సంపాదకీయం
విరాళాల వైచిత్రి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రజాస్వామ్య ప్రక్రియను సమూలంగా సంస్కరించడానికి దోహదం చేయగల ‘మార్గదర్శక పటం’- రోడ్ మాప్- ఆవిష్కృతం అయిందట! ‘్భరత ఎన్నికల సాధికార సంఘం’- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా- ఇ.సి.ఐ.- వారు ఆవిష్కరించిన ఈ ‘మార్గదర్శక పటాని’కి రాజకీయ పక్షాలవారు విచ్చలవిడిగా డబ్బును వెదజల్లుతుండడం విచిత్ర నేపథ్యం... ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటినుంచి పరిసమాప్తం అయేవరకు వివిధ రాజకీయ పక్షాల ధనం- లెక్కలలో చూపినది, లెక్కలలో చూపనిది- వివిధ రూపాలలో విన్యాసాలను చేస్తుండడం నడుస్తున్న చరిత్ర. అధిక శాతం మత ప్రదాత- వోటర్-లకు దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడ ఎంతోకొంత ముట్టచెప్పడానికి యత్నిస్తుండడం ధ్రువపరచడానికి వీలులేని బహిరంగ రహస్యం... ప్రతి ఎన్నిక సమయంలోను ‘డబ్బు సంచులు’- అక్రమంగా ఖర్చుపెట్టడానికి ఉద్దేశించిన నల్లడబ్బు మూటలు- దొరికిపోతూనే ఉన్నాయి. దొరికిన అక్రమ ధనం కంటె దొరకని నల్లడబ్బు విలువ వంద రెట్లు ఎక్కువ కావచ్చు, వేయి రెట్లు ఎక్కువ కావచ్చు! బ్రహ్మదేవుడు సైతం కనిపెట్టలేని రహస్యం ఇది. అందువల్లనే అక్రమాలకు వ్యతిరేకంగా ఆర్భాటపు అధికార ప్రకటనలు ఆవిష్కృతం అవుతున్నప్పటికీ ‘‘మత ప్రదాతలకు డబ్బు పంచుతున్న ప్రక్రియ’’ను మాత్రం ‘ఎన్నికల సాధికార సంఘం’ పూర్తిగా నిరోధించలేక పోయిందన్నది నిరాకరింపజాలని నిజం! అభ్యర్థులు ఎన్నికల ప్రచారంకోసం వెచ్చించే నిధులకు ఆధికారికంగా గరిష్ఠ పరిమితి ఉంది, ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజకీయ పక్షాలు చేస్తున్న ఖర్చులకు మాత్రం గరిష్ఠ పరిమితి లేదు! అందువల్ల ఎన్నికల సందర్భంగా రాజకీయ పక్షాలు చేయగల ఖర్చులకు కూడ గరిష్ఠ పరిమితిని విధించాలన్నది ‘ఇసిఐ’కి నివేదితమైన అనేక ప్రతిపాదనలలో ఒకటి! ఎన్నికల ప్రక్రియను సంస్కరించడానికి వీలుగా అధ్యయనం చేయడానికై గత లోక్‌సభ ఎన్నికల తరువాత తొమ్మిది బృందాలు ఏర్పడినాయట! ‘ఎన్నికల సాధికార సంఘం’ నియమించిన ఈ తొమ్మిది బృందాలు కూలంకష అధ్యయనాలు జరిపిన తరువాత మొత్తం ఇరవై ఐదు సంస్కరణ ప్రతిపాదనలను నివేదించారట! ఈ ముసాయిదా ప్రతిపాదనల గురించి వివిధ వర్గాలవారు ఈనెల చివరి వరకు తమ అభిప్రాయాలను ‘ఇసిఐ’కి నివేదించవచ్చునట... పదిహేడు ఏళ్లు నిండిన యువజనులు తమ పేర్లను ‘అంతర్జాల’ మాధ్యమ ప్రసారం- ఆన్‌లైన్-ద్వారా ఎన్నికల ‘కమిషన్’వద్ద నమోదుచేసుకొనడానికి వీలుకల్పించాలన్నది ఒక ప్రధాన ప్రతిపాదన! ఇలా నమోదుచేసుకున్న వారికి పద్దెనిమిది ఏళ్లు నిండిన వెంటనే జాప్యంలేకుండా ‘మత ప్రదానపు’- వోటింగ్- హక్కు లభిస్తుందట!!
అన్నిటికంటె మిన్న అయిన ప్రతిపాదన రాజకీయ పక్షాలు చేస్తున్న ఎన్నికల వ్యయంపై గరిష్ఠ పరిమితిని విధించడం. జాతీయ రాజకీయ పక్షాలకు లభిస్తున్న విరాళాలలో అరవై ఏడు శాతాన్ని గుర్తుతెలియని గుప్తదాతలు సమర్పిస్తున్నారట! చేసింది చెబితే దాని ఫలితం నశించిపోతుందట! మంచి పనికి అయినా చెడు పనికి అయినా ఇదే సూత్రం వర్తిస్తుందన్నది భారతీయుల కర్మసిద్ధాంతం! అందువల్ల దానాలు, ప్రదానాలు గుప్తంగా చేయాలన్నది కర్మయోగుల విశ్వాసం! అందువల్ల అనాదిగా సమాజంలో అనేకానేక దాతలు కుడి చేతితో చేస్తున్న దానాన్ని ఎడమ చేతికి తెలియనీకుండా జాగ్రత్తపడినట్టు చరిత్ర... ఈ చరిత్రకెక్కినవారు కష్టార్జితమైన, శ్రమజీవన స్వేద జల ఫలాలను సమాజానికి సమర్పించారు, న్యాయమైన సొమ్మును దానంచేశారు. కానీ రాజకీయ పక్షాలకు రహస్యంగా విరాళాలను ప్రదానం చేస్తున్నవారు ఆదాయం పన్ను ఎగవేసి దాచిన అక్రమ ధనాన్ని సమర్పిస్తున్నట్టు ప్రచారవౌతోంది. ఏది ఏమయినప్పటికీ ఇరవై వేల రూపాయలు అంతకంటె తక్కువ విరాళాలను ప్రదానంచేసే వారి వివరాలను రాజకీయ పక్షాలవారు వెల్లడించనవసరం లేదన్నది ఎన్నికల ‘కమిషన్’వారి నిబంధన. అందువల్ల తమకు విరాళాలను ఇస్తున్న వారిలో కొందరి వివరాలను రాజకీయ పక్షాలు వెల్లడించక పోవడం నియమావళికి అనుగుణమైన వ్యవహారం. భారతీయ జనతాపార్టీకి గత ఏడాది దాదాపు పదహారు వందల పనె్నండు కోట్ల రూపాయల విరాళాలను గుప్తదాతలు సమర్పించారట. ‘కాంగ్రెస్’కు దాదాపు ఏడువందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల విరాళం ఈ రహస్య దాతల నుంచి వచ్చిందట! గత ఏడాది- 2018-2019వ ఆర్థిక సంవత్సరం- రాజకీయ పార్టీలకు మొత్తం దాదాపు మూడువేల ఏడువందల యాబయి కోట్ల రూపాయలు విరాళాలుగా లభించినట్టు ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్’- ఎడిఆర్- ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం-వారు కనిపెట్టారట! ఇందులో తొమ్మిది వందల యాబయి రెండు కోట్ల రూపాయల దాతల ఆచూకీ మాత్రమే వెల్లడయింది. చిన్న చిన్న రాజకీయ పక్షాలకు, ప్రాధాన్యం లేని పక్షాలకు విరాళాలు ప్రదానంచేస్తున్న ‘రహస్యదాత’ల కంటె ప్రాధాన్య జాతీయ పక్షాలకు సంబంధించిన ‘గుప్తదాతల’ శాతం చాలా ఎక్కువగా ఉన్నట్టు దీనివల్ల స్పష్టమైంది!
ఇలా అరవై ఏడు శాతం విరాళాలు ‘తెలియని’ వారినుంచి ముప్పయి మూడు శాతం ‘తెలిసిన’వారినుంచి రాజకీయ పక్షాలకు లభించడం ‘ప్రదాన ప్రక్రియ’లో సామాన్య ప్రజల విస్తృత భాగస్వామ్యానికి చిహ్నమన్న వాదనలు కూడ వినిపిస్తున్నాయి. అరవై ఏడు శాతం విరాళాలు ఇరవై వేల రూపాయలు, అంతకంటె తక్కువ మొత్తాలలో లభించాయన్నది రాజకీయ పక్షాలు చేయగల నిర్ధారణ! అంటే ఇలాంటి చిన్న విరాళాల సంఖ్య ఎంత ఎక్కువ అయితే సామాన్యుల సమర్ధన అంత ఎక్కువగా ఉందన్నది ‘నిర్ధారణ’. ఇలా గుర్తుతెలియనివారు అన్ని జాతీయ పక్షాలకు కలసి ప్రదానంచేసిన విరాళాల మొత్తం విరాళాలలో అరవై నాలుగు శాతం! ఇలా ‘గుర్తుతెలియని’ వ్యక్తుల విరాళాలలో అరవై నాలుగు శాతం భారతీయ జనతా పార్టీకి, ఇరవై తొమ్మిది శాతం కాంగ్రెస్‌కు దక్కాయట! అంటే ఏమిటి? భాజపాకు వచ్చిన విరాళాలలో అరవై నాలుగు శాతం ‘‘ఇరవై వేలు రూపాయల’’లోపు చిన్న మొత్తాలు! కాంగ్రెస్‌కు లభించిన ఇలాంటి చిన్న మొత్తాల విరాళాలు ఇరవై తొమ్మిది శాతం...
కానీ ఒక కోటి రూపాయల విరాళం ఇచ్చిన ‘ఘరానా దాత’పేరు బయటికి రాకుండా ఉంచడానికి కూడ ఈ విధానం దోహదం చేయగలదన్నది విమర్శకులు చెబుతున్న మాట! ఈ కోటి రూపాయలను ఐదువందల ‘‘ఇరవై వేల రూపాయల’’ చిన్న విరాళాలుగా విడగొట్టి చూపవచ్చు! కోటి, పది కోట్లు, వంద కోట్ల రూపాయల పెద్దమొత్తాలను సైతం ఇలా ‘‘విభజించి’’ స్వీకరించడం ద్వారా ‘దాత’ల పేర్లను గుప్తంగా ఉంచుకోవచ్చు! అందువల్ల విరాళాల వెల్లడికి ఉన్న ఈ కనిష్ట పరిమితిని, ‘రహస్య రక్షణ’కు కల ఈ గరిష్ఠ పరిమితిని తొలగించాలి! ఒక రూపాయి విరాళం ఇచ్చిన ప్రదాత వివరాలు సైతం రాజకీయ పక్షాలు వెల్లడించి తీరాలన్న నిబంధనను విధించాలి! రాజకీయ పక్షాల ఆర్థిక పారదర్శకతకు అది దోహదం చేయవచ్చు! కానీ రాజకీయ పక్షాలు తమకు లభించిన మొత్తం విరాళాల విలువను వెల్లడిస్తున్నాయా? అన్నది మరో సమస్య! లెక్కలలోనే చూపని విరాళాల శాతం ఎంత?? ఈ ‘లెక్క’ను ‘ఎన్నికల సాధికార సంఘం’ అంచనావేయలేదు... రాజకీయ పక్షాల నిర్వాహకుల నైతిక నిష్ఠ పెరగడం మాత్రమే కచ్చితమైన లెక్కలు వెల్లడి కావడానికి ఏకైక మార్గం...