సంపాదకీయం

వాల్‌మార్ట్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశాలకు చెందిన చిల్లర దోపిడీ సంస్థలను దేశం నుండి వెళ్లగొట్టే వ్యవహారంలో వాగ్దాన భంగం చేయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వారు మాజీ ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్‌కు ఘన గౌరవాన్ని ప్రదానం చేస్తున్నారు. వాల్ మార్ట్ వంటి విదేశీయ సంస్థలు చిల్లర వ్యాపారంలోకి చొరబడకుండా నిరోధిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతాపార్టీ వారు అత్యంత ఆర్భాటంగా ప్రచారం చేశారు. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడ భాజపా ఈ మేరకు వాగ్దానం చేసింది. ఎట్టి పరిస్థితుల లోను వాల్‌మార్ట్ అన్న అమెరికా సంస్థ వారి చిల్లర దుకాణాలను తెరవనివ్వబోమని 2012లో ప్రతిపక్ష నాయకురాలు సుషమా స్వరాజ్ లోక్‌సభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ చరిత్ర పుటల్లో నమోదై ఉంది. 2014 మే 26నుండి కేంద్ర ప్రభుత్వ అధికార పక్షంగా మారిన భాజపాకు ఈ ప్రతిజ్ఞ గుర్తులేదు, గుర్తు లేదా? లేక గుర్తు లేనట్టు కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు అభినయిస్తున్నారా? అన్నవి సమాధానం లేని ప్రశ్నలు. కానీ వాల్‌మార్ట్ అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ విషయంలో కేంద్ర ప్రభుత్వం వారు వ్యూహాత్మక వౌనం వహిస్తున్నారన్నది స్పష్టం. అమెరికా ప్రభుత్వం వారి ఒత్తడికి లొంగిన మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం 2012లో వాల్‌మార్ట్ సంస్థను అధికారికంగా చిల్లర వ్యాపారంలోకి ప్రవేశ పెట్టింది. లక్షల స్వదేశీయుల చిల్లర దుకాణాలు క్రమంగామూతపడి పోవడానికి మార్గా న్ని సుగమం చేసింది. ఆటో రిక్షాలు వచ్చిన తరువాత గుర్రపు బగ్గీలు, గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు, రవాణాకు ఉపయోగపడే గాడిదలు అంతరించినట్టు వాల్‌మార్ట్, క్యారీఫోర్ వంటి విదేశీయ సంస్థలు చిల్లర దుకాణాలను ఆధునిక పద్ధతిలో తెరచిన తరువాత మాంథాత కాలం నాటి మన చిల్లర దుకాణాలు మూతపడిపోవలసిందేనని మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం వారు పరిణామక్రమాన్ని వివరించారు కూడ. ఆవిధంగా భారతీయుల చిల్లర దుకాణాలు అంతరించి పోవడానికి అర్హమైన వ్యవస్థలుగా చిత్రీకరించడం ద్వారా మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం స్వదేశీయతను అవమానించింది. వాల్‌మార్ట్ వంటి విదేశీయ సంస్థల తళుకు బెళుకుల పోటీని తట్టుకోలేక, తమ దుకాణాలను మూసుకొనే చిల్లర వ్యాపారులు చిట్టిపొట్టి సంచార వ్యాపారులు ఏం చేయాలి? విదేశీయుల ‘మెగా’ దగా చిల్లర వ్యాపార ప్రాంగణాలలో కూలీలుగా చేరిపోవాలి. అదీ మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం వారి ప్రపంచీకరణ వాణిజ్య స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని నిలబెట్టడానికి ఇరవై నెలలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వారు కృషి చేస్తున్నట్టు స్పష్టమైంది. ఈ ప్రభుత్వం వారి వ్యూహాత్మక వౌనం ఇందుకు సాక్ష్యం. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వాల్‌మార్ట్ వంటి దోపిడీ సంస్థల విస్తరణకు రంగాలను సిద్ధం చేస్తుండడానికి కేంద్ర ప్రభుత్వం వారి ఈ వ్యూహాత్మక వౌనం వాణిజ్య నేపథ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్‌మార్ట్ విస్తరణకు తలుపులను బార్లా తెరవడం మంగళవారం నాటి విపరిణామం...
హైదరాబాద్‌లోను ఇతర చోట్ల ఇప్పటికే వాల్‌మార్ట్ వారి చిల్లర దుకాణాలు వెలసి ఉన్నాయి. వీటికి తోడు తెలంగాణలో మరిన్ని తమ దుకాణాలను ఏర్పాటు చేసుకొనడానికి వీలుగా మంగళవారం నాడు వాల్‌మార్ట్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారట. మూడు వాణిజ్య అవగాహన పత్రాలపై వాల్‌మార్ట్ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారట. వాల్‌మార్ట్ వంటి విదేశీయ సంస్థల రాక్షస-జెయింట్-వాణిజ్య ప్రాంగణాలు వెలసిన ప్రతిచోటా దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న చిల్లర దుకాణాలు మూతపడటం చరిత్ర. అందువల్ల మరిన్ని చిల్లర దుకాణాలు మూతపడడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ వాల్‌మార్ట్ ద్వారా రంగం సిద్ధం చేస్తోంది. వాల్‌మార్ట్ వాణిజ్య అవినీతికి ప్రతిరూపమన్న ప్రచారం ప్రపంచమంతటా జరుగుతోంది. అనేక దేశాలలో వాల్‌మార్ట్ దుకాణాలను మూసి వేయించడానికై ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సంగతి తెలియనట్లు తెలంగాణ ప్రభుత్వం వాల్‌మార్ట్ విస్తరణకు అంగీకరించడం మిక్కిలి శోచనీయం. ప్రపంచీకరణ వాణిజ్య మాయా మారీచ మృగం కల్పించిన కృత్రిమ సువర్ణజాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు చిక్కుకొని ఉన్నాయనడానికి వాల్‌మార్ట్ విస్తరణ మరో ఉదాహరణ...
ఇప్పుడు వాల్‌మార్ట్ వారు దుకాణాలను తెరవడం మాత్రమే కాక వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ రంగాన్ని కూడ కబ్జా చేయడానికి వీలు ఏర్పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు వాల్‌మార్ట్ వారు మహిళలతో చిల్లర దుకాణాలను ఏర్పాటు చేస్తారట. మన మహిళా వ్యాపారులు చిల్లర దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి వాల్‌మార్ట్ వారి మెహర్భానీ ఎందుకు? చిల్లర దుకాణాలు ఏర్పాటు చేసుకునే కనీసం పరిజ్ఞానం కూడ మన మహిళలకు లేదా? కూరగాయలు పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పంపిణీ చేయడంలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలకు ఈ వాల్‌మార్ట్ దోపిడీ సంస్థ వారు సహకరిస్తారట. తెలంగాణ ప్రభుత్వ సంస్థలు వాల్‌మార్ట్ మార్గ దర్శనం లేకుండా పంపిణీ చేయలేవా? ఇలా మార్గదర్శనం చేయగల స్వదేశీయ వాణిజ్య సంస్థలు లేవా? ప్రపంచ వ్యాప్తంగా చిల్లర వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఈ వాల్‌మార్ట్! చిల్లర దుకాణాలను తెరవడం ద్వారా జనాన్ని ప్రధానంగా వర్ధమాన దేశాలలోని వినియోగదారులను దోచుకున్న కీర్తి ప్రతిష్టలను వాల్‌మార్ట్ ఇది వరకే మూట కట్టుకొని ఉంది. ఇప్పుడు పంపిణీ రంగాన్ని కబ్జా చేయడం ద్వారా వర్ధమాన దేశాలు వ్యవసాయ రంగంలోకి చొరబడిపోవడం వాల్‌మార్ట్ లక్ష్యం. ఇలా నిరంతరం విస్తరించి పోవడానికి వీలుగా మనదేశంతో సహా దాదాపు అన్ని దేశాలలోను వాల్‌మార్ట్ వారు లక్షల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారని అమెరికా కాంగ్రెస్-పార్లమెంట్-వారే నిర్ధారించిన వాస్తవం. 2012లో మనదేశంలోని బహుళ వస్తువుల చిల్లర వ్యాపారంలోకి చొరబాటునకు అనుమతిని వాల్‌మార్ట్ పొందగలిగింది. అంతకు పూర్వం ఆ తరువాత కూడ వాల్‌మార్ట్ మనదేశంలో వేలకోట్ల రూపాయలను అక్రమంగా వెదజల్లినట్టు వచ్చిన ఆరోపణలను అమెరికా కాంగ్రెస్ ఉపసంఘటం వారు నిజమేనని నిర్ధారించారు.
ఇలాంటి అవినీతిగ్రస్తమైన విదేశీయ సంస్థలను భాజపా ఆధ్వర్యంలోని ప్రభుత్వం వారు దేశం నుండి వెళ్లగొడతారన్న ఆశలు ‘అంకురం’ దశలోనే హతమారి పోతున్నాయి. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత తమకు ఉద్వాసన తప్పదన్న భయంతో ఫ్రాన్స్‌కు చెందిన క్యారీఫోర్ సంస్థవారు తమ చిల్లర దుకాణాలను మూసివేసి, 2014 మేలో మన దేశం నుంచి నిష్క్రమించారు. కానీ అమెరికా వారి వాల్‌మార్ట్‌కు ఎన్నికల ముందు ఆ భయం కలుగలేదు...విస్తరణ పథకాన్ని 2014 ఎన్నికల సమయంలోనే ఆవిష్కరించింది. అంటే ఎమిటి?