సంపాదకీయం

‘కార్చిచ్చు’కు కారకులు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్టణం నుంచి విజయవాడకు వెడుతుండిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం నాడు తునివద్ద తగలబడి పోవడం ఊహించని ఆశనిపాతం. ప్రశాంత ప్రకృతి అమితవేగంగా అశాంత వికృతిగా మారడం కాపుల సంక్షేమ ఉద్యమంపై పడిన పిడుగు. రైలును తగులబెట్టిన వారు కాపుకులస్థులకు అపకీర్తి తెచ్చిపెట్టారు. పథకం ప్రకారం ఉద్యమ గతిని తప్పుదోవ పట్టించారా? హఠాత్తుగా ఆవేశం కట్టలు తెంచుకున్నదా? అన్నది బహుశా నిర్ధారణ కాకపోవచ్చు. కానీ తమ కులం వారికి వెనుకబడిన హోదా కల్పించడానికి ఆందోళనకు దిగిన ఉద్యమకారులు మాత్రం రైలును తగులబెట్టే దుశ్చర్యకు పాల్పడి ఉండరు. ప్రతి సమస్యను దుర్మార్గులు కొందరు అశాంతిని సృష్టించడానికై అమిత చాకచక్యంగా ఉపయోగించుకుంటారన్నది స్పష్టం. రత్నాచల్ రైలుకు చెందిన ఇరవైనాలుగు బోగీలు తగలబడిపోవడం అధికారులు ధ్రువీకరించిన విషాదం. పదమూడు బోగీలు పూర్తిగా బూడిద అయిపోయాయి. ఇలా రైలు మొత్తం అగ్నిగ్రస్తం అయినప్పటికీ జననష్టం కలుగక పోవడం ఒక్కటే ఉపశమనం. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు ఇతరేతర వాహనాలు ధ్వంసం కావడం దగ్ధం కావడం న్యాయం కోరుతున్న నిజమైన ఉద్యమకారుల పని కాకపోవచ్చు. ఉద్యమం చాటున ముఖానికి ముసుగులు తగిలించుకున్న సంఘ వ్యతిరేకులు, దేశవిద్రోహులు, కులాల మధ్య చిచ్చుపెట్టి వైరుధ్యాలను ఉద్ధృతం చేయడానికి పొంచి ఉన్న హిందూ వ్యతిరేకులు, గూం డాలు, ప్రచ్ఛన్న బీభత్సకారులు ఆదివారం తునిలో చెలరేగిపోయారన్నది మాత్రం స్పష్టం. తరలివచ్చిన లక్షల మంది ఉద్యమకారులలో ఈ దుండగులు చేరిపోవడం వల్లనే రైలు తగలబడిపోయింది. ముఖానికి ముసుగులు ధరించిన విద్రోహులు, రైలును తగులబెట్టారన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం. జనాన్ని ప్రధానంగా భయ విభ్రాంతులకు గురిచేసి పరుగులు తీయించిన ఈ అసాంఘిక శక్తులు ఫలానా రాజకీయ పార్టీకి చెందిన వారని మరో రాజకీయ పార్టీవారు ఆరోపించడం ఆశ్చర్యకరం కాదు. కానీ ఉద్యమం హింసా రూపం ధరించవచ్చునని, ఉద్యమకారులలో దుర్మార్గులు, చేరిపోగలరని ఊహించకపోవడం, నిరోధించలేకపోవడం క్రూరమైన నిర్లక్ష్యానికి ఘోరమైన సాక్ష్యం. ఈ వైఫల్యం ప్రభుత్వ నిఘా వర్గాలది, రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులది, రాజకీయ పార్టీలది, ఉద్యమ నిర్వాహకులది..ఉద్యమ అధినేత ముద్రగడ పద్మనాభం పాల్పడిన ప్రదర్శనా వైపరీత్యానిది. నిరశన వ్రతంలో నిరసన దీక్ష ప్రారంభించిన ముద్రగడ దీక్షాస్థలంనుండి జాతీయ రహదారి పైకి వచ్చి భైఠాయించడం ఈ ప్రవర్తనా వైపరీత్యం. సంయమనం పాటించి ఉద్యమ కారులను సమన్వయం చేయవలసిన అధినాయకుడు ఇలా ఆవేశానికి హఠాత్తుగా లోనుకావడం విధ్వంసకాండకు, దగ్ధకాండకు ప్రధాన కారణం.
కాపు కులస్థులు అనాదిగా వ్యవసాయదారులు. కాపు అన్న పేరు వ్యవసాయంతో పొలంతో ముడివడి ఉంది. కాపు అంటే పొలాన్నిరక్షించేవాడు. ధాన్యసంపత్తిని కాపాడేవాడు. అన్నదాతకు అన్యాయం జరిగిపోతోందని 1947 నుంచీ నేటి వరకు ఆర్భాటిస్తున్న రాజకీయ పార్టీలవారు కాపు కులస్థులకు న్యాయం చేయడానికి మాత్రం చిత్తశుద్ధితో పూనుకొనకపోవడం సమాంతర వైపరీత్యం! ఇందుకు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మాత్రమే కాదు, కాపు ఉద్యమ నేతలుగా చెలామణి కావడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న ప్రముఖులు కూడ కారణం! పదవిలో ఉన్నప్పుడు ఒకమాట, పదవి లేనప్పుడు మరోమాట ఆవిష్కరిస్తున్న రాజకీయ వేత్తల వలెనే ఈ కుల పెద్దలు సైతం ద్వంద్వ విధానాలను అభినయించడం చరిత్ర! వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లను కల్పించిన సమయంలోనే కాపులకు సైతం ఆ సదుపాయాలను కల్పించకపోవడానికి కారకులు ఎవరు? పట్టించుకోని వారు ఎవరు? దాదాపు అన్ని రాజకీయ పార్టీలవారు ఎన్నికల సమయంలో కాపులను వెనుకబడిన తరగతులుగా గుర్తిస్తామన్న వాగ్దానంతో వారి వోట్లను దండుకున్నారు! అధికారం లభించిన తర్వాత ఆ సంగతిని మరిచిపోయారు! అవశేషాంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సైతం నిర్వహిస్తున్న వారు కూడ ఇరవై నెలలుగా ఈ మరచిపోవడాన్ని అభినయించారు! అందువల్ల కాపుల గుండెలు రగలడం సహజం!
ఒక నేరగాడి వల్ల మాత్రమే ఈ దగ్ధకాండ, ధ్వంస రచన జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వాపోయారు. మరి ఆ నేరగాడు ఎవరో ఎందుకని బయటపెట్టడం లేదు? ఎవరో తెలిసినప్పుడు ఆ నేరగాడు నేరానికి పాల్పడకుండా ఎందుకు నిరోధించలేదు? కాపులను వెనుకబడిన కులం బీసీగా గుర్తిస్తూ తక్షణం ప్రభుత్వం ఉత్తరువును జారీ చేయగలదన్నది ధ్వంసకాండ జరిగిపోయిన తరువాత చంద్రబాబు చెప్పిన మాట! కానీ ఇందుకోసం ఆయన ఒక షరతును విధించడం విషాద ప్రహసనంలో విచిత్ర సన్నివేశం! ప్రభుత్వపుటుత్తరువు-జివో-ను అమలు జరిపే బాధ్యత మాత్రం ప్రభుత్వానిది కాదట! జివోను అమలు జరిపే బాధ్యతను మీరు తీసుకుంటారా? అని ఆయన ఒక ప్రశ్నను సంధించారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను ప్రభుత్వం అమలు జరపాలి కాని ఇతరులెవరో అమలు జరపడం ఏమిటి? ముఖ్యమంత్రి ప్రశ్నించిన ఆ మీరు ఎవరో మాత్రం స్పష్టం కాలేదు. జివోను అమలు జరుపవలసింది కాపు ఉద్యమకారులా? లేక ప్రతిపక్షాల వారా? ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన మేరకు కాపులను బీసీలలో చేర్చడానికి కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాంటప్పుడు ఉద్యమ నేతలను జివో అమలు జరుపడంలో గల ఇబ్బందుల గురించి ఎందుకని ఒప్పించలేకపోయారు? ఆ ఇబ్బందులను తొలగించడానికి అధికారం చేపట్టిన నాటినుండి తీసుకున్న చర్యలేమిటి? ఇప్పుడు విధ్వంస కాండ జరిగిన తరువాత మాత్రమే ఉలిక్కి పడిన అవశేషాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంతకాలం ఈ సంగతి పట్టించుకున్న దాఖలా లేదు. విదేశీయ సంస్థలకు అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించే గురుతర బాధ్యతను కట్టభెట్టడానికి జరుగుతున్న ఆర్భాటపు హోరులో కాపుల ఆక్రందన దొరతనం వారికి వినపడలేదు...
వెనుకబడినతనం అన్న దానికి జాతీయస్థాయిలో నిర్వచనం ఏర్పడకపోవడం మన రాష్ట్రంలో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న ఉద్యమాలకు మూలం. ఇలాంటి స్పష్టతను చట్టం ద్వారా కానీ రాజ్యాంగ సవరణ ద్వారా కానీ కలిగించకపోవడం రాజకీయ చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనం. ఇలాంటి శాసకీయ-స్టాట్యుటరీ-స్పష్టత ఏర్పడి ఉండనట్టయితే కాపులను బిసిలో చేర్చడానికి ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తరువు-జివో-1995 నుంచీ అమమలు జరిగి ఉండేది! ఉద్యమాలు ఒత్తడులు ప్రాతిపదికగా కాక వెనుకబడిన కులాల నిర్ధారణ మండలి-బీసీ కమిషన్ వారి సిఫార్సు ప్రాతిపదికగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని న్యాయస్థానాలు నిర్ధారించడానికి ఇదీ కారణం! తదుపరి చర్యలు తీసుకోని రాజకీయ నిర్లక్ష్యం ఆదివారంనాటి దుర్ఘటనకు అసలు కారణం...