సంపాదకీయం

వ్రతం చెడిన ఓలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్ ప్రధానమంత్రి పదవికి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి రావడం చైనా అమలు జరుపుతున్న రాజకీయ వ్యూహంలో భాగం. ఖడ్గప్రసాద్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తుండిన సమయంలోనే ఆయనను పదవిలో నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందన్న ప్రచారం జరిగింది. ఖడ్గప్రసాద్ ప్రభుత్వాన్ని గద్దెదించడం లేదా ఆయన పదవిలో కొనసాగడం నేపాల్ అంతర్గత సమస్య. అందువల్ల చైనా ప్రభుత్వం ఓలీని అధికారంలో కొనసాగించడానికి యత్నించడం లేదా ఆయను పదవీచ్యుతుడిని చేయడానికి కుట్ర చేయడం -రెండూ నేపాల్ ఆంతరంగిక వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి నిదర్శనం. కానీ 1996 నుంచి కూడ చైనా ప్రభుత్వం నేపాల్ ఆంతరంగిక వ్యవహారాలలో కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది. ఇందుకు మాధ్యమం నేపాల్ ఏకీకృత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ. 1995లో కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగం రూపొందించడానికి, నేపాల్‌లో అంగీకారం కుదిరిన నాటికి, ఈ మావోయిస్టు పార్టీ లేదు. నేపాల్ కాంగ్రెస్ ప్రధాన రాజకీయపక్షం! రెండవది నేపాల్ కమ్యూనిస్టు పార్టీ! ప్రజాస్వామ్య నూతన రాజ్యాంగ వ్యవస్థకు శ్రీకారం జరగగానే కమ్యూనిస్టు పార్టీలోని చైనా మద్దతుదారులు పార్టీని చీల్చిపారేశారు, మావోయిస్టు పార్టీని ఏర్పాటు చేసారు. అప్పటినుంచి రెండు కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడిపోయాయి. నేపాల్ ఏకీకృత మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లేదా మార్క్సిస్ట్ పార్టీ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు నిబద్ధతను ప్రకటించింది. చీలిపోయిన మావోయిస్ట్ పార్టీ దాదాపు తొమ్మిదేళ్లపాటు భయంకర సా యుధ బీభత్సకాండను కొనసాగించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ వికసించకుండా నిరోధించి ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థను నేపాల్‌లో ఏర్పాటు చేయడం మావోయిస్టు పార్టీ ల క్ష్యం, చైనా కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వ లక్ష్యం! మార్క్సి స్ట్ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్య నిబద్ధతను, మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేకతను ప్రదర్శించడం 2005వరకు నడిచిన కథ...1996నుండి 2004 వరకు మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ జరిపిన బీభత్సకాండకు పదమూడు వేలమంది సైనికులు, ప్రజలు బలైపోవడం ఈ కథలో భాగం. 2004లో మావోయిస్ట్ పార్టీ, చైనా ప్రభుత్వం వ్యూహం మార్చాయ. సాయుధ బీభత్సకాండవల్ల తమ లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదని గ్రహించడం ఇందుకు కారణం! ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల నిబద్ధతను నటిస్తూ, ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడకుండా నిరోధించాలని, ఏర్పడినప్పటికీ అది విఫలం కావడానికి వీలుగా నేపాల్‌ను నిరంతరం సంక్షోభాలకు, కల్లోలాలకు గురి చేయాలని మావోయిస్టులు, వారిని ఉసిగొల్పుతున్న చైనా ప్రభుత్వం నిర్ణయించడం ఈ కొత్త వ్యూహం! పదకొండేళ్ల చరిత్ర ఈ వాస్తవాన్ని ధ్రువీకరించింది. ఓలీని పదవీచ్యుతుడిని చేయడం ఈ వ్యూహంలో సరికొత్త ఘట్టం...
ఎన్నికలలో గెలిచినప్పుడు, ఘోరంగా ఓడినప్పుడు కూడ మా వోయిస్టులు ప్రభుత్వ నిర్మాణ నిర్ణాయకులు-కింగ్‌మేకర్స్- కావడం 2005నుంచి కొనసాగుతున్న విచిత్ర పరిణామక్రమం. 2005లో నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో తాము భాగస్వాములం కానున్నట్టు ప్రకటించిన మావోయిస్టులు సాయుధ సంఘర్షణకు స్వస్తి చెప్పారు. కానీ 2008 వరకు రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరగకుండా మావోయిస్టులు బెదిరింపు రాజకీయాలను నిర్వహించారు. మావోయిస్టుల మాట తాము వినకపోయినట్టయితే వారు మళ్లీ ఆయుధాలను పట్టుకుని రక్తపాతాన్ని పునరావృత్తం చేయగలరన్న భయం నేపాలీ కాంగ్రెస్‌కు, మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీకి పట్టుకుంది! చివరికి ఎన్నికలు జరిగాయి. మావోయిస్టులు ఓడిపోతే వారు మళ్లీ రక్తపాతం సృష్టించగలరన్న భయంతో ఓటర్లు ఎక్కువమంది మావోయిస్టులను బలపరిచారు. 601 మంది సభ్యులున్న రాజ్యాంగ పరిషత్‌లో 225 స్థానాలు గెలిచిన మావోయిస్టులు అతి పెద్ద పక్షంగా అవతరించారు. మావోయిస్టు పార్టీ అధినేత పుష్పకమల్ దహల్ ప్రచండ మార్క్సిస్ట్ పార్టీ మద్దతుతో ప్రధానమంత్రి కాగలిగాడు. దాదాపు సంవత్సరం పాటు ప్రధానమంత్రిత్వం నిర్వహించిన ప్రచండ నిర్వహించిన ఏకైక కార్యక్రమం నేపాల్‌ను భారత్‌నుంచి దూరంగా జరిపి చైనా ఒడిలోకి చేర్చడం..
నేపాల్ అనాదిగా భౌగోళికంగా రాజ్యాంగపరంగా సాంస్కృతికపరంగా అనాదిగా భారత ఖండంలో భాగం. విదేశీయుల దురాక్రమణ ఫలితంగా నేపాల్ భారత్‌నుండి విడిపోయింది. ఇదే భౌగోళిక రాజకీయ పరిస్థితి 1947 కూడ కొనసాగడం వల్ల నేపాల్ ప్రత్యేక స్వతంత్ర దేశమైంది. అయినప్పటికీ భారత్‌తో యుగయుగాలనాటి సాంస్కృతిక సంబంధాలు చెక్కు చెదరలేదు. 1950 నాటి భారత నేపాల్ మైత్రీ అంగీకారం ఈ సాంస్కృతిక చారిత్రక బంధానికి మరో ధ్రువీకరణ మాత్రమే. నేపాల్ ప్రజలు తమదేశంలో వలె మన దేశంలో సైతం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. 1950 నాటి ఒప్పందాన్ని రద్దు చేయించడానికి ప్రచండ విఫలయత్నం చేసాడు. నేపాల్ సైనిక దళాలను చైనాకు అనుకూలంగా తీర్చిదిద్దడానికై నిర్లజ్జగా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం బెడిసి కొట్టిన తరువాత ప్రచండ ప్రధాని పదవికి రాజీనామా చేసాడు. అప్పటినుంచి ఇప్పటివరకు మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్‌పార్టీ అభ్యర్థిని ప్రధానిగా కూర్చోబెట్టడం ఆ తరువాత ఏడాది తిరగకముందే దించివేయడం ఇదీ ప్రచండ కార్యక్రమం. 2009నుంచి ఐదుగురు ప్రధానమంత్రు లు గద్దెనెక్కారు, గద్దె దిగా రు. ఓలీ పదవీచ్యుతుడైన ఆరవ ప్రధాని. 2008నుంచి ఎనిమిదేళ్లలో ఇలా ఏడుగురు ప్రధానులు-ప్రచండ సహా-మారిపోవడం అస్థిరతకు అద్దం. అస్థిరతను కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యం పనికిరాదని నిరూపించడం చైనా లక్ష్యం, మావోయిస్టుల లక్ష్యం! ఈ వ్యూహంలో చిక్కుకున్న ఖడ్గప్రసాద్ తొమ్మిది నెలలుగా భారత వ్యతిరేక విషం కక్కాడు. వ్రతం చెడినప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు. మావోయిస్టులు మద్దతును ఉపసంహరించారు.
మావోయిస్టుల చైనా అనుకూల భారత వ్యతిరేక విధానాలతో విసుగెత్తిన నేపాల్ వోటర్లు 2013 నాటి ఎన్నికలలో మావోయిస్టు పార్టీని చిత్తుగా ఓడించారు. నేపాల్ కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీ మూడవ స్థానానికి దిగజారిపోయింది. అయినప్పటికీ అతిపెద్ద పార్టీకి చెందిన ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాలాను గత అక్టోబర్‌లో మావోయిస్టులు గద్దె దింపారు. మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు ఖడ్గప్రసాద్‌ను గద్దెనెక్కించారు. మావోయిస్టుల మెప్పును, చైనా వారి మెప్పును పొందడానికై తద్వారా కల్పాంతం వరకు ప్రధాని పదవిలో వుండాలన్న అత్యాశతో ఖడ్గప్రసాద్ నిరంతరం భారత వ్యతిరేక ప్రకటనలు చేసా డు. 1949 నాటి వాణిజ్యం రాకపోకల ఒప్పందం ప్రాతిపదికగా నేపాల్‌కు సరుకుల రవాణా మన దేశంనుండి జరుగుతోంది. ఈ ఒప్పందాన్ని ఓలీ ఉల్లంఘించాడు. చైనానుండి పెట్రోలు, పెట్రోలియం పదార్ధాల దిగుమతికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మన దేశంలోని తమ రాయబారి దీపకుమార్ ఉపాధ్యాయ మన ప్రభుత్వంతో కలిసి తనను గద్దెదించడానికి కుట్ర చేసాడని కూడ ఖడ్గప్రసాద్ గత మే నెలలో ఆరోపించాడు. ఉపాధ్యాయను పదవినుంచి తొలగించాడు! ఓలీ ఇంతగా దిగజారినప్పటికీ మావోయిస్టులు ఆయనను తొలగించారు. నేపాల్‌ను నిరంతరం కల్లోల గ్రస్తం చేయడమే మావోయిస్టుల లక్ష్యం...