సంపాదకీయం

‘కంది’పోతున్న తిండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిల్లర ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండడం ఆర్థికవేత్తలకు హర్షం కలిగిస్తున్న పరిణామం! ధరలు పెరుగకపోవడం వల్ల తద్వారా ద్రవ్యోల్బణం పెరగకపోవడం వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడిపోతుందన్నది ఆర్థిక వేత్తల భయం! అందువల్ల సామాన్య ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా ధరలు ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతుండడమే ప్రగతికి చిహ్నమన్నది మేధావుల నిర్ధారణ! ఈ మేధావులు ప్రభుత్వ నిర్వాహకులకు సలహాదారులు! మన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయమైన గీటురాయిపై నిరంతరం రాచి రాచి రాటుదేల్చడం ఆర్థికవేత్తల లక్ష్యమైంది. నియంత్రించదగిన-మానేజబుల్ ఇన్‌ఫ్లేషన్-ద్రవ్యోల్బణం-అన్న పదజాలం తరచు ప్రచారమవుతూ ఉంది. ఎందువల్ల, కనీసం ఐదు శాతం స్థాయిలో ద్రవ్యోల్బణం పరిఢవిల్లాలన్నది సరిహద్దుల వెలుపలనుంచి మనకు సలహాలిస్తున్న స్వచ్ఛంద ఆర్థిక సంస్థల అభిప్రాయం! బొత్తిగా సున్న శాతం ద్రవ్యోల్బణం ఉండడం మాత్రం ప్రగతి చిహ్నం కాదట!కానీ సున్నశాతం ద్రవ్యోల్బణాన్ని సున్నశాతం ధరల పెరుగుదలను సామాన్య ప్రజలు కోరుతున్నారు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలలో ఉద్యోగులు కాని అధికాధిక సామాన్యులు కోరుతున్నారు! ఈ సామాన్యుల మాటను పెడచెవిన పెట్టడం దశాబ్దులుగా నడుస్తున్న చరిత్ర! బ్యాంకులిచ్చే ఋణాలపై బ్యాంకులలో జమఅయ్యే మొత్తాలపై సాధ్యమైనంత తక్కువ స్థాయిలో వడ్డీ ఉండాలన్నదే ప్రగతిశీలకుల ఆర్భాటం! ఇలా వడ్డీలు తక్కువగా ఉండడంవల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్నది ఆర్థిక వేత్తలే నిర్ధారించిన నిజం, తద్వారా ద్రవ్యోల్బణం కూడ పెరుగుతుంది! అయినప్పటికీ వడ్డీని తగ్గించవలసిందిగా గత ఏడాది మొత్తం కేంద్ర ఆర్థిక మంత్రి రిజర్వ్ బ్యాంకు వారిని కోరారు! ఫలితంగా గత ఏడాది మొత్తంలో నాలుగుసార్లు రిజర్వు బ్యాంకువారు వడ్డీని తగ్గించారు! ఇలా వడ్డీలను తగ్గించినప్పటికీ ఆధికారికంగా ద్రవ్యోల్బణం అతి తక్కువగా నమోదు కావడం గత ఏడాది చరిత్ర! అయితే ఇప్పుడిప్పుడే ఈ ద్రవ్యోల్బణం పెంపు చర్యలు ఫలితాన్ని ఇస్తున్నట్టు కేంద్ర గణాంక వివరాల కార్యాలయం-సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్-వారు వెల్లడించిన వివరాలవల్ల స్పష్టమైంది! చిల్లర ద్రవ్యోల్బణం పెరిగిపోతోందట! పెట్రోలియం పదార్ధాల ధరలు పెరగడంవల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయి తద్వారా వినిమయ వ్యవస్థలో పంపిణీకి గురి అవుతున్న పదార్ధాల ధరలు పెరిగిపోవడం గురించి దశాబ్దుల తరబడి ప్రచారం జరిగింది! అందువల్ల పెట్రోలియం ధరలు పెరిగినప్పుడల్లా ఉప్పు ధర పప్పు ధర బియ్యం ధర చక్కెర ధర పెరగడం మధ్యతరగతి ప్రజల వాణిజ్య అనుభవం! ఎందుకు ఉప్పు్ధర పెరిగిందంటే పెట్రోలు డీజిల్ నూనె ధరలు పెరిగాయి కదా! అన్నది సద్యస్ఫూర్తి సమాధానం! ఇది గతం! ఇప్పుడు పెట్రోలియం వస్తువుల ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. పెట్రోలు, డీజిల్ నూనెలు కారు చౌకగా లభిస్తున్నాయి! అయినప్పటికీ పప్పులు, కూరగాయల ధరలు ఎందుకని తగ్గడంలేదు? చిల్లర ద్రవ్యోల్బణం ఎందుకని పెరిగింది? కనీసం ప్రభుత్వ ప్రభుత్వేతర వాహనాలలో రవాణా, ప్రయాణ శుల్కాలు అయినా తగ్గాలి కదా! తగ్గలేదు...
సాధారణ ద్రవ్యోల్బణం దాదాపు సున్న స్థాయిలోను, ఇంకా తక్కువ స్థాయిలోను ఉన్నప్పుడు కూడ గత ఏడాది తొమ్మిది నెలలపాటు కందిపప్పు ధరలు గగనమంటి అనేక నెలలపాటు అంతరిక్షంలోనే విహరించాయి! మిరియాలు, మిరపకాయలు, మినపప్పు వంటి ఆహారం అనివార్యాల ధరలు కూడ పెరిగిపోయాయి! ఈ ధరలు ఇంతగా పెరుగుతున్నప్పుడు సాధారణ ద్రవ్యోల్బణం-హెడ్‌లైన్ ఇన్‌ఫ్లేషన్-పెరగకపోవడం ఆశ్చర్యకరం కాదు! ఎందుకంటే ఆహారం ప్రాతిపదికగా కాక విమానయాన శుల్కాలు, కంప్యూటర్ల ధరల ప్రాతిపదికగా సాధారణ ద్రవ్యోల్బణంలోని జీవనరీతి-్ఫ్యషన్! కానీ ఆహార ద్రవ్యోల్బణం, చిల్లర ద్రవ్యోల్బణం పెరిగి ఉండాలి కదా! అవి కూడ పెద్దగా పెరగకుండా ఐదు శాతం కంటె తక్కువలోనే ఉన్నాయన్నది ఆధికారిక నిర్ధారణ! అధికార నిర్ధారణలకు జీవన వాస్తవాలకు మధ్య అనుసంధాన సమన్వయం కుదరకపోవడమే అంతర్జాతీయ అనుసంధానం! అందువల్ల ద్రవ్యోల్బణం తగ్గిపోయినప్పటికీ కందిపప్పు ధరలు తగ్గలేదు! కందిపప్పును మానేసి కూరగాయలు ఎక్కువ తినడం గత ఏడాదిలో మధ్యతరగతి జీవన వ్యవహారం! ఈ సంగతిని పసికట్టిన వాణిజ్య వ్యవస్థ నిర్వాహకులు కూరగాయల ధరలను కూడ భయంకరంగా పెంచడం ఆంగ్ల నూతన సంవత్సరాది కానుక! అందువల్ల చింతపండు చారు మాత్రమే ప్రధాన వ్యంజనమైపోయింది!
ఈ చింతచారు ఆరోగ్యానికి మంచిది. అందువల్ల మన ఆరోగ్యాలను మెరుగుపరచడానికేనన్నట్టు గత ఏడాది కంది, ఉల్లి, కూరల ధరలు, మిరపకాయల ఘాటు పెరిగింది! ఇలా పెరిగిన సమయంలో ద్రవ్యోల్బణం సున్న! ఇప్పుడు మళ్లీ చిల్లర ద్రవ్యోల్బణం పెరుగుతోందట! దంతాలు లేని నోరు పరపరా నమిలి వేయగలిగినప్పుడు, దంతాలున్న నోరు ఇంకెంత గట్టిగా దంచగలదో మరి...అలాగే సున్న ద్రవ్యోల్బణం నమోదయినప్పుడే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన కంది పప్పు ధరలు ఇప్పుడు చిల్లర ద్రవ్యోల్బణం పెరగడం మొదలైన తరువాత ఇంకెంతగా పెరగనున్నాయో మరి! ఇలా కందిపప్పు ధరలు గత మే జూన్ నెల స్థాయి నాటి కిలో అరవై ఐదునుంచి కిలో రెండు వందల రూపాయలకు చేరడం గత ఏడాది కథ. తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత తక్కువకు కందిపప్పు సరఫరా చేసినప్పటికీ ఈ తక్కువ ధరలు కూడ జూన్‌స్థాయి నాటి ధరలకంటె చాలా ఎక్కువగా ఉన్నాయి! ధరలు కిలో రెండువందల రూపాయల స్థాయికి చేరిన తరువాత తాపీగా విదేశాలనుంచి కందిపప్పును దిగుమతి చేసుకొనడానికై టెండర్లను పిలిచారు. ఈలోగా నిలువ ఉంచిన వ్యాపారులు వందలాది కోట్ల రూపాయలను పెరిగిన ధరల రూపంలో మధ్యతరగతి ప్రజలనుంచి దోచిపారేశారు. నిరుపేదలకు ఈ కంది భోగం లేని సామాజిక వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం ప్రగతి ప్రగల్భాలను అభివృద్ధి ఆర్భాటాలను అపహాస్యం చేస్తున్న జీవన వాస్తవం! ప్రభుత్వపు పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే కిలో లేదా అరకిలో కందిపప్పు వారికి దిక్కు!
ఇప్పటికి కంది పప్పు ధరలు కొంత దిగి కిలో నూట అరవై ఐదు రూపాయల వద్ద స్థిరపడినాయి..అంతేకాని మళ్లీ గత జూన్ నెలకు ముందుండిన స్థాయికి కందిపప్పు ధరలు ఎప్పటికీ రావు! కందిపప్పు ధరలు 2010లో ఇలాగే ఒకేసారి రెండున్నర రెట్లు పెరిగి ఆ తరువాత రెండింతల స్థాయిలో స్థిరపడినాయి. ఈ వైపరీత్యం పునరావృత్తం కావడం ఐదేళ్లలో ఇది రెండవసారి! ఎనిమిదేళ్లలో బియ్యం ధరలు కూడ రెండున్నర రెట్లు పెరిగాయి! భూమినిధి-లాండ్‌బ్యాంక్-లను ఏర్పాటు చేసి లక్షల ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించి పరిశ్రమలకు అప్పగిస్తున్న ప్రభుత్వాల విధానాలవల్ల దీర్ఘకాల వైపరీత్యాలు సంభవించబోతున్నాయి! ఆహారం ధరలు మరింతగా పెరగనున్నాయి. నిరోధించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు జరపడం అనివార్యం!