకటిన్నర శాతానికి మించని మొత్తాన్ని మాత్రమే రక్షణకు కేటాయిస్తోంది! దీర్ఘకాల రక్షణ ప్రయోజనాలకు ఈ విధానం విఘాతకరం. ‘జిడిపి’లో నాలుగు శాతానికి సమానమైన నిధులను మన ‘వార్షిక’ రక్షణ వ్యయంకోసం కేటాయించినప్పుడు మాత్రమే మనం ‘చైనా, పాకిస్తాన్’ల ఉమ్మడి దురాక్రమణను ప్రతిఘటించగల రక్షణ పటమను పెంపొందించుకోగలం...
నడుస్తున్న ఆర్థిక- 2019-2020 సంవత్సరంలో నిర్ధారిత వ్యయం దాదాపు ఇరవై ఏడు లక్షల కోట్లు రూపాయలు. ఇందులో రక్షణకు మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే మొత్తం వార్షిక వ్యయంలో రక్షణ వ్యయం వాటా దాదాపు పనె్నండు శాతం. కొత్త ఆర్థిక సంవత్సరం-2020-21-లో వార్షిక వ్యయం ముప్పయి లక్షల యాబయివేల కోట్లని ప్రభుత్వం అంచనావేసింది. ఈ ఏడాది రక్షణకు మూడు లక్షల ముప్పయి ఏడువేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారట. ఇది మొత్తం వార్షిక వ్యయంలో దాదాపు పదకొండు శాతం. అంటే వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో రక్షణ నిధుల శాతం తగ్గింది. ప్రతి ఏటా నిధుల శాతం పెరిగినప్పుడు మాత్రమే మనం మన రక్షణ పటిమను పెంచుకోగలం. కానీ రానున్న సంవత్సరంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మేర రక్షణ నిధులు పెరిగినప్పటికీ రక్షణ నిధుల శాతం మాత్రం- మొత్తం వ్యయం ప్రాతిపదికగా- తగ్గిపోయింది! పాకిస్తాన్ ప్రతి ఏటా మొత్తం వ్యయంలో దాదాపు ఇరవై రెండు శాతం నిధులను సైనిక విభాగంకోసం కేటాయిస్తోంది. చైనా వార్షిక వ్యయంలో దాదాపు పదహారు శాతం ఆధికారిక సైనిక వ్యయం!! చైనా పాకిస్తాన్‌ల ఉమ్మడి దురాక్రమణ ప్రమాదం మనదేశానికి నిరంతరం పొంచి ఉందన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం!! మన ప్రభుత్వం చైనా చొఱబాట్లను తాత్కాలిక ప్రాతిపదికపై నిరంతరం ప్రతిఘటిస్తోంది, గత ఐదేళ్లుగా ప్రతిఘటిస్తోంది. కానీ దీర్ఘకాల ప్రాతిపదికపై చైనా దురాక్రమణ ప్రమాదాన్ని ప్రతిఘటించగల వ్యూహం ఇప్పటికీ సిద్ధం కాలేదు!! రక్షణ రంగానికి గణనీయంగా నిధులు పెరగకపోవడం ఇందుకు ఒక నిదర్శనం...
ఇరవై ఏళ్ల క్రితం చైనా ప్రభుత్వం లక్ష నలబయి వేల కోట్ల రూపాయలను సాలీనా సైనిక వ్యయం చేసింది. 2018-2019వ ఆర్థిక సంవత్సరంలో పనె్నండు లక్షల కోట్ల రూపాయలను చైనా ప్రభుత్వం సైనిక విభాగానికి కేటాయించింది. ఇవి అధికార గణాంకాలు! అంటే ఇరవై ఏళ్లలో చైనా సైనిక వ్యయం తొమ్మిది రెట్లకు పైగా పెరిగిపోయింది. 2019-2020లో ఈ వ్యయం మరో లక్ష యాబయి కోట్ల మేర పెరిగింది! ఇలా చైనా సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోతోంది! చైనాకు 1991వరకు సోవియట్ రష్యాతో అతి దీర్ఘమైన సరిహద్దు ఉండేది! సోవియట్ రష్యాలోను చైనాలోను కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలు కొనసాగినప్పటికీ రెండు దేశాలు మిత్ర దేశాలు కాలేదు. అందువల్ల దాదాపు ఆరున్నర వేల కిలోమీటర్ల పొడవునా ఉభయ దేశాల మధ్య ఏర్పడి ఉండిన సరిహద్దులో ఉభయ దేశాల సైనికులూ భారీగా మోహరించి ఉండేవారు. అందువల్ల చైనా సైనిక వ్యయంలో అధిక భాగం సోవియట్ రష్యా-యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్- యుఎస్‌ఎస్‌ఆర్- సరిహద్దుల పరిరక్షణకోసం వినిమయం అయ్యేది. కానీ 1991లో ‘యుఎస్‌ఎస్‌ఆర్’లో ‘కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ’ను ప్రజలు తొలగించారు. వెంటనే ‘సోవియట్ యూనియన్ పదహైదు స్వతంత్ర దేశాలుగా విడిపోయింది. ఫలితంగా రష్యాకు చైనాకు మధ్య ‘మధ్య ఆసియా’లో ‘కిర్గిఝిస్తాన్’, ‘కఝకిస్తాన్’వంటి స్వతంత్ర దేశాలు ఏర్పడినాయి. ఈ దేశాల ఏర్పాటువల్ల చైనా పశ్చిమ ప్రాంతంలో ‘చైనా రష్యా సరిహద్దు’ అంతరించిపోయింది! మధ్య ఆసియా దేశాలవల్ల చైనాకు ప్రమాదం లేదు, పైగా ఆ దేశాలతో చైనా ‘‘చమురు స్నేహాన్ని’’ పెంపొందించుకొంది. మధ్య ఆసియా దేశాల ముడి చమురును, ఇంధన వాయువును చైనా భారీగా కొల్లగొడుతోంది! చైనా ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో మాత్రమే ఇప్పుడు ‘చైనా రష్యా సరిహద్దు’ మిగిలి ఉంది! ప్రచ్ఛన్నయుద్ధం-కోల్డ్‌వార్- అంతరించిన తరువాత రష్యా, చైనాలు గొప్ప మిత్రదేశాలుగా మారాయి, కలసికట్టుగా అమెరికాను ఢీకొంటున్నాయి. అందువల్ల చైనా దురాక్రమణ వ్యూహం ప్రధానంగా మన దేశం చుట్టూ అల్లుకొంటోంది! బర్మానుంచి ఆఫ్రికాలోని జిబౌటీవరకు గల మన ఇరుగుపొరుగు దేశాలన్నింటిలోను చైనా ‘వ్యూహాత్మక దురాక్రమణ కేంద్రాలు’ వెలసి ఉన్నాయి...
ఇలా మన దేశం చుట్టూ సైనిక కేంద్రాలను నెలకొల్పుతున్న చైనాతో మన ప్రభుత్వం 1989నుంచి వాణిజ్య సంబంధాలను పెంపొందించుకొనడం మరో వైపరీత్యం! ఈ వాణిజ్యం కారణంగా మన భారీ లోటు ఏర్పడి ఉంది. చైనానుంచి నాసిరకం వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఏటేటా దాదాపు మూడు లక్షల కోట్ల మన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ - ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ చైనాకు తరలిపోతోంది. చైనాతో మనం ‘వాణిజ్యం’మానుకున్నట్టయితే, ఈ ‘వినిమయ ద్రవ్యం’ ఆదా అవుతుంది. దురాక్రమించిన మన భూభాగాలను తిరిగి మనకు అప్పగించేవరకూ చైనా మన వాణిజ్యాన్ని రద్దుచేయడం దౌత్య విజ్ఞత కాగలదు...