సంపాదకీయం

‘కుటుంబ’ కశ్మీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేక్ అబ్దుల్లా తరువాత జమ్మూకశ్మీర్ రాజకీయ గతిని నిర్దేశించిన వారిలో అత్యంత ప్రముఖుడు ముఫ్తిమహమ్మద్ సరుూద్. గురువారం నాడు డెబ్బయి తొమ్మిదేళ్ల ముఫ్తి మరణించడం అందువల్ల ఈ రాజకీయ ప్రపంచానికి తీరని లోటు. 2002 నుంచి మూడేళ్లపాటు ముఫ్తి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ఆయన నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిడిపి-కాగ్రెస్‌తో జట్టుకట్టింది. గత ఏడాది మార్చిలో ఆయన మళ్లీ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలిగాడు. ఈసారి పిడిపి భారతీయ జనతాపార్టీతో జట్టుకట్టింది. ఇలా జాతీయ ప్రధాన పక్షాలైన భాజపా, కాంగ్రెస్‌లు ముఫ్తి నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ పంచన చేరడం పిడిపి ప్రాధాన్యానికి నిదర్శనం. ముఫ్తిమహమ్మద్ రాజకీయ ప్రాబల్యానికి సాక్ష్యం. ముఫ్తి మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యస్థితిని భర్తీ చేయడానికి ఆయన కుమార్తె పిడిపి అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి సిద్ధంగా ఉండడం జమ్మూ కశ్మీర్‌లోని వారసత్వ పదవీ సంప్రదాయానికి అనుగుణం... దశాబ్దుల తరబడి జమ్మూకశ్మీర్ ‘ప్రత్యేకత’కు ఈ‘ప్రత్యేకత’ ఫలితంగా పరిణమించిన విచ్ఛిన్న రాజకీయాలకు కేంద్ర బిందువైన నేషనల్ కాన్ఫరెన్స్-ఎన్‌సి- అధినేత షేక్ అబ్దుల్లా 1980వ దశకం ఆరంభంలో మరణించే నాటికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మరణంవల్ల ఏర్పడిన రాజకీయ శూన్యస్థితిని ఆయన తనయుడు ఫరూక్ అబ్దుల్లా భర్తీ చేయడం వారసత్వ సంప్రదాయానికి అనుగుణం. ఫరూక్ అబ్దుల్లా ఆ తరువాత కేంద్ర మంత్రిపదవిని స్వీకరించడానికి వీలుగా జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని పరిత్యజించడం చరిత్ర. ఆయన తనయుడు ఉమర్ అబ్దుల్లా వారసత్వ సంప్రదాయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 2014 నవంబర్‌లో జరిగిన ఎన్నికల వరకు నిర్వహించాడు. అందువల్ల జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి వారసత్వ రాజకీయాలు కొత్తకాదు. భారత రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయవ అధికరణం ప్రకారం లభించిన ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూకశ్మీర్‌లోని ఈ రెండు ప్రాంతీయ పార్టీల నాయకులకు మరింత ప్రత్యేకతను కలిగించడం చరిత్ర. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటె రాజకీయ నాయకులకంటె మిన్నగా జమ్మూకశ్మీర్ ప్రాంతీయ పక్షాల నాయకులు విదేశాంగ విధాన ప్రకటనలు చేయడం ఈ ప్రత్యేకతకు ఒక ఉదాహరణ మాత్రమే. కానీ రాజకీయ పార్టీలను కుటుంబ సంస్థలుగాను, రాజకీయ పదవులకు వారసత్వానికి ప్రాతిపదికగాను ఏర్పాటు చేయడంలో మాత్రం జమ్మూకశ్మీర్ ప్రాంతీయ నాయకులు ఇతర రాష్ట్రాలలోని రాజకీయ నాయకుల కంటె భిన్నంగా వ్యవహరించడం లేదు. వారు కూడ రాజకీయ పక్షాలను కుటుంబ సంస్థలుగా గుర్తిస్తున్నారు. ఈ గుర్తింపునకు అనుగుణంగానే ఎన్‌సి అస్తిత్వం షేక్ అబ్దుల్లా కుటుంబ వారసత్వమైంది. పిడిపి మనుగడకు ముఫ్తిమహమ్మద్ సరుూద్ కుటుంబం ఆధారమైంది. దివంగత ముఫ్తికున్న ప్రాధాన్యత ఇది. అందువల్లనే ఆయనలేని లోటును ఆయన కుమార్తె ముఫ్తి మహబూబా భర్తీచేస్తుండడం సహజమైన పరిణామం. ముఫ్తి సరుూద్ విధానాలు కొనసాగనున్నాయి.
జమ్మూకశ్మీర్ రాజకీయాలలో ఏకఛత్రాధిపత్యం వహించిన అబ్దుల్లాల ప్రాబల్యాన్ని ఎదిరించి మరో రాజకీయ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టగలిగిన ఘనత ముఫ్తిమహమ్మద్ సరుూద్‌ది. ప్రాంతీయ స్థాయి కల పాంథర్స్ పార్టీ వంటికాని, కాంగ్రెస్ వంటి జాతీయ రాజకీయ పక్షాలు కాని దశాబ్దుల పాటు ఎన్‌సికి ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగలేకపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజన ప్రభావం కారణంగా భారతీయ జనతాపార్టీ జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఘన విజయాలను సాధించింది. అయితే విజయాలు జమ్మూ ప్రాంతానికి లడక్ ప్రాంతానికి పరిమితం కావడం, కశ్మీర్ లోయ ప్రాంతానికి భాజపా విస్తరించకలేపోవడం నడుస్తున్న చరిత్ర. ముఫ్తి మహమ్మద్ సరుూద్‌కు పెరిగిన ప్రాధాన్యత ఇందుకు కారణం. అబ్దుల్లాల కుటుంబాన్ని తిరస్కరించినప్పుడల్లా జమ్మూకశ్మీర్ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా పిడిపిని గుర్తించడం 2002 నుండి కొనసాగుతున్న కథ. అందువల్ల పిడిపితో జట్టుకట్టడం 2002లో కాంగ్రెస్ పార్టీని, 2015లో భాజపాకు అనివార్యం అయిపోయింది. వివిధ రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ మంత్రివర్గాలను ఏర్పాటు చేసిన సందర్భాలలో కాంగ్రెస్ తన ప్రాధాన్యాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి పదవిని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి చోట్ల గతంలో ఏర్పడిన, ప్రస్తుతం ఏర్పడి ఉన్న సంకీర్ణ మంత్రివర్గాలు ఇందుకు నిదర్శనం. ఈ మూడు రాష్ట్రాలలోను సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వారే. కానీ 2002లో ఈ చరిత్రకు ముఫ్తి మహమ్మద్ సరుూద్ గండి కొట్టగలిగాడు. మొదటి మూడేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు. ఆ తరువాతనే ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్‌కు అప్పగించాడు.
గత ఏడాది ఆరంభం నాటికి ముఫ్తి ప్రాధాన్యత మరింత పెరిగింది. 2014 నవంబర్ నాటి శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం వల్ల మొదలైన నాలుగు స్తంభాలాటలో ముఫ్తిని వ్యూహాత్మక విజయం వరించింది. ఎనబయి ఏడు స్థానాల జమ్మూ కశ్మీర్ శాసనసభలో పిడిపి 28, భాజపాకు 25, ఎన్‌సివి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీవారు మద్దతును ఇస్తామని ప్రకటించినప్పటికీ ముఫ్తి ఆ మద్దతును తిరస్కరించాడు. భాజపాతో జట్టు కట్టాడు. ఇలా పిడిపితో జట్టు కావడం ద్వారా భాజపా వ్యూహాత్మకంగా సైద్ధాంతికంగా పరాజయం పాలైంది. విచ్ఛిన్నకాండకు దేశ విద్రోహకర శక్తులు ఎదగడానికి మూలకారణం భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం. ఆ అధికరణాన్ని రద్దు చేయాలన్నది భాజపా వారి దశాబ్దుల విధానం. అధికరణాన్ని కొనసాగించడం మాత్రమే కాదు, జమ్మూకశ్మీర్‌కు స్వయం పాలన ప్రతిపత్తి ఇవ్వాలన్నది పిడిపి విధానం. పిడిపితో పొత్తు కుదుర్చుకున్న సందర్భంగా భాజపా 370వ అధికరణం విషయంలో రాజీపడిపోవడం పెరిగిన ముఫ్తి ప్రాధాన్యానికి నిదర్శనం. 370వ అధికరణాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని, 2015 ఫిబ్రవరి 25న భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించవలసి వచ్చింది. ముఫ్తి మహమ్మద్ సరుూద్ ప్రాధాన్యం ఇదంతా. భాజపా వ్రతాన్ని చెడగొట్టడం జమ్మూకశ్మీర్ రాజకీయాలలో ఆయన సాధించిన వ్యూహాత్మక విజయం...ఆయన కుమార్తెకు ఈ విజయం వారసత్వం..
వ్రతం చెడిన భాజపాకు ఫలితం మాత్రం దక్కలేదు. 2002లో పిడిపి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని మూడేళ్ల చొప్పున పంచుకున్నారు. కానీ 2015లో పిడిపి, భాజపా పొత్తు సందర్భంగా ఇలాంటి పంపకం జరగలేదు. పిడిపితో దాదాపు సమానంగా భాజపాకు స్థానాలున్నప్పటికీ మూడేళ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిని పంచుకునే సూత్రం ఇప్పుడు వర్తించడం లేదు. ముఫ్తి మహమ్మద్ సరుూద్ రాజకీయ ప్రాబల్యం ఇలా ప్రస్ఫుటించింది. ఆయన మరణించిన తరువాత కూడాఆయన కుమార్తె ఈ ప్రాబల్యాన్ని ప్రస్ఫుటింపజేయడం ఖాయం. విభిన్న ధ్రువాలైన రెండు పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని నిర్వహించడంలో ఏర్పడిన సమస్యలు ఇకముందు కూడ కొనసాగుతాయి. రెండు పతాకాల వివాదం ఈ సమస్యల్లో ఒకటి మాత్రమే.