సంపాదకీయం

నేరానికి గౌరవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయ్‌దత్ అనే చలనచిత్ర నటుడిని శిక్షాకాలం పూర్తి కాక మునుపే జైలునుండి విడుదల చేస్తున్నారట! ఈ దుర్వార్త మహత్తర హర్షణీయ పరిణామంగా ప్రచారం అవుతుండడం అనైతికతా పరిమాణ సూచిక పెరుగుతుండడానికి నిదర్శనం. సంజయ్‌దత్ ఘరానా నేరస్థుడన్నది న్యాయస్థానాలు నిగ్గుతేల్చిన నిజం! అయితే ఇతగాడిని 1996లో మొదటిసారి నిర్బంధించిన నాటినుంచి దాదాపు ఇరవై ఏళ్లుగా జరుగుతున్న ప్రచారం ఈ ఖల్‌నాయక్ ఆదర్శ నాయకుడన్న భ్రమను వ్యాపింపచేసింది, చేస్తోంది! ఇతగాడు పేరుమోసిన చలనచిత్ర అభినయవేత్త కావడం ఇందుకు కారణం! అనేక హిందీ సినిమాలలో నాయకుడుగా నటించిన ఇతగాడు జీవితంలో మాత్రం నేర ప్రవృత్తి కలిగిన దుష్టనాయకుడుగా నిగ్గుతేలాడు. న్యాయస్థానాలు నిగ్గుతేల్చాయి. కానీ ప్రభుత్వాలవారు, ప్రచార మాధ్యమాలలోని అనేకులు ఇతగాడిని ఉదాత్త చరితునిగా, ఏదో అన్యాయానికి గురి అయిన విధి వంచితునిగా భావిస్తున్నట్టు స్పష్టమైపోయింది. ఇతనిపట్ల జనంలో సానుభూతి పెరిగే విధంగా జరిగిన ప్రచారం అభినయమే ఆదర్శమన్న భ్రాంతిని ఫైలాయించింది. రఘురామునిగా యదుకుల కృష్ణునిగా సినిమాలలోను డ్రామాలలోను నటించిన నటులు ఆ జాతీయ వీరులు అయిపోతారా? నేను మహాకవి కాళిదాసుగా నటించాను. కానీ నేను ఆ మహాకవిని కాదు గదా! అని ప్రముఖ తెలుగునటుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి స్వయంగా దృశ్యమాధ్యమ వేదికపై చెప్పి ఉన్నారు. ఉదాత్త భూమికలను అభినయించిన వారు వికృతపాత్రలను పోషించినవారు కూడ అందువల్ల నిజ జీవితంలో మాత్రం సమానులే! ఇలాంటి ప్రసిద్ధులు నిజ జీవితంలో వ్యవహరించే తీరు మాత్రమే వారిని మంచివారుగానో చెడ్డవారుగానో చరిత్రలో నిలబెడుతుంది! కానీ సినిమాలలో ఉదాత్తమైన సంస్కారవంతమైన పాత్రలను పోషించిన వారు ఈ అభినయం ప్రాదిపదికగా మాత్రమే సమాజంలో ఉదాత్త వ్యక్తులుగా చెలామణి అవుతుండడం కొనసాగుతున్న వైపరీత్యం! సినిమాలలో మంచివాడుగా నటించిన నటుడు నిజ జీవితంలో భయంకరమైన ఘోరాలను చేసినప్పటికీ, నేరాలకు ఒడిగట్టినప్పటికీ అతగాడిని మంచివాడుగానే గుర్తించాలా? భావించాలా? అవును అన్న సమాధానాన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందుకు సంజయ్‌దత్ ఒక ఉదాహరణ మాత్రమే....అతగాడు నేరస్థుడుగా ధ్రువపడి పదేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం అతనికి గౌరవాలను ఘటిస్తూనే ఉన్నాయి!
జైలు శిక్షను అనుభవిస్తుండిన సమయంలో సంజయ్‌దత్‌ను మాటిమాటికీ పెరోల్‌పై విడుదల చేస్తుండడం ఇలా గౌరవం ఘటించడంలో భాగం! ఇంటిలో అక్రమంగా మారణ ఆయుధాలను నిలువచేసిన నేరానికి ఇతగాడికి ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. సుప్రీంకోర్టు 2013లో శిక్షను ఐదేళ్లకు తగ్గించింది! 2013 మే నెలలో ఈయనను మహారాష్టల్రోని పూనా సమీపంలోని ఎరవాడ జైలునకు తరలించారు. అప్పటినుంచి ఈ రెండున్నర ఏళ్లలో నాలుగుసార్లు బయటికి వదిలిపెట్టారు. నేరస్థుడు సంజయ్‌దత్ కాక మరో అనాపలింగ కూస్కాని-టామ్ డిక్ అండ్ హారీ-వంటి సామాన్యుడయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా రెండున్నర ఏళ్లలో నాలుగుసార్లు నేరస్థునికి తాత్కాలిక నిర్బంధ విముక్తి-పెరోల్‌ని ప్రసాదించి ఉండేదా? సమాధానం ఎవరు చెప్పాలి? 2013 అక్టోబర్‌లోనే ఇతగాడిని మూడు వారాల పాటు జైలు నుండి వదిలిపెట్టేశారు. ఆ తరువాత మూడు నెలలు గడవక ముందే మళ్లీ అరవై రోజులపాటు మహారాష్ట్ర ప్రభుత్వం సంజయ్‌దత్‌కు స్వేచ్ఛా జీవనాన్ని ప్రసాదించింది! ఇలా అతి కొద్ది వ్యవధిలో రెండవసారి పెరోల్ ఇవ్వడం మహారాష్ట్ర జైళ్ల చరిత్రలో బహుశా మొదటిసారి! నూతన ఆంగ్ల సంవత్సరాది ఉత్సవాలను జరుపుకొనడానికి వీలుగా 2014 డిసెంబర్ మరోసారి ఈ ఘరానా నేరస్థుడిని రెండువారాలపాటు నిర్బంధం నుండి వదిలేశారు! నేరస్థునికి నిర్బంధం విధించడమంటే స్వేచ్ఛా మానవులకు లభించే వసతులను, అధికారాలను, సౌకర్యాలను, గౌరవాలను ఘనతలను తాత్కాలికంగా ఉపసంహరించడం మాత్రమే! అలాంటప్పుడు సంజయ్‌దత్ జైలు బయటికి వచ్చి నూతన సంవత్సరపు వేడుకలు జరుపుకోవడం ఏమిటి? ఈ ప్రశ్న మాధ్యమాలలో ప్రచారమైన తరువాత పెరోల్ వ్యవధిని పెంచలేదు. అంతకు ముందు రెండు సందర్భాలలోను పెరోల్ గడువు ముగిసిన తరువాత వ్యవధిని మళ్లీ పెంచారు!
ఇతగాడు జైలులో వుంటున్న సమయంలో ఈ సంజయ్‌దత్ కుమార్తె ముక్కునకు శస్త్ర చికిత్స అవసరమైందట! అందుకని మహారాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత సానుభూతితో 2015 ఆగస్టులో ఈయనకు మళ్లీ బంధ విముక్తిని కల్పించారు. కుమార్తె ముక్కునకు శస్త్ర చికిత్స జరిగే సమయంలో తండ్రి దగ్గర ఉండాలి మరి! ముప్పయి రోజుల పెరోల్‌ను ఆ తరువాత అరవై రోజులకు పొడిగించడం సానుభూతి మరింతగా విస్తరించిందనడానికి నిదర్శనం. ఎన్నివేల మంది సామాన్య ఖైదీల కూతుళ్లకు ముక్కు చికిత్సలు జరిగి ఉంటాయి? ఎందరి ఖైదీల కుటుంబ సభ్యులు ఆసుపత్రుల పాలయి ఉంటారు! వారందరికీ ఇలా మానవీయమైన మన్ననలు ప్రభుత్వాలనుంచి లభించాయా? ఇదంతా చాలదన్నట్టు ఆయనగారి ఐదేళ్ల శిక్షలో నూటికి ఎనిమిది రోజులు రద్దు చేసి ఫిబ్రవరి 27న ఆయనకు నిర్బంధంనుండి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తున్నారు! ఇతగాడి మంచి నడవడిని గుర్తించి అధికారులు ఈ చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారట...మహారాష్ట్ర జైళ్ల వ్యవహారాల అదనపు పోలీసు సంచాలకుడు పికె ఉపాధ్యాయ బుధవారం వెల్లడించాడట! సంజయ్‌దత్ 2013 మేనుంచి నిర్బంధంలో ఉన్న సమయంలో ఇలా నూట యాబయి ఐదు రోజులపాటు బయటనే ఉన్నాడు. కాగా ఈ అతి తక్కువ శిక్షాకాలంలో ఆయన నడవడిలో వచ్చిన విప్లవాత్మకమైన సత్ పరివర్తన ఏమిటన్నది వెల్లడి కావలసి ఉంది! యావజ్జీవ నిందితుల, దీర్ఘకాల నిర్బంధితుల ప్రవర్తనలో మార్పురావడం సహజం! కానీ రెండేళ్ల నిర్బంధ సమయంలోనే సంజయ్‌దత్ మంచివాడుగా మారిపోవడం అద్భుతం! అద్భుతం మహిమ కావచ్చు, మాయ కావచ్చు! మాయా? మహిమా? అన్నది ఎవరు నిర్ధారిస్తారు? ఇలా నేరస్థునికి జరిగిన ఘన గౌరవం గురించి రాజమర్యాదల గురించి ప్రతిపక్ష రాజకీయ వాదులు సైతం నిరసన గళాలను నిగిడించకపోవడం ఆశ్చర్యం కాదు, సినిమా జీవులు అందరూ ఉదాత్త పురుషులన్నది అధికాధిక రాజకీయ జీవుల అభిప్రాయం...
ముంబయిలోని సినిమా ప్రపంచానికి నేర ప్రపంచానికి అవినాభావ సంబంధం కొనసాగుతుండడం అనేకసార్లు ధ్రువపడిన వాస్తవం! అయితే సంజయ్ దత్‌కు దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం ఉందన్న ఆరోపణ మాత్రం న్యాయస్థానాలలో ఋజువు కాలేదు. ఇది ప్రభుత్వం తరఫున న్యాయస్థానంలో అభియోగాన్ని నడిపించిన వారి వైఫల్యం కావచ్చు, కాకపోవచ్చు! కానీ సంజయ్‌దత్ ఇంటిలో దాగి ఉండిన ఆయుధాలు మాత్రం మామూలు నేరస్థులు ఉపయోగించేవి కావు! దావూద్ ఇబ్రహీం వంటి జిహాదీ హంతకులకు మాత్రమే అలాంటి ఆయుధాలు అవసరం...