మెయన్ ఫీచర్

మోదీ-షరీఫిజానికి పఠాన్‌కోట్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏవైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సున్నితమైన మనోభావాలతో ముడిబడిన అంశాలను ప్రస్తుతానికి పక్కన ఉంచి, ఇతరత్రా సంబంధాల అభివృద్ధికి ప్రయత్నించాలన్నది అంతర్జాతీయ దౌత్యనీతి సూత్రాలలో ఒకటి. ఆర్థికం, సాంస్కృతికం వంటి రంగాలలో సంబంధాలు మొదట మెరుగుపడుతూ పోతే, ఉద్రిక్తతలకు ఆలవాలమైన అంశాలపై క్రమంగా సానుకూల దృక్పథాలు ఏర్పడతాయని, అప్పుడు వాటి పరిష్కారం తేలికవుతుందని ఈ నీతి సూత్రం భావిస్తుంది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వర్తింపజేసిన మొదటి పెద్దసమస్య సోవియెట్ యూనియన్- చైనా సంబంధాలు. సరిహద్దు వివాదంపై చిన్నపాటి యుద్ధానికి కూడా తలపడిన ఈ రెండు దేశాలు ఈ దౌత్యనీతిని అనుసరించి మొదట ఇతర సంబంధాలు అభివృద్ధిపరచుకున్నాయి. తర్వాత సరిహద్దుల వద్ద ఇచ్చిపుచ్చుకుని తేలికగా రాజీపడ్డాయి. ఆ వెనుక ఇం డియా-చైనా ఇదే పని చేయటం మంచిదన్నారు. ఆ ప్రకారం ఆర్థిక సంబంధాలు గణనీయంగా వృద్ధిచెందాయి. సరిహద్దు వివాదమైతే ఇంకా తేలలేదు గాని, దానిని పురస్కరించుకుని ఒకప్పుడు ఉండిన ఉద్రిక్తతలు ఇపుడు కొన్ని దశాబ్దాలుగా లేవు. ఈ రెండు ఉదంతాలనే ఆదర్శంగా తీసుకొమ్మని అమెరికా పెద్దన్న చాలాకాలం క్రితం ఇండియా, పాకిస్తాన్‌లకు హితవు చెప్పా డు. ఆ దిశలో కొన్ని ప్రయత్నాలు రెండువైపులనుంచి జరిగాయి కూడా. ఆ పద్ధతి పునరుద్ధరణకు ఇరువురు ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్‌లు తాజాగా నిర్ణయించుకున్నట్లా?
ఇందుకు సమాధానం వెంటనే చెప్పగల స్థితి లేదు. కాని ఇటీవలి పరిణామాలను జాగ్రత్తగా గమనించినట్లయితే, దానిని వెంటనే కొట్టివేయగల స్థితికూడా లేదు. పఠాన్‌కోట్ ఘటనకు కొంత వెనుకముందులను చూడండి. అక్కడ వైమానిక దళ స్థావరంలోకి కనీసం ఆరుగురు టెర్రరిస్టులు ప్రవేశించారు. నాలుగు రోజులపాటు హింసకు పాల్పడ్డారు. చివరి మనిషి చనిపోయేలోగా భారత దళాలకు చెందిన ఏడుగురి ప్రాణాలు తీశారు. వారు పాకిస్తాన్ కేంద్రంగాగల జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన వారని తొలుత ఊహాగానాలు వెలువడినా భారత సైన్యానికి ఇంకా ధృవీకరణ లభించలేదు. వారు సరిహద్దుకు అవతలి నుంచి చొరబడి వచ్చినవారా లేక ఇక్కడి వారేనా అన్నది కూడా నిర్ధారణగా తేలలేదు. వారిలో ఒక టెర్రరిస్టు పాకిస్తాన్‌లోని తన తల్లితో సెల్‌ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పటం మినహా. ఈ వివరాలు ఎట్లున్నా వారు టెర్రరిస్టులు అనడంలో సందేహం లేదు. వారికి పాక్ భూభాగంతో సంబంధం అన్నది కూడా నిర్వివాదం. ఏ విధంగా చూసినా ఇది భారత ప్రభుత్వాన్ని, దేశాన్ని కలవరపాటుకు గురిచేసే ఘటన.
ఇందుకు భారత ప్రభుత్వం వైపునుంచి స్పందన ఏమిటన్నది ఇక్కడ గమనించవలసిన ప్రధానమైన విషయం. ఇదే గనుక కొద్దికాలం క్రితం వరకు ఎప్పుడు జరిగినా మోదీ ప్రభుత్వం వెంటనే నవాజ్‌షరీఫ్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ సైన్యాన్ని, ఐఎస్‌ఐని సూటిగా కటువుగా నిందించి హెచ్చరికలు జారీచేసి ఉండేది. టెర్రరిస్టుల శిక్షణా శిబిరాలను, వారిని అక్కడ పోషిస్తున్న సంస్థలను నిర్మూలించాలనేది. ఇరుదేశాల ఉన్నతాధికారుల మధ్య ఈనెల 15వ తేదీ నుంచి జరగవలసి ఉన్న చర్చలను రద్దుపరచటమో, నిరవధికంగా వాయిదావేయటమో చేసేది. గతంలో తీవ్రమైన టెర్రరిస్టు దాడులు జరిగిన ప్రతిసారి జరిగింది ఇదే. కాంగ్రెస్ నాయకత్వాన యుపిఎ ప్రభుత్వం సైతం ఇంచుమించు ఇటువంటి వైఖరి తీసుకున్న స్థితిలో బిజెపి నాయకత్వానగల ఎన్‌డిఎ ప్రభుత్వం గురించి చెప్పవలసింది లేదు. గత ఏడాదిన్నరగా జరుగుతూ వచ్చింది తెలిసిందే. మన దౌత్యనీతి గడియారం పెండ్యులం వలె ఈ చివరినుంచి ఆ చివరకు తిరుగుతూ పోయింది. మోదీ ప్రమాణ స్వీకారానికి అనూహ్యమైన, అపూర్వమైన రీతిలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఆహ్వానించటం నుంచి, మరీ అంత తీవ్రం కాని కారణాలపై చర్చలను రద్దుపరచటం వరకు నిజంగానే నాటకీయతలు కన్పించాయి. మనది క్యాబినెట్ సిస్టం అయినప్పటికీ కొన్ని రహస్యమైన, సున్నితమైన విషయాలను క్యాబినెట్‌లో చర్చించ నక్కరలేదన్నది నిజమేగాని, ఈ ఏడాదిన్నర పరిణామాల వెనుక అంత రహస్యం, సున్నితం అయినవి కూడా కన్పించవు.
వీటన్నింటి నేపథ్యంలో మోదీ-షరీఫ్‌లు ప్యారిస్‌లో కలవటం నుంచి మొదలుకొని, షరీఫ్ జన్మదినం సందర్భంగా మోదీ ఆకస్మికంగా పాకిస్తాన్‌కు వెళ్లటంవరకు మరొక విడతగా అనేక పరిణామాలు చకచకా సాగుతూ వస్తున్నాయి. ఇరు ప్రభుత్వాల జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు సమావేశం కావాలని, రష్యాలోని ఉఫాలో ఉగ్రవాదంపై చర్చల నిర్ణయానికి భిన్నంగా ‘‘అన్ని’’ అంశాలు అజెండాపైకి తీసుకోవాలని నిర్ణయాలు జరిగిపోయాయి. భద్రతా సలహాదారులు బ్యాంకాక్‌లో, మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్‌లో ఇందుకు ముఖాముఖి సమావేశాలలో రంగం సిద్ధంచేసారు. సాధారణంగానైతే గత ఏడాదిన్నర అనుభవాలనుబట్టి దీనినంతా నమ్మ టం కష్టమే. ఈ నిర్ణయాలైతే జరిగాయి గాని ఇదొక ఇసుక గూడు అని, సముద్రంనుంచి చిన్న అల వచ్చి తగిలినా కూలిపోగలదన్న భావనే సహజంగా కలుగుతుంది.
పఠాన్‌కోట్ టెర్రరిస్టు దాడి దరిమిలా మోదీ ప్రభుత్వపు స్పందనను జాగ్రత్తగా గమనించటం అందువల్లనే. కాని అది మొదటిరోజునుంచి మొదలుకొని పలు దినాలు గడిచిన వెనుక కూడా ఇంత మంద్రంగా, సంయమనంగా ఉండటం ఒక కొత్త స్థితి. ఆశ్చర్యకరమైన స్థితి. ఇంకా చెప్పాలంటే ఆశావహమైన స్థితి. స్పందన ఏ విధంగా ఉంది? టెర్రరిజాన్నయితే తీవ్రంగానే ఖండించారు గాని, గతానికంటె భిన్నంగా పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, చివరకు ఐఎస్‌ఐని కూడా ఏమీ అననట్లే లెక్క. టెర్రరిస్టు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు గాని వాటికి ప్రభుత్వాన్ని, సైన్యాన్ని, ఐఎస్‌ఐని బాధ్యులంటూ మాట్లాడలేదు. చర్చల విషయమై ఈ ఘటన సృష్టించిన వాతావరణంలో కొద్ది అస్పష్టతను ఒక ఎత్తుగడగా ధ్వనింపజేసారు తప్ప చర్చల వాయిదా అంటూ మాట్లాడలేదు. గతంతో పోల్చితే ఇదంతా కొత్తస్థితే. అయితే ఈ స్థితి ఇక స్థిరపడిపోయింది, దీర్ఘకాలంపాటు కొనసాగుతుందని అన టం లేదు. అటువంటి హామీ ఎవరూ ఇవ్వలేరు. అది మునుముందు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో, కనీసం ప్రస్తుతానికి, ఇదొక గమనార్హమైన తేడా అన్నది మాత్రం నిజం.
ఎందుకీ తేడా అన్నది అసలు ప్రశ్న. పైన ఒక దౌత్యనీతి సూత్రం గురించి చెప్పుకొన్నాము. దానిని మోదీ, షరీఫ్ గుర్తించినట్లా? అందుకు అదనంగా మరొకటి ఉంది. వీరిద్దరూ ఆర్థికాభివృద్ధివాదులు. అందుకోసం దక్షిణాసియాలోని రెండు ప్రధాన దేశాలైన భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడాలనే సూచనలు ఇతరత్రా కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. షరీఫ్ తన 1999 ఎన్నికల ప్రచార కాలంలో ఈ వాదనను బలంగా ముందుకుతెచ్చి ప్రచారాలు చేసారు. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో తాను ప్రపంచంలో చాలా పర్యటించానని, అన్ని దేశాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయని, బాగా వెనుకబడిన భారత్, పాకిస్తాన్‌లు మాత్రం పరస్పర వైరంతో అపరిమితమైన ధనాన్ని సైన్యంపై ఖర్చుచేస్తున్నాయని, కనుక సంబంధాలను వృద్ధిచేసుకుని పేదరికాన్ని నిర్మూలించాలని అపుడు తను పదే పదే చెప్పినమాటలను మరిచిపోలేము. ఆ దిశలో తను ప్రయత్నించటం జనరల్ ముషార్రఫ్ కార్గిల్ ఎత్తుగడకు, షరీఫ్‌పై సైనిక కుట్రకు ఒక ముఖ్యకారణం. ఇటువంటి దృష్టిగల వ్యక్తి తిరిగి ప్రధాని అయ్యారు. మోదీది కూడా ఆర్థికాభివృద్ధి దృక్పథమే. ‘మోదీ-షరీఫిజం’ అంటున్నది దీనినే.
ఇది ముందుకు పోతుందా అన్నది ప్రశ్న. ఇందులో కొన్ని సమస్యలున్నాయి. వాటిలో రెండు తక్షణమైనవి. పఠాన్‌కోట్ పరీక్ష నుంచి వారు బయటపడుతున్నట్లేనా అన్నది మొదటిది. వారిద్దరి దృష్టి ఒకటే అని మనం భావిస్తూ దానికి ‘మోదీ-షరీఫిజం’అనే పేరైతే పెడుతున్నాముగాని, వారి అవగాహన కూడా ఇదేనని చెప్పలేం గదా. కనుక ఇది రెండవ తక్షణమైన ప్రశ్న అవుతున్నది. ఇక మిగిలినవి ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఐఎస్‌ఐ అక్కడి రాజకీయ నాయకులనుంచి స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్నది తెలిసిందే గనుక అవి ఏంచేస్తాయి? అక్కడి టెర్రరిస్టులు, మిలిటెంట్లు బేనజీర్‌ను హత్యచేసి, జనరల్ ముషార్రఫ్‌పై హత్యాయత్నాలు చేసినవారు గనుక ఇప్పుడు ఊరుకుంటారా? కశ్మీర్ సమస్య పెచ్చరిల్లుతూనే ఉంటుంది కనుక అది ఎప్పుడే విధంగా పరిణమించవచ్చు? ఆప్ఘన్ మిలిటెంట్లకు, ఐఎస్‌ఐఎస్‌కు ప్రధాన కార్యక్షేత్రం ఇండియా- పాకిస్తాన్‌లు కాకపోయినా చిన్న సంబంధం ఉన్నందున మునుముందైనా వారిపాత్ర ఏమికావచ్చును? యధాతథంగా ఉభయ దేశాలలోని సాధారణ ప్రజలు పరస్పరం సత్సంబంధాలను కోరుకుంటున్నా, వారిని ప్రభుత్వాలు, పార్టీలు అదే దృష్టితో ఉండనిస్తాయా వికటింపజేస్తాయా? ఇవన్నీ సీరియస్ ప్రశ్నలే. వీటన్నింటి మధ్యనుంచి మోదీ-షరీఫిజం నెగ్గుకురావలసి ఉంటుం ది.
ఇప్పటికైతే పఠాన్‌కోట్ గండం కడతేరినట్లు కనిపిస్తున్నది. అందుకు ఉభయ ప్రధానులను అభినందించాలి. ఆ దాడిని ఖండించి, మోదీతో స్వయంగా మాట్లాడి షరీఫ్ మంచి పనిచేసారు గాని, దాడి బాధితుడై ఉండి సంయమనం చూపిన మోదీని అంతకన్న ఎక్కువగా అభినందించాలి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)