సంపాదకీయం

ఫ్రాన్స్‌తో పెరిగిన మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మనదేశంలో జరిపిన పర్యటన ఐరోపాలోని ప్రధాన దేశాలతో మనకు పెరుగుతున్న వ్యూహాత్మక, ద్వైపాక్షిక మైత్రికి నిదర్శనం. ఇరవైతొమ్మిది దేశాల ఐరోపా సమాఖ్య వారు అప్పుడప్పుడు మనదేశం పట్ల వ్యూహాత్మక వ్యతిరేకత వెళ్లగక్కుతున్నారు. మనదేశంలో అక్రమ ప్రమేయం కల్పించుకొనడానికి యత్నిస్తున్నారు. అయినప్పటికీ సమాఖ్యలోని బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వంటి ప్రముఖ దేశాలతో మనకు ద్వైపాక్షిక మైత్రి విస్తరించడం ఇటీవలి పరిణామం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను చేపట్టిన తరువాత ఈ ద్వైపాక్షికమైత్రి మరింతగా విస్తరిస్తోంది. మన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రధాన అతిథిగా హాజరు కావడం ఉభయ దేశాల మధ్య నెలకొని ఉన్న సుహృద్భావానికి ప్రతీక. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వంటి ఒప్పందాలు కుదరడం ఫ్రాన్స్‌కు వాణిజ్య లాభాలను కలిగించే పరిణామం. పశ్చిమ దేశాలతో మన ద్వైపాక్షిక సంబంధాలకు ఆ దేశాల వాణిజ్య ప్రయోజనాలు ప్రాతిపదిక. మన ప్రధానమంత్రి అమెరికాకు, బ్రిటన్‌కు ఇటీవల వెళ్లి రావడానికి ముందుగా ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు అనేకం కుదిరాయి. అమెరికా ఆయుధాలను, బ్రిటన్ యుద్ధ పరికరాలను కొనడానికి మన ప్రభుత్వం భారీ ఒప్పందాలను కుదుర్చుకొని ఉంది. ఈ ఒప్పందాల వల్ల మన విదేశీయ వినిమయ ద్రవ్యం పెద్ద ఎత్తున ఆ దేశాలకు తరలిపోతోంది. ఆ దేశాల ఆయుధ సామగ్రిని, యుద్ధ వాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థ నెలకొన్న తరువాత ఈ దేశాలనుంచి మన దేశానికి భారీగా నిధులు తరలి వస్తున్నాయని, ఈ పెట్టుబడుల వల్ల మన దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయని ఇరవై ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇలా తరలి వస్తున్న పెట్టుబడులకు దీటుగాను ఇంకా ఎక్కువగాను ఆయా దేశాలకు మన విదేశీయ వినిమయ ద్రవ్యం- ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ- ఆ దేశాలకు తరలిపోతోంది. రాఫెల్ ఒప్పందం ఇలా వేలకోట్ల మన వినిమయ ద్రవ్యం ఫ్రాన్స్‌కు తరలిపోవడానికి దోహదం చేయగల పరిణామం. అయినప్పటికీ రాఫెల్ యుద్ధ విమానాల వ్యవస్థ ద్వారా మన రక్షణ పటిమ విస్తరించనుంది. చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తు సామగ్రిలో అత్యధికం మనకు అవసరంలేని పనికిరాని పరికరాలు. ప్రతిగా మనదేశంలోని ఇనుప ఖనిజం భారీగా చైనాకు తరలిపోతోంది. అంతేకాదు, ప్రతియేటా అదనంగా వాణిజ్య లోటు రూపంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల మన వినిమయ ద్రవ్యం చైనాకు తరలిపోతోంది. చైనాతో వాణిజ్యం రద్దు చేసుకున్నట్లయితే మన ఇనుప ఖనిజం మనవద్దనే ఉంటుంది. అదనంగా రెండు లక్షల కోట్ల రూపాయల వినిమయ ద్రవ్యం కూడ మనకు మిగిలిపోతుంది. కానీ మన ప్రభుత్వాలు దశాబ్దులుగా ఆ పనికి పూనుకోవడంలేదు. శత్రు దేశమైన చైనాకు ఇంత భారీగా నిధులు తరిలిపోతున్నప్పుడు మిత్రదేశమైన ఫ్రాన్స్‌కు మన నిధులు తరలిపోవడానికి అభ్యంతరం చెప్పనక్కరలేదు. పైగా కొనుగోలు చేస్తున్నది మన రక్షణ ఆవసరమైన యుద్ధ విమానాలకు..
ఈ వాణిజ్య ప్రాతిపదిక కంటె దీర్ఘకాలిక వ్యూహాత్మక మైత్రి పెంపొందడం ప్రధానమైన అంశం. భారతదేశంతో పాటు ఫ్రాన్స్ కూడ ప్రజాస్వామ్య దేశం. సర్వమత సమభావ వ్యవస్థ పట్ల ఫ్రాన్స్ నిబద్ధత మనదేశమంత అచంచలమైనది కాకపోయినప్పటికీ ఫ్రాన్స్ మత రాజ్యాంగం కాదు. ఫ్రాన్స్ రాజ్యంగా సర్వమత సమభావ వ్యవస్థకు కట్టుబడి ఉంది. అందువల్ల ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థను సాకారం చేసే దిశగా జరిగే కృషిలో మనదేశంతో పాటు ఫ్రాన్స్ కూడ భాగస్వామి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మరో ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడు ప్రధాన అతిథిగా రావడం వ్యూహత్మక సహకారంలో భాగం. గత ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా వచ్చిన బరాక్ హుస్సేన్ ఒబామా కూడ మరో ప్రజాస్వామ్య దేశానికి అధినేత. మతోన్మాద ఉగ్రవాద దురాక్రమణకు దీర్ఘకాల పరిష్కారం వివిధ దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలకు విస్తరింపజేయడం. సర్వమత సమభావ వ్యవస్థ ప్రజాస్వామ్య వౌలిక స్వభావం. అందువల్ల విస్తరించిపోతున్న జిహాదీ మతోన్మాద ఉగ్రవాదాన్ని ప్రతిఘటించగల దీర్ఘకాల వ్యూహం ప్రజాస్వామ్యం...్భరత ఫ్రాన్స్ దేశాల వ్యూహాత్మక ద్వైపాక్షిక మైత్రికి ఇదీ ప్రధాన ప్రాతిపదిక.
ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం-ఐఎస్‌ఐఎస్-జిహాదీ ముఠా బీభత్స కలాపాలు ప్రస్తుతం ఐరోపాకు విస్తరించడంతో ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమరం జరుపవలసిన అనివార్యం గురించి ఫ్రాన్స్ తదితర దేశాలు గుర్తించాయి. సిరియా నుండి పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలనుంచి ఐరోపాకు లక్షల మంది శరణార్థులుగా తరలిపోవడం, ఐఎస్‌ఐఎస్ ఉగ్ర కాలాపాల ప్రభావం. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌పై ఐఎస్‌ఐఎస్ చేసిన దాడులు ఐరోపాను కుదిపి వేశాయి. మనదేశంతో పాటు ఫ్రాన్స్ తదితర ఐరోపా దేశాలు సైతం ఇప్పుడు ఉగ్రవాదుల గురి పరిథిలో ఉన్నాయి. భారత్-ఫ్రాన్స్‌ల మధ్య, భారత్-బ్రిటన్‌ల మధ్య వ్యూహాత్మక సహకార మైత్రి అనివార్యమన్నది స్పష్టమైంది. భారత- ప్రాన్స్ దేశాలు ఉమ్మడిగా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాన్ని గర్హిస్తున్నాయి. ఈ ఉమ్మడి విధానానికి హోలాండే మనదేశంలో జరిపిన పర్యటన మరింత బలం చేకూర్చింది. ఎందుకంటె ఐఎస్‌ఐఎస్, బొకోహరాం, వంటి పశ్చిమాసియా, ఆఫ్రికా ప్రాంతాలను రక్తసిక్తం చేస్తున్న మతోన్మాద బీభత్స ముఠాలను సైతం పాకిస్తాన్ ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఐఎస్‌ఐ అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాద సంస్థలన్నింటిని ఏకోన్ముఖంగా అనుసంధానం చేస్తోంది. అందువల్ల అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూపాన్ని బట్టబయలు చేసి, పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం అనివార్యం. ఇలా జరిగినప్పుడు మాత్రమే అంతర్జాతయ జిహాదీల దాడులను నిరోధించవచ్చు. ఇలా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడంలో భారత్-ఫ్రాన్స్‌లు కలిసి వస్తున్న విశ్వాసం హోలాండే పర్యటన వల్ల పెరిగింది..
సౌరశక్తి ఉత్పాదనకు ఫ్రాన్స్ ప్రనుత్వం రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను సమకూర్చడానికి అంగీకరించడం ఉభయ దేశాల ఉమ్మడి విజయం. విదేశీయ ప్రత్యక్ష నిధులు వౌలిక రంగాలలో ఉత్పత్తిని పెంచడానికి మాత్రమే పరిమితం కావాలన్నది స్వదేశీయ ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. ఇందుకు విరుద్ధంగా విదేశీయ సంస్థలు, సేవా రంగాలలోను, పర్యాటక రంగంలోను, పంపిణీ రంగంలోను చొరబడి పోవడం ప్రపంచీకరణ వైపరీత్యం. సౌర విద్యుత్ ఉత్పత్తి వౌలికమైన అవసరం. అందువల్ల ఈ వౌలిక రంగంలో ఫ్రాన్స్ పెట్టుబడులను పెట్టడానికి ముందుకు రావడం హర్షణీయం. మనదేశం నాయకత్వంలో అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమి ఏర్పాటు కావడం, ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన పర్యావరణ పరిరక్షణ సదస్సు సందర్భంగా సంభవించిన సమాంతర పరిణామం. సౌర విద్యుచ్ఛక్తి ప్రపంచానికి తరగని ప్రాకృతిక సంపద.