సంపాదకీయం
సబలకు సమ్మానం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వేణిన్ జొల్లెము వెట్టి
సంఘటిత నీవీబద్ధయై భూషణ
శ్రేణిన్ దాల్చి, ముఖేందు మండల
మరీచీ జాలమున్ పర్వగా
పాణిన్ పయ్యెద చక్క నొత్తి
నిజ ప్రాణేశాగ్ర భాగంబునన్
యేణీ లోచన లేచి నిల్చె...
సంస్కృతి పరిరక్షణకోసం సత్యభామ సమర సన్నద్ధ అయినప్పటి దృశ్యమిది. మహాకవి బమ్మెర పోతన ఆవిష్కరించిన చిత్రమిది. ద్వాపర యుగంలో మాతృ సంస్కృతికి విద్రోహం తలపెట్టిన నరక రక్కసుని మాతృభూమి సంరక్షకుడైన యదుకుల కృష్ణుడు దండించాడు, ఆ యుద్ధంలో కృష్ణునితో సమానంగా సత్యభామ భాగస్వామ్యం వహించింది! సమరశీల స్వభావానికి ప్రతీక అయిన సబల సత్యభామ! మాతృ సంస్కృతి రక్షణ మాతృభూమి రక్షణ! భూమి శరీరం, ప్రజలు ప్రాణం, సంస్కృతి ఆత్మ... ఈ జాతీయ ఆత్మ పరిరక్షణ ప్రస్థానంలో మహిళలు తమ భర్తలతో సోదరులతో తండ్రులతో సుతులతో కలసి సమాన భాగస్వాములు మాత్రమే కాదు, అగ్రగాములు కూడ! సమర పథంలో ఈ సమాన భాగస్వామ్యం మళ్లీ ప్రస్ఫుటించడానికి రంగం సిద్ధమైంది. మన సైనిక దళాలలో మహిళలకు పురుషులతో సమాన ప్రతిపత్తి ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించడం ఇలా రంగం సిద్ధం కావడం! మహిళలు అబలలు కాదని సమాజ రక్షణకోసం ‘సమరాంగణం’లో దూకిన ‘సమరాంగనలు’ ఎందరో ఉన్నారని మన జాతీయ చరిత్ర సాక్ష్యం చెబుతోంది. ఈ చరిత్రకు సరికొత్త ధ్రువీకరణ సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్దేశం! ఈ నిర్దేశంతో మన సైనిక దళాలలో మహిళలకు కూడ సమానత్వం ప్రాతిపదికగా ‘నిర్దేశక పదవులు’- కమాండ్ పోస్టులు- లభించనున్నాయి, శాశ్వత ప్రాతిపదిక - పర్మినెంట్ కమిషన్‌పై యువతులు సైనిక ఉద్యోగాలలో, పదవులలో నియుక్తులు కానున్నారు. ఇంతవరకు, ఇరవై ఎనిమిది ఏళ్లుగా, ‘స్వల్పకాల సమర సేవ’-షార్ట్ సర్వీస్ కమిషన్- ఎస్‌ఎస్‌సీ- ప్రాతిపదికపై సైనిక దళాలలో పనిచేయడానికి మాత్రమే యువతులకు అవకాశం ఉండేది! ఈ ‘స్వల్పకాల సమర సేవ’ ఐదు సంవత్సరాలకు పరిమితం! మరో ఐదు సంవత్సరాలపాటు పొడిగించుకొనడానికి వీలుండేది. కొన్ని ప్రత్యేక విభాగాలలో మాత్రం మహిళలు పదునాలుగు సంవత్సరాలు పనిచేయడానికి వీలుండేది! ఈ ‘సబలలు’ కేవలం సమర సహాయ విభాగాలలో మాత్రమే ఇంతవరకు పనిచేశారు. ఇకపై ‘సమర నిర్దేశక’- కమాండ్- విభాగాలలోను, ఈ విభాగాల ‘అధిపతులు’- అధినాయకరాండ్రు- గాను మహిళలు నియుక్తులు కాగలరు. మహిళా సాధికార పునస్సాధన పథంలో ఇది మరో ప్రగతి పదం... కనీసం ఇరవై ఏళ్లపాటు మహిళలు సకలవిధ సైనిక విభాగాలలోను పనిచేయగలరు...
సాధికార పునఃసాధన- అని అనడం ఎందుకంటె విదేశీయ దురాక్రమణకు పూర్వం మన దేశంలో మహిళలు పురుషులతో సమానులు మాత్రమే కాదు, పురుషులకంటె అధికులు! భారతీయ సనాతన జాతీయ చరిత్ర ఇందుకు నిదర్శనం! ‘‘సాహసం షడ్గుణంచ ఏవ స్ర్తిణామ్’’- మహిళలు పురుషులకంటె ఆరు రెట్లు సాహసవంతులు- అన్నది ప్రాచీన సూక్తి! అనాదిగా హైందవ జాతీయ సమాజంలో ‘‘నమాతుః పరదైవతమ్’’- తల్లిని మించిన దైవం లేదు- అన్నది జీవన విధానం మహిళ మాతృమూర్తి! అందువల్ల మన రక్షణ దళాలలోని పురుషులు మహిళా అధికారిణుల ‘నిర్దేశక’ విభాగాలలో పనిచేయడానికి ఇష్టపడరు- అని సర్వోన్నత న్యాయస్థానంలో చేసిన వాదం అతార్కికం! మహిళలకు ‘శాశ్వత ప్రాతిపదిక’- పర్మినెంట్ కమిషన్- పిసి-గా సైనిక దళాలలో నియుక్తిని కల్పిస్తామని 2018 ఆగస్టు 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించాడు. అయినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానంతో ప్రభుత్వం ఎందుకు మాట మార్చిందన్నది స్పష్టం కాలేదు! మహిళల నిర్దేశకత్వంలో సమాజ జీవనమే జరుగుతున్నప్పుడు సైనిక వ్యవహారం ఎందుకని జరగరాదు?? ‘‘సహస్రంతు పిత్రూన్ మాతా గౌరవేణా తిరిచ్యతే’’- తండ్రి కంటె తల్లి వేయి రెట్లు పూజనీయురాలు- అన్నది మన జాతీయ జీవన స్వభావం!
ఈ స్వభావాన్ని విదేశీయ దురాక్రమణదారులు చెఱచిపోయారు. మహిళలను, సంతలో పశువులను వలె, బానిసలుగా అమ్మిన అరబ్బీ భౌతిక బీభత్సకారులు చెఱచిపోయారు, మహిళలను ద్వితీయశ్రేణి పౌరులుగా వ్యవస్థీకరించిన ఐరోపా బౌద్ధిక బీభత్సకారులు చెఱచిపోయారు. భారతదేశంలో ఆడపిల్లలు మగ పిల్లలతో సమానంగా ప్రాథమిక మాథ్యమిక ఉన్నత విద్యలను అభ్యసించిన వాస్తవాన్ని క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది ఆరంభంలో బ్రిటన్‌వారు గుర్తించారు, తమ గ్రంథాలలో నమోదుచేశారు... భారతదేశంలో ఆడ పిల్లలకు చదువు నేర్పడం లేదని అదే బ్రిటన్‌వారు పంతొమ్మిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. నిజానికి ఆ వంద ఏళ్లలో దేశంలో ఆడ పిల్లలు చదువు నేర్చుకోలేని దుస్థితి దాపురించింది. విదేశీయ బీభత్స పాలన ఇందుకు కారణం! కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించలేని దుస్థితి ఆ తరువాత దాపురించింది. ఇప్పటికీ కొనసాగుతోంది! అందువల్ల ఒకప్పుడు దేశంలో, సహస్రాబ్దులపాటు, కొనసాగిన స్ర్తిపురుష సమానత్వం గురించి మహిళలకు ఉండిన గౌరవాధిక్యం గురించి అవగాహన పెరగాలి! అందువల్ల మహిళలకు సైనిక దళాలలో సమాన భాగస్వామ్యం లభించడం మహిళా సాధికార ‘‘పునస్సాధన’’లో భాగం! ఒకనాటి భారతీయ మహిళ సమర తేజం... విదేశీయ బీభత్స పాలనం గ్రహణం!!
నేతాజీ సుభాస్ చంద్రవసు బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ సమరం జరిపాడు. ఆయన సైన్యంలో కెప్టెన్ లక్ష్మి పనిచేసింది!! నూట అరవై మూడు ఏళ్ల క్రితం జరిగిన బ్రిటన్ వ్యతిరేక ప్రథమ భారత సంగ్రామంలో ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి ‘‘చండిలా, దుర్గలా, చెండాడు కాళిలా’’ వీర విహారం చేయడం మహిళల సమర పటిమకు చెఱగని ప్రతీక! కర్ణాటకలోని కిత్తూరు సంస్థానం అధినేత్రి చెన్మమ్మ పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడింది, సమరాంగణంలో సైనికులను నిర్దేశకత్వం వహించింది! కర్నాటకలోని ‘కేలడి’ రాణి ‘మరో’చెన్నమ్మ పదిహేడవ శతాబ్దిలో మొఘలాయి బీభత్సకారుడైన ఔరంగజేబును ఎదిరించింది, యుద్ధ్భూమిలో అపర దుర్గవలె వీర విహారం చేసింది! రాణి అహల్యాబాయి, రాణి దుర్గావతి వంటివారు మొఘలాయి బీభత్సపు కోటలపై దూకిన పిడుగులు... పదమూడవ శతాబ్దినాటి కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి శౌర్య సాహస పరాక్రమ స్వరూపం... ప్రతిఘటనా సమర స్ఫూర్తి సామ్రాజ్యంలో మలగని వజ్ర దీపం!! ద్వాపరయుగం చివరిలో అజేయుడైన అర్జునుని ఓడించి ఆ తరువాత అతనిని పెళ్లాడిన వీర వనిత ప్రమీల గురించి జైమినీయ మహాభారతంలో ఉల్లేఖించారు!! ఆదిమ తత్త్వం ఆదిపరాశక్తి రూపం మహిళ! మహిష రక్కసుని మదమడంచిన దుర్గ ప్రప్రథమ ‘సమర వనిత’! మన దేశం చుట్టూ మన దేశం లోపల వివిధ వికృత రూపాల మహిషాసురులు నక్కి ఉన్న తరుణంలో, నిక్కినిక్కి చూస్తూన్న తరుణంలో ‘‘మహిళలు అబలలు కాదన్న’’ వాస్తవం ఇలా మళ్లీ వెలిగింది... ‘‘మహిళలు సబలలన్న’’ సత్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఇలా వెలిగించింది!