సంపాదకీయం

‘సారం’ తగ్గిన సేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని దాదాపు మూడవ వంతు భూభాగం నిర్జీవమై పోయిందని, పోతోందని నిగ్గుతేలడం పాలకులకు పాలితులకు ఆందోళన కలిగించవలసిన విపరిణామం! దేశంలోని కనీసం మూడవ వంతు భూభాగం అడవులతో ఆకుపచ్చని అందాలతో, ప్రాకృతిక పరిమళాలతో పరిపుష్టం కావాలన్నది అంతర్జాతీయ ఆదర్శం! ఈ ఆదర్శం మనదేశంలో దశాబ్దులకు పూర్వమే వమ్మయిపోయింది. మొత్తం భూమిలో నాలుగవ వంతు కూడ అటవీ మయమయి లేదు. పారిశ్రామిక ప్రగతిని పెంచడానికి ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వాలు అటవీ వైశాల్యాన్ని పెంచడం గురించి మాత్రం పట్టించుకోవడం. తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పట్టించుకోవడం అపవాదం! -ఎక్సెప్షన్-! హరితహారం విజయవంతం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనైనా మూడవవంతు భూభాగం అటవీ భరితం కాగలదన్నది అనుమానమే! కానీ మొత్తం దేశంలోని భూ సంపదలో మూడవ వంతు నష్టమైపోతుండడం భవిష్యత్ జాతీయ జీవన ప్రమాద ఘంటిక! భారతీయ అంతరిక్ష పరిశోధక సంస్థ-ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ఇస్రో-ఈ ప్రమాద ఘంటికను మోగించింది. దేశంలోని ముప్పయి శాతం భూమి నిస్సారమై నిర్జీవంగా ఎడారిగా మారిపోతోందన్నది ఇస్రో ఇటీవల విడుదల చేసిన పరిశోధన పత్రంలోని ప్రధానమైన అంశం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారి పర్యవేక్షణలో జరిగిన ఈ పరిశోధక అధ్యయన కార్యక్రమంలో ఇస్రోకు మరో పంతొమ్మిది ప్రభుత్వ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కూడ సహకరించాయట! మన దేశపు మొత్తం భూమి విస్తీర్ణం దాదాపు ముప్పయి మూడు లక్షల చదరపు కిలోమీటర్లు, దాదాపు పనె్నండు లక్షల చదరపు కిలోమీటర్ల భూమి పాడయిపోయిందన్నది ఇస్రో నిగ్గుతేల్చిన నిజం. భూసారం నష్టం కావడం, వ్యవసాయ సీమలు చవిటి పర్రలుగా ఉప్పుకయ్యలుగా మారడం, మారుతుండడం, వేలాది చదరపు మైళ్లు మొక్క మొలవని ఊసర సీమలుగా, ఎడారులుగా మారడం త్వరలో మారనుండడం వంటివి భూమి పాడయిపోవడంలోని వివిధ దశలు. కొన్ని లక్షల హెక్టారుల భూమి నిర్జీవం కాగా, మరికొన్ని లక్షల ఎకరాలు ఎడారులయిపోయాయట! చదరపు కిలోమీటరునకు వంద హెక్టారుల చొప్పున దేశంలో దాదాపు ముప్పయి మూడు కోట్ల హెక్టారుల భూమి ఉంది. అంటే దాదాపు ఎనబయి మూడు కోట్ల ఎకరాలు! 2013వ సంవత్సరానికి పూర్వం పదేళ్లలోనే దాదాపు పనె్నండు లక్షల హెక్టారుల భూమి నిర్జీవకరణ-డెసర్ట్ఫికేషన్-కు గురి అయిందట. 2013 నాటికి సారవిహీనత-డిగ్రెడేషన్-కు గురి అయిన భూమి పరిమాణం రెండు కోట్ల తొంబయి మూడు లక్షల హెక్టారులు, నిర్జీవకరణం చెందుతున్న భూమి విస్తీర్ణం ఎనిమిది కోట్ల ఇరవై ఏడు లక్షల హెక్టారులు...
ఇలా ప్రగతి భ్రాంతి వాస్తవ ప్రగతిని దిగమింగుతోంది, పారిశ్రామిక ప్రగతి పేరుతో పచ్చని పంట భూములు పాడయిపోతుండడం నడచిపోతున్న నడమంత్రం...పర్యావరణ పరిరక్షణకు భూమిని పరిరక్షించడం వౌలికమైనది! భూమి సారవంతమై ఉన్నప్పుడు మాత్రమే విత్తనం మొలకెత్తుతుంది, మొక్క మహావృక్షంగా ఎదుగుతుంది. ఇలా మొక్కలు మహా వృక్షాలుగా ఎదుగుతున్న ప్రక్రియ అనాదిగా భూమిని రక్షిస్తోంది. మహావృక్షాలు నిండిన అడవులు నీటి ప్రవాహాల ద్వారా భూసారం కొట్టుకుని పోకుండా నిరోధిస్తున్నాయి. కొట్టుకుని పోతున్న భూసారానికి దీటుగా కొత్తసారాన్ని మట్టిని సృష్టించగలుగుతున్నది కూడ మొక్కలు, వృక్షాలు మాత్రమే! అడవులు అంతరించడం, భూసారం నష్టం కావడం, ఆ ప్రాంతాలు వర్షమేఘాలను ఆకర్షించలేకపోవడం, క్రమంగా వర్షాభావం నెలకొని పచ్చదనం లేని ప్రాంతాలు ఎడారులుగా మారడం భూహనన ప్రక్రియలోని వివిధ దశలు. ఇలా ఎడారులుగా మరు భూమి సమప్రాంతాలుగా మారిన ప్రాంతాలలో మొక్కలు నాటి పెంచడం దాదాపు అసాధ్యం. వేళ్లు లోపలికి దిగకుండా పైకి పొడుచుకుని వస్తున్నాయి. అందువల్ల మొక్క ఎక్కువ కాలం ఎదగదు జీవించదు. అందువల్ల అలాంటి ఊసర క్షేత్రాలను మొదట సారవంతమైన మట్టితో నింపి ఆ తరువాత మొక్కలు నాటాలి! కానీ సారవంతమైన మన్ను ఏదీ? కృత్రిమ రసాయనపు ఎరువులను దశాబ్దుల పాటు వాడడం వల్ల భూమి మొత్తం నిర్జీవమైపోతోంది, నిరంతరం భూమిని పరిపుష్టం చేయగల వానపాములు పారిపోతున్నాయి...
సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించడం ద్వారా మాత్రమే భూమి మళ్లీ సారవంతం కాగలదు. కానీ ఈ దిశలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానం నత్తల నడకతో పోటీపడుతోంది. అందువల్లనే ప్రతి ఏటా ముప్పయి ఆరు లక్షల హెక్టారుల భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతోంది! అంతే విస్తీర్ణం కల పనికిరాని భూమిని పునర్‌జీవవంతం - రిక్లెయిమింగ్ - చేయగలిగినట్టయితే భవిష్యత్తులో యథాతథ స్థితి అయినా కొనసాగుతుంది. నిజానికి యథాతథ స్థితి కొనసాగినందువల్ల ప్రయోజనం లేదు. పనికిరాని పాడయిన భూమి ముప్పయి శాతం ఉండడం యథాతథ స్థితి. ఈ ముప్పయి శాతాన్ని క్రమంగా పాతిక శాతానికి పదిహేను శాతానికి, పది శాతానికి, ఐదు శాతానికి, సున్నా శాతానికి తగ్గించగలిగినప్పుడే మళ్లీ అన్ని వ్యవసాయ ఉత్పత్తులను మనం ఎగుమతి చేయగలం. అవసరమైన కందిపప్పు తదితర పప్పు ధాన్యాలలో సగం కంటె ఎక్కువగా దిగుమతి చేసుకోవలసి రావడం మనదేశ వ్యవసాయ చరిత్రకు తీరని కళంకం. సహస్రాబ్దుల పాటు ఆహార ఉత్పత్తులు నిండిన ఓడలు ప్రపంచంలోని ఇతర దేశాలకు నిరంతరం పయనించాయి. ఈ చరిత్రను బ్రిటన్ దురాక్రమణదారులు చెరచిపోవడం మన భూమి పాడుపడిపోతుండడానికి శ్రీకారం...రెండు ప్రపంచ యుద్ధ సమయాలలోను అడవులను నరికివేసి కలపను తరలించుకుని పోయిన బ్రిటన్ మన భూసార పరిరక్షణకు గండి కొట్టింది! ప్రస్తుతం ప్రపంచీకరణ ఫలితంగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ప్రత్యేక ఆర్థిక మండలాలు-స్పెషల్ ఎకనామిక్ జోన్స్-సెజ్‌లు-మన భూమిని కాలుష్యంతో కాటేస్తున్నాయి!
భూమిని నిరంతరం దున్ని సారవంతం చేస్తున్న వానపాములు భూగర్భంలో జీవిస్తున్నాయి. కృత్రిమ రసాయనాల కాలుష్యపు వాసనలను భరించలేని ఈ ఎర్రలు ముప్పయి అడుగుల లోతునకు వెళ్లి అక్కడ జీవిస్తున్నాయట! శాస్తవ్రేత్తలు తేల్చిన ప్రాకృతిక వాస్తవమిది. అందువల్ల వానపాములు దున్నని పై భాగపు భూగర్భం సహజ పరిపుష్టికి నోచుకోవడం లేదు, క్రమంగా సారహీనమైపోయింది. ఈ కృత్రిమ రసాయనపు ఎరువులను మందులను వాడడం మాని, పేడ, పచ్చి ఆకులు, గోమూత్రం, మన్ను వంటి వాటితో తయారయిన ఎరువులను వాడుతున్న భూమి మళ్లీ సారవంతం అవుతోంది. ఆవుపేడ, మూత్రం వాసనలు వానపాములకు మహా ఇష్టం. అందువల్ల లోతులలో దాగిన వానపాములు బిలబిలమంటూ గుంపులుగా పైకి వచ్చేస్తున్నాయి, భూమిని మళ్లీ సారవంతం చేస్తున్నాయి. అందువల్ల సంప్రదాయ సేంద్రీయ వ్యవసాయం భూసార పరిరక్షణకు ఏకైక మార్గం...