సంపాదకీయం

‘వైరుధ్య’ ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలసీమలో ఉపాధిని కోల్పోయిన గ్రామీణులు లక్షల సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసపోతుండడం ప్రతీక మాత్రమే! దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను గ్రామీణ ప్రాంతాలవారు క్రమంగా ఉపాధిని కోల్పోయి పట్టణాలకు నగరాలకు ఉరుకులెత్తుతుండడం అసలు సమస్య! అంతర్జాతీయ రాజధానిని నిర్మించడంలో తలమునకలై ఉన్న అవశేషాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమనుంచి తండోపతండాలుగా తరలిపోతున్న వ్యవసాయ దారులను, వ్యవసాయ శ్రామికులను పట్టించుకునే స్థితిలో లేడు! భాగస్వామ్య సదస్సుల పేరుతో శత్రుదేశమైన చైనాను సైతం అమరావతి నిర్మాణానికై ఆయన ఆహ్వానిస్తుండడం అంతర్జాతీయ స్థాయికి నిదర్శనం! చంద్రబాబు నాయుడి ఈ అంతర్జాతీయ ప్రవర్తన సైతం ప్రతీక మాత్రమే! దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ ప్రభుత్వాల నిర్వాహకులూ, కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు సైతం ప్రపంచీకరణ మాయలేడి కల్పిస్తున్న ప్రగతి భ్రాంతి ప్రవాహాలలో ఓలలాడుతున్నవారే! చిత్ర విచిత్ర పదజాలాలు పుట్టుకొచ్చాయి! నాజూకు నగరాలు, అమృత నగరాలు, వాణిజ్యనగరాలు, సాంకేతిక నగరాలు, బుల్లెట్ రైళ్లు, హరిత శోభల రహదారులు...ఇంకా ఎనె్నన్నో ప్రగతి కేంద్రాల గురించి ఆదర్శ నగరాల గురించి నమూనాల గురించి పెద్దఎత్తున ప్రచారం జరిగిపోతోంది! ప్రగతి సాధనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు అంతర్జాతీయ స్థాయి గురించి ఆపై స్థాయి గురించి- అంతరిక్ష స్థాయి కాబోలు- మాత్రమే ప్రసంగిస్తున్నారు. ఇలా పైపైకి చూస్తున్న ప్రభుత్వ నిర్వాహకులకు నేలపై నెలకొంటున్న వైపరీత్యం కనిపించడం లేదు! వేలాది మందికి గొప్ప ఉపాధి లభిస్తుండగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోతుండడం ఈ వైపరీత్యం! బుల్లెట్ రైళ్లు వద్దని కాని హరిత రాజపథాలు ఏర్పరచరాదని కానీ ఎవ్వరూ కోరుకోరు. కానీ మొదట రహదారులకు ఇరువైపులా ఉన్న హరిత శోభలను ధ్వంసం చేసిందెవరు? ఎక్స్‌ప్రెస్ హైవేలు ఏర్పడి దశాబ్దులు గడిచిపోతున్నప్పటికీ ఈ దారుల పక్కన పచ్చని చెట్లను పెంచనిది ఎవరు? ఇప్పుడు వేలాది కిలోమీటర్ల పొడవునా బోసి రహదారులు వెక్కిరిస్తున్నాయి. కాబట్టి మరో పథకం, మళ్లీ బహుళ జాతీయ సంస్థల రంగప్రవేశం...
రాయలసీమలో మాత్రమే కాదు, తెలంగాణలోను, ఉత్తరాంధ్రలోను, దేశంలోని ఇతరేతర ప్రాంతాలలోను కూడ గ్రామీణ ఉపాధి దశాబ్దుల తరబడి సన్నగిల్లిపోతుండడంవల్ల మాత్రమే నగరాలలో జనాభా కేంద్రీకృతమవుతోంది, ఫలితంగా నగరాలు ఇరుకైపోయాయి, నిలువున పెరిగిన అంతస్థుల సౌధాలు ప్రతి చదరపు గజంలోను జనసాంద్రతను పెంచాయి! పట్టణీకరణ, నగరీకరణ నిలువున పెరగడంవల్ల మాత్రమే కాలుష్యం కేంద్రీకృతం అయింది. భూగర్భ జలం ఇంకిపోయింది! పది ఇళ్లు కూల్చి అదే స్థలంలో వంద ఇళ్లు ఉండే విధంగా అంతస్థుల భవనాలు నిర్మించడంవల్ల ఏమయింది? ఒక కుటుంబం నివసించిన చోట పది కుటుంబాలను కుక్కేశారు, ఒక వాహనం వున్న చోట పది వాహనాలు చేరాయి. లీటర్ భూగర్భ జలం అవసరమైన చోట పది లీటర్ల భూగర్భ జలం కావలసి వచ్చింది! కాలుష్యానికి రహదారులు పట్టక పిక్కటిల్లి పగిలిపోతుండడానికి ఈ నిలువు ప్రగతి కారణం! ఒకటి రెండస్థుల జనావాసలలో నగరాలు అడ్డంగా విస్తరించి ఉండినట్టయితే ఎంతమంది గ్రామీణులు వచ్చి చేరినప్పటికీ పట్టణాలు పగిలిపోయేది కాదు! ఇదంతా తెలిసి కూడ మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఇరవై అంతస్థుల, వంద అంతస్థుల భవనాలను నిర్మించి కాలుష్యాన్ని కేంద్రీకరిస్తారట! ఇది మొదటి వైపరీత్యం, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేని స్థితి ఎందుకు ఏర్పడుతున్నదానిపై ప్రభుత్వ నిర్వాహకులు దశాబ్దుల తరబడి దృష్టి పెట్టకపోవడం రెండవ వైపరీత్యం...గ్రామాలలో ఉపాధి ఉన్నట్టయితే గ్రామీణులు పట్టణాలకు రానేరారు...కాలుష్యరహితమైన ప్రాకృతిక పరిసరాలను వదిలి వచ్చి నగర నరకాలలోకి చీకటి గదులలో కూరుకుపోవడం పల్లె ప్రజలకు సరదా కాదు!
రాయలసీమలోను, ఉత్తరాంధ్రలోను వ్యవసాయం జరుగుతున్న విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది! అందువల్ల రైతులు వ్యవసాయ శ్రామికులు బయటి ప్రాంతాలకు వెళ్లిపోతున్నారట! రాయలసీమ జిల్లాలనుండి గత ఏడాది ఆరు లక్షలమంది కర్నాటక, తమిళనాడు తదితర ప్రాంతాలలోని పట్టణాలకు వలస వెళ్లారన్నది అధ్యయనాలలో వెల్లడైన వాస్తవం! అనేక గ్రామాలలో చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రమే మిగిలి ఉన్నారట! గ్రామీణ ఉపాధి పథకం ఏడాదికి వందరోజుల పాటు పని, ఉపాధి లభిస్తోంది! చౌక ధరలకు నిత్యావసర వస్తువులను ఆహార భద్రత పథకం కింద ప్రభుత్వం సమకూర్చుతోంది...అయినప్పటికీ గ్రామీణులు పట్టణాలవైపు ఎందుకని పరుగులు తీస్తున్నారు? రాయలసీమలో గత ఏడాది మాత్రమే, దేశమంతటా ఇరవై ఏళ్లుగా పల్లె జీవనం పాడుపడిపోతోంది! దేశంలో ప్రపంచీకరణ వ్యవస్థీకృతం అయి కూడ ఇరవై ఏళ్లుఅయింది...ప్రపంచీకరణ ప్రభావం వల్ల వ్యవసాయం అప్పుల ఊబిలో కూరుకుని పోయిందన్న వాస్తవాన్ని విశ్వసించే స్థితిలో కూడా ప్రభుత్వాలు లేవు! ఈ ఇరవై ఏళ్లలో సన్నకారు రైతులు మరీ బక్కచిక్కిపోవడం దేశమంతటా నెలకొంటున్న కఠోర వాస్తవం! 1992లో సన్నకారు రైతునకు సగటున రెండున్నర ఎకరాల భూమి ఉండేదట...ఒక సన్నకారు కుటుంబానికి ఒక హెక్టారు భూమి! కానీ ప్రస్తుతం సన్నకారు రైతుల కుటుంబానికి, దేశం మొత్తంమీద, సగటున ఒక ఎకరా, మరో పాతిక ఎకరా మాత్రమే భూమి ఉందట! అధ్యయన సంస్థలు నిగ్గుతేల్చిన నిజం ఇది. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయదారులలో సన్నకారు రైతులు ఎనబయి శాతం..అంటే ఏమిటి? ఎనబయి శాతం వ్యవసాయదారులకు 1992 ఉన్న భూమిలో దాదాపు సగం అన్యాక్రాంతమైంది! గ్రామీణ ప్రాంతంలోని ఏడు శాతం సంపన్న రైతుల కుటుంబాలవారు పదమూడు శాతం మధ్యతరగతి రైతులు పట్టణాలకు వలసపోవడం లేదు! సన్నకారు రైతుల కుటుంబాల వారే గ్రామాలలో బతకలేక పట్టణాలవైపు పరుగులు తీస్తున్నారు!
సన్నకారు రైతుల వ్యవసాయ భూమిలో సగాన్ని ఎవరు కాజేసినట్టు? ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో దురాక్రమిస్తున్న బహుళ జాతీయ సంస్థలవారు..గ్రామాలలోని సంపన్న భూస్వాములు ఏడు శాతం మంది...్భనిధి-లాండ్ బ్యాంక్-పేరుతో భూమిని కొని ఖాళీగా ఉంచుతున్న పారిశ్రామిక సంస్థలు కొన్ని... ప్రగతి పేరుతో భూమిని సమీకరిస్తున్న ప్రభుత్వాలు! ఇలా విధాలు అనేకంగా విస్తరించి వ్యవసాయ భూమిని కాజేస్తున్నాయి! ఈ ప్రపంచీకరణ వ్యవస్థ పచ్చని పొలాలను ఇలా పాడుచేస్తోంది! అందువల్లనే గ్రామీణ ప్రాంతంనుండి నగరాలకు జనం వలస వెడుతున్నారు. ఇలా పట్టణీకరణ పెరుగుతుండడంవల్ల పట్టణాలలోను నగరాలలోను జీవనస్థితిగతులను మెరుగుపరచాలన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం. నాజూకు నగరాలు, అమృతనగరాలు..! కానీ వలసలను నిరోధించి మళ్లీ గ్రామాలకు జనాన్ని తరలించడం గురించి ప్రభుత్వాలకు ధ్యాసలేదు!