సంపాదకీయం
అనివార్య ఆగమనం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డొనాల్డ్ ట్రంప్ అన్న అమెరికా అధ్యక్షుడికి భారత్, చైనా పరస్పరం ఇరుగుపొరుగు దేశాలన్న భౌగోళిక వాస్తవం తెలియదట!- అన్నది భవిష్యత్తులో చరిత్ర విద్యార్థులు తెలుసుకోబోయే పాఠం... ఈనెల ఇరవై నాలుగవ తేదీ నుంచి రెండురోజులపాటు ఈ అమెరికా అధ్యక్షుడు మన దేశంలో జరుపుతున్న అధికార పర్యటనకు ఇలాంటి అనధికార వాస్తవాలెన్నో విచిత్ర నేపథ్య భూమికలు... డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఒక మహావిచిత్రం! ఆయన అమెరికా అధ్యక్షుడు కావడం మరో అరుదైన విచిత్రం! 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో తన ప్రత్యర్థి, ‘డెమొక్రాటిక్ పార్టీ’ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కంటె డొనాల్డ్ ట్రంప్‌కు తక్కువ మంది ప్రజలు వోట్లు వేశారు. ట్రంప్ కంటె క్లింటన్‌కు మూడున్నర లక్షల ‘వోట్లు’ అధికంగా లభించాయి. కానీ అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో ప్రజల ‘వోట్ల’కంటె ‘వరణ సమితి’- ఎలక్టరల్ కాలేజీ-లోని ప్రతినిధుల- డెలిగేట్స్-కే ప్రాధాన్యం ఎక్కువ! ‘వరణ సమితి’కి యాబయి రాష్ట్రాలనుంచి, వాషింగ్టన్ జిల్లా నుంచి ఐదువందల ముప్పయి ఎనిమిది మంది ప్రతినిధులు ఎన్నిక అవుతున్నారు. ఒక రాష్ట్రంలోని ప్రజల- వోటర్ల-లో సంఖ్యాధిక్యం - మెజారిటీ- లభించిన అభ్యర్థికి ఆ రాష్ట్రానికి చెందిన మొత్తం ‘వరణ సమితి’ ప్రతినిధులు లభిస్తారు. ఈ పద్ధతి కారణంగా ‘వరణ సమితి’లో దేశం మొత్తంమీద సంఖ్యాధిక్యం- మెజారిటీ లభించే అభ్యర్థి అధ్యక్షుడుగా ఎన్నిక కావడం అమెరికా రాజ్యాంగ పద్ధతి! సాధారణంగా ‘వరణ సమితి’లో ‘మెజారిటీ డెలిగేట్లు’ లభించే అభ్యర్థికి ప్రజల వోట్లలో కూడ మెజారిటీ లభిస్తోంది. కానీ అప్పుడప్పుడు ‘వరణ సమితి’లో మెజారిటీ వచ్చి అధ్యక్షుడుగా ఎన్నిక అవుతున్న అభ్యర్థికి ప్రధాన ప్రత్యర్థికంటె తక్కువ ‘ప్రజల’ వోట్లు లభించడం అమెరికా ఎన్నికల పద్ధతిలోని విచిత్రం... ఇలాంటి అరుదైన విచిత్రం 2016 నవంబర్‌లో జరిగింది. ‘వరణ సమితి’లో ‘మెజారిటీ’ లభించిన ట్రంపునకు ప్రజల ‘వోట్ల’లో మెజారిటీ రాలేదు. ‘వరణ సమితి’ పద్ధతి కాక, మొత్తం దేశ ప్రజల వోట్లు ప్రాతిపదికగా అధ్యక్షుడిని ఎన్నుకొనే పద్ధతిలో- ఒకవేళ- ఎన్నిక జరిగి ఉండినట్లయితే 2016లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ఈ ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నికయి ఉండేవాడు కాదు, హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయి ఉండేది! ఇదీ డొనాల్డ్ ట్రంప్‌కు అధ్యక్ష పదవి లభించడంలో నిహితమై ఉన్న విచిత్రం! డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే చాలు... ఆయన సన్నిహితులు, అనుచరులు హడలిపోతుంటారట! ఎందుకంటె ‘‘తెరచిన నోటిలోకి ట్రంప్ తన కాలును పెట్టుకుంటాడేమోనన్నది’’ వారి భయం...
‘‘చైనా మీ సరిహద్దులో ఉన్న దేశం కాకపోయినప్పటికీ...’’అని డొనాల్డ్ ట్రంప్ గతంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు మాటల సందర్భంలో అన్నాడట! నరేంద్ర మోదీ విస్మయ చకితుడయ్యాడట... అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ చేతులతో ముఖాన్ని దాచుకున్నాడట!! ‘సుస్థిర ధీమంతుడు’- ఎ వెరీ స్టేబుల్ జీనియస్- అన్న ఆంగ్ల గ్రంథంలో రచయితలు ఫిలిప్ రూకర్, కెరోల్ లయనింగ్ ఈ సంగతిని ఉల్లేఖించినట్టు గత నెలలో ప్రచారమైంది! ప్రపంచంలోని వివిధ దేశాల భౌగోళిక, నైసర్గిక స్థితిని విద్యావంతులందరూ తెలిసికోవలసిన అవసరం లేదు! కానీ ఒక దేశపు ప్రభుత్వ అధినేత, తాను చర్చలు జరుపుతున్న మరో సార్వభౌమ ప్రభుత్వ అధినేతకు సంబంధించిన దేశపు భౌగోళిక స్థితిని తెలుసుకోవడం కనీసపు విజ్ఞత... మన ప్రధానితో చర్చలు జరిపిన సందర్భంగా ట్రంప్ ఈ విజ్ఞతను సైతం కోల్పోయాడు... దౌత్య నిర్లక్ష్యానికి ఇది ‘ప్రశాంత సాగర’మంత నిదర్శనం! అమెరికా అధ్యక్షులలోని ఎక్కువ మంది మన దేశం పట్ల ఈ నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శించడం చరిత్ర... జమ్మూకశ్మీర్ గురించి మనకూ పాకిస్తాన్‌కూ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతుండడం ‘నిర్లక్ష్య’ ప్రవర్తనకు మరో నిదర్శనం... మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్యగల అన్ని వివాదాలకు పరిష్కారాన్ని కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా సాధించాలన్నది 1972లో కుదిరిన ‘సిమ్లా ఒప్పందం’ స్ఫూర్తి! కానీ ‘జమ్మూకశ్మీర్’ ‘‘వివాదం’’పరిష్కారంకోసం మన దేశానికీ, పాకిస్తాన్‌కూ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటించడం అనభిజ్ఞత- ఇగ్నోరెన్స్-కు మాత్రమేకాదు, అహంకారానికీ- యారగెన్స్- కూడ చిహ్నం...
ఇలా అమెరికా ప్రభుత్వం మాత్రమేకాక ‘ఐరోపా సమాఖ్య’వారు, ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాల కూటమి- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్- ఓఐసి-వారు, చైనా ప్రభుత్వంవారు మన ‘జమ్మూకశ్మీర్’ విషయంలో అక్రమ ప్రమేయం కల్పించుకొనడానికి యత్నిస్తుండడం డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు మరిన్ని విచిత్ర నేపథ్య భూమికలు! నిజానికి ‘జమ్మూకశ్మీర్’ వివాదం కాదు, మన దేశపు అంతర్గత వ్యవహారం. పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్ మాత్రమే వివాదం! కానీ వాస్తవాలు తెలుసుకోలేని, తెలుసుకొనడానికి సిద్ధంగా లేని ఈ వివిధ దేశాలు ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్’ను గురించి మాట్లాడడం లేదు. మన జమ్మూకశ్మీర్‌ను గురించి మాత్రమే వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు! ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అమెరికాతో మన దేశానికి మైత్రి అనివార్యం అయిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం చైనా చంకబిడ్డగా మారిన నేపథ్యంలో అమెరికాకు కూడ మన దేశంతో మైత్రి అనివార్యం అయిపోయింది! అందువల్ల డోనాల్డ్ ట్రంప్ విచిత్ర వర్తనతోను, అహంకార ప్రవృత్తితోను నిమిత్తం లేకుండా భారత అమెరికా బంధం బలపడడం అంతర్జాతీయ అనివార్యం... హిందూ, మహాసముద్ర, ప్రశాంత మహాసాగర ప్రాంతాలలో చైనా జరుపుతున్న వ్యూహాత్మక దురాక్రమణకు పటిష్ఠమైన ప్రతిఘటన భారత, అమెరికా మైత్రి! ఐక్యరాజ్యసమితిలో ‘కశ్మీర్’ను ప్రస్తావించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల వైఫల్యానికి కారణం ఈ ‘మైత్రి’...! ఈ మైత్రి అమెరికానుంచి ఆయుధాల దిగుమతికి ప్రాతిపదిక! మనకు అతిపెద్ద ఆయుధ విక్రేతగా అమెరికా అవతరించనుంది! రక్షణోత్పత్తుల రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించలేకపోవడం ఈ మైత్రిని అనివార్యం చేస్తోంది. రష్యా ప్రభుత్వం మన దేశపు మైత్రి కంటె చైనా చెలిమికి ప్రాధాన్యం ఇస్తోంది... అమెరికాతో మన బంధం బలపడుతుండడానికి ఇది మరో అనివార్యం...
గతంలో గణతంత్ర దినోత్సవ ప్రధాన అతిథిగా మన దేశానికి రావాలన్న మన ప్రభుత్వ అభ్యర్థనను ట్రంప్ తిరస్కరించాడు. అప్పుడు ఆయన అత్యవసర కలాపాలలో వ్యగ్రుడై ఉన్నాడట... అందుకని రాలేదు! పదవీచ్యుతుడయ్యే ప్రమాదంనుంచి ట్రంప్ ఇటీవల తప్పించుకున్నాడు. అమెరికా కాంగ్రెస్-పార్లమెంట్-లోని ప్రతినిధుల సభ- దిగువ సభ- ఆయనను అభిశంసించింది. కానీ సెనేట్- ఎగువ సభ- ఈ ‘అభిశంసన’ను నిరాకరించింది... ఫలితంగా ట్రంప్ పదవి పదిలమైంది. వచ్చే నవంబర్‌లో జరుగనున్న ఎన్నికలలో ట్రంప్ మళ్లీ పోటీచేస్తున్నాడు! అందువల్ల నిజానికి ట్రంప్ ఇప్పుడు మరింత ‘వ్యగ్రత’కు గురిఅయి ఉన్నాడు! అయినప్పటికీ ఈ ఎన్నికల సంవత్సరంలో ఆయన మన దేశానికి వస్తున్నాడు. మన దేశంతో మైత్రి అమెరికాలోని ‘మత ప్రదాత’- వోటర్-లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలలో ఒకటి... బహుశా అందువల్లనే ఈ పర్యటన జరపడం ట్రంప్‌కు అనివార్యమైపోయింది!