సంపాదకీయం
సౌలభ్యం.. ఎవరికో??
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాణిజ్య పారిశ్రామిక ఆర్థిక ప్రగతి సూచికల తరుగుదల, పెరుగుదల ప్రాతిపదికగా నష్టాలను లాభాలను నిర్ధారించడానికి గొప్ప ఆర్భాటం జరుగుతోంది! వాణిజ్యపు వాటాల సూచికలు దేశ ఆర్థిక వ్యవస్థ సౌష్టవానికి ప్రతీకలుగా మారిపోయి ఉండడం తరతరాల వైపరీత్యం! ఆరోగ్య సూచికలు లేవు, ఆనంద సూచికలు ఊహకందవు. కొన్ని లక్షల మంది వాణిజ్యపు వాటాల యజమానులు- స్టాక్ హోల్డర్స్- లాభాల నష్టాల ప్రాతిపదికగా దేశ ఆర్థిక వ్యవస్థను, సార్వభౌమ పరపతి- సావరిన్ రేటింగ్-ని నిర్ధారించి ప్రగతిని విశే్లషిస్తున్నారు. ఎనబయి కోట్ల మందికి పైగా ఉన్న వ్యవసాయ యజమానుల, శ్రామికుల భూ జీవనుల నష్టాలను లాభాలను అంచనావేసి ప్రగతిని నిర్ధారించే ‘సూచికల’ వ్యవస్థ మాత్రం ఇంతవరకు ఏర్పడలేదు. నిర్వాహకులకు ఈ ధ్యాస లేదు! ఇప్పుడు ‘వ్యాపార సౌలభ్యం’ గురించి అంటే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘‘వ్యాపార సౌలభ్యం’’ మెరుగుపడిపోతోందన్నది హోరెత్తుతున్న ప్రచారం. ‘జీవన సౌలభ్యం’ - ఈజ్ ఆఫ్ లివింగ్- గురించి మాత్రం నిర్వాహకుల బుద్ధులకు స్ఫురించడం లేదు! స్ఫురించి ఉండినట్టయితే వాణిజ్యపు వాటాల యజమానుల- స్టాక్ హోల్డర్స్- ప్రయోజనాలకంటె అధికంగా వ్యవసాయ రంగంలోని ‘హక్కు’దారుల - స్టేక్ హోల్డర్స్- హితానికి విధానాలలో అధికతర ప్రాధాన్యం లభించి ఉండేది, మాధ్యమాలలో అధికతర ప్రచారం లభించి ఉండేది! ఫలానా బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ఫలానా కొత్తరకం శీతల పానీయాన్ని విపణి వీధిలోకి వదులుతోంది, ప్రజలను దోపిడీ చేయడానికి దుకాణాలను అతిపెద్ద ఉత్పాదక ప్రాంగణాలను తెరుస్తోంది... ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఎక్కువ. ఇలా విదేశీయ సంస్థల ‘ఉత్పత్తి’కేంద్రాలకు మంత్రులు ప్రారంభోత్సవాలు చేస్తారు, ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు ఈ ‘దోపిడీ’ సంస్థల యజమానుల పక్కన నిలబడి చిఱునవ్వులు చిందిస్తారు... కరచాలన విన్యాసాలను ప్రదర్శిస్తారు! ‘కరోనా’ జబ్బు భయంతో ఇప్పుడు కరచాలనాలను నిషేధించారట! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు ఐర్లాండు ప్రధాని లియోవరాడ్‌కర్‌ను చేతులు జోడించి పలుకరించాడట. చేతులు కలపలేదు ఇది వేఱుకథ... కానీ ఫలానా జిల్లాలోని ఫలానా పల్లెలో రైతులు మొత్తం భూమిలో సేంద్రియ వ్యవసాయం చేసి పండించారు... ఇలాంటి వాటికి ప్రాధాన్యం లేదు, ప్రచారం లేదు... అక్కడికి మంత్రి వెళ్లి పంటను కోయడు... ఏరువాక ఉత్సవానికి ప్రముఖులు వెళ్లరు! వాణిజ్య సౌలభ్యం పెరుగుతోంది, జీవన సౌలభ్యం వాణిజ్య సౌలభ్య కబంధ బంధంలో ఇరుక్కొని విలవిలలాడుతోంది... నగరాలలో ‘ఉబర్’ ‘ఓలా’ సంస్థలు మన ప్రయాణాలను నిర్దేశిస్తున్నాయి, దూరవాణి, సంచారవాణి, లావణ్యవాణి సంస్థలు మన అవసరాలను నియంత్రిస్తున్నాయి!!
కరోనా జాడ్యంవల్ల ‘వాటా’ల విలువలు పడిపోయాయట... దశాబ్ది కాలంలోనో, శతాబ్దికాలంలోనో ఇంత భయంకర పాతాళ పతనం ఎప్పుడూ చెందలేదట! పనె్నండు లేదా పదిహేను వందల సంస్థలకు- ఘరానా వాణిజ్య సంస్థలకు- గొప్ప పారిశ్రామిక సంస్థలకు- మొత్తం ఎంత నష్టం వాటిల్లినదీ లెక్కలువేసి చెబుతున్నారు, విడివిడిగా ఏ సంస్థకు ఎంత నష్టమన్నది తెలుసుకోవడం ‘సాధారణ పరిజ్ఞాన’- జనరల్ నాలెడ్జ్-పు పోటీకి ప్రాతిపదికగా మారింది! కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు ‘్భవిష్య నిధి’లో జమచేస్తున్న పొదుపు మొత్తాలపై ప్రభుత్వం చెల్లించే వడ్డీని తగ్గించేశారు, తగ్గించేస్తున్నారు, తగ్గించబోతున్నారు. ‘ఉద్యోగుల భవిష్యనిధి’- ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్-పై ప్రభుత్వం పదకొండు శాతం వడ్డీని చెల్లించడం గతం, ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ వడ్డీ శాతం తగ్గి తగ్గి ఇప్పుడు ‘రసాతల’ పతనమైంది. ‘రసాతలం’ పాతాళానికి పై లోకం... ఈ ‘వడ్డీ’ త్వరలో పాతాళ పతనం కావచ్చు! కానీ దీనికి ప్రాధాన్యం లేదు. దశాబ్దుల తరబడి ఇలా వడ్డీ శాతం తగ్గినందువల్ల నిరుపేద, మధ్యతరగతి వారైన ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత నష్టం వాటిల్లినదీ చెప్పగల ‘సూచికలు’లేవు. ‘వాటాల విపణి’ - స్టాక్ మార్కెట్- గురించి ఆర్భాటం చేస్తున్నవారికి ఈ ‘ఉద్యోగుల భవిష్యనిధి’ వడ్డీల పతనం ధ్యాస లేదు... ఇది ‘‘పరిజ్ఞానపు పోటీ’’కి ప్రాతిపదిక కాజాలదు... సామాన్య జన సమాహారమైన సమాజం కేంద్ర బిందువు కావడం లేదు. ఈ సమాజాన్ని వంచనకు గురిచేస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య’ బకాసురుడు కేంద్ర బిందువు! ‘ప్రపంచీకరణ’ నిర్దేశిస్తున్న ప్రగతి గతికి ఇదీ ఇతివృత్తం!
ఈ ఇతివృత్తం పరిధిలో ప్రభుత్వాల విధానాలు, కార్యక్రమాలు, నీతులు, రీతులు ఇరుక్కొని ఉన్నాయి! పెట్టుబడులు పెరగడానికి దోహదంచేస్తున్న ఏకైక కార్యక్రమం ‘బ్యాంకుల’ వడ్డీ తగ్గిపోవడం. ఇందుకు విపరీతంగా ద్రవ్యోల్బణాన్ని ధరలను తగ్గించడానికి వీలైన ఏకైక ప్రత్యామ్నాయం ‘బ్యాంకుల’ వడ్డీ పెరగడం. బ్యాంకుల ‘వడ్డీలు’ తగ్గితే పెట్టుబడులు పెరగడం బాగుంది. సమాంతరంగా ధరలు ద్రవ్యోల్బణం పెరిగి మధ్యతరగతి ప్రజల నడుం విరుగుతుంది! ‘వడ్డీలు’ పెరిగితే ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతాయట, కానీ సమాంతరంగా పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తులు, వీటి ప్రాతిపదికగా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్- జిడిపి-కూడ తగ్గిపోతాయట! ‘‘పెళ్లికుదిరితే పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే పెళ్లి కుదరదు’’అన్న కొత్త లోకోక్తికి ఇదీ ప్రాతిపదిక!! పైగా అంతర్జాతీయ స్థాయి ఆర్థిక సిద్ధాంతమట! పెట్టుబడులు తగ్గని రీతిలో, ఉత్పత్తులు, ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ తగ్గని రీతిలో ధరలను ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయగల సంతులన ఆర్థిక వ్యూహం ఇంతవరకు ‘రచన’కు నోచుకోలేదు. అందువల్ల దశాబ్దుల తరబడి ఇదే ఆర్థిక వ్యూహం నడుస్తోంది. పెట్టుబడులు పెరుగుతాయన్న వ్యామోహంతోనే ‘రిజర్వ్ బ్యాంక్’వారు, కేంద్ర ప్రభుత్వంవారు ఒకే సంవత్సరంలో బ్యాంకుల ‘వడ్డీల’ను- రిజర్వ్ బ్యాంక్‌వారు వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీలను, వాణిజ్య బ్యాంకులు ‘రిజర్వ్ బ్యాంక్’వారికి చెల్లించే వడ్డీలను- ఐదారుసార్లు తగ్గించేశారు. వ్రతం చెడిన ఫలితం దక్కిందో లేదో కాని ధరలు, ద్రవ్యోల్బణం మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంటే ‘వడ్డీలు’ తగ్గినందువల్ల ‘జిడిపి’వేగవంతం అయిందా? లేదా? అన్నది తేలలేదు!! ఐదు ‘ట్రిలియన్’ అమెరికా డాలర్ల-మూడు కోట్ల యాబయి లక్షల కోట్ల రూపాయల- ఆర్థిక వ్యవస్థను సాధించే ప్రక్రియలో ప్రధాన అంశం వడ్డీలు తగ్గడం...
వడ్డీలు తగ్గడంవల్ల లక్షల మంది పెట్టుబడిదారులకు తక్కువ వడ్డీలపై బ్యాంకుల ఋణాలు లభించవచ్చు! కానీ ‘బ్యాంకుల’లో చిన్న మొత్తాలను స్వల్పకాల వ్యవధి, దీర్ఘకాల వ్యవధి- టైమ్ బౌండ్ ఫిక్సిడ్- ప్రాతిపదికపై జమచేసిన కోట్ల మంది ఖాతాదారులు నష్టపోతున్నారు. వారికి బ్యాంకులు చెల్లిస్తున్న ‘వడ్డీ’ల శాతం నానాటికీ తగ్గిపోతోంది. లక్షల పెట్టుబడిదారుల ప్రయోజనాలు కోట్ల సంఖ్యలో ఖాతాదారుల హితానికి విఘాతంగా పరిణమిస్తుండడం ఆర్థిక వ్యవస్థలో నిహితమై ఉన్న వైరుధ్యం?? ఎవరికి సౌలభ్యం?