ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విదేశాంగ విధానంలో మార్పు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగా నిర్వహించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఇదే విధానం కొనసాగింది. ఇజ్రాయిల్‌తో స్నేహం చేస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారని కాంగ్రెస్ భయపడింది. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్‌తో స్నేషం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇజ్రాయిల్‌తో ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహించవలసి వస్తే దానిని అత్యంత గోప్యంగా ఉంచేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అరబ్, ముస్లిం దేశాలతో చేసినంత స్నేహం ఇజ్రాయిల్‌తో చేయలేదు. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నించి కొంత విజయం సాధించింది. అయితే ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయింది. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయం మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసింది.
ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం మరోసారి ఇజ్రాయిల్‌తో సత్సంబందాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఇజ్రాయిల్, లెబనాన్ దేశాల పర్యటనకు వెళుతున్నారు. ఇజ్రాయిల్‌తో పాటు లెబనాన్ దేశాన్ని తమ పర్యటనలో చేర్చటం ద్వారా యూదు, ముస్లిం దేశాలకు సమాన ప్రధాన్యత ఇస్తున్న సందేశాన్ని పంపించే ప్రయత్నం కూడా జరిగింది. అయితే మొత్తం మీద ఇజ్రాయిల్‌తో మన సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు మోదీ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 1992లో ఇజ్రాయిల్‌తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్నప్పటి నుండి ఇంత వరకు కేవలం ఇద్దరు భారత విదేశాంగ మంత్రులు మాత్రమే ఆ దేశంలో పర్యటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2014లో ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఆ తరువాత భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గత సంవత్సరం ఇజ్రాయిల్‌లో పర్యటించారు. ఇప్పుడు సుష్మాస్వరాజ్ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లివచ్చిన అనంతరం ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజామిన్ నెతన్యాహు భారత దేశంలో పర్యటించేందుకు రానున్నారు. తదనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆజ్రాయిల్ పర్యటనకు వెళతారు.
రెండు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసేందుకు ఇరుపక్షాల నుండి ముఖ్యంగా భారత దేశం వైపు నుండి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఈ పర్యటనలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయిల్ ఎప్పటి నుండో భారత దేశంతో స్నేహం చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇజ్రాయిల్ ఇలా కోరుకోవటం వెనక చారిత్రక కారణాలతోపాటు దేశ భద్రతకు సంబంధించిన కారణాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఇజ్రాయిల్ దేశం ఎలా ఏర్పడిందనేది అందరికి తెలిసిందే. ముస్లిం దేశాల మధ్య ఉన్న ఏకైక యూదు దేశం ఇజ్రాయిల్. ఇజ్రాయిల్‌ను రూపుమాపేందుకు జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇజ్రాయిల్ దేశస్తుల దృఢ విశ్వాసం పట్టుదల, దేశం పట్ల ఉన్న ప్రేమాభిమానాల మూలంగానే ఆ చిన్న దేశం నిలదొక్కుకోవటంతోపాటు తన ఉనికిని కాపాడుకోగలుగుతోంది. ఇజ్రాయిల్ మాదిరిగానే భారత దేశం కూడి ఇస్లామిక్ ఉగ్రవాదం నుండి ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని నిలవరించడంలో ఇజ్రాయిల్ గణనీయమైన ప్రగతి, ఫలితాలను సాధిచింది. మన పాలకుల మాదిరిగా ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించే విధానాన్ని ఇజ్రాయిల్ ఏ రోజూ అనుమతించలేదు. దెబ్బకు దెబ్బ తీస్తోంది. కొన్ని సంధర్భాల్లో ఒక దెబ్బకు రెండు దెబ్బలు కొట్టటం ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాదులను నిలవరించింది.
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొంనేందుకు ఇజ్రాయిల్‌తో లోతైన స్నహం చేయటం భారత దేశానికి ఎంతో అవసరం. లష్కరే తయ్యబా, జైషె మహమ్మద్, తాలిబాన్, ఐ.ఎస్.ఐ.ఎస్ లాంటి సంస్థల నుండి దేశాన్ని కాపాడుకునేందురకు ఇజ్రాయిల్ నుండి ఆయుధ సహాయంతో వ్యూహాత్మక సహాయ, సహకారాలు తీసుకోవటం ఎంతో మంచిది. ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టేందుకు అవసరమైన సహాయం చేసేందుకు ఇజ్రాయిల్ సంసిద్ధంగా ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకొన్ని ఆ దేశంతో స్నేహం చేయటం మంచిది. ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఇజ్రాయిల్‌తో దూరంగా ఉండటం వలన బి.జె.పికి ఒరిగేదేదీ లేదు. ఇజ్రాయిల్‌తో స్నేహం చేసినా, చేయకపోయినా మైనారిటీలు బి.జె.పికి ఓటు వేయరనేది పచ్చి నిజం. ఈ నేపథ్యంలో ఎన్.డి.ఏ ప్రభుత్వం ఇజ్రాయిల్‌తో పూర్తి స్థాయి స్నేహం చేయటం మంచిది. ఇజ్రాయిల్ నీటిపారుదల, వ్యవసాయం, ఆయుధాల రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. బిందు సేద్యానికి ఇజ్రాయిల్ పెట్టింది పేరు. ఇజ్రాయిల్ బిందు సేద్యం ఎంత మంచిదనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును అడిగితే తెలుస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపెట్టకుండా ఇజ్రాయిల్ సాంకేతిక పరిజానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చుననేది చంద్రబాబునాయుడు నుండి నేర్చుకోవాలి. నీటిపారుదల రంగంలో ఇజ్రాయిల్ సాధించిన ప్రగతి అందరికి ఆదర్శం కావాలి.
ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ఇజ్రాయిల్ అనుసరిస్తున్న విధానాన్ని మన దేశం అవసరాలకు అనుగుణంగా మార్చుకుని అమలు చేయటం వలన మంచి ఫలితాలు లభిస్తాయి. ఇజ్రాయిల్‌తో స్నేహం చేయటం లాభదాయకమని తెలిసినా ఓటు బ్యాంకు రాజకీయం మూలంగా ఇది సాధ్యపడలేదు. 2003లో ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి ఎరీల్ షెరాన్ భారత దేశంలో పర్యటించిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. షెరాన్ పర్యటన అనంతరం భారత ప్రధాన మంత్రి కూడా ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లి ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవి. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతెన్యాహు మన దేశంలోపర్యటించటం, తరువాత నరేంద్ర మోదీ ఇజ్రాయిల్‌లో పర్యటించటం పూర్తి అయితే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇజ్రాయిల్‌తో స్నేహం మెరుగుపడగానే కొన్ని ముస్లిం, అరబ్ దేశాలు మనకు దూరం కావచ్చు లేదా వత్తిడి పెంచవచ్చు. దేశ ప్రయోజనాల దృష్టా ఇలాంటి వత్తిళ్లకు తావివ్వకుండా ఇజ్రాయిల్‌తో స్నేహాన్ని పెంపొదించుకోవటం భారత దేశానికి చారిత్రాత్మికంగా, ఇతరత్రా కూడా ఎంతోమంచిది.