సంపాదకీయం

మాతృ భాషల లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అ క్షరాలు అజరామర
భావాలకు రూపాలు..
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు..
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు..
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధక స్వరాలు!!
‘అమ్మ’ను మరిపించి, ‘మమీ’ని మప్పుతుండడం దశాబ్దుల వైపరీత్యం... అక్షరాలను హత్య చేస్తుండడం మరో వైపరీత్యం! ఈ వైపరీత్యాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, విశే్లషణలు, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, వైపరీత్యాలు మరింత ‘‘ప్రస్ఫుటిస్తూ’’ ఉన్నాయి. అక్షరాల సమూహం ‘లిపి’... ‘లిపి’ భాషా యోషకు స్వరూపం, అక్షరాలు భాషా మాతృదేవి అవయవాలు, అంగాలు! ఒక్క చిన్న అవయవాన్ని గిల్లిపారేసినప్పటికీ స్వరూపానికి, శరీరానికి వైకల్యం ఏర్పడడం ప్రత్యక్ష అనుభవం! కానీ తెలిసి తెలిసి దశాబ్దుల తరబడి తెలుగు లిపి నుంచి అనేక అక్షరాలను గిల్లిపారేస్తున్నారు! ఈ ‘అవయవాల’ హననం వల్ల ఆంధ్ర భాషా స్వరూపం వికృతమై పోయిందన్న ధ్యాస కూడ అధిక శాతం విద్యాధికులకు లేదు! ‘ఱ’ను చంపేశారు, ‘ఋ’ను వెళ్లగొట్టారు! మరికొన్ని ‘అచ్చు’లు మన భాషలో ‘‘ఉండేవన్న’’ ధ్యాస కూడ లేదు. ‘చ’ వర్గంలోని ‘రెండవ అక్షరం’ ‘ఐదవ అక్షరం’ గురించి, వాటిని హత్య చేశారన్న చారిత్రక వాస్తవం గురించి ఇప్పటి తరానికి తెలీదు! ఆంగ్ల భాషలోని ఇరవై ఆరు అక్షరాలలో ‘‘అనవసరమైన’’ నాలుగైదు అక్షరాలున్నాయి. వాటిని ‘రోమన్’- ఆంగ్ల- లిపి నుంచి తీసివేయాలన్న బుద్ధి ఎవరికీ పుట్టలేదు. కానీ మాతృభాష ‘లిపి’నుంచి మాత్రం ‘‘అనవసరమన్న’’ సాకుతో తెలుగు మేధావులు అనేక అక్షరాలను వెళ్లగొట్టారు! అక్షర హననంతో ఆగలేదు. తెలుగు ‘బ్రాహ్మీ’లిపి మొత్తం అంతరించిపోతోంది! తెలుగు భాష మాట్లాడడం మాత్రమే తెలిసి స్నాతకోత్తర స్థాయి విద్యాధితులు తెలుగును చదవడం లేదు వ్రాయడం లేదు. ఎందుకంటె వారికి తెలుగు ‘లిపి’తెలీదు... ‘‘షివుడు’’అని ఒక యువకుడు పలికాడు! ‘‘శివుడు’’అని పలకాలి- అన్నది అతనికి తెలీదు. ఎందుకంటే ఆ మాటను అతడు తెలుగులో వ్రాయడు... చదవడు... ‘‘ఎస్‌హెచ్‌ఐవియుడియు’’అని ఆంగ్ల- రోమన్- లిపిలో వ్రాస్తాడు, చదువుతాడు! ‘చరవాణి’, ‘లావణ్యవాణి’, ‘అంతర్జాలం’ విస్తరించిన తరువాత, తెలుగును మాత్రమేకాదు అన్ని భారతీయ భాషలనూ మాతృ లిపిలో వ్రాయడం మరింతగా తగ్గిపోయింది. భారతీయ భాషలను ఇలా ‘రోమన్’ లిపిలో వ్రాయడంవల్ల భారతీయ మాతృభాషల ‘స్వరూపం’ మారిపోతోంది, వికృతం అవుతోంది! ఇప్పటికే కశ్మీరీ- శారద-లిపి అంతరించి పోయిందట... సింధీ భాషను ‘గురుముఖి’ లిపిలో వ్రాసే సంప్రదాయం దాదాపు వంద ఏళ్ల క్రితమే అంతరించిందట! లాల్‌కృష్ణ అద్వానీ తన ‘ఆత్మకథ’లో చెప్పాడు...
‘అమ్మ’ను తొలగించి ‘మమీ’ని వెలిగించడంవల్ల స్వభావం మారిపోతోంది, జాతీయ జీవన స్వభావం పాశ్చాత్య జీవన స్వభావంగా రూపాంతరం చెందుతోంది! మాతృభాషల పరిరక్షణ, మాతృభాషా మాధ్యమ బోధన, మాతృభాషా జీవన వ్యవహారం- వీటి లక్ష్యం మాతృ సంస్కృతిని పరిరక్షించి పెంపొందించుకోవడం!! ఈ వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ లక్ష్యంగా నిర్దేశించింది. ‘‘మాతృ భాష మాధ్యమం ద్వారా మాతృ జాతీయ సంస్కృతి పరిరక్షణ చేయడం’’అన్నది ఐక్యరాజ్యసమితి మార్గదర్శక సూత్రం! మన దేశంలో అనేక మాతృభాషలు వికసించడం మన జాతీయ స్వభావంలో నిహితమై ఉన్న వైవిధ్య పరిపోషక తత్త్వం... అనాదిగా మన దేశంలో అనేక భాషలు అనేక మతాలు పరిఢవిల్లుతున్నాయి. భాషా వైవిధ్యాలు, మత వైవిధ్యాలు మాత్రమే అనేకానేక ఇతర వైవిధ్యాలు కూడ మన జాతీయ స్వభావంలో నిహితమై ఉన్నాయి. ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యాలు లేవు, సహజ సమన్వయం అనాదిగా ఏర్పడి ఉంది. ఈ సమన్వయం జాతి, జాతీయ సంస్కృతి! అసంఖ్యాక భాషలు, మతాలు, వైవిధ్యాలు ఉన్న మన దేశ ప్రజలు అనాదిగా ఒకే జాతి! ఈ ప్రజలది ఒకే సంస్కృతి! కొలంబోనుంచి కైలాసం వరకు గాంధారం నుంచి బర్మా వరకు విస్తరించిన ‘అఖండ భారత్’లో అనేక భాషలు వికసించాయి. ఈ వైవిధ్య భాషల మాధ్యంగా ఒకే ‘జాతి’- భారత జాతి- వికసించడం చరిత్ర, ఒకే సంస్కృతి ప్రస్ఫుటించడం చరిత్ర! అందువల్ల మాతృభాషా పరిరక్షణ అన్ని భారతీయ భాషలకు వర్తించే అద్వితీయ జాతీయ సూత్రం, అద్వితీయ సాంస్కృతిక తత్వం!
అందువల్ల దేశంలోని ఏ మాతృభాష స్వరూప స్వభావాలు భంగపడినప్పటికీ మొత్తం భారత జాతీయ తత్త్వం, సాంస్కృతిక స్వచ్ఛత భగ్నంకావడం వ్యవహార వాస్తవం! ఇలా భగ్నం కావడం గురించి ఎన్ని విశే్లషణలు వ్యాఖ్యలు జరిగినప్పటికీ ప్రయోజనం లేదన్నది దశాబ్దుల అనుభవం. అందువల్ల దేశమంతటా ఉన్న భారతీయ మాతృభాషల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైన నడుం బిగించాలి! ఎందుకంటె ఇది ప్రాంతీయ సమస్య కాదు, మొత్తం భారతీయతపై పాశ్చాత్య వికృతి దాడి చేస్తుండడం భారతీయతను ధ్వంసం చేస్తుండడం రెండు శతాబ్దులుగా కొనసాగుతున్న వౌలిక సమస్య... మాతృభాషలు మళ్లీ జనజీవన ధ్వనులుగా, వ్యవహార మాధ్యమాలుగా, గ్రాంథిక, సాహిత్య రూపాలుగా పునరుద్ధరణకు నోచుకోవాలి. నోచుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించగల చట్టం చేయాలి. ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు దేశంలోని ప్రతి ప్రాంతంలోను ఆయా ప్రాంతీయ మాతృభాష మాధ్యమంగా మాత్రమే విద్యాబోధన జరగాలని ఈ చట్టంలో నిర్దేశించాలి. ఒకటవ తరగతికి పూర్వం రెండేండ్లపాటు శిశువులను విద్యా‘శిక్ష’కు బలిచేస్తున్న పాఠశాలలలో సైతం మాతృభాషను విధిగా బోధనా మాధ్యమంగా ప్రకటించాలి. అప్పుడు ‘అమ్మ’ మళ్లీ బతుకుతుంది. ‘అమ్మా’అని పిలిచే పసిపాపల సంఖ్య పెరుగుతుంది. ‘‘బాబా బాబా బ్లాక్ షీప్’’అని, వల్లెవేస్తున్న శిశు గళాలు మళ్లీ ‘‘చిట్టి చిలకమ్మ’’ పాటలను వల్లెవేయగలరు!! ఇదంతా జరగాలంటే మొదటి ఈ రెండేళ్లు, ఆ తరువాత ఎనిమిదవ తరగతి వరకు మాతృభాషా మాధ్యమ బోధనను నిర్బంధంచేస్తూ అఖిల భారతస్థాయిలో చట్టం రూపొందాలి! అప్పుడు మాత్రమే జీవచ్ఛవ స్థితిలో ఉన్న భారతీయ మాతృభాషలు మళ్లీ జవసత్వాలను పొందగలవు! తొమ్మిదవ తరగతి నుంచి స్నాతకోత్తర స్థాయివరకు, పరిశోధక స్థాయివరకు ఒకే భారతీయ భాష మాధ్యమంగా విద్యాబోధన జరిగే వ్యవస్థ ఏర్పడాలి! ఇలాంటి సమీకృత విద్యావ్యవస్థ ఏర్పడడానికి ప్రభుత్వం- కేంద్రం- ఇప్పుడు చట్టం చేసినట్టయితే ముప్పయి ఏళ్లలో అది ‘ఆచరణ’వాస్తవం కావచ్చు! బ్రిటన్ దురాక్రమణకు పూర్వం, విదేశీయ బీభత్సకారులు మన దేశంలోకి చొఱబడడానికి పూర్వం దేశమంతటా ఉన్నత విద్యాబోధనకు మాధ్యమం సంస్కృత భాష! బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు సంస్కృత భాషను తొలగించి ఆ స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టారు. ఈ మార్పును భారతీయులు కోరలేదు, తమ ‘‘బానిసలైన’’ భారతీయులపై బ్రిటన్ ప్రభుత్వం ఈ ‘‘మార్పు’’ను రుద్దింది... అందువల్ల స్వతంత్ర భారత జాతి బ్రిటన్ దురాక్రమణ పూర్వపు బోధన మాధ్యమాన్ని ఇప్పుడైన పునరుద్ధరించుకోవాలి! ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ మాతృభాషల మాధ్యమంగా బోధన జరగాలి, ఉన్నత విద్యాబోధన, తొమ్మిదవ తరగతి నుంచి అన్ని పైస్థాయిలలోను సంస్కృత భాషలో జరగాలి... ప్రభుత్వం చిత్తశుద్ధితో పూనుకుంటే ముప్పయి నలబయి ఏళ్లలో ఈ వ్యవస్థ ఏర్పడగలదు! భారతీయ భాషలన్నీ బహుముఖంగా పల్లవించి పుష్పించి పరిమళించగలవు... ఆ పరిమళం భారత జాతీయ తత్త్వం!