మెయన్ ఫీచర్

అక్క చెల్లెళ్లవుతున్న ఇద్దరు ‘తల్లులు’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తల్లి, తెలంగాణ తల్లి ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు నవ్వ టం ఎట్టకేలకు మొదలైనట్లేనా? ఇరు రాష్ట్రాల ప్రజలకు కూడా వారిద్దరి ఉమ్మడి దీవెనలు లభించనున్నట్లేనా? అది జరగాలే గాని మొత్తం తెలుగు ప్రజలంతా సంతోషిస్తారంటే విభేదించేవారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. ఈ రెండు గడ్డల నుంచి మొదలుకొని దేశ విదేశాల్లోని తెలుగువారందరికీ అది ఆనందించదగ్గ పరిణామమే అవుతుంది. తెలుగువారికే కాదు కేంద్ర ప్రభుత్వం మొదలుకొని దేశమంతటికీ అది ఆహ్వానించదగినవుతుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కోసం టిడిపి-బిజెపి మొదటి ప్రచార సభ పనె్నండవ తేదీన నిజాం కాలేజ్ మైదానంలో జరిగింది. అందులో టిటిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఆ వేదికపై ఇతర నాయకులు ఎందురున్నా అందరి దృష్టి చంద్రబాబు ఏమి మాట్లాడగలరన్నదానిపైనే. అందుకు కారణాన్ని ఊహించటం కష్టం కాదు. ఎన్నికలకు సంబంధించి టిడిపి, తెలంగాణలో అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి కావటమన్నది సరేసరి. అదిగాక ఇరువురిమధ్య రాష్ట్ర విభజన తర్వాత కూడా వివిధ కారణాలవల్ల ఉద్రిక్తతలు కొనసాగాయి. ఓటుకు నోటు ఉదంతం సందర్భంగా పరాకాష్టకు చేరాయి. ఇవిగాక మరొక పరిస్థితి కూడా ఉంది. తెలంగాణలో తనంతట తానుగా కాని, బిజెపితో కలిసిగాని అధికారానికి రాగలననే ఆశ టిడిపికి లేదు. అంతమాత్రాన తెలంగాణలో పార్టీ శాఖను రద్దుచేయరు గదా. ఉనికిని వీలైనంత మేర కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. వేర్వేరు కారణాలవల్ల టిడిపి వెంట గల నాయకులు కొందరున్నారు. కొన్ని వర్గాల ప్రజలలో ఇంకా అభిమానులున్నారు. అదీకాక, టిడిడిపి జాతీయ పార్టీగా నిలిచేందుకు తెలంగాణలో చట్టప్రకారం కొన్ని ఓట్లు, సీట్లు అవసరమవుతాయి. ఇవి రాజకీయ కారణాలు కాగా, పరిపాలనాపరంగా చూసినపుడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇంకా రాజధాని. వచ్చే జూన్‌తో ఆరంభించి ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం కొత్త రాష్ట్రానికి తరలివెళ్లటం మొదలైనా, చివరి కార్యాలయం, చివరి ఉద్యోగి వెళ్లటానికి తగినంత కాలం అవసరం. అది జరిగినా సాంకేతికంగా 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అవుతుంది. ఈలోపలే తరలింపు ముగిసిపోయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనంతట తానుగా తమకిక ఉమ్మడి రాజధాని అవసరం లేదని కేంద్రానికి లిఖితపూర్వకంగా తెలియజేసి ఆ మేరకు గెజెట్ ప్రకటన కేంద్రం నుంచి వెలువడితే తప్ప.
కనుక ఈ వివిధ కారణాల రీత్యా తెలంగాణలో టిడిపి ఉనికి ఆ పార్టీ నాయకత్వానికి అవసరం. జిల్లాలో ఇక కష్టమన్నది గత సాధారణ ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరిగిన ఇతర ఎన్నికలలో స్పష్టమైనందున, తమ చివరి స్థావరమైన గ్రేటర్ హైదరాబాద్‌లో తమ బలాన్ని వీలైనంత ఎక్కువగా నిలబెట్టుకోవడం మరింతగా అవసరం. అది జరగాలంటే అందుకు చంద్రబాబు మాత్రమే పూనుకోవాలి. గత మున్సిపల్ ఎన్నికలలో, 2014 సార్వత్రిక ఎన్నికలలో గ్రేటర్ ప్రాంతంలో టిడిపి బలం గణనీయంగా కన్పించినా, తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి బాగా మారింది. టిడిపి నాటకీయంగా, వేగంగా బలహీనపడింది. సికింద్రాబాద్ కంటోనె్మంట్ ఎన్నికలు, ఆ తర్వాత నుంచి మొదలుకొని పార్టీని పెద్దఎత్తున వదలిపోతున్న నాయకులు, కార్యకర్తలు ఇందుకు రుజువు. ఇంకా మిగిలివున్న నాయకులలో హైదరాబాద్‌వారు గాని, మొత్తం తెలంగాణ వారుగాని చాలా బలహీనురు. దేవేందర్‌గౌడ్ స్థాయిగల నాయకుడైనా క్రియాశీలకంగా పనిచేయలేని పరిస్థితి ఉంది. పార్టీలో ఇటువంటి పరిస్థితులవల్లనే నైతిక స్థైర్యం దెబ్బతినగా, తెలంగాణలో పార్టీని చంద్రబాము ఎంతవరకు పట్టించుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది.
అందువల్లనే చంద్రబాబు గ్రేటర్ ఎన్నికల ప్రచార ప్రసంగానికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఖమ్మం, మహబూబ్‌నగర్‌లు చేజారి, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎంఎల్‌సి కూడా పోయిన తర్వాత మిగిలిన చిట్టచివరి ఆధారమైన గ్రేటర్‌లో సంకుల సమరం సాగించటం టిడిపికి ఒక తప్పనిసరి అవసరం. అందుకు తెలంగాణ టిడిపిని సమాయత్తపరచి టిఅర్‌ఎస్‌ఫై శతఘు్నలు పేల్చవలసింది చంద్రబాబు నాయుడు. కనుక ఆ పని జరగగలదని రెండు రాష్ట్రాలలో అందరూ ఆసక్తిగా ఎదురుచూడగా, అది జరగాలని తెలంగాణ టిడిపి గట్టిగా కోరుకుంది. కాని పార్టీ అధ్యక్షుని శతఘ్ని సువాసనలు వెదజల్లే పూలవర్షాన్ని కురిపించింది. వాటిలో తగినన్ని, తమను కురిపించిన యోధుని మనసెరిగి, తెలుగు తల్లి, తెలంగాణ తల్లులకు అభిషేకం చేసాయి.
చంద్రులిద్దరి మధ్య సఖ్యత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన పనుపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఇక్కడ గవర్నర్ నరసింహన్ ప్రయత్నాలు చేసి ఏమి సాధించారో తెలియదు గాని, కొంతకాలంపాటు ముఖ్యమంత్రులిద్దరు రాజ్‌భవన్‌లో మరెటో చూస్తూ కరచాలనాలు చేసుకునే ఫొటోలు మాత్రం కొన్నిసార్లు వచ్చాయి. కాని అయిష్టాలను పరస్పర అవసరాలు, కాలక్రమాన ఏర్పడే, ఏర్పడగల సదవగానలు ఇష్టాలుగా మార్చుతుంటాయి. అందుకోసం తెరవెనుక జరిగిందేమిటో తెలియదు గాని, మనకు బయట కన్పించినంతవరకు ఆరంభమనదగ్గది ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం అమరావతి శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును సగౌరవంగా ఆహ్వానించటంతో జరిగింది. అందుకు బదులును తెలంగాణ ముఖ్యమంత్రి తాను నిర్వహించిన అయుత చండీయాగ సందర్భంలో తీర్చారు.
ఇపుడు గ్రేటర్ ఎన్నికలు వచ్చాయి. నిజాం కాలేజీ వేదిక నుంచి చంద్రబాబు యుద్ధ శతఘు్నలతో అగ్నిగోళాలను వర్షించలేదు. తను పరిపాలించినపుడు హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధిపరచిందీ చెప్పారు. హైదరాబాద్ మున్సిపాలిటీని గెలవాలని, 2019తో తిరిగి అధికార సాధనకు అది నాంది కావాలని అన్నారు గాని ఆ స్వరంలో దృఢత్వం కన్పించలేదు. మొక్కుబడి మాట ధ్వనించింది. అదే ఊపులో, రెండు తెలుగు రాష్ట్రా లు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఆ మాట ఒకటికి రెండు సార్లన్నారు. అందులో దృఢత్వం తోచింది. గర్జనలకు బదులు సామరస్యత అన్నదానికి అర్థమేమిటో చెప్పనక్కరలేదు. అందులో కొత్త వాస్తవికతల గుర్తింపు వుంది. వాటిని మన్నించటం ఉంది. వాటిని అనుసరించటం అవసరమనే సందేశం ఉంది. కొత్త వాస్తవికతలనేవి రాష్ట్ర విభజన, టిడిపి ఒక అధికార పార్టీగా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కావటం, తెలంగాణలో ఉనికి అంటూ కొనసాగినా అంతకుమించిన లక్ష్యాలకు అవకాశం లేకపోవటం, అభివృద్ధి అవసరాలు రెండు రాష్ట్రాలకు ఉండటం, అందుకోసం పరస్పర సహకారంలోనే వివేకం వుందని గ్రహించటం, కలహాలవల్ల నష్టాలు తప్పవని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవటం అన్నమాట.
చంద్రబాబు ఈ విధమైన ఉపన్యాసం తెలంగాణ టిడిపి నాయకులకు రుచించగలది కాదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి వ్యాఖ్యలు కూడా అదేవిధంగా వున్నాయి. తామున్న బలహీన స్థితి, ఎదురుగా నిలిచిన బలమైన సవాళ్లను బట్టి వారు తమ పార్టీ అధ్యక్షునిపైన ఆశలన్నీ నిలుపుకున్నారు. కాని ఆయన ముఖ్యమంత్రివలె మాట్లాడారు. ఈ స్థితిలో గ్రేటర్ ఎన్నికలు ఏ విధంగా పరిణమించగలవన్నది వారి తక్షణమైన చింత కాగా, భవిష్యత్తు ఏమిటనేది అంతకుమించిన దీర్ఘకాలిక భయం. ఇందుకు సమాధానాలు వారికి, అందరికీ లభించగలది గ్రేటర్ ఫలితాల తర్వాతనే. దీనంతటికి అర్థం చంద్రబాబు తమ తెలంగాణ శాఖను పూర్తిగా గాలికి వదలగలరని కాదు. అది తన రాజకీయానికీ నష్టదాయకమే. కొన్ని విచికిత్సలలో ఆస్తి, నాస్తి రెండింటికీ చోటు వుంటుంది. ఇవన్నీ తేలేది కూడా గ్రేటర్ ఎన్నికల అనంతరమే. ఇక్కడ మరొక మాట చెప్పుకోవాలి. ఈ ఫలితాలు నిరుత్సాహకరమయిన పక్షంలో పార్టీని వదలిపోయేటందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. పైన అన్నట్లు ఆ పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డిలతో కూడిన గ్రేటర్ చివరి స్థావరం అయినందున, అది పోయినట్లయితే ఇక మిగిలేదేమీ ఉండదు. ఇది టిడిపి అధ్యక్షునికి తెలియదనలేం. కనుక, బహిరంగ వేదిక నుంచి ఏమి మాట్లాడినా, తెరవెనుక వ్యూహాలు ఏ విధంగా సాగగలవో ఈ ద్విముఖ వ్యూహపు ఫలితాలు ఏ విధంగా తేలగలవో కూడా అప్పుడే చూడవలసి వుంటుంది.
చివరగా రెండు వాస్తవిక పరిస్థితుల గురించి చెప్పుకోవాలి. ఒకటి, తెలుగు రాష్ట్రాలు రెండింటికి పరస్పర సహకారం అవసరం కావటం. రెండు రాష్ట్రాల ప్రజలు అటువంటి సహకారాన్ని కోరుకోవటం. పైనుంచి రాజకీయాల స్థాయిలో తమ పరిస్థితిని బట్టి ఎవరు- ఎపుడు- ఏ వైఖరి తీసుకున్నా, చివరకు క్షేత్ర స్థాయి పరిస్థితులు నాయకులపై వత్తిడిని సృష్టిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఆ వత్తిడిని బట్టి నాయకత్వాల విధానాలు మారుతుంటాయి. ప్రస్తుత సందర్భంలో గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అయిదున్నర దశాబ్దాలపాటు ఒకే రాజకీయ - ఆర్థిక వ్యవస్థలో భాగం కావటం, ఇరుగు పొరుగు ప్రాంతాలు అవటం, భాషా సంస్కృతుల భాగస్వామ్యాల కారణంగా పరస్పరం ఆధారపడే అంశాలు అనేకం వున్నాయి. విభజన అనంతరం కూడా ఉమ్మడి పాలనను మినహాయిస్తే తక్కినవి కొనసాగేవే. ఇందుకు అదనంగా సీమాంధ్ర మూలాలు గలవారు గ్రేటర్‌లో, తెలంగాణలో తగినంత సంఖ్యలో వున్నారు. అటు ఇటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సంబంధాలు అనేకం వున్నాయి. దానిని బట్టి పరస్పరం ఈ స్థితిని సజావుగా, సహృదయపూర్వకంగా కొనసాగించి దృఢ తరం చేసుకోవటం రెండు రాష్ట్రాల ప్రజలకు కావాలి. అదొక జీవితావసరం. వారు దానిని కోరుకుంటున్నారు కూడా. ఉద్యమ కాలంలో కొన్ని వైమనస్యాలన్నవి ఎక్కడైనా ఏ ఉద్యమ స్థితిలోనైనా ఏర్పడేవే. అవి శాశ్వతంగా కొనసాలని ప్రజలెప్పుడూ కోరుకోరు. పరిస్థితులను రాజకీయ స్థాయిలో మార్చుతున్నది కూడా ఈ క్షేత్ర స్థాయి వాస్తవాలంటే పొరపాటు కాబోదు. ఇద్దరు పిల్లలు స్నేహితులుగా మారితే ఇద్దరు ‘తల్లు’లకు అంతకన్నా కావలసిందేమిటి?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)