సంపాదకీయం

సమన్వయమే శరణ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ఉగ్రవాదం వెర్రితలలు వేస్తోంది. ఓర్లాండో, ప్యారిస్ నుంచి ఇస్తాంబుల్, ఢాకా వరకూ ఏ నగరానికీ నిర్భయంగా మనుగడ సాగించగలిగే పరిస్థితులు కనుమరుగే! ఎప్పుడు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంపై, ఎలాంటి నగరంపై ఉగ్రవాదులు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి మరింతగా కలవర పెట్టేదే..నిన్న అల్ ఖైదా, నేడు ఐసిస్..పేరేదైనా వాటి వాదం ఉగ్రవాదం. అరాచక వాదం. శాంతిని కబళించి మానవత్వానికి పాతరేసే అమానుష, అనాగరిక విధానం. ఢాకాలో తాజాగా జరిగిన భయానక ఊచకోత ప్రపంచ దేశాలన్నింటినీ కల్లోల పరిచింది. వరుసగా గత పది రోజులుగా ఐసిస్ మారణకాండ సాగించని రోజులేదు. నిన్నమొన్నటి వరకూ మధ్యప్రాచ్యానికే పరిమితమైందనుకున్న ఐసిస్ మహాభూతం ఇప్పుడు ప్రపంచం నలుమూలలకూ విస్తరిస్తోందని చెప్పడానికి ఢాకా మారణకాండ నిదర్శనం. అల్‌ఖైదాకంటే శక్తిలోనూ, యుక్తిలోనూ, ఆర్థిక వనరుల విషయంలోనూ మెరుగైన స్థితిలో ఉన్నట్టుగా చెబుతున్న ఐసిస్ తన విధ్వంసక, అమానుష సిద్ధాంతాలను పరివ్యాప్తం చేసుకుంటోందని చెప్పడానికి వేల సంఖ్యలో దాని సానుభూతిపరులు ప్రపంచ మంతా విస్తరించడమే తార్కాణం. మొదటి నుంచి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఉగ్రవాదం వేళ్లూనుతున్నప్పటికీ ఇంతగా అంతర్జాతీయంగా అలజడి రేకెత్తించే పరిస్థితి ఎన్నడూ తలెత్తలేదు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్‌ఖైదా జరిపిన భయానక దాడి నేపథ్యంలోనే దాని అసలు రూపం వెల్లడైంది. 9/11గా పేర్కొంటున్న ఆ దాడి నేపథ్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదానే్న తుదముట్తిస్తామని అమెరికా ఇటు ఇరాక్‌పైనా, అటు అఫ్గాన్‌పైనా ఏకకాలంలో దండెత్తింది. అల్‌ఖైదా అధినేత బిన్‌లాడెన్ అంతమైనా..దాని ఆవశేష వర్గాల నుంచే ఇరాక్‌లో ఐసిస్ పుట్టుకొచ్చింది. ఇరాక్, సిరియా ప్రాంతాలను తన గుప్పిట పట్టి ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే మొదట్లో లక్ష్యగా పెట్టుకున్నప్పటికీ దీని ప్రభావం ఇతర దేశాలకూ విస్తరించింది. ఇది అన్ని దేశాలనూ ఆందోళనకు గురిచేసే పరిణామం. బంగ్లాదేశ్‌పై జరిగిన ఐసిస్ దాడి భారత్ సహా దాని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలకూ హెచ్చరిక లాంటిదే.
బంగ్లాలో ఎక్కువగా ఉన్నది సున్నీ ముస్లింలే కావడం వల్ల ఐసిస్ తన సిద్ధాంతాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది తోడ్పడింది. ఇరాక్, సిరియాల్లో తన ఉనికికే ప్రమాదం వాటిల్లడంతో అన్ని విధాలుగా బలహీనంగా ఉన్న దేశాలపై ఐసిస్ దృష్టి పెట్టింది. అంతర్జాతీయంగా ఎలాంటి చర్యలు చేపట్టినా, ఎంతగా మిలిటెంట్లను హతమారుస్తున్నా ఐసిస్ ఊహించని చోట తన ఉనికిని చాటుకుంటోందంటే..ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను, పద్ధతులను వెతుక్కుంటోందన్నమాట. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఉన్న ప్రజలందరూ సున్నీ ముస్లింలే కావడం, అందులోనూ ఎలాంటి ప్రలోభాలకైనా లోబడే అవకాశం ఉన్న వయసులో ఉన్నవారు కావడం వల్ల ఐసిస్ త్వరితగతిన అక్కడ వేళ్లూనడానికి ఆస్కారం ఏర్పడింది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ నిఘా సంస్థలు ఐసిస్ కదలికలపై దృష్టి పెట్టడమే కాకుండా ఏయే దేశాల్లో అది తన కేంద్రాల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందో కూడా నిర్ధారించగలిగాయి. ఆ కోణంలోనే అంతర్జాతీయ హెచ్చరికల్ని తరచూ జారీ చేయడం జరుగుతోంది. అయినప్పటికీ సైనిక దాడులతోనో, వైమానిక దాడులతోనో ఏరివేయడానికి వీల్లేని ప్రాంతాల్లోనే ఐసిస్ పాగా వేయడానికి కారణం స్థానికంగా దానికి లభిస్తున్న మద్దతేనన్నది నిజం. ఇవాళ బంగ్లాదేశ్‌పై దాడి చేసిన ఐసిస్ రేపు మరో సంపన్న దేశంలోని పట్టణాలపైనా విరుచుకు పడే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద ముప్పు తీవ్రత దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఉందన్నది వాస్తవం. తమదాకా వచ్చే వరకూ చేతులు ముడుచుకు కూర్చోవడం వల్ల దాడి అవకాశాల్ని తీవ్రం చేయడమే అవుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఉగ్రవాదమే. దాని లక్ష్యం, ఆశయం మానవ విలువల్ని హరించి రక్తపాతం సృష్టించడమేనన్న నిజాన్ని ఎంత త్వరితగతిన ప్రపంచ దేశాలు గ్రహిస్తే అంత మంచిది. ప్రపంచ శాంతికి సంబంధించిన ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏ ఒక్క దేశం తనంతట తానుగా విజయం సాధించే అవకాశం ఉండదు. ఇందుకు ఉమ్మడి శక్తి అవసరం. ఢాకాపై జరిగిన దాడి ఉగ్రవాద నిరోధం, నివారణ విషయంలో ప్రపంచ దేశాలన్ని సంఘటితంగా పనిచేయాల్సిన అవసరాన్ని మరోసారి చాటిచెప్పింది.
ముఖ్యంగా మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు కావడం వల్ల ఇతర దేశాల్లో ఉంటున్న తమ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకునైనా ప్రపంచ దేశాలు ఉగ్రవాద నిరోధానికి ఉమ్మడిగా కృషి చేయాలి. తమ ప్రయత్నాలను సంఘటిత పరచడం ద్వారా ఈ జాడ్యం ఏ రూపంలో ఉన్నా, ఏ మూలన ఉన్నా..దాని మూలాలు ఛేదించగలగాలి. ఇందుకు ధనిక పేద అన్న తేడా లేకుండా దేశాల మధ్య పరిపూర్ణ రీతిలో, చిత్తశుద్ధితో పరస్పర సహకారం పెంపొందడమొక్కటే మార్గం. ఉగ్రవాదానికి సంబంధించి స్పష్టమైన రీతిలో అంతర్జాతీయంగా నిర్వచించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పటివరకూ కూడా ఇతర దేశాల్లో కల్లోలాల్ని సృష్టించేందుకు ప్రయత్నించిన దేశాలన్నీ ఈ మహమ్మారి విషయంలో ద్వంద్వ వైఖరినే అవలంబించాయి. దాని వల్లే అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారానికి ఆస్కారం లేకుండా పోయింది. ముఖ్యంగా మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ధోరణి ఇందుకు ప్రబల నిదర్శనం. ఓ పక్క దేశీయంగా తీవ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్‌లో హింస, విధ్వంసకాండల్ని ప్రేరేపించేందుకు తమ దేశంలోనే ఉగ్రవాదులకు స్థావరాలు కల్పించింది. తమ దేశాన్ని కేంద్రంగా చేసుకుని భారత్‌పై ఉగ్రవాద దాడులు చేసే వారిని తరిమికొడతామంటూ పాక్ చెబుతున్నా.. మొన్న ముంబయిపై దాడి, నిన్న పఠాన్‌కోట్‌పై ముష్కర మూకలు తెగబడటం ఆ దేశ రెండు నాల్కల తీరుకు దర్పణం. ఉగ్రవాదం పెరట్లో పెంచే కాలనాగు లాంటిదేనన్న అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ మాటల్ని పాక్ చెవికెక్కించుకోవాలి. ఇతరుల్ని కాటేయడానికే కాదు..దాన్ని పెంచి పోషిస్తున్న వారికీ దీని వల్ల ముప్పేనన్న వాస్తవాన్ని ఒక్క పాకిస్తానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రహించాలి. భారత ప్రధాని మోదీ పేర్కొన్నట్టుగా ఉగ్రవాదాన్ని ఏరివేయాలంటే అన్ని దేశాల్లోనూ దీనికి వ్యతిరేకంగా సంఘటిత ప్రయత్నం బలోపేతం కావాలి. అన్ని దేశాలూ అంతర్జాతీయ నియమ నిబంధనలు, ప్రమాణాలను త్రికరణ శుద్ధిగా పాటించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఐరాస నేతృత్వంలోనే ఇందుకు తొలి అడుగు పడాలి. అప్పటి వరకూ ఉగ్రవాదులు ఏదోవిధంగా ఎక్కడో అక్కడ ఆశ్రయం పొందుతూనే ఉంటారు. భారత్ వంటి దేశాలు ఇప్పటికే ఉగ్రవాదం వల్ల ఎంతగానో నష్టపోయాయి. ఇదే పరిస్థితి అన్ని దేశాలకూ క్రమంగా దాపురిస్తుందనడంలోనూ ఎలాంటి సందేహం లేదు. చిత్తశుద్ధి, సమన్వయం, నిర్ద్వంద్వ విధానాలతోనే ఐసిస్ ఆగడాల్ని అరికట్ట గలుగుతాం. ఇందుకు మరో మార్గం లేదన్న పరమసత్యాన్ని విస్మరిస్తే..వినాశనమే..!