సంపాదకీయం

‘కార్చిచ్చు’కు కారకులు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుర్హన్ వని వధ తరువాత కల్లోల గ్రస్తమైన కశ్మీర్ లోయ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు అంతర్గతంగాను, సరిహద్దులకు వెలుపలి నుండి కూడ అవరోధాలు ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. గురువారం లోక్‌సభలో కశ్మీర్ గురించి జరిగిన చర్చకు ఇదీ నేపథ్యం. భారతీయులందరు కలిసి ఉంటారన్నది దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ కశ్మీర్‌పై సభలో చేసిన ప్రసంగంలో వ్యక్తం చేసిన విశ్వాసం. ఈ విశ్వాసం భారతదేశపు భౌగోళిక, చారిత్రక, రాజ్యాంగ, సాంస్కృతిక వాస్తవాల భూమికపై వికసించిన సమష్టి జాతీయ ఆకాంక్ష...కశ్మీర్ యుగయుగాలుగా భారతదేశంలో అవిభాజ్యమైన అంగం, భరతమాత స్వరూపంలో శిరోభాగం. అందువల్ల తలకు గాయమైన తల్లి హృదయం తల్లడిల్లుతోండడం దశాబ్దుల జాతీయ వ్యథ. అందువల్ల భారతీయులందరు కలిసి ఉంటారన్న రాజ్‌నాధ్‌సింగ్ విశ్వాసం గాయానికి జరుగుతున్న చికిత్సలో భాగం!కానీ ఈ చికిత్స జరగకుండా దేశంలోని ప్రధానంగా కశ్మీర్ లోయ ప్రాంతంలోని జిహాదీ బీభత్సకారులు ప్రత్యక్షంగా అడ్డుకుంటున్నారు. బుర్హన్ వని ఇలాంటి కరుడుగట్టిన జిహాదీ బీభత్సకారుడు, హిజ్‌బుల్ ముజాహిదీన్ ముఠాలోని ముందరి మనిషి. జిహాదీ బీభత్సకాండను సమర్ధిస్తున్న వారు చికిత్స కొనసాగకుండా ప్రచ్ఛన్నంగా నిరోధిస్తున్నారు. ఇలా పరోక్షంగా దేశ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న వారిలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ- పిడిపి-కూడ ఉండడమే విచిత్రమైన విపరీతమైన ప్రహేళిక-పజిల్-! జాతీయ సమగ్రతా పరిరక్షణ నిష్ఠకల భారతీయ జనతాపార్టీతో కలిసి జమ్ము కశ్మీర్‌ను పరిపాలిస్తున్న పిడిపి బుర్హన్ వని వధను పరోక్షంగా వ్యతిరేకిస్తోంది. కశ్మీర్ గాయానికి చికిత్స చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ పిడిపి ప్రవర్తన బహుశా కొరుకుడు పడడంలేదు...జమ్ము కశ్మీర్‌కు ప్రస్తుతం లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి చాలదని, మరింత స్వయం ప్రతిపత్తి కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోండడం చికిత్సను అడ్డుకోవడానికి జరిగిపోతున్న కుట్రలోని మరో ప్రధానమైన అంశం! కశ్మీర్ రాజకీయాలలో ప్రధాన భూమికను పోషిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్‌సి-పార్టీ కూడ దశాబ్దులుగా ఈ మరింత స్వయం ప్రతిపత్తి-అటానమీని కోరుతోంది. కేంద్రంలో అధికారం వహించిన సమయంలో ఈ మరింత స్వయం ప్రతిపత్తిని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్‌సి పగటి కలను వాస్తవం చేయాలని కలలు కంటోంది. జాతిహితం కంటె అక్రమ రాజకీయ ప్రయోజన సాధనకు ప్రాధాన్యం ఇస్తున్న సంకుచిత చిత్తవృత్తికి ఇది మరో నిదర్శనం. జమ్ము కశ్మీర్‌లో మానవీయ అధికారాలను కేంద్ర ప్రభుత్వం హననం చేస్తోందన్న పాకిస్తాన్ ప్రచారం సరిహద్దులకు వెలుపలినుండి దూకుతున్న ఉగ్రమృగ, వికృత విన్యాసం...
పాకిస్తాన్ ప్రభుత్వం బుర్హన్ వనీ మృతికి సంతాపం ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేసిన వికృత పరిణామం!మనదేశంపైకి పాకిస్తాన్ ఉగ్రవాదపు తోడేళ్లను ఉసిగొల్పడం అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం. అయితే మన ప్రభుత్వం యధావిధిగా పాకిస్తాన్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. జమ్ము కశ్మీర్‌కు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌కు మధ్య సీమాంతర వాణిజ్యం నడుస్తోంది. అందువల్ల గాయపడినవారు, గాయం చేస్తున్నవారు పరస్పరం దౌత్యం,వాణిజ్యం కొనసాగిస్తున్నప్పుడు మనకెందుకు? అన్న భావం వివిధ దేశాల ప్రభుత్వాలకు కలిగి ఉంది! బుర్హన్ వని ఉదంతంలో పాకిస్తాన్ నిర్లజ్జ మరింత వికృతంగా ఆవిష్కృతమైంది! ఇప్పుడైనా మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో అన్నిరకాల సంబంధాలను రాకపోకలను తెగతెంపులు చేసుకున్నట్టయితే పాకిస్తాన్‌ను బీభత్స ప్రభుత్వం ఉన్న దేశం-టెర్రరిస్ట్ రిజీమ్-గా ప్రకటించే ప్రయత్నాలకు సాఫల్యం సిద్ధించే అవకాశం ఉంది. అలా జరగడం లేదు కనుకనే పాకిస్తాన్ ప్రభుత్వం మరింత నిర్లజ్జగా నిర్భయంగా మన ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది! కశ్మీర్‌లో ఎవరి మానవీయ అధికారాలకు మనసైనికులు భంగం కలిగించారు?? మానవ సమాజానికి మొత్తం శత్రువులుగా పరిణమించిన జిహాదీ ఉగ్రవాదులకు హక్కులను కల్పించాలా? పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారంలోని డొల్లతనాన్ని రాజనాధ్‌సింగ్ గురువారం లోక్‌సభలో తేటతెల్లం చేసారు. కానీ అభిశంసనవల్ల పాకిస్తాన్ ప్రభుత్వం తన తోడేలు స్వభావాన్ని మార్చుకోదు. దాన్ని టెర్రరిస్ట్ వ్యవస్థగా ఐక్యరాజ్య సమితిలో ప్రకటింపచేయడం మాత్రమే కశ్మీర్‌కు సంభవించిన బాహ్య ప్రమాదాన్ని తొలగించగలం...
రోగం దూరం కావడానికి చికిత్స జరగాలి.. కానీ రోగాన్ని పెంచే చికిత్స జరగాలని కాంగ్రెస్ వారు ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. జమ్ము కశ్మీర్‌కు మరింత స్వతంత్ర ప్రతిపత్తి కావాలని మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన పదేళ్లలో కొంతకాలం దేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన పళనియప్పన్ చిదంబరం కోరుతున్నారు. ఈ కోరిక కశ్మీర్ ప్రజల హితం కోసమైనట్టయితే 2014 మే 21 వరకు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ తన పదేళ్లపాలన కాలంలో ఎందుకని తీర్చలేదు? కేవలం భారతీయ జనతాపార్టీ విధానాలను చర్యలను తప్పుపట్టాలన్న రాజకీయ సంకుచిత దృష్టితో మాత్రమే చిదంబరం ఇప్పుడు మరింత అటానమీ గురించి ప్రస్తావించారు. గతంలో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీవారు కూడ మరింత స్వతంత్ర ప్రతిపత్తి కశ్మీర్‌కు సాధించాలని కోరారు. ఈ అటానమీ గురించి నేషనల్ కాన్ఫరెన్స్ వారు దశాబ్దులుగా కలలు కంటున్నారు! అప్పుడెందుకని చిదంబరం అటానమీని సమర్ధించలేదు? అటానమీ కావాలని కోరుతు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు ముఖ్యమంత్రులుగా ఉండినప్పుడు జమ్ముకశ్మీర్ శాసనసభలో తీర్మానాలు కూడ ఆమోదించారు. కానీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన సమయంలో కాంగ్రెస్ ఈ తీర్మానాలను వ్యతిరేకించడం చరిత్ర! చిదంబరం ఈ చరిత్రను మరిచిపోయారు! జమ్ము కశ్మీర్‌లో రగులుతున్న విద్రోహ దవాలన జ్వాలలకు ఇంధనం భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రకారం ఆ రాష్ట్రానికి లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి! ఈ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి జమ్ము కశ్మీర్‌కు దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో సమాన ప్రతిపత్తి కల్పించడం బీభత్స జిహాదీ వ్యాధిని నిర్మూలించడానికి ఏకైక చికిత్స...
ప్రత్యేక ప్రతిపత్తి-స్పెషల్ స్టేటస్-కంటె స్వతంత్ర ప్రతిపత్తి-అటానమీ, స్వతంత్ర ప్రతిపత్తి కంటె స్వయంపాలన-సెల్ఫ్ రూల్ ప్రమాదకరమైనది. అటానమీ కోరుతున్న ఎన్‌సి 1953 నాటి స్థితిని పునరుద్ధరించాలని కోరుతున్నారు. పిడిపి వారు మరింత ముందుకు వెళ్లి సెల్ఫ్‌రూల్‌ను కోరుకుంటున్నారు. సెల్ఫ్‌రూల్‌ను ప్రసాదించడమంటే కశ్మీర్‌ను దాదాపు ప్రత్యేక దేశంగా ప్రకటించడంతో సమానం. ఈ సెల్ఫ్ రూల్‌ను ప్రతిపాదించినది గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం. పిడిపి దాన్ని అందిపుచ్చుకుంది. భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ పిడిపి తన స్వయంపాలన ప్రతిపాదనను విడనాడలేదు! బుర్హన్ వనిని సైనికులు మట్టుపెట్టిన తరువాత పిడిపివారు అందువల్లనే పరోక్షంగాను ప్రత్యక్షంగాను కేంద్రంపై రుసరుసలాడిపోతున్నారు...