సంపాదకీయం

‘ఎండోసల్ఫాన్’ భూతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రవిచిత్ర మానసిక శారీరక వ్యాధులకు గురి అయినవారిని బహుళ జాతీయ వాణిజ్య సంస్థల యజమానులు వెక్కిరిస్తుండడం ప్రపంచీకరణ మారీచ మృగ మాయాజాలంలో భాగం. ఎండోసల్ఫాన్ అన్న క్రిమినాశక రసాయనం లక్షల ప్రజల బతుకులను నాశనం చేయడం ఒక ఉదాహరణ మాత్రమే. ఎండోసల్ఫాన్‌ను ప్రపంచమంతటా నిషేధించిన తరవాత మాత్రమే మనదేశంలో నిషేధించడం ప్రభుత్వ నిర్వాహకుల ప్రపంచీకరణ నిబద్ధతకు ఒక సాక్ష్యం మాత్రమే. ఉదాహరణలు, సాక్ష్యాలు విరివిగా ఉన్నాయి, విస్తరిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తరువాత మాత్రమే 2011లో ఎండోసల్ఫాన్ నిషేధానికి గురైంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎండోసల్ఫాన్ నిషేధానికి గురైన తరువాత కూడ మన వ్యవసాయ రంగానికి పట్టిన ఎండోసల్ఫాన్ చీడ ఇప్పటికీ వదలడం లేదు. పెద్ద ఎత్తున ఎండోసల్ఫాన్ వాడడం ఆగిపోయి ఐదేళ్లు గడిచినప్పటికీ, వాడిన సమయంలో దుష్ప్రభావానికి గురైన వారి కడగండ్లు మాత్రం ఇప్పటికీ తీరడంలేదు. కేరళ రాష్ట్రంలోని కాసర్‌గాడ్, పాలక్కాడ్ ప్రాంతాలలోను, ఇతర ప్రాంతాలలోను ఎండోసల్ఫాన్ బాధితులకు ఇప్పటికీ ప్రభుత్వ సహాయం అందకపోవడం తెలిసిన వైపరీత్యం. దేశవ్యాప్తంగా ఎండోసల్ఫాన్ విష రసాయన ప్రభావగ్రస్తులు ఎందరన్నది ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. ఎప్పటికీ నిర్ధారణ కాదు. కొంతమేరకు నిర్ధారణ జరిగిన కేరళ రాష్ట్రంలో సైతం మానసిక శారీరక ఘోర వైపరీత్యాలకు గురైన వేలాది మందికి ఇప్పటికీ సహాయం అందలేదట. కేరళలోని అయా ప్రాంతాలలో జీడి మామిడి తదితర తోటలకు ఎండోసల్ఫాన్‌ను పిచికారీ చేసినందువల్ల సంభవించిన రోగా లు 2009వ, 2010వ సంవత్సరాలలో పెద్ద ఎత్తున బయటపడినాయి. మామిడి వంటి వృక్షాలకు కిందనుండి పిచికారీ చేయడం కష్టం కనుక గగనం నుండి పెద్ద ఎత్తున పిచికారీ చేయడం కార్పొరేట్ వ్యవసాయ లక్షణం. ఇలా పిచికారీ చేసిన పండ్లను కూరగాయలను, పంటలను భుజించిన వారిలో కొందరు క్రమంగా అకాల మరణాలు పాలయ్యారు. మరికొందరు దీర్ఘ శారీరక వ్యాధులకు, మానసిక వైపరీత్యాలకు బలైపోయి జీవచ్ఛవాలుగా మిగిలారు. ఎండోసల్ఫాన్ ప్రభావిత ఆహారం భుజించిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు తలలు వాచినట్టు పెద్దవిగా ఉండడం, అవయవ సౌష్టవం దెబ్బతినడం, చర్మంపై పుండ్లు ఏర్పడడం, మానసిక వైకల్యం వంటి వ్యాధులు మాత్రమే కాక క్యాన్సర్ వంటి భయంకర రుగ్మతలు సైతం సంభవించాయట. వీరందరూ చికిత్సలకోసం, ఆర్థిక సహాయం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు.
ఈ ప్రాణాంతక ఎండోసల్ఫాన్ విష ప్రభావానికి గురి అయినవారు ఎందరన్నది నిర్ధారించబడడానికి వీలుగా ఆరోగ్య సర్వేలను నిర్వహించాలని జాతీయ మానవాధికారాల న్యాయమండలి- నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్-వారు 2010లోనే ఆదేశించారు. ఇప్పటివరకు కేరళ ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించలేదు. ఎండోసల్ఫాన్ ప్రభావ మృతుల కుటుంబాలకు, తీవ్రమైన రుగ్మతలకు గురయిన వారిని ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని కమిషన్ ఆదేశించిందట. సాధారణ రుగ్మతలకు గురయిన వారికి కనీసం మూడు లక్షల రూపాయలు చెల్లించాలని కూడ న్యాయ మండలి నిర్ధారించిన తరువాత ఐదేళ్లు గడిచిపోయాయి. అందువల్ల ప్రభావగ్రస్తులు ఎవరన్నది అధికారికంగా నిర్ధారణ జరగలేదు. కేరళ ప్రభుత్వం ఎవ్వరికీ ఆర్థిక సహాయం అందజేయలేదన్నది ప్రస్తుతం వెల్లడైన సమాచారం. పాలక్కాడ్ జిల్లాలోని ముత్తలమాడ ప్రాంతంలోనే దాదాపు ఆరువందల మంది బాలబాలికలు ఎండోసల్ఫాన్ విష ప్రభావానికి గురై రకరకాల రుగ్మతలకు గురయ్యారట. ఇది అనధికారిక నిర్ధారణ మాత్రమే. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఎండోసల్ఫాన్ బాధితులు ఎందరన్నది తెలియవలసి ఉన్నది. ఎండోసల్ఫాన్‌ను దశాబ్దుల తరబడి వ్యవసాయ దోహదకారిగా ప్రచారం చేసినవారు విదేశీయ సంస్థలు, వాటికి మనదేశంలో ఉన్న దళారీలు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ దళారీ పనికి పూనుకోవడం ఇప్పుడు చరిత్ర. ఈ చరిత్రకు సాక్ష్యాలెన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతోసల్ఫాన్‌ను నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయిన తర్వాత 2011లో కూడ కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించలేదు. 2011 ఏప్రిల్‌లో జెనీవాలో జరిగిన సమావేశంలో ఎండోసల్ఫాన్ నిషేధాన్ని వాయిదా వేయాలని మన ప్రభుత్వం కోరింది. ఎండోసల్ఫాన్ ఉత్పత్తిని, వాడకాన్ని తక్షణమే నిషేధించాలని కోరవలసిన మన ప్రభుత్వం ఇలా విదేశీయ సంస్థకు అంతర్జాతీయ వేదికపై కొమ్ము కాయడం అప్పుడు దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆప్పటి కేరళ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ సహా అనేకమంది రాజకీయ వేత్తలు, ఉద్యమకారులు ఎండోసల్ఫాన్‌కు ‘నిరసనలు’, ‘నిరశనలు’ తెలిపిన సమయంలో కేంద్ర ప్రభుత్వం జెనీవాలో ఈ విచిత్ర వాదాన్ని వినిపించింది. 2011 మే నెలలో సుప్రీం కోర్టు ఎనిమిది వారాలపాటు ఎండోసల్ఫాన్‌ను వాడరాదని తాత్కాలిక నిషేధం విధించిన తరువాత కూడ కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిషేధంపై మీన మేషాలను లెక్కపెట్టింది. 2017 నాటికి మాత్రమే సంపూర్ణంగా ఎండోసల్ఫాన్‌ను తొలగించనున్నట్టు ప్రభుత్వం పార్లమెంటుకు అప్పుడు నివేదించింది. ఆ తరువాత స్టాక్‌హోమ్-స్వీడన్ రాజధాని-లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎండోసల్ఫాన్‌ను నిషేధించారు. ఎండోసల్ఫాన్ పర్యావరణాన్ని పాడు చేస్తోందన్నది ఆ సదస్సులో జరిగిన నిర్ధారణ. కానీ మనదేశంలో మాత్రం ఇప్పటికీ ఎండోసల్ఫాన్ వాడకం రహస్యంగాను, బహిరంగంగాను కొనసాగుతూనే ఉందట. నిషేధం ఉన్నట్టా? లేనట్టా? ఎండోసల్ఫాన్ విష ప్రభావం గురించి జనానికి తెలియడానికి దశాబ్దులు పట్టింది. బయట పడిన తరువాత కూడ దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అనేక ఏళ్లు పట్టడం విదేశీ సంస్థలకు మన ప్రభుత్వ నిర్వాహకులపై ఉన్న ‘పట్టు’కు నిదర్శనం. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం వారు పూనుకొని దశాబ్దులపాటు ఈ విష రసాయనాన్ని వాడినందువల్ల జరిగిన దుష్ఫలితాల గురించి అధ్యయనం, పరిశోధన చేయించాలి.
ఎండోసల్ఫాన్ ప్రతీక మాత్రమే. కృత్రిమమైన ఎరువులను, క్రిమినాశక రసాయనాలను వాడకం వల్ల భూసారం దెబ్బతినిపోవడం మాత్రమే కాదు, పరిసరాలు, పర్యావరణం పాడు పడిపోతున్నది. ఒక క్రిమినాశక రసాయనాన్ని నిషేధించినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. వేరువేరు పేర్లతో చెలామణి అవుతున్న క్రిమినాశనకాల ప్రభావానికి గురైన కూరగాయలు, పండ్లు, పంటలు నిల్వ చేసిన తిండి మానవ ఆరోగ్యాన్ని హననం చేస్తోంది. సహస్రాబ్దుల తరబడి సాగిన సంప్రదాయ వ్యవసాయం వల్ల భూసారం నిరంతరం రక్షణ పొందింది. ఆవుపేడ, పంచితం, పచ్చి ఆకులు, పాత మట్టి సహజంగా కుళ్లిన వ్యర్థాలు ఉపయోగించడం వల్ల మాత్రమే సంప్రదాయ వ్యవసాయం మళ్లీ పునరుజ్జీవం పొందుతోంది. అందువల్ల దేశవాళీ ఆవులను, ఆడవులను పరిరక్షించి పెంపొందించడం మాత్రమే భూమి ఆరోగ్యానికి పరిసరాల ఆరోగ్యానికి ప్రజల ఆరోగ్యానికి సముచిత ప్రత్యామ్నాయం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు జరుపుతున్న గోపరిరక్షణ కృషి ప్రశంసనీయం...