సంపాదకీయం

ప్రజాస్వామ్య ప్రాబల్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వైపాక్షిక మైత్రీ స్వరాలు మారుమోగడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో జరిపిన రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రస్ఫుటించిన మహావిషయం. ఈ మైత్రీ ధ్వనులు మాథ్యమాలలోను లక్షల మంది ఉత్కంఠ పూరిత అభిమానుల గుండెలలోను పెద్దగా ప్రతిధ్వనిస్తుండడం ఈ రెండు రోజుల ముచ్చట. సోమ, మంగళవారాలలో దాదాపు ముప్పయి ఆరు గంటల పర్యటన వినూతన మైత్రీ చరిత్రకు శ్రీకారమన్నది జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టాడు, డొనాల్డ్ ట్రంప్ ఆర్భాటయుతంగా భాగస్వామ్యం వహించాడు! ఈ ద్వైపాక్షిక మైత్రీ ప్రహసనానికి మళ్లీ ప్రజాస్వామ్యం ప్రాతిపదిక కావడం వినూతన చరిత్ర! ప్రపంచీకరణ మొదలయినప్పటినుంచి ప్రజాస్వామ్య ప్రస్తావన తగ్గుముఖం పట్టడం గత ఇరవై ఆరేళ్ల చరిత్ర, వాణిజ్య ప్రాధాన్యం మితిమీరిపోవడం ఈ ఇరవై ఆరేళ్ల చరిత్ర... ‘వాణిజ్యం’అన్నది అవకాశం! ప్రజాస్వామ్యము’ అన్నది మహత్తర మానవీయ సంస్కారం! ప్రపంచీకరణ మొదలైన తరువాత సంపన్నదేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్- ఎమ్‌ఎన్‌సిలు- మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలలోకి చొరబడిపోయాయి, దోపిడీ సాగిస్తున్నాయి. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి అమెరికా సంస్థలు మన జనజీవన ప్రస్థానాన్ని నియంత్రిస్తున్నాయి నిర్దేశిస్తున్నాయి. మొన్‌సాంటో అన్న సంస్థ మన వ్యవసాయదారులకు, ‘బిటి’ పత్తి తదితర కృత్రిమ సస్యజాతుల విత్తనాలను అమ్మి వేల కోట్ల రూపాయల లాభాలను అమెరికాకు తరలించినట్టు ప్రచారవౌతోంది! ఇదంతా వాణిజ్య అవకాశం! ద్వైపాక్షిక మైత్రికి ఈ ఇరవై ఆరేళ్లుగా వాణిజ్యం ప్రాతిపదిక కావడం చరిత్ర... గతంలో బర్రాక్ హుస్సేన్ ఒబామా అమెరికా అధ్యక్షుని హోదాలో మన దేశానికి వచ్చినప్పుడు పెట్టుబడుల గురించి పెద్ద ప్రచారం జరిగింది. అంతకు పూర్వం అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్ మన దేశానికి వచ్చినప్పుడు కూడ పెట్టుబడుల ఆర్భాటం జరిగింది. మన దేశానికి అమెరికానుంచి వేల, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చిపడుతాయన్నది జరిగిన ప్రచారం! రెండేళ్ల క్రితం మన దేశంలో జరిగిన ప్రపంచ దేశాల పెట్టుబడుల సదస్సునకు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరుకావడం అంతర్జాతీయంగా గొప్ప ఆర్భాటం... కానీ ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’- ఫారిన్ డైరెక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఆర్భాటంవల్ల మన దేశానికి లభించిన ప్రయోజనం సున్న! నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్ళి పెట్టుబడుల సదస్సులలో ప్రసంగించినప్పటికీ మనకు లభించిన పెట్టుబడులు పెద్దగా లేవు! 2008లో ఆర్భాటంగా కుదిరిన ‘శాంతి ప్రయోజనాల అణువిద్యుత్’ అవగాహన గురించి ఇప్పుడు జ్ఞాపకం కూడ లేదు. ఈ ఒప్పందంవల్ల అమెరికా సంస్థలు మన దేశానికి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేసి కారుచౌకగా మన వినియోగదారులకు విక్రయిస్తాయన్న ప్రచారం జరిగింది...
అమెరికా సంస్థలు రాలేదు. పెట్టుబడులను పెట్టలేదు. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయలేదు. వాల్‌మార్ట్, అమెజాన్ వంటి అమెరికా సంస్థలు పెట్టుబడులు అవసరం లేని చిల్లర వ్యాపారం చేస్తున్నాయి!! అందువల్ల ట్రంప్ ఆగమనం సందర్భంగా ‘పెట్టుబడుల’ ప్రచారం జరుగకపోవడం శుభపరిణామం! గతంలో అమెరికా సంస్థలను మన ప్రభుత్వం పెట్టుబడులకోసం దేబిరించింది. ఇప్పుడు మంగళవారం ఢిల్లీలో జరిగిన వాణిజ్యవేత్తల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించాడు! అమెరికాలో పెట్టుబడులను పెట్టవలసిందిగా భారతీయ వాణిజ్య పారిశ్రామికవేత్తలను ట్రంప్ ఆహ్వానించాడు... ఇదీ చరిత్ర తిరగబడుతున్న తీరు! ‘ప్రజాస్వామ్యం’ ప్రాధాన్యం ప్రస్ఫుటించడం ఈ తిరుగుబాటునకు సమాంతర పరిణామం! ‘‘పెట్టుబడుల’’ ప్రాతిపదికగా కాక ఉభయ దేశాల ప్రజాస్వామ్య సమానత్వం ప్రాతిపదికగా ‘్భరత -అమెరికా స్నేహ సుగంధం’ అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేయాలన్నది కర్ణావతి- అహమ్మదాబాద్‌లో జరిగిన ‘‘నమస్తే ట్రంప్’’ సమావేశంలో ‘్ధ్వనించిన’ స్ఫూర్తి... ట్రంప్ సకుటుంబంగా మన దేశానికి రావడం, ట్రంప్ భార్య మిలానియా ట్రంప్ దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాలలో శిశువులతో ‘‘ఆనంద’’- హాపీనెస్- సమావేశం జరపడం వంటి వాస్తవాలు ప్రజలకూ, ప్రజలకూ మధ్య పెంపొందుతున్న అవగాహనకు సరికొత్త అంకురాలు. ప్రజలు రాజ్యాంగ వ్యవస్థ స్వరూపం, రాజ్యాంగ వ్యవస్థ ప్రజలకు రక్షణ కవచం. ‘మహాభారత’ ఇతిహాస కావ్యంలో ప్రస్తావించిన ‘సనాతన ప్రజాస్వామ్య’ స్వభావం ఇది. భారతదేశం ప్రజాస్వామ్య స్వభావానికి శైశవ డోలిక- పుట్టినిల్లు!
‘‘రాజునకు ప్రజ శరీరము
రాజు ప్రజకు రక్షకాన రాజున్ ప్రజయున్
రాజోత్తమ! అన్యోన్య వి
రాజితులై మెలగవలయు రక్షార్చనలన్’’.
ఇలా అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశం గురించి ట్రంప్ ప్రస్తావించడం ‘‘అంతర్జాతీయ ప్రజాస్వామ్యవ్యవస్థ’’ వరల్డ్ డెమొక్రాటిక్ ఆర్డర్-కు పెరుగుతున్న ప్రాధాన్యం! ఉభయ దేశాల మధ్య మంగళవారం ఢిల్లీలో వివిధ ఒప్పందాలు కుదరడం కొత్త విషయం కాదు. ఎందుకంటె ఈ ఒప్పందాలు కుదరనున్నట్టు వారంరోజులుగా ప్రచారం జరిగింది! దాదాపు ఇరవై రెండువేల కోట్ల రూపాయల విలువైన రక్షణ సామగ్రిని, సమర గగన శకటాలను మన దేశం అమెరికానుంచి కొనుగోలు చేయడానికి వీలైన ఒప్పందం కుదిరింది. ఇంధన వినిమయ అంగీకారం రక్షణ సహకారం, వ్యూహాత్మక సహకారం- ఈ ఒప్పందాలు కుదురుతాయన్నది పూర్వ నిర్ధారిత వ్యవహారం కుదరదనుకున్న ‘సమగ్ర వాణిజ్య వ్యవహారాల’ ఒప్పందం కుదరలేదు! అమెరికా ఆయుధాలను అమ్మడం, మనం కొనడం కొత్తకాదు... అందువల్ల ‘వాణిజ్యం’కంటె ‘ప్రజాస్వామ్యం’ ఈ పర్యటనకు ప్రధాన ఇతివృత్తమైంది. ప్రపంచంలోని అతి పెద్ద రెండు ప్రజాస్వామ్యాల మధ్య అత్యంత సాన్నిహిత్యం క్రీస్తుశకం 1947 నుంచి కొనసాగవలసి ఉండింది, కొనసాగలేదు. ఇప్పుడైన మొదలుకావడం ‘‘ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సైద్ధాంతిక సమాఖ్య’’ ఏర్పడడానికి దోహదం చేయవచ్చు! ఇలాంటి ‘ప్రజాస్వామ్య ప్రపంచీకరణ’- డెమొక్రాటిక్ గ్లోబలైజేషన్- దోపిడీకి ప్రాతిపదిక అయిన ‘వాణిజ్య ప్రపంచీకరణ’- కమర్షియల్ గ్లోబలైజేషన్ -కు ప్రత్యామ్నాయం కాగలదు. చైనా ప్రాతినిధ్యం వహిస్తున్న ‘‘ఏకపక్ష నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ’’- టోటలిటేరియన్ డిక్టటోరియల్ రిజీమ్-కు కూడ ఈ ‘ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ’ సమంజసమైన సైద్ధాంతిక ప్రత్యామ్నాయం కమ్యూనిజమ్- సామ్యవాదం-, కాపిటలిజమ్- పెట్టుబడుల వాదం-, ప్రపంచమంతటా విఫలమయ్యాయి. ఈ వైఫల్యం ఫలితం చైనా సాగిస్తున్న వ్యూహాత్మక అంతర్జాతీయ దురాక్రమణ... ఈ దురాక్రమణకు పటిష్ఠమైన ప్రతిఘటన ప్రజాస్వామ్య ప్రాతిపదికగా బలపడనున్న భారత అమెరికాల సాన్నిహిత్యం...
భారత అమెరికాల మధ్య స్నేహం, డొనాల్డ్ ట్రంప్ స్వభావం రెండు వేఱు వేఱు అంశాలు! ఈ వాస్తవం ట్రంప్ పర్యటన ద్వారా మరోసారి ధ్రువపడింది, ‘‘నోరు తెరిస్తే చాలు, మూసుకునే లోగా ట్రంప్ నోటిలో తన కాలును పెట్టుకుంటాడు...’’అన్నది ఆయన స్వభావం! అహమ్మదాబాద్‌లోను, ఢిల్లీలోను ఇలా డొనాల్డ్ ట్రంప్ నోటిలో కాలుపెట్టుకున్న దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. జిహాదీ బీభత్సకాండను ప్రతిఘటించడంలో భారత్, అమెరికాలు కలసికట్టుగా కృషిచేస్తాయన్నది ఉభయ దేశాల ప్రభుత్వ అధినేతలు చెప్పిన మాట! బాగుంది... కానీ తమ ప్రభుత్వానికి బీభత్సకాండను నిరోధించడంలో పాకిస్తాన్ ప్రభుత్వం కూడ సహకరిస్తోందని ట్రంప్ వక్కాణించడం ‘‘నోటిలో కాలు వేసుకోవడం...’’ బీభత్సకాండను ఉసికొలుపుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం దానిని నిర్మూలించగలదా?? జమ్మూకశ్మీర్ విషయంలో మన దేశానికీ పాకిస్తాన్‌కూ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం వహించగలడట...న్నది ట్రంప్ నోటిలో వేసుకున్న తన రెండవ కాలు!! ఈయన మధ్యవర్తిత్వాన్ని మన ప్రభుత్వం అనేకసార్లు నిరాకరించింది! అయినప్పటికీ స్నేహ గీతాలాపనలో ‘అపశ్రుతి’ని వినిపించాడు ట్రంపు... ఏమయినప్పటికీ అపస్వరాలు ప్రధానం కాదు... స్నేహశ్రుతి వౌలికం...