సంపాదకీయం

‘కంచె’లోని కన్నాలెన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశద్రోహం అభియోగంపై వైమానిక దళానికి చెందిన మరో ఇద్దరిని శుక్రవారం ‘నిఘా’ అధికారులు నిర్బంధించడంతో డొంక కదలడం మొదలైంది. కొందరు రక్షకులు భక్షకులుగా మారుతుండడం భద్రతాకుడ్యంలోని కన్నాలు మరింతగా విస్తరిస్తున్నాయనడానికి నిదర్శనం. ఈ కన్నాలగుండా పాకిస్తానీ బీభత్స మృగాలు దేశంలోకి చొరబడుతుండడం దేశానికి అత్యంత అవమానకరం. ఇప్పుడు ఈ మృగాలు మన సైనిక స్థావరాలలోకి సైతం చొరబడి పోతున్నాయి. పఠాన్‌కోట వైమానికదళ స్థావరంలోకి ఇలా పాకిస్తానీలు చొరబడడం సరికొత్త దుర్ఘటన. కానీ దుర్ఘటనల పరంపరకు ఇది మొదలు కాదు. జమ్మూకశ్మీర్‌లోని సైనిక స్థావరంలోకి, పోలీసు ఠాణాలలోకి అనేక ఏళ్లుగా ఉగ్రవాదులు చొరబడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో మన నిఘా ప్రమత్తత ఇందుకు కారణం. మరికొన్ని సందర్భాలలో మన నిఘా అప్రమత్తతను సైతం పాకిస్తానీ జిహాదీలు అధిగమించారు. మన సైనిక దుస్తులు వేసుకున్న పాకిస్తానీలు ఇప్పటికే అనేకసార్లు మన స్థావరాలలోకి చొరబడిపోయారు. మన నిఘా నిర్లక్ష్యం కావచ్చు, అసమర్ధతా కావచ్చు..వీటివల్ల అనేకమంది మన సమర వీరులు బలైపోయారు. పాకిస్తానీ సైనికులే దొంగచాటుగా మన భూభాగంలోకి చొరబడి హత్యాకాండ సాగించడం కూడ మన నిఘా వైఫల్యాలకు నిదర్శనం. పఠాన్‌కోట వైమానిక స్థావరంలోకి రెండవతేదీన జిహాదీ పాకిస్తానీలు చొరబడడం ఈ నిఘా వైఫ ల్య చరిత్రలో భాగం. కానీ ఇప్పుడు విరుచుకొని పడుతున్న మరో భయంకర వైపరీత్యం దేశద్రోహం. దేశాన్ని రక్షించాల్సిన సైనికులలో కొందరు శత్రువులతో చేతులు కలుపుతుండడం పఠాన్‌కోట పై జరిగిన దాడికి ప్రధాన కారణమన్నది నిరాకరింపజాలని నిజం. పోలీసు అధికారి సల్వీందర్ సింగ్ ప్రవర్తన అత్యంత అనుమానాస్పదంగా మారడం ఈ దేశద్రోహపు షడ్యంత్రంలో ఒక అంశం మాత్రమే. రంజిత్ అనే వైమానిక దళం ఉద్యోగిని దాడి జరగడానికి ఐదురోజుల ముందే అరెస్టు చేశారు. ఇతగాడు పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ఐఎస్‌ఐతో కుమ్మక్కయిపోవడం ఆరోపణ. ఇలా దాడికి ముందే రంజిత్‌ను అరెస్టు చేసినప్పటికీ టెర్రరిస్టులు మాత్రం వైమానిక దళం స్థావరంలోకి చొరబడగలిగారు. మన నిఘా నిరోధించలేకపోయింది. ఈ కెకె రంజిత్ అనే దేశద్రోహికి వైమానిక దళంలోనే మరో ఇద్దరు సహచరులు ఉన్నట్టు శుక్రవారం నాటి అరెస్టుల వల్ల వెల్లడైంది. ఈ ఇద్దరు కూడ రంజిత్‌తో సెల్‌ఫోన్ల ద్వారా సంభాషణలు జరిపారట. వీరిద్దరిపై రంజిత్ అరెస్టు తర్వాత నిఘా వీక్షణాలు ప్రసరించాయి...
ఇలా పఠాన్‌కోట వైమానిక స్థావరంలోకి పాకిస్తానీ జిహాదీ హంతకులు చొరబడడానికి ఎందరు మనవారు సహకరించారన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మనవారు ఎవ్వరు కాని దేశద్రోహానికి పాల్పడలేదని ధ్రువడితే అందరం సంతోషించవచ్చు. కానీ రెండవ తేదీన పఠాన్‌కోట వైమానిక దళం స్థావరంలోకి చొరబడిన దుండగులకు స్థావర నిర్మాణాల వివరాలు లోపలి భాగంలోని వ్యవస్థ వివరాలు మన వైమానిక దళంలోని వారే అందించారన్నది కొనసాగుతున్న ప్రచారం. పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండకు సహకరిస్తున్న అనేక వందలమంది మనదేశంలో పట్టుబడినారు, పట్టుబడుతున్నారు, వారందరూ సైనికులు కాదు, దేశ రక్షణ కర్తవ్య దీక్షాధరులు కాదు. కానీ ఈ కర్తవ్యదీక్షాధరులైన వారిలో సైతం మాతృదేశ వ్యతిరేకులు, మాతృభూమి విధ్వంసకులు పుట్టుకురావడం భయంకర విపరిణామం, ‘నిప్పులకు చెదలు పట్టదు’ అన్న వాస్తవం వమ్మయిపోతుండడం ఈ విపరిణామం! నిందితులందరూ నేరస్థులు కాకపోవచ్చు, కానీ నిందితులందరూ నిర్దోషులు కూడ కాదన్నది ధ్రువపడిన వాస్తవం! దేశద్రోహం అభియోగంపై సరిహద్దు భద్రతా దళం ఉద్యోగులు పట్టుబడినారు, సైనికులు పట్టుబడినారు, పోలీసులు పట్టుబడుతున్నారు. గత మూడేళ్లలో ఐఎస్‌ఐతో కుమ్మక్కయిన అభియోగంపై ముప్పయ నలుగురిని నిఘా విభాగం వారు అరెస్టు చేసారు. వీరిలో పదకొండు మంది సైనిక దళాలకు చెందినవారు, పనిచేస్తున్న వారు, ఉద్యోగ విరమణ చేసినవారు...డిసెంబర్ 16వ తేదీన రాజ్యసభలో ప్రభుత్వం ఈ సంగతిని వెల్లడించింది!
రక్షణ దళాలలో కాని అనుబంధ సైనిక దళాలలో కాని ఎంతమంది దేశద్రోహులు ఉన్నారన్నది ప్రధానం కాదు. ఈ దళాలలోని ఒక్కరినైనా దేశవిద్రోహం పరిభావితం చేయడమే భయంకర ప్రమాదం! సైనికులు మన రక్షకులు, మన దేశ సార్వభౌమ అధికారానికి, భౌగోళిక సమగ్రతకు భద్రతా కవచాలు! సైనికులు తమ ప్రాణాలను బలిదానం చేసి సరిహద్దులకు కాపలా కాస్తున్నారు కనుకనే మనం నిర్భయంగా జీవించగలుగుతున్నాం. నిరంతర నిర్నిద్రులైన సైనికులు అప్రమత్తతతో రక్షిస్తున్నారన్న ధీమాతోనే దేశప్రజలు భద్రంగా నిద్రపోగలుగుతున్నారు. అందువల్ల సైనిక దళాలకు, రక్షణ దళాలకు జాతి మొత్తం కృతజ్ఞతతో ఉండడం సనాతన సంప్రదాయం! కానీ ఆదమరిచి హాయిగా నిద్రిస్తున్న పాపను కన్నతల్లి ప్రమాద వలయంలోకి విసిరి వేస్తే ఏమవుతుంది! సైనికులలో ఒక్క దేశద్రోహి పొటమరించినప్పటికీ అదే జరుగుతుంది. రక్షణకున్న ప్రాధాన్యం ఇది, సైనికునికున్న ఔన్నత్యం ఇది! ఇదంతా క్రమంగా గతమైపోతుందన్న భయం దేశ ప్రజలలో వ్యాపించడానికి పట్టుబడుతున్న దేశవిద్రోహ సైనికులు ప్రాతిపదికలు! పట్టుబడినవారు కొందరే... పట్టుబడనివారు ఎందరున్నారన్న ప్రశ్న తలెత్తడం అత్యంత సహజం! కంచెలో కన్నాలు పడడం నిర్లక్ష్యం... ఈ కన్నాలలో విషపు కోరల దేశ విద్రోహపు తోడేళ్లు మాటువేసి ఉండడం.. దేశాన్ని కాపాడగల రక్షణ దళాలలోకి సైతం క్రమంగా వికృతులు చొరబడిపోతుండడం ఇలా నడుస్తున్న వ్యధ! సైనికులు నిస్సహాయ యువతులను, బాలికలను లైంగిక అత్యాచారాలకు గురి చేయడం గురించి ప్రచారవౌతోంది! రక్షణ శాఖ కొనుగోళ్లలో అవినీతి పుట్టలు పెరగడం కూడ ఆవిష్కృతమైంది. ఇప్పుడు దేశద్రోహం కూడ రక్షణ దళాలలోకి చొరబడిపోతోంది! సౌశీల్యవంతులను తయారు చేయలేకపోతున్న మన విద్యావిధానం ఇందుకు ప్రధాన కారణం! అన్నిరంగాలను ఆర్థిక అవినీతి లైంగిక అవినీతి ఆవహించినట్టే రక్షణ రంగానికి సైతం అవి దాపురించడానికి సౌశీల్యవంతులు కాని విద్యావంతులు ప్రధాన కారణం! సౌశీల్య రాహిత్యం జాతీయతా నిష్ఠను భగ్నం చేస్తోంది, దేశ ద్రోహాన్ని అంకురింపచేస్తోంది!
ఇలా భద్రతాదళాలలో దేశద్రోహులు చొరబడి ఉండడం అంతర్జాతీయ వాస్తవం! మరో దేశం వారి నిఘా వ్యవస్థకు సహకరించే ప్రతివాడు దేశద్రోహిగా మారడం సహజం! అమెరికా నిఘాలో రష్యన్ ప్రతినిధులు, రష్యా నిఘాలో అమెరికా ప్రతినిధులు చేరిపోయినట్టు అనేకసార్లు బయటపడింది! ఇలా బయటికి లాగడం నిఘాపై నిఘా-కౌంటర్ ఇంటిలిజెన్స్! ఈ కౌంటర్ ఇంటిలిజెన్స్ విఫలం కావడం పఠాన్‌కోట స్థావరంలోకి టెర్రరిస్టులు చొరబడడానికి దోహదం చేసింది! దేశ వ్యాప్తం నిఘా నిద్దుర లేవాలన్నది నిద్దురపోరాదన్నది గ్రహించవలసిన పాఠం!