సంపాదకీయం
సాయుధ సిద్ధాంతం సబబేనా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయస్టుల కలాపాలు మొదలు కావడం ప్రతీక మాత్రమే. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసులు పరస్పరం తలపడడం మరో ప్రతీక. ఆరుగురు రాజకీయ నాయకులను అపహరించుకొనిపోయిన మావోయిస్టులు తమ కోరికలు నెరవేర్చేవరకు వారిని విడుదల చేయబోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో అపహరణకు గురి అయిన ఈ నాయకులు అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు కావడం యాదృచ్ఛికం కావచ్చు. లేదా పథకం ప్రకారం ప్రభుత్వంతో ఢీకొనడానికి సిద్ధమైన మావోయిస్టులు అధికార పార్టీవారిని ఎంపిక చేసికొని ఉండవచ్చు. బాధితులు ఏ పార్టీకి చెందినవారన్నది ప్రధాన అంశం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చడానికి దేశవ్యాప్తంగా మావోయిస్టులు కొనసాగిస్తున్న విప్లవ కార్యక్రమంలో ఈ అపహరణ ఒక అంశం మాత్రమే. వరంగల్ జిల్లాలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినందుకు ప్రతీకారంగా ఈ అరుగురు రాజకీయవేత్తలను అపహరించడంలో ఔచిత్యమేమిటన్నది అపహరణకర్తలు ఆలోచించవలసిన అంశం. వరంగల్లు నియోజకవర్గం నుండి లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌ను జనం బహిష్కరించాలన్నది కూడ మావోయిస్టుల కోర్కెలలో ఒకటన్న ప్రచారం జరుగుతోంది. బాధితులకు విడుదల లభించబోదన్న భయంలో కొందరు వోటర్లు పోలింగ్ స్టేషన్లకు రాకపోవచ్చు. కానీ మొత్తం వోటర్లు పోలింగ్‌ను బహిష్కరించడం అసాధ్యం. అసాధ్యమైన కోరికను అపహరణతో ముడిపెట్టడం ఔచిత్యమా? అన్న ప్రశ్నకు సైతం మావోయిస్టులు సమాధానం చెప్పరు. తెలుగు రాష్ట్రాలలో తాము క్రియాశీలంగా ఉన్నట్టు చాటుకోవడం మావోయిస్టుల వ్యూహం. విశాఖ ఏజెన్సీలో ఇటీవల ఇలా అపహరణకు పూనుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సవాలు చేసిన మావోయిస్టులు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇలా సవాలు చేశారు. మావోయిస్టుల లక్ష్యం తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్‌లోనో మాత్రమే అలజడి సృష్టించడం కాదు. క్రీస్తుశకం 2050వ సంవత్సరం నాటికి ఇప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థను కూల్చి తమ నూతన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని మావోయిస్టులు పదేపదే స్పష్టం చేసి ఉన్నారు. అందువల్ల వారు చేయతలపెట్టిన, చేస్తున్న యుద్ధం భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా మాత్రమేనన్నది వారే అంగీకరించిన వ్యవహారం. రాజకీయ వేత్తలను అపహరించడం వల్ల కాని, ఉద్యోగులను అపహరించడం వల్లగాని ఈ భారత రాజ్యాంగ వ్యవస్థ కూలిపోదు. అందువల్ల విజ్ఞత వికసించి అపహరించిన రాజకీయవేత్తలను మావోయిస్టులు విడుదల చేయాలి. అంతేకాని తమ భయంతో వోటర్లు ఎన్నికలను బహిష్కరించగలరని మావోయిస్టులు భావించడం నేలవిడిచి సాము చేయడంతో సమానం...
మావోయిస్టులు, భద్రతా దళాలు ఇలా పరస్పరం తలపడుతున్న సమయంలోనే జరిగిన మరో సమాంతర పరిణామం చైనా రాజధాని బీజింగ్‌లో మనదేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా నాయకులతో చర్చలు జరపడం. ఈ చర్చల పర్యవసానంగా, ఉగ్రవాదాన్ని నిరోధించడానకి వీలుగా ఉభయ దేశాల అంతరంగిక భద్రతా మంత్రిత్వ విభాగాల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడానికి వలసిన ఒప్పందం కుదిరిందట. ఈ ఒప్పందం ఫలితంగా ఉభయ దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీభత్సకాండను ఎదుర్కొనడానికి వీలవుతుందట. ఫ్రాన్స్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల జరిపిన భయంకర బీభత్సకాండ రాజ్‌నాథ్ సింగ్ చైనా ప్రజాభద్రతామంత్రి గూషెంగ్ కున్‌తో జరిపిన చర్చలకు తక్షణ నేపథ్యం. సిరియాలో ఒక చైనీయ పౌరుడిని ఐఎస్‌ఐఎస్ జిహాదీలు చంపివేయడం గురించి బీజింగ్‌లో ఉభయ దేశాల మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారట. మన దేశానికి చెందిన ముప్పయి తొమ్మిది మందిని ఏడాదిగా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు నిర్బంధించి ఉంచారు. వీరిని ఐఎస్‌ఐఎస్ చంపి వేసిందన్న ప్రచారం కూడ జరిగింది. బందీలు క్షేమంగానే ఉన్నట్టు మన విదేశాంగ మంత్రిత్వశాఖవారు ఇప్పటికీ భావిస్తున్నారు. ఈ బంధితులకు జిహాదీ నిర్బంధం నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందన్నది దైవాధీనం...అయితే ఈ భారతీయుల గురించి రాజ్‌నాథ్ సింగ్, గూషెంగ్ కున్‌తో జరిపిన చర్చల సందర్భంగా ప్రస్తావన జరిగినట్టు వార్త లేదు. సిరియాలో ఒక చైనీయుడి మృతిని గురించి చర్చించినప్పుడు 39 మంది భారతీయ బంధితుల గురించి కూడ ఉభయ మంత్రులు చర్చించి ఉండాలి. ఏమైనప్పటికీ ఇవన్నీ తాత్కాలిక అంశాలు. టెర్రరిస్టులను నిరోధించడంలో ఉభయదేశాల ప్రభుత్వాలు దీర్ఘకాలం పరస్పరం సహకరించుకొనడం ఒప్పందంలోని స్ఫూర్తి! మరి టెర్రరిస్టులంటే కేవలం జిహాదీ ఉగ్రవాదులేనా? మావోయిస్టులు జరుపుతున్న రక్తపాతం టెర్రరిజం నిర్వచనం పరిథిలోకి వస్తుందని చైనా ప్రభుత్వం భావిస్తోందా? లేదా? భావిస్తున్నట్టయితే మావోయిస్టులను నిరోధించడంలో సైతం చైనా ప్రభుత్వం మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందా?
ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడప్పుడే లభించకపోవచ్చు. భారత-చైనా బంధాలలో ఇమిడి ఉన్న అనేక చిక్కుముడులలో ఈ ఒప్పందం కూడ ఒకటి కావచ్చు. కానీ మనదేశంలో మావోయిస్టులు జరుపుతున్న సాయుధ కలాపాలకు చైనా సహా యం చేస్తోందన్నది దశాబ్దుల తరబడి కొనసాగుతున్న ఆరోపణ. మావోయిస్టులకు, చైనాపట్ల అనురక్తి కూడ రహస్యం కాదు. మావోసేటుంగ్, చైనా మాజీ నియంత. ఆయన సైద్ధాంతిక స్ఫూర్తితోనే మావోయిస్టులు తమ లక్ష్యాలను నిర్ధారించుకున్నారు. ఈ లక్ష్య సాధనకు సాయుధ సమరం సాగిస్తున్నారు. ఈ సమరం ప్రజలు కోరుకున్న సమరమా? లేక కొన్ని వేలమంది మావోయిస్టు సిద్ధాంత వాదులు ప్రజలకు వ్యతిరేకంగా జరుపుతున్న రక్తపాతమా? అన్నవి కూడ తరచుగా వినబడుతున్న ప్రశ్నలు. ఏమయినప్పటికీ మన దేశంలోను, నేపాల్‌లోను మావోయిస్టులు జరిపిన, జరుపుతున్న రక్తపాతానికి ఆయుధ సామగ్రి ప్రధానంగా చైనా నుంచి సరఫరా అవుతోందన్నది జనమెరిగిన సత్యం. చైనా ఓడరేవులలో నౌకలలో చేరిన ఆయుధాలు బర్మా-మయన్మార్, బంగ్లాదేశ్ లోని ఓడరేవులలో దిగి, మన ఈశాన్య ప్రాంతం గుండా దేశంలోకి చేరిపోతున్నాయన్న వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ మహా సమస్యను చైనా నాయకులతో ఎందుకని చర్చించలేదు? 2009 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం సిపిఐ-మావోయిస్టు-పార్టీని నిషేధించిన తరువాత మావోయిస్టుల కలాపాలు మరింతగా పెరిగాయి. ఈ పెరుగుదలకు ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్ వంటి రాష్ట్రాలలో జరిగిపోతున్న సంకుల సమరం ప్రత్యక్ష ప్రమాణం...
ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను 2050వ సంవత్సరానికి కూల్చివేసి సరికొత్త కమ్యూనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మావోయిస్టులు చెబుతున్నారు. కానీ గతంలో ఇలా ఐరోపా దేశాలలో రష్యాలో ఏర్పడిన కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థలను ప్రజలు తిరస్కరించారు. తొలగించారు. చైనా ప్రభుత్వం సైతం మావోయిస్టు ఆర్థిక విధానాలకు తిలోదకాలివ్వడం నడుస్తున్న చరిత్ర. అందువల్ల తమ సాయుధ రక్తపాతం కొనసాగించడంలోని ఔచిత్యం గురించి మావోయిస్టులు అంతరంగ మథనం చేసుకోవడం మేలు..ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతనను ప్రకటించడం మేలు..