మెయన్ ఫీచర్

ఒక అసాధారణ మానసిక యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీల మధ్య మానసిక యుద్ధాలు సాధారణమే అయినా తెలంగాణలో ఒక అసాధారణ స్థితి కనిపిస్తున్నది. ప్రస్తుతం అక్కడ రెండు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాగా రెండవది నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ రెండూ ఇదే ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. యథాతథంగానే వేర్వేరు కారణాలవల్ల అవి ఆసక్తికరమైవి కాగా, ప్రతిపక్షాలపై అధికార పక్షమైన టిఆర్‌ఎస్ విసిరిన ఒక సవాలుతో అవి అసాధారణమైన మానసిక యుద్ధంగా మారాయి. గ్రేటర్ మున్సిపాల్టీ అధ్యక్ష స్థానాన్ని తాము గెలవలేనట్టయితే తన మంత్రి పదవికి రాజీనామా చేయగలనని కె.తారకరామారావు, నారాయణ్‌ఖేడ్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడితే మంత్రివర్గంనుంచి తప్పుకోగలనని హరీశ్‌రావు సవాళ్లు విసిరారు. దానితో ప్రతిపక్షాలపై అధికార పక్షపు మానసిక యుద్ధం పరాకాష్ట స్థితికి చేరింది. అందరికీ ఉత్కంఠ విపరీతంగా పెరిగిపోయింది.
వాస్తవానికి ఎన్నికల సందర్భాలలో రాజీనామాలతో సహా పలు రకాల సవాళ్లు సాధారణంగా వినవచ్చేవే. వాటిని సవాళ్లు చేసినవారు గానీ, ఎదుటి పార్టీలు గానీ ప్రజలు గానీ సీరియస్‌గా తీసుకోరు. తీరా ఫలితాలు వెలువడి అవి అటు ఇటు అయినా తమ సవాళ్లను నవ్వి తోసిపుచ్చేందుకు ఎవరి పద్ధతి వారికుంటుంది. దానితో అందరూ నవ్వి అన్నిటినీ మరిచిపోతారు. ప్రస్తుత సందర్భంలో చివరకు ఏమయ్యేది చెప్పలేము గా నీ, సవాళ్ల పరిస్థితి మాత్రం మామూలుకు భిన్నంగా ఉంది. వాటిని పరిశీలకులు మా మూలుకన్నా భిన్నంగా చూడడం కూడా అం దువల్లనే. ఆ కారణంగా ఇది చర్చనీయమవుతున్నది తప్ప లేనట్టయితే పట్టించుకోవలసింది ప్రత్యేకంగా ఏమీలేదు.
తెలంగాణ ఏర్పడి టిఆర్‌ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమైన ఉప ఎన్నిక వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగినపుడు అది తమ పరిపాలనపై రెఫరెండం అని కెటిఆర్ ప్రకటించారు. అది ఆశ్చర్యం కలిగించింది. ప్రభుత్వం ఏర్పడి అప్పటికి సుమారు పదహారు నెలలు గడిచాయి. తను ఆ కాలంలో చేసిన మంచి పనులేమిటో ప్రభుత్వం ఒకవైపు ఎంత గట్టిగా ప్రచారం చేస్తున్నా, వైఫల్యాలంటూ ప్రతిపక్షాలు కూడ నిత్యం హోరెత్తిస్తుండిన రోజులవి. తెలంగాణలోని పలు ప్రజాసంఘాలు, కొందరు మేధావులు, రచయితలు, కొన్ని పత్రికలు, చానళ్లు కూడా ఆ శ్రుతిని పెంచి వాతావరణాన్ని బాగా వేడెక్కించారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు లేని రోజంటూ అప్పుడు లేకపోవడం కూడా ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పెట్టే పరిస్థితి. అందుకే వరంగల్‌లో టిఆర్‌ఎస్ గెలిచినా మెజారిటీ గణనీయంగా తగ్గగలదని స్వయంగా ఆ పార్టీ నేతలు సైతం భావిస్తున్న స్థితి అది. అటువంటప్పుడు మామూలుగానైతే జరిగేది ఏమిటి? ఆ ఎన్నిక ప్రభుత్వ పాలనకు రెఫరెండమని, గెలవకపోతే రాజీనామా చేస్తారా అని, మెజారిటీ తగ్గితే తప్పుకుంటరా అని ప్రతిపక్షాలు సవాళ్లు విసరాలి. ఆ విధంగా అధికారపక్షంపై మానసిక యుద్ధాన్ని ప్రకటించి ఉక్కిరి బిక్కిరి చేయాలి. కానీ అదేమీ జరగకపోగా, ఆ ఎన్నిక తమ పాలనపై రెఫరెండమని ఉన్నట్లుండి ఒకరోజున కెటిఆర్ స్వయంగా అన్నారు.
ఆ మాట మరెవరైనా అని ఉంటే ఎక్కువ విలువ, ప్రభావం ఉండేవి కావు. కానీ అన్నది ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కావడంతో ఫ్రజలకు ఆసక్తి ఏర్పడగా ప్రతిపక్షాలు ఉలికిపడ్డాయి. విధిలేకనో, లేక తమకు అంతవరకు తట్టలేదో కానీ అప్పటినుంచి వారు కూడా రెఫరెండమని అనసాగారు. చివరకు వారు గెలవడం మాట అటుంచి టిఆర్‌ఎస్ మెజారిటీ వారు సైతం ఊహించని స్థాయికి చేరడం తెలిసిందే. ఇక్కడ విషయం అదికాదు. ఆ ఎన్నిక తమ పాలనకు రెఫరెండమని అనూహ్యంగా తామే ముందు ప్రకటించి ప్రతిపక్షాలపై మానసిక యుద్ధాన్ని ఆరంభించడం గురించిన చర్చ ఇది. అది నిజానికి అప్పుడుండిన ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైనది కూడా. బహుశా మరొక దిశనుంచి అది ఓటర్ల మనసులను చతురమైన రీతిలో ప్రభావితం చేయబూనడం కూడా కావచ్చు. రాజకీయ యుద్ధం నువ్వా నేనా అన్నట్టు సాగేటప్పుడు ఇటువంటి ఆకస్మికతల ప్రభావం ప్రేక్షకులపై నాటకీయంగా ఉంటుంది. సాహసుల వైపు పోలరైజేషన్ పెరుగుతుంది. చప్పట్లు, ఈలలు చెలరేగుతాయి. సాహసవంతునికి ఓట్లు పెరుగుతాయి. రాజకీయాలలో మానసిక యుద్ధాల ఉద్దేశమే అది. ముందుగా తటస్థులను, తర్వాత అవతలవైపువారిని తమవైపు తిప్పుకోవడం. వరంగల్లులో తారక రామారావు ఎవరూ ఊహించని విధంగా ఆకస్మికంగా ఆ సవాలు విసిరింది ఎందుకో మనకు తెలియదు. గెలుపుపై పూర్తి నమ్మకం ఏర్పడినందుకా, లేక మానసిక యుద్ధాలలోని కిటుకుల తెలిసినందుకా లేక రెండూ కలిసి పనిచేసాయా తనుమాత్రమే చెప్పగలరు. పోతే, ఆ మానసిక యుద్ధం చూపిన ప్రభావం ఇదమిత్థంగా ఎంత? ఈ నిర్దిష్టమైన ప్రశ్నతో వరంగల్ ఓటర్ల మనసులను తరచి చూస్తూ పోతే విషయం కొంతవరకు అర్ధం కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఓటర్ల ఎలక్టోరల్ బిహేవియర్‌ను అధ్యయనం చేయడంలో మనం ఇంకా అంత దూరం వెళ్లలేదు. వరంగల్ అనేకాదు, దేశంలో ఎక్కడా కూడా.
దానినట్లుంచితే, వరంగల్ రెఫరెండం ప్రకటనను కెటిఆర్ గ్రేటర్ ఎన్నికల సందర్భంలో ఒక సవాలు రూపంలోకి మార్చారు. ఆ తర్వాత హరీశ్‌రావు అదే పని చేస్తున్నారు. ఇది తప్పకుండా హైస్టేక్స్ మానసిక యుద్ధం. సరిగా వరంగల్‌వంటి పరిస్థితులే ఇక్కడ కూ డా ఉన్నాయి. హైదరాబాద్ కోసం ఏమేమి చేసారో, ఏమి చేయనున్నారో టిఆర్‌ఎస్ చెప్తుండగా అవన్నీ లోగడ తాము చేసినవి, లేదా ఆరంభించినవని ప్రతిపక్షాలు గట్టిగా ఎదురు ప్రచారం చేస్తున్నాయి. ఇంకా ఏవైనా మిగిలితే వాటిని ఆచరణ సాధ్యం కాని హామీలని కొట్టివేస్తున్నాయి. అమలయ్యే వాటిలో అనేకానికి కేంద్ర ఆర్థిక సహాయం ఎంతున్నదో గణాంక వివరాలను పేర్కొంటున్నాయి. ఇది ఒక స్థితి కాగా యథాతథంగా మొదటినుంచి గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ బలమైన పార్టీ కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి గణనీయంగా మారినట్టు సికింద్రాబాద్ కంటోనె్మంట్ ఎన్నికలు, స్థానిక సంస్థలనుంచి ఎమ్మెల్యే ఎన్నిక, ఇతర పార్టీలు అన్నింటినుంచి టిఆర్‌ఎస్‌లోకి సాగుతున్న నిరంతర వలసలు, ప్రజలనుంచి సాధారణ రూపంలో వినిపించే మాటలు చెప్తున్న మాట నిజం. అయినప్పటికీ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల వంటి సమగ్ర స్థాయిలో అధికారపక్షం మొదటిసారిగా తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నది. నగరానికి బయటగల జిల్లాలలోని ఓటర్ల సముదాయానికి, నగర ఓటర్ల సముదాయానికి మధ్య తగినన్ని వ్యత్యాసాలున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు టిఆర్‌ఎస్‌ది సున్నితమైన పరిస్థితి. స్టేక్స్ ఎంత ఎక్కువో పరిస్థితి అంత సున్నితం. పైగా తన రకరకాల విమర్శకులందరికీ హైదరాబాద్ కేంద్ర స్థానం. నగర ప్రాంత ఓటర్లు గ్రామీణులకన్నా భిన్నంగా చంచల చిత్తులనే (్ఫకిల్ మైండెడ్) పేరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉన్నదే.
అయినప్పటికీ గమనార్హమైన రీతిలో గ్రేటర్ మున్సిపల్ అధ్యక్ష స్థానం గురించిన సవాలు ప్రతిపక్షాలనుంచి కాక టిఆర్‌ఎస్‌నుంచి వచ్చింది. అంతకన్నా గమనార్హమైనది కెటిఆర్ సవాలు విసరిన తర్వాత కూడా ప్రతిపక్షాలనుంచి అందుకు సూటి అయిన స్పందన లేదు. 150లో 100 సీట్లు గెలవగలమనే మాటను కెటిఆర్ పక్కకు ఉంచవచ్చుగాక. కానీ అధ్యక్ష స్థానం అసలు ట్రోఫీ. పైన పేర్కొన్న పరిస్థితులు తమకు అనుకూలమైనవైనట్టు భావిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు తామే మొదట సవాలు విసరకపోవడం సరికదా, వచ్చిన సవాలుకు కూడా స్పందించడం లేదు. డొంకతిరుగుడుగా వేరే మాటలు మాట్లాడడం తప్ప. దానినిబట్టి అధికార పక్షపు మానసిక యుద్ధ ఎత్తుగడ యుద్ధానికన్నా ముందే ఫలించినట్టు భావించాలా? ఈ ఎత్తుగడ ప్రభావం వరంగల్‌లో ఎంత ఉందన్న అంచనాలు అయితే మనకు లేవు గానీ, (టిఆర్‌ఎస్‌కు అంతర్గతంగా ఉన్నాయేమో తెలియదు) అటువంటి ప్రభావాన్ని హైదరాబాద్‌లో కూడా చూపాలని కెటిఆర్ ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్లా? దీని ప్రభావాలు ఎంతవరకు ఉంటాయన్నది ఎక్కడైనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అవేమిటన్న వర్గీకరణలు, విశే్లషణలు ఇక్కడ చేయలేముకానీ, ప్రస్తుతం గ్రేటర్‌లో కనిపిస్తున్న పరిస్థితిని బట్టి ఆ ప్రభావం తగినంత ఉండే లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. అంత మాత్రాన గెలిచి తీరుతారనడం లేదు. ఆ మాట ఎట్లున్నా ప్రభావం పడడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. మూడే మూడు మాటలు చెప్పాలంటే ప్రతిపక్షాలు కకావికలుగా స్థైర్యాన్ని, ఐక్యతను కోల్పోయినట్టు ఉన్నాయి. గాలి అధికార పక్షానికి మొగ్గుగా కనిపిస్తున్నది. నగరవాసుల దృష్టి పౌర సమస్యలు, అభివృద్ధిపై కేంద్రీకృతమవుతున్నది. ఇవి అధికార పక్షపు మానసిక యుద్ధ నీతికి కలిసిరాగల అంశాలు. టిఆర్‌ఎస్ దీనిని గుర్తెరిగినందువల్లనే రాజీనామా సవాలును విసిరినట్లా?
నారాయణ్‌ఖేడ్‌లోనూ ఇదే సవాలు చేసిన హరీశ్‌రావు స్థాయి తక్కువది కాదు. ఆయన ముఖ్యమంత్రికి మేనల్లుడు. పార్టీలో, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. తమకు అప్పగించిన శాఖల బాధ్యతలను చాలా సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారనే గుర్తింపును కెటిఆర్, హరీశ్‌రావు ఇద్దరూ తెచ్చుకున్నారు. నారాయణఖేడ్ మొదటినుంచి కూడా కాంగ్రెస్‌కు, టిడిపికి బలమైన స్థావరం. కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతివల్ల ఆ పార్టీపట్ల సానుభూతి గణనీయంగా ఉందనేభావన ఉంది. అది పూర్తిగా గ్రామీణమైన, వెనుకబడిన ప్రాంతమైనందున ప్రజలపైన సాధారణంగా బయటిమార్పులు, ఆలోచన ప్రభావాలు తక్కువగా ఉంటాయి. హరీశ్‌రావు అక్కడ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నది ఇందు వల్లనే. అయినప్పటికీ సవాలు విసిరింది ఆయనేకానీ కాంగ్రెస్,టిడిపిలు కాదు. ఈ కారణాల మూలంగానే గ్రేటర్, నారాయణ్‌ఖేడ్ ఎన్నికలు ఎంత ముఖ్యంగా మారా యో, రాజకీయ మానసిక యుద్ధాలు అంత అపూర్వమైన రీతిలో సాగుతున్నాయి. ఇవి మనం సాధారణంగా చూసేవి కాదు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)