మెయన్ ఫీచర్

జాతిని నిర్మించేది వ్యక్తిత్వాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు?’అని అడిగితే పదికి ఒకరిద్దరు సరియైన సమాధానమిస్తే అది విశేషమే అవుతుంది. అవును మరి శ్రీ మాణిక్‌సర్కార్ అంత నిరాడంబరమైన ముఖ్యమంత్రి. కానీ ‘దిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు?’ అని అడిగితే పదికి పదిమందీ సరియైన సమాధానమే చెపుతారు. అవును మరి! చెప్పుకోదగిన స్థిరమైన మంచి పని ఏదీ చేయకపోయినా శ్రీ అరవింద్ కేజ్రీవాల్ తనకుతాను అంత పబ్లిసిటీ తెచ్చుకున్న ముఖ్యమంత్రి.
దేశంలోని 29 రాష్ట్రాలలో త్రిపుర కూడా ఒకటి. చిన్నదే కానీ, దేశంలో అత్యంత నిజాయితీగా పనిచేసే యంత్రాంగం, వ్యవస్థలు కలిగివున్న రాష్ట్రంగా త్రిపురను నడిపిస్తున్నారు శ్రీ మాణిక్‌సర్కార్. త్రిపురలో ఆయనకు సాటిరాగల నాయకుడు దరిదాపుల్లో ఒక్కరు కూడా లేరు. కానీ ఆయన పబ్లిసిటీకి చాలా దూరంలో ఉంటారు. ఆయన నిజాయితీ, నిబద్ధత తెలిసిన త్రిపుర ప్రజలు ఆయనకు ఇరవై ఏళ్లుగా పట్టంకడుతూనే వున్నారు. ఆయనకు సొంత ఇల్లులేదు, కారు లేదు. రోజూ కార్యాలయానికి సైకిల్ మీద కానీ నడుచుకుంటూ కానీ వెళతారు. ముఖ్యమంత్రిగా వున్నందుకు ఆయనకొచ్చే జీతాన్ని ఆయన తన పార్టీ అయన సిపిఎంకు ఇచ్చివేస్తారు. తనదగ్గర పైసా కూడా ఉంచుకోరు. పార్టీ ఆయనకు నెలకు 5000 రూపాయల జీతం చెల్లిస్తుంది. దానితోనే ఆయన, ఆయన భార్య నెల పొడుగునా జీవనం చేస్తారు.
ఇపుడు దిల్లీ ముఖ్యమంత్రి విషయానికొద్దాం. ఎన్నికల సమయంలో స్వయానా ఆయనే ఇచ్చిన ‘డిక్లరేషన్’ ప్రకారం, అరవింద్ కేజ్రీవాల్‌కు రెండు స్వంత భవనాలున్నాయి. ఇవికాక, ఆయన ఇపుడు ప్రభు త్వం ద్వారా వచ్చిన ఒక పెద్ద బంగళాలో వుంటున్నారు. ఇక జీతమంటారా? నెలకు 2 లక్షల రూపాయలు. 2015 ఫిబ్రవరిలో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న తొలి నిర్ణయాలలో, తనతోపాటు శాసనసభ్యుల జీతాన్ని ఏకంగా 400 శాతం పెంచేసుకోవడం. అవినీతి, నల్లదనం... లాంటి అంశాలకు వ్యతిరేకంగా మొదలైన అన్నాహజారే ఉద్యమాన్ని తనకు అనుకూలంగా వాడేసుకుని కేజ్రీవాల్ ‘ఆప్’ను స్థాపించారు. కానీ అదే కేజ్రీవాల్ 2015 ఎన్నికలప్పుడు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు చెక్కులను (అంటే 2కోట్ల రూపాయల నల్లధనం) తీసుకున్నారు.
త్రిపురను పాలిస్తున్నది సిపిఎంకు చెందిన శ్రీ మాణిక్‌సర్కార్. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్నది సిపిఎం సిద్ధాంతానికి బద్ధశత్రువైన భారతీయ జనతాపార్టీ. అయినా శ్రీ మాణిక్‌సర్కార్ కేంద్రంతో ఎప్పుడూ ఘర్షణకు దిగలేదు, దిగడు కూడా. అది ఆయన స్వభావం కాదు. ఎంతో హుందాగా పరిపక్వతతో కేంద్రంతో వ్యవహరిస్తుంటారు. ఇపుడే కాదు, గత ఇరవై ఏళ్ళలో శ్రీ వాజ్‌పేయి, శ్రీ మన్మోహన్‌సింగ్‌లు ప్రధానులుగా వున్న సమయంలో కూడా శ్రీ మాణిక్‌సర్కార్ వాళ్ళతో ఎంతో చక్కటి సంబంధాలు కలిగివుండేవారు.
దిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రం కాదు. అది ఒక కేంద్ర పాలిత ప్రాంతమనే ఇప్పటికీ చెప్పాలి. దాని ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఒక చిన్న మునిసిపాలిటీకి కమిషనర్‌గా వున్న వ్యక్తికంటే ఎక్కువ అధికారాలుండవు. కానీ కేజ్రీవాల్ చేసే హడావుడి అంతాఇంతా కాదు. అయిన దానికి, కానిదానికి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతుంటాడు. ప్రధాని మోదీకి అనవసరమైన అపవాదులు అంటగడుతుంటాడు. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులపై ఆధారాల్లేని అసత్య ఆరోపణలు చేస్తుంటాడు. ఇప్పటికే ఒకసారి కేంద్రమంత్రి నితీష్‌గడ్కారీ మీద అసత్య ఆరోపణచేస్తే, గడ్కరీ, కేజ్రీవాల్ మీద పరువునష్టం దావావేసాడు. కేజ్రీవాల్ చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని కోర్టుతీర్పుచెప్పింది. కోట్లాది రూపాయల పరువు నష్టం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో, కేజ్రీవాల్ తోకముడిచి గడ్కరీకి క్షమాపణ చెప్పాడు. ఇపుడు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీద కూడా ఆరోపణలు చేసాడు. ఈ కేసులోకూడా కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తప్పదు. ఇలాంటి సంచలనాలు చేయడం, దానిద్వారా ప్రచారం పొందడం అనే వాటిమాటున తన ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల పర్యవసానంనుండి ప్రజల దృష్టినికూడా మరలించవచ్చు. ఇప్పుడు ఇదే జరుగుతోంది.
‘ఆప్’చేసిన ఎన్నికల వాగ్దానాల్లో ‘ఉచిత మంచినీరు’ దిల్లీలో అందరికీ అందడం లేదు, ‘తగ్గించిన విద్యుత్ బిల్లులు’ డబ్బున్నవారికే ప్రయోజనకరంగా మారుతున్నాయి. షీలాదీక్షిత్ అవినీతి ఆరోపణలపై, అధికారంలోకొచ్చిన 15రోజుల్లో సిబిఐ విచారణ చేస్తామన్న మరో వాగ్దానం అటకెక్కింది. తాజాగా ‘గొప్ప సంచలన నిర్ణయమని’ మీడియా నెత్తికెత్తించుకున్న సరి, బేసి కార్ల వాడకం, కాలుష్య నివారణకు ఏమా త్రం ఉపయోగపడకపోగా, పౌరులకు కష్టాలు తెచ్చిపెడుతోందని జనవరి 6వ తేదీనాడు దిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. సరి-బేసి కార్ల వాడకం నెపంతో కేజ్రీవాల్, ఆయన అనుచరులు మాత్రం ఒక్కొక్కటి 8 నుండి 12 లక్షల రూపాయలు విలువచేసే 10 కొత్త కార్లు కొనేశారు. అదంతా ప్రజలనుండి పన్నుల రూపంలో ప్రభుత్వానికి అందిన డబ్బు. కార్యక్రమం అయిపోతుంది. కేజ్రీవాల్‌కు కార్లు మిగిలిపోతాయి.
ఇపుడు కొంచెం వెనక్కువెళదాం. లాల్‌బహదూర్‌శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.
మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్ర్తీగారికి ఈ విషయం తెలి పారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దానె్నలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా?
స్వాతంత్య్ర పోరాట సమయంలో, ఆంగ్లేయులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు చెందిన ఒక పెద్ద బంగళాను స్వాధీనంచేసుకుని వేలంపాటకు పెట్టారు. అపుడు, కుటుంబానికి దూరంగాఉండిన ప్రకాశంగారు తన కుటుంబ సభ్యులకు ఉత్తరం వ్రాస్తూ, ‘‘బంగళా వేలానికి పెడితే పెట్టనివ్వండి. మీరుమాత్రం ఆంగ్లేయులకు జరిమానా కట్టకండి’’అని చెప్పారట. అంత పెద్దబంగళాను ఎందుకు వదువలుకోవాలి? ఎంతోకొంత జరిమానా కడితే పోలా? అని కుటుంబ సభ్యులంటే, ‘‘బంగళా వ్యామోహంలో పడకండి. దాన్ని వేలంపాటకు పెడితే మన ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది. జరిమానా మాత్రం కట్టకండి. దేశ ప్రతిష్ఠకంటే మన బంగళా గొప్పదేమీకాదు’’ అని గట్టిగా బదులు ఉత్తరం వ్రాసారట.
దేశ ప్రధాని కాకముందు లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీఅయ్యారు. అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితాశాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయ త్నం కారణంగా ఇనే్నళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. దేశ ప్రధాని ఐన లాల్‌బహదూర్‌శాస్ర్తీ. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మించేది.
1930లో భౌతిక శాస్తవ్రేత్త శ్రీ సి.వి.రామన్‌కు నోబెల్ బహుమానంతోపాటు తనకు అందిన పెద్దమొత్తాన్ని భారతదేశంలో శాస్త్ర పరిశోధనకే ఖర్చుపెట్టారు. 1998లో ఆర్థిక శాస్తవ్రేత్త శ్రీ అమర్త్యసేన్ కూడా నోబెల్ పురస్కారాన్ని, కోట్లాది రూపాయల మొత్తాన్ని అందుకున్నారు. దానితో ఆయనేమిచేశారో తెలియదుకానీ, ఆయన్ని సోనియాగాంధీనలందా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించాక, భారత ప్రభుత్వం కేటాయించిన రూ. 5000కోట్ల నిధుల్లో మాత్రం చాలావరకూ దుర్వినియోగం చేసారు. సి.వి.రామన్ మన సనాతన ధర్మం పట్ల శ్రద్ధ, నిష్ఠకలిగి వుండిన జాతీయవాది అయితే, అమర్త్యసేన్ సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని అనునిత్యం ద్వేషించే ‘కుహనా లౌకికవాది’. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయనకొచ్చిన 39 లక్షల రూపాయల జీతాన్ని, తనదగ్గర పనిచేసిన పోలీసుల కుమార్తెల చదువుకోసం విరాళంగా ఇచ్చేసారు నరేంద్రమోదీ. ఇది మీడియాలో రాదు. కేజ్రీవాల్ ఒక్కరోజు ‘ప్రచారంకోసం’ సైకిల్‌మీద ఆఫీసుకెళితే దాన్ని ఘనకార్యంగా చూపిస్తుంది అదే మీడియా. ప్రజలు వీటిని తెలుసుకోవాలి. నిజాయితీ ఏదో, నటన ఏదో నిగ్గుతేల్చాలి.

- పి.సతీష్ ఫోన్: 08554-242691