మెయన్ ఫీచర్

స్టార్టప్‌లు సరే! ప్రభుత్వరంగ సంస్థల మాటేంటి...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనవరి 6న మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక మంత్రివర్గ సమావేశంలో హెచ్‌ఎంటీకి సంబంధించిన మూడు యూనిట్లైన హెచ్‌ఎంటి గడియారాలను, చినార్ గడియారాలను, బేరింగ్సును మూసివేయాలని నిర్ణయించింది. వీటితోపాటుగా తుంగభద్ర స్టీలును మూసివేయాలనే నిర్ణయం తెలిసిందే! గత ఎన్‌డిఎ హయాంలో మొదలైన పెట్టుబడుల ఉపసంహరణ తిరిగి వేగవంతమైంది. 49 శాతంగా వుండే ప్రభుత్వ మూలధనాన్ని ఉపసంహరించుకొని, ప్రజాసంక్షేమ పథకాలకు దారిమళ్లించడం దేశవ్యాపితమైంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.69,500 కోట్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావించినా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఎగుమతులు, భారవౌతున్న దిగుమతులు, పతనవౌతున్న రూపాయి విలువ, తగ్గుతున్న వృద్ధిరేటు ప్రభుత్వానికి కొంత అడ్డుకట్టవేయడంతో ఇప్పటివరకు రూ.12,700 కోట్లను మాత్రమే వెనక్కి తీసుకుంది.
జనవరి 16న విజ్ఞాన్‌భవన్‌లో మోదీ ఓ వినూతన ప్రయోగాన్ని ఆవిష్కరించారు. స్టార్టప్, స్టాండప్ అనే యాక్షన్ ప్రణాళికను ప్రారంభించారు. ఉబర్ వ్యవస్థాపకుడైన ట్రావిస్ కలానిక్‌తోపాటు, యోరూమ్స్ అధినేత 22 ఏళ్ల రితేష్ అగర్వాల్, సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషిసన్, గూగుల్స్ నికేష్ అరోరా లాంటి డిజిటల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. నిజానికి స్టార్ట్‌అప్ యాక్షన్ ప్లాన్ (ఎస్‌ఎపి) చూడడానికి బాగానేవుంది. మనం ఎలా బతకాలనే ఆలోచన, ప్రభుత్వం ఎలాంటి ఉపాధిని, సౌకర్యాల్ని కలిగించడం లేదని నిందించడంకన్నా స్వయంగా బతుకుతూ, కనీసం ఓ అయిదుగురికి ఉపాధి కలిగించినా ఓ గొప్ప పనే! సంపాదన ముఖ్యంకాదని, మన ఆలోచనల్ని ఉత్పాదనవైపు మరల్చి, ప్రజలు ఎదుర్కొనే దైనందిన సమస్యలకు పరిష్కారమార్గాల్ని కనుగొని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా మోదీ భాషించడం నిజంగా యువతకు మేలుకొలుపే! గతంలో ఏ చిన్న సంస్థను ఏర్పాటుచేయాలన్నా అనేక ఇబ్బందుల్ని, సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉండేది. అన్నింటికి మించి నిధుల వేటతోపాటు, ప్రభుత్వ నిబంధనల్ని ఒప్పుకోవడం ఓ పీడకల లాంటిదే! తాను ప్రారంభించాలనుకున్న ఏర్‌వేస్‌కు, విమానయాన సంస్థ దండిగా డబ్బుల్ని అడిగిందంటూ స్వయాన రతన్‌టాటా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే! ఓ పరిశ్రమనో, ఉపాధి కలిగించే చిన్నసంస్థనో ప్రారంభించాలంటే కార్మిక, పర్యవరణానికి సంబంధించిన తొమ్మిది నిబంధనలకు లోబడి ఆమోదం పొందాలి. అనేక అనుమానాల్ని నివృత్తిచేయాలి. అటెండర్‌నుంచి సంబంధిత మంత్రిదాకా డబ్బుల మూటల్ని అందించాలి. అనుమతి పొందడానికి గతంలో 127 రోజులుండగా, దీన్ని 29రోజులకు తగ్గించినా, ఆశించిన ఫలితాలు రావడంలేదని, రాబోయే ఏప్రిల్ ఒకటి నుంచి ఒకే ఒక రోజులో అనుమతి ఇవ్వాలనేది ఈ కొత్త స్టార్ట్‌అప్ లక్ష్యం. ఇప్పటిదాకా బిజినెస్ ఇండెక్స్‌లో ఉన్న 130వ స్థానం నుంచి 50వ స్థానానికి ఎదగాలనేది ప్రభుత్వ ఆలోచన!
వీటన్నింటిని, ముఖ్యంగా బ్యూరోక్రసి స్థాయిలో వున్న రెడ్‌టేపిజాన్ని రూపుమామాలంటే ఏదో ఒకటి చేయాలనేది మోదీ ఆలోచనగా కనపడుతున్నది. అందుకే గత స్వాతంత్య్ర దినోత్సవంన ప్రకటించిన ఈ స్టార్ట్‌అప్‌కు ఉబర్, ఫ్లిప్‌కార్ట్, యోరూమ్స్ లాంటి సంస్థల్ని మోదీ మార్గదర్శకంగా భావిస్తున్నారు. కార ణం, అతి స్వల్పకాలంలోనే ఇవి ప్రపంచాన్ని జయించడం, బిలియన్ డాలర్లను పోగుచేయడం. ఇలాంటి సంస్థలు దేశవ్యాపితంగా మొదలుకావాలంటే, నిబంధనల్ని సడలించడమే కాదు, అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించాలి. అందుకే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కింద రూ.10వేల కోట్ల కార్పస్ నిధితోపాటు, రూ.500 కోట్ల చొప్పున అయిదు సంవత్సరాలపాటు క్రెడిట్ నిధిని మోదీ ప్రకటించారు. వీటితోపాటుగా నిబంధనలకు సంబంధించి స్వయంగా హామీఇస్తే చాలని, మూడు సంవత్సరాలపాటు ఎలాంటి తనిఖీలుండవని, పెట్టుబడి ఆదాయంపై పన్ను మినహాయింపుతోపాటుగా, సంస్థ ఒకవేళ దివాలాతీస్తే మూడునెలల్లోనే హాయిగా మూసివేసుకోవచ్చనే నజరానాల్ని కూడా మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయా సంస్థలు ఉత్పత్తిచేసే వస్తువులకు పేటెంటు హక్కుల్ని సులభతరం చేయడంతోపాటు, సంబంధిత పేటెంట్ రిజిస్ట్రేషన్ రుసుములో 80శాతం రాయితీ నిజంగానే పెద్ద ఊరట!
ఈ స్టార్టప్‌లు ఇప్పటికే బెంగళూర్, గూర్‌గాం, నోయిడాలతోపాటు హైదరాబాద్‌లో వందల సంఖ్యలో ఏర్పాటుఅయినాయి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, సైబర్ సిటీ లాగా, బెంగుళూర్‌కు కోరమండల్ ప్రాంతం ఈ స్టార్టప్‌లకు కేంద్రం. ప్రారంభించిన సార్టప్‌లన్నీ నిలదొక్కుకోవడం లేదు. దాదాపు ప్రతీ సంవత్సరం వెయ్యి, పదహేను వందలదాకా మొదలౌతున్న వాటిల్లో ఎదురొడ్డి నిలుస్తున్నవి 150-300 మాత్రమే!
గతంలో యుపిఎ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెజ్‌ల పరిస్థితి ఇలాగే వుంది. ఇలా తెరుచుకున్నవి మూతపడడానికి గల కారణాల్లో ఈ హబ్‌ల చుట్టూ వుండే జనావాసాలు కూడా కారణం! 4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన బెంగళూర్ కోరమండల్ హబ్‌లో కాఫీ క్లబ్బులు, ఫుడ్‌హబ్బులు, వైన్‌షాప్‌లు కూడా (సిట్టింగ్) వుండడం, ఇవి జనాలకు ఇబ్బంది కల్గించడంతో కోర్టును ఆశ్రయంచారు. అలాగే కొన్ని అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక మూసివేతకు గురౌతున్నాయి. ఇప్పుడు మోదీ ప్రతిపాదించిన ఈ స్టార్టప్‌తో ఈ ఇబ్బందులు తొలగిపోవచ్చు! కాని ప్రారంభించిన సంస్థల్ని స్వార్థంతో మూసివేసే ప్రమాదం లేకపోలేదు. అలాగే వ్యక్తిగత పూచికత్తుతో ప్రారంభమయ్యే ఈ సంస్థలు ఆరోగ్య, విద్య, వ్యవసాయ సంబంధితమైన వాటికి కూడా విస్తరిస్తే భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తవచ్చు! ఉదాహరణకి ఓ ఎబిసి అనే సంస్థ విత్తనాల అమ్మకానికి, ఉత్పత్తికి హక్కుల్ని పొంది, కల్తీ విత్తనాల్ని, విధ్వంసకర విత్తనాల్ని వ్యవసాయదారులకు అమ్మి, తాను మాత్రం బుద్దిమంతురాలినని డిక్లరేషన్ ఇస్తే, లేదా అప్పుల్లో వున్నానని చేతులెత్తేస్తే, పరిస్థితి ఏంటి? వైద్యం సంగతి తెలిసిందే! డోర్‌టు డోరు ల్యాబ్ అని ఓ స్టార్టప్‌ను ఓ వ్యక్తి ప్రారంభిస్తే ముందు బా గానే వుంటుంది. తరువాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యు లు? ఉబర్ ఇలాంటి అనుభవాన్ని రుచి చూపించింది కూడా!
ఏ దేశస్థుడైనా, ఏ వ్యక్తిఅయినా, ఎక్కడైనా స్థాపించుకునే వెసులుబాటు ఈ స్టార్టప్‌లో ఉంది. నిజానికి దేశంలో ప్రతి సంవత్సరం పది మిలియన్ల ఉద్యోగాలు అవసర పడుతాయని గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు ఏర్పడబోయే స్టార్టప్ లు విజయవంతంగా కొనసాగితే, 80-85వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనేది అంచనా. ఇందులో రెగ్యులర్ ఉద్యోగాల సంఖ్య అతి స్వల్పమే! ఇప్పటికే చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగాల కుదింపు పేరున టీకప్పులో తుఫాన్‌ను సృష్టిస్తూనే వున్నాయి. సాఫ్ట్‌వేర్ బూం వచ్చిన తర్వాత, చేసే ఉద్యోగానికి, చదివిన చదువుకు సంబంధమే లేకుండా పోయింది. ఉదాహరణకు, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదివేల మంది బిటెక్ వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారంటే, మన చదువుల స్థాయి ఏ విధంగా దిగజారిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఈ స్టార్టప్ ఉద్యోగాలలో ఎలాంటి రిజర్వేషన్స్ వుండవు. నైపుణ్యతనే ప్రమాణికంగా తీసుకునే విధానంతో నియామకాలు జరుగుతాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో, ప్రభుత్వరంగ ఉద్యోగాలే దీర్ఘకాలిక ప్రయోజనాల్ని కల్గిస్తాయి. గతంలో ఇవి అనుభవంలో వున్నవే! స్వాతంత్య్రానంతరం విస్తృత ప్రాతిపదికన ఏర్పాటైన పబ్లిక్ రంగసంస్థలు, రైల్వేలు లక్షలాది మందికి ఉద్యోగాల్ని కల్పించాయి. పైగా ఇవి ఉత్పాదక రంగానికి చెందడంతో దేశ ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయి. స్థానిక ఖనిజ వనరులపై, వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడి నిర్మాణం కావడంతో ఓ ఆరోగ్యమైన సామాజిక వ్యవస్థ ఏర్పడింది. కాని, కొత్త వాటిని ప్రారంభించకపోగా ఉన్నవాటిని మూసివేయడం, మూసుకున్న వాటిని తెరవకపోవడం జరుగుతున్నది. రెండు దశాబ్దాల క్రితం ఐడిపిఎల్ మూతపడింది. నైజాం కాలంలో ఏర్పాటైన నిజాంషుగర్స్, సిరిపూర్ కాగజ్‌నగర్ మిల్లులు మూతపడ్డాయి. ఆజంజాహి మొండి గోడలతో దర్శనమిస్తున్నది. హైదరాబాద్‌లోని డిబిఆర్ పరిస్థితి ఇదే! ప్రాగాటూల్స్ స్థలం రియల్ ఎస్టేట్‌గా మారిపోయింది. సర్‌సిల్క్‌ది ఇదే గాథ.
ఈమధ్యన ఆదిలాబాద్‌లోని సీసీఐని, వరంగల్ జిల్లాలోని బాలాపూర్ పేపర్ మిల్లును నడిపించాలనే ఆలోచన రావడం సంతోషం! ఇలాగే వెంటనే నిజాం షుగర్స్‌ను, సిరిపూర్ పేపర్‌మిల్లును కూడా తిరిగి తెరిపించి నడిపిస్తే ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వరంగం స్థాయిలోని 31 ప్రభుత్వ రంగ సంస్థల్లో 19 నష్టాల్లో వున్నాయని, వీటిని మూసివేయాలనే ఆలోచనని వెంటనే విరమించుకొని, స్టార్టప్ లాంటి ఆర్థికపుష్టిని కల్గిస్తే, గత వైభవాన్ని ఇవి సంతరించుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ దిశగా మోదీ అడుగులువేస్తూ, ముఖ్యమంత్రులను కూడా ఈ దిశగా నడిపిస్తే నిజంగా అభినందనీయుడే!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162