సంపాదకీయం
‘పౌర’ సెగకు మూలమేమిటి?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేశ చరిత్రలో ఓ ప్రభుత్వం చేపట్టిన చట్టానికి వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన జ్వాలలు రగిలిన ఉదంతాలు ఇటీవల కాలంలో ఎన్నడూ లేనిదే! జాతీయ పౌర రిజిస్ట్రీ (ఎన్‌ఆర్‌సి)ని అస్సాంలో ప్రవేశ పెట్టినప్పుడు మొదలైన నిరసనలు అనంతరం మోదీ సర్కార్ ఆమోదించిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టంతో మరింత ముదురుపాకాన పడ్డాయి. తాజాగా జాతీయ జనగణన పట్టిక పేరుతో మరో ఆంశం తెరపైకి రావడంతో ఈ మూడింటిపైనా మోదీ సర్కార్ ముప్పేట దాడినే ఎదుర్కొంటోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం వివరణలు ఇస్తున్నా.. ఇవేవీ భారతీయ పౌరులకు వ్యతిరేకం, ప్రతికూలం కాదని చట్టసభల్లోనూ, బయటా.. రాత్రింబవళ్లు వివరణలు ఇస్తున్నా కూడా జనాగ్రహం తగ్గడం లేదు. వీటి స్వభావం, వాటిలోని అంశాలు, ఉద్దేశాలపై అనుమానాలు మాత్రం నివృత్తి కావడం లేదు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా వీటిపై వివిధ దేశాల్లో నిరసనలూ చెలరేగడాన్ని బట్టి చూస్తే.. వీటి వెనుక మోదీ సర్కార్ అసలు ఉద్దేశమేమిటన్నది వివాదానికి మూలకారణంగా కనిపిస్తోంది. భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు మతపరమైన దేశాలు. ఇస్లాం మతాలే ప్రధానంగా ఉన్న ఈ దేశాల్లో భారత్ నుంచి తరలి వెళ్లి.. అక్కడ మతపరమైన వేధింపులు తాళలేక తిరిగి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధమతస్తులు, పార్శీలు, క్రైస్తవులు ఎందరో ఉన్నారు. వీరంతా ఈ మూడు దేశాల్లో మైనార్టీలే..! వీరిని ఆదుకోవాల్సిన అవసరం, అగత్యం ఉంది కాబట్టే పౌరసత్వ సవరణ చట్టం తెచ్చామని ఇది తమ జాతీయ బాధ్యత అంటూ మోదీ ప్రభుత్వం వివరణ ఇవ్వని రోజు లేదు. ఐనా.. వివాదానికి ప్రధాన హేతువు ముస్లింలను విస్మరించారన్న వాదన. పైగా ఈ చట్టం వల్ల దేశంలోని ముస్లింలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా ఒక రకంగా నెలల తరబడి అవిశ్రాంతంగా సాగుతున్న నిరసనలకు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. దేశంలో పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌తో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇంత తీవ్రంగా ఉద్యమం సాగుతోందంటే అది కేవలం రాజకీయపరమైన చర్యగా, కేవలం రాజకీయ పార్టీలే ఎగదోస్తున్న జ్వాలగా భావించడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇటీవలి కాలంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై పునరాలోచించాల్సిందిగా ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖల ద్వారా ఎన్నో విన్నపాలు, విజ్ఞప్తులూ చేశారు. వీటిని ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్లే పరిస్థితి నానాటికీ జటిలంగా, సమస్యాత్మకంగా మారుతోంది. సీఏఏ పార్లమెంట్ ఆమోదించిన చట్టం కాబట్టి దాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ వాదన పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడానికి కారణమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. పశ్చిమ బెంగాల్ సహా పలు బీజేపీయేతర పార్టీలు ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తమతమ అసెంబ్లీల్లో తీర్మానాలూ చేశాయి. దీనితో పాటు ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలనూ అమలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశాయి. మరే బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో లేనంతగా పశ్చిమ బెంగాల్‌లో ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోనే నిరసనలు రోజువారీగా వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేవలం ముస్లింలే ఈ ఉద్యమ పథం తొక్కారు. ముఖ్యంగా విద్యార్థులు సైతం వీటిపై కదం తొక్కడంతో ఉద్యమ తీవ్రత ఇటీవలి కాలంలో ఎంతగా ఆందోళన రేకెత్తించిందో మనం చూశాం. పరిస్థితిని ఇలాగే వదిలేస్తే అది కచ్చితంగా శాంతి భద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది. అయితే ఆ హక్కు పక్కదోవ పట్టి నిరసనల పేరిట అరాచక శక్తులు అలజడి సృష్టించేందుకు గల అవకాశాలనూ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సమస్య సామరస్యపూర్వక పరిష్కారానికి దోహదం చేయాలి. సీఏఏ చట్టం అమలును ఎవరూ అడ్డుకోలేరన్న పిడివాదం వల్ల ఆందోళనల తీవ్రత మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఉండదన్న వాస్తవాన్ని విజ్ఞతాయుతంగా గుర్తించాలి. సీఏఏ రాజ్యాంగ చెల్లుబాటు ఆంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో అనుకూల, ప్రతికూల వర్గాలు సంయమనం పాటించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. కానీ అలాంటి అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మరో రెండు రోజుల్లో జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రచార తీవ్రత పరిస్థితిని మరింత జటిలం చేసింది. ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ఇటు అధికార పక్షం, అటు విపక్షం పరస్పర విమర్శలతో పరిస్థితిని మరింత సంక్షుభితంగా మార్చాయే తప్ప సామరస్య వాతావరణానికి అవకాశం ఇవ్వడం లేదన్నది నిజం. ఇందుకు హస్తిన మూల కేంద్రంగా మారింది. ఆందోళనకారులపై జరిగిన కాల్పులు హిందుత్వ రాజకీయాలే ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశమన్న భావనకు దారితీశాయి. ఈ నిరసనలు నిజంగా పౌర సమాజ సారథ్యంలోనే సాగుతున్నాయా లేక వీటి వెనుక అరాచక శక్తులు ఉన్నాయా అన్న వాస్తవాన్ని నిగ్గుదేల్చి తగిన రీతిలో పోలీసు చర్య తీసుకోవాల్సింది పోయి.. దాన్ని మరింతగా రగిల్చేందుకే పాలక పార్టీ ప్రయత్నించింది. ద్రోహుల్ని కాల్చేయాలంటూ ఓ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసే చందమే.. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా పాలక, విపక్షాలు వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పరస్పరం రెచ్చగొట్టుకోవడం వల్ల ఈ సమస్యా ఎన్నటికీ పరిష్కారం కాదు. సమున్నత ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారత్‌కు ఈ రకమైన ఆందోళనలు నెలల తరబడి సాగడం దాని ప్రతిష్టకే మాయని మచ్చగా మిగిలిపోతాయి. ఇది పంతాలు, పట్టింపులతో పరిస్థితిని మరింత ముదరబెట్టుకునే తరుణం కాదు.. రాజీ పథంలో సామరస్య వాతావరణానికి దోహదం చేసే దిశగా పాలక పార్టీ ఉద్యుక్తం కావాలి. అసలు పౌర చట్టంపై ఎందుకు వ్యతిరేకత రగులుకుందన్న మూలాన్ని శోధించి దాన్ని నివృత్తి చేయాలి. పొరుగున ఉన్న మూడు దేశాల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కోలేక భారత్‌కు వచ్చిన వారిని వెళ్లగొట్టాలని ఏ పౌరుడూ భావించడు. అవసరమైతే పౌరసత్వ సవరణ చట్టాన్ని జనం మెచ్చే విధంగా సవరించడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కోసమే ప్రభుత్వం కాబట్టి.. వారి అభిమతానికి పట్టం కట్టాల్సిందే.. పౌరసత్వ కల్పన విషయంలో సంకుచిత భావన వీడి విశాల దృక్పథాన్ని కనబరచాలి. కేవలం మూడు దేశాల్లోని మైనార్టీ హిందువులకే పౌరసత్వం అన్న అంశాన్ని చట్టంలో సవరిస్తే.. పరిస్థితి సద్దుమణుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ హితం కోసం, ప్రజా సంక్షేమం కోసం, లౌకిక భారతం మరింత వేళ్లూనడం కోసం సర్కార్ ఈ రకమైన సవరణకు సిద్ధపడితే.. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ఆందోళనల అగ్ని చల్లారుతుంది. ఇందుకు విపక్షాలు కూడా నిర్మాణాత్మక రీతిలో దోహదం చేయాలే తప్ప సర్కార్ తీసుకునే ప్రతి చర్యనూ తప్పుబట్టడమే పనిగా పెట్టుకోకూడదు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ సామరస్య వాతావరణానికి వేదిక కావాలి. అధికార, విపక్షాలు కలిసి ఉద్యమ భారతానికి తెరదించాలి. ఈ దిశగా ఇరు వర్గాలు కనబరిచే సహేతుకత, విశాల దృక్పథం దేశ ఖ్యాతిని మరింత ఇనుమడిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు..