సబ్ ఫీచర్

భవ్య భారతమే ఆయన లక్ష్యం ( నేడు వివేకానందుని జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వామి వివేకానందునిది విలక్షణ వ్యక్తి త్వం. నరేంద్రుడుగా వారు ఒక జ్ఞాన పిపాసి. ప్రశ్నించే తత్వం ఆయన ప్రత్యేకత. శ్రీరామకృష్ణుని శిష్యరికంతో పరిపూర్ణ ఆధ్మాత్మికత వారికి తోడైంది. ‘‘అర్హత కలిగిన శిష్యుడేనా’’ అన్న లక్ష్యంతో ప్రపంచంలో కొత్త శిష్యులకు గురువు పరీక్షలకు పెట్టడం సాధారణం. దీనికి పూర్తి భిన్నంగా నరేంద్రుడు శ్రీరామకృష్ణుడిని ప్రశ్నించడంతోనే వారి పరిచయం ప్రారంభమైంది. నరేంద్రునికి ‘దుర్గామాత’ దర్శనమైంది. నరేంద్రుని జీవనలక్ష్యం నిర్ణయమైంది. నరేంద్రుడు శ్రీరామకృష్ణుడికి తన జీవనాన్ని సమర్పించుకున్నారు. ‘‘సనాతన ధర్మం పట్ల సరైన అవగాహనను కల్గించడమే’’ శ్రీరామకృష్ణులు తనకందించిన జీవన సందేశమని స్వామి వివేకానందులు స్వయంగా చెప్పుకున్నారు. భవ్య భారతం కొరకు, ప్రపంచ ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఆయన జీవించారు.
శాంతి వల్లనే ఆధ్యాత్మిక ఉన్నతి
తన మతమే సత్యమైనదనీ, ఇతర మతాలన్నీ నరకానికి మార్గాలన్న సంకుచిత, దురహంకార ధోరణితో క్రైస్తవ, ఇస్లాం మతాలవారు వ్యవహరించిన కారణంగా ప్రపంచంలో 700-800 సంవత్సరాలు ‘‘పవిత్ర యుద్ధాలు’’ పేరున మారణ హోమం, రక్తపాతం జరిగింది. అనేక స్థానిక మతాలు, సంస్కృతులు నాశనం చేయబడ్డాయి. మతమంటే ద్వేష భావనను నిర్మించే సిద్ధాంతాలు పుట్టడానికి కారణమయ్యే పరిస్థితులు సృష్టించబడ్డాయి. ‘‘సర్వపంధ-సమభావన’’ ఆధారంగా గల సనాతన హిందూ ధర్మం పునాదుల ఆధారంగా ప్రపంచ శాంతి సాధ్యమని స్వామి వివేకానందుడు పేర్కొన్నారు. ఏమతమైనా ముక్తికి దారి చూపుతుంది, మతమార్పిడి రాజకీయాలు అవసరం లేదని చికాగో ప్రపంచ సమ్మేళనంలోని వారి సందేశం ప్రపంచ మేధావులందర్నీ ఆకర్షించింది. ‘‘ప్రపంచంలోని మానవులందరూ ఆధ్యాత్మిక ఉన్నతిని’’ సాధించేవరకు తాను తిరిగి, తిరి గి జన్మిస్తూనే ఉంటానని స్వామీజీ పేర్కొన్నారు. యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్తల జీవితాలు, జీవన సందేశాలను గౌరవిస్తూనే వారి అనుయాయులు చేసిన, చేస్తున్న దురాగతాలను నిర్మొహమాటంగా స్వామీజీ ఖండించారు.
క్రైస్తవ మతదేశాల గడ్డపై ‘‘యేసుక్రీస్తు నిజమైన సందేశాన్ని’’ తెలియజేస్తూ స్వామీజీ చేసిన ప్రసంగాలను క్రైస్తవ మత పెద్దలు సైతం ఆశ్చర్యంతో, ఆనందంతో విన్నారు. స్వామీజీ విదేశాలలో సనాతన ధర్మ విశిష్టతను భారతదేశ ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ప్రసంగాలు చేశారు. వారు చేసిన ప్రసంగాల ప్రభావం వల్ల విదేశీయులలో భారతదేశం పట్ల, సనాతన ధర్మం పట్ల, అపోహలు పోయి, గౌరవం ఏర్పడింది. విద్య పేరున, ఉపాధి పేరున వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయ జీవన విలువలను ఆయా దేశాల ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలియజేయాలి. ప్రపంచ శాంతి దిశలో ఆయా దేశాల సర్వతోముఖ అభివృద్ధికి సహకరిస్తూ నిజమైన భారతీయ ప్రతినిధులుగా విదేశాలలోని భారతీయులు వ్యవహరించాలి. దానికై వివేకానందుని సందేశాన్ని ఈ దిశలో అధ్యయనం చేయాలి, ఆచరించి చూపాలి
విదేశీ పర్యటనల అనంతరం ‘‘కోలంబో నుండి అల్మోరా’’ వరకు భారతీయులను ఉద్దేశించి స్వామీజీ చేసిన ప్రసంగాలు విభిన్నమైనవి. భారతీయులలో స్వదేశీ, స్వధర్మాల పట్ల ఆత్మవిశ్వాసాన్ని నింపడం, పరోక్షంగా అనేక మంది యువతీ యువకులను స్వాతంత్రోన్ముఖులను గావించడం, భవ్య భారత నిర్మాణం కొరకు- పేదరిక నిర్మూలన, అందరికీ అందుబాటులో విద్య, విదేశాలనుండి సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల దిగుమతి చేసుకొని మనదేశ అవసరాలకు అనుగుణంగా స్వదేశంలో పరిశోధనలు ప్రారంభించడం, మహిళల అభ్యుదయం, నిమ్న వర్గాల, శ్రామికుల ఉన్నతికై పెద్దపీట, అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలన-్భరతమాతనే సర్వస్వంగా ఆరాధిస్తూ పేద ప్రజలను సేవించే యువత లక్ష్యంగా వారి ఉపన్యాసాలు సాగాయి. మతానికి సేవకు నూతన అర్థాన్ని వారు మనముందుంచారు. శ్రీరామకృష్ణమఠంతో పాటు, రామకృష్ణామిషన్‌ను ప్రారంభించడం ద్వారా ముక్తి సాధనకు ప్రజాసేవను జోడించారు. కాషాయ వస్తధ్రారులు ప్రజల ఇహపరమైన ఉన్నతికై చేయవలసిన పనులను తెలియజేశారు.
స్వామి వివేకానందుడు, సోదరి నివేదిత మనకు అందించిన నిజమైన భారతీయ విద్యావిధానాన్ని ఇంకా మనం రూపొందించుకోలేదు. అందరికి విద్య, వ్యక్తులలోని గుణగణాలను వికసింపజేసే, సమాజహితానికి ఉపయోగపడే భృతిని, జ్ఞానాన్ని కలిగించే విద్యావిధానం మనం రూపొందించుకోవాలి. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు దేశభక్తులైన యువతీ, యువకులను నిర్మించే కేంద్రాలు కావాలి. భారతీయ విద్యపై వివేకానందుని బోధనల ఆధారంగా మరిన్ని ప్రయోగాలు నిర్వహించాలి.
ఒకే నాయకత్వం కింద అందరూ కలిసిమెలసి పనిచేసే ఆవశ్యకతను వారు తెలియజేశారు. కార్యకర్తలకు, నాయకులకు, అవసరమైన గుణగణాలను వారు వివరించారు. భారతదేశ అభివృద్ధికొరకు భారతీయులందూ కలిసిమెలసి పనిచేయడం నేర్చుకోవాలి. సామాజిక అసమానతలు లేని, అందరికీ జ్ఞానం పొందే హక్కు, ఏ వృత్తినైనా స్వీకరించే హక్కు, సమాన గౌరవం, సమాన అవకాశాలు గల సమాజ నిర్మాణం కొరకు యువ తీ, యువకులు పనిచేయాలని స్వామీజీ ఆశించారు. ఆర్ధిక సంపాదనే లక్ష్యంగా పరుగులెత్తే ధోరణిని విడనాడి ధర్మంతో కూడిన అర్ధ-కామల సాధనకు కొరకు, విలువలతో కూడిన జీవనాన్ని గడపడానికి అంతా కృషి చేయాలి.
స్వామీజీ బోధనలను కంఠస్తం చేయడంతోపాటు వారి సందేశాన్ని అమలు చేయడం కోసం యువకులు బృందాలుగా ప్రయోగాలు చేపట్టాలి. వివేకానందుని జీవన విశేషాలను హైస్కూల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. దేశ పునర్‌నిర్మాణానికి స్వామీజీ ఇచ్చిన సందేశాన్ని కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయాలి.

-కె. శ్యాంప్రసాద్ సెల్: 09440901360