సంపాదకీయం

అరుణాచల్ సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనపై విభిన్న విశే్లషణలు, వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ఏమయినప్పటికీ రాజ్యాంగంలోని 356వ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో రాష్టప్రతి పాలన విధించడానికి వీలు కల్పించే అధికారంపై న్యాయసమీక్ష పరిధి క్రమంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు, దాదాపు క్రీస్తుశకం 1980వ దశకం చివరి వరకూ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం విధించే రాష్టప్రతి పాలనను న్యాయస్థానాలలో ప్రశ్నించడానికి వీలుండేది కాదు. ఎందుకంటే రాష్టప్రతి పాలనను విధించడానికి రాష్టప్రతి కున్న అధికారాలపై న్యాయ సమీక్షకు వీలులేదు-నాన్ జెస్టిసబుల్! అందువల్ల రాష్టప్రతి పాలన వల్ల తమకు అన్యాయం జరిగిందని భావించిన రాజకీయ పక్షాలు సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయడానికి మాత్రం సాహసించలేదు. ఆ తరువాత దశలో రాష్టప్రతి పాలనను, శాసనసభ రద్దును సవాలుచేస్తూ పిటిషన్లు దాఖలయినప్పటికీ న్యాయ సమీక్షకు వీలులేదన్న కారణంగా సుప్రీంకోర్టు ఆ దరఖాస్తులను విచారణకు ముందే తోసిపుచ్చేది. 1990వ దశకంనుండి రాష్టప్రతి పాలనను వ్యతిరేకిస్తున్న వారి దరఖాస్తులను సర్వోన్నత న్యాయస్థానం స్వీకరించి విచారించడం మొదలైంది. రాష్టప్రతి విధింపును ఆయా సందర్భాలలో సుప్రీంకోర్టు తప్పుపట్టింది,శాసనసభల రద్దు చెల్లదని కూడ తీర్పునిచ్చింది! ఇదంతా 356వ అధికరణం వ్యవహారంలో న్యాయాధికార పరిధి విస్తరిస్తుండడానికి నిదర్శనం. అయితే రాష్టప్రతి పాలనను ఆయా రాష్ట్రాలలో విధించిన తరువాత మాత్రమే ఈ పరిణామాన్ని సవాలు చేయడానికి బాధితులు పూనుకునే వారు. ఇప్పుడు న్యాయ ప్రమేయం పరిధి మరింత విస్తరించింది! అరుణాచల్‌లో రాష్టప్రతి పాలనను 26వ తేదీన విధించారు. కేంద్ర మంత్రివర్గం సిఫార్సును రాష్టప్రతి ప్రణవ్ కుమార్ ముఖర్జీ ఆరోజున అంగీకరించారు. కానీ అంతకుముందు రోజుననే కాంగ్రెస్ పార్టీవారు రాష్టప్రతి పాలనను విధించరాదని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో వినతిపత్రం దాఖలు చేసారు. ఈ దరఖాస్తును సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించడం రాజ్యాంగ ప్రక్రియకు వినూతన భాష్యం!రాష్టప్రతి పాలనను విధించాలని అరుణాచల్ రాష్ట్ర గవర్నర్ జెపి రాజఖోవా కేంద్ర ప్రభుత్వానికి చేసిన సిఫార్సు చెల్లదన్నది కాంగ్రెస్ దాఖలు చేసిన వినతిపత్రానికి ఇతివృత్తం! అందువల్ల రాష్టప్రతి పాలనను విధిస్తారా? విధించరా? కేంద్ర మంత్రివర్గం గవర్నర్ సిఫార్సును ఆమోదిస్తుందా? లేదా? అన్న మీమాంస కోసం ఎదురు చూడకుండా ముందుగానే రాష్టప్రతి పాలనను నిరోధించడానికి వీలైన వినతులను సైతం సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి వీలు ఏర్పడింది! అరుణాచల్ రాజ్యాంగ సంక్షోభం ఈ నూతన సంప్రదాయానికి శ్రీకారం...356వ రాజ్యాంగ అధికరణంపై న్యాయ సమీక్షాధికార పరిధి మరింత విస్తరించింది! ఇలా విస్తరిస్తున్న న్యాయాధికార పరిధి ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ పరిణతికి నిదర్శనం...
రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభలో అధిక సంఖ్యాకుల మద్దతు అనివార్యం కావడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వౌలిక నిబంధన. అయితే ఈ అధిక సంఖ్యాకుల మద్దతు ఉందా? లేదా అన్నది నిర్ధారణ జరుగవలసింది శాసనసభ సమావేశంలో మాత్రమే! అరుణాచల్ ప్రదేశ్‌లో ఇలా శాసనసభ సమావేశంలో బలపరీక్ష జరగలేదన్నది కాంగ్రెస్ వాదం. జరిగిందని భారతీయ జనతాపార్టీ, దాని మిత్రపక్షాల వాదం. గత నెల 16వ, 17వ, 18వ తేదీలనాటి తథాకథిత శాసనసభా సమావేశాలు ఇలా వివాదం ఊబిలో ఇరుక్కుని పోవడం అరుణాచల్ రాష్టప్రతి పాలనకు దారితీసిన విపరిణామం! ఆ సమావేశాలు రాజ్యాంగబద్ధమైనవా? కావా? అన్న వ్యవహారం కూడ న్యాయ స్థానాలకు ఎక్కింది. ఇది కూడ న్యాయస్థానాల అధికార పరిధి విస్తరించింది అనడానికి మరో నిదర్శనం. 2005 మార్చి తొమ్మిదవ తేదీన ఝార్ఖండ్ రాష్ట్ర సభ సమావేశాల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయమై పూర్వ ఉదాహరణ-ప్రిసీడెంట్- కావచ్చు! అప్పటి ముఖ్యమంత్రి శిబూ సోరెన్‌కు శాసనసభలో మెజారిటీ ఉందా? లేక అప్పటి మాజీ ముఖ్యమంత్రి అర్జున్‌ముండాకు మెజారిటీ ఉందా అన్న విషయమై సంయుక్త బలపరీక్ష-కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్‌జరగాలని అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. 2005 మార్చి 11న ఈ సంయుక్త బలపరీక్ష జరగాలని, ఇందుకోసం శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తూ గవర్నర్ విడిగా ప్రకటన-నోటిఫికేషన్-జారీ చేయనక్కరలేదని, తమ ఉత్తరువునే శాసనసభ్యులు నోటిఫికేషన్‌గా స్వీకరించాలని కూడ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడు స్పష్టం చేసింది...శాసనసభలలోను పార్లమెంటు సభలలోను రాజ్యాంగపరమైన గందరగోళం నెలకొన్న స్థితిలో సర్వోన్నత న్యాయస్థానం భాష్యం చెప్పక తప్పదు. రాజ్యాంగమే సుప్రీం కోర్టునకు ఈ అధికారాన్ని ప్రసాదించింది.!
జనవరి 16వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ సమావేశాన్ని ముప్పయి ముగ్గురు శాసనసభ్యులు ఇటానగర్‌లోని ఒక కమ్యూనిటీ హాల్‌లో సమావేశమై స్పీకర్ నాబమ్‌రెబియాను పదవినుంచి తొలగించారు. గవర్నర్ ఏర్పాటుచేసిన ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి నాబమ్‌తుకీ నాయకత్వంలోని మంత్రివర్గం వ్యతిరేకించడంవల్ల సమావేశాన్ని కమ్యూనిటీ హాల్‌లో జరిపారు. కాంగ్రెస్ పార్టీనుంచి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విడిపోయిన ఇరవై మంది శాసనసభ్యులు, పదకొండుమంది భాజపా సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.మరుసటిరోజున ఈ శాసనసభ్యులు ఒక హోటల్‌లో సమావేశమై కాంగ్రెస్‌నకు చెందిన ముఖ్యమంత్రి నాబమ్‌తుకీని పదవినుంచి తొలగించారు. కాలిఖో పుల్ అనే కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిని ఈసమావేశంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం విచిత్రమైన రాజ్యాంగ పరిణామం!రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించాలి, శాసనసభలు ఎన్నుకోవు! ఏమయినప్పటికీ ఈరెండు సమావేశాలలో జరిగిన నిర్ణయాలను అమలు జరగకుండా గువాహతీ ఉన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేయడం తరువాతి పరిణామం! తిరుగుబాటు కారణంగా కాంగ్రెస్ మంత్రివర్గం మెజారిటీని కోల్పోయి ఉండవచ్చు. ఆ సంగతి పూర్వ నిర్ధారిత కార్యక్రమం ప్రకారం ఫిబ్రవరి రెండవ తేదీన జరుగవలసిన శాసనసభ సమావేశంలో స్పష్టమై ఉండేది. కానీ ఫిబ్రవరి రెండున జరగవలసి ఉండిన సమావేశాలను ముందుగానే జనవరి 16న జరగాలని గవర్నర్ జెపి రాజ్‌ఖోవా ఏకపక్షంగా నిర్ధారించడం సంక్షోభానికి ప్రారంభం! మంత్రివర్గం సిఫార్సు లేకుండా గవర్నర్ ఇలా ఏకపక్షంగా నిర్ణయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది!
ముఖ్యమంత్రి శాసనసభ మద్దతు కోల్పోయినాడని గవర్నర్ భావించి ఉన్నట్టయితే తక్షణం వారం రోజులలోనో ఇంకా తక్కువ వ్యవధిలోనో శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రిని ఆదేశించి ఉండాలి! ఈ ఆదేశాన్ని ముఖ్యమంత్రి పాటించకపోయి ఉండినట్టయితే వ్యవధి ముగిసిన వెంటనే ముఖ్యమంత్రిని గవర్నర్ పదవినుంచి తొలగించి ఉండవచ్చు, మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించి ఉండవచ్చు! ఈ రాజ్యాంగ ప్రక్రియను పక్కకు నెట్టి రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియ ద్వారా హోటల్‌లో శాసనసభను సమావేశపరచడం ద్వారా గవర్నర్ స్వయంగా సంక్షోభాన్ని సృష్టించాడు!