సంపాదకీయం

రక్షణ లేని ‘రక్షణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైనిక దళాలలో పదోన్నతులను ఇప్పించడానికై లంచాలను దండుకుంటున్న ముఠాలు ఏర్పడి ఉన్నాయన్నది ప్రచారవౌతున్న అభియోగం. మేజర్ జనరల్ స్థాయి ఉన్నత సైనిక అధికారులిద్దరు ఈ ముఠాలలో కీలకపాత్ర వహిస్తున్నారన్నది అవినీతి ప్రహనంలో సరికొత్త ఘట్టం. ఈ ఇద్దరి అవినీతి గురించి దర్యాప్తు జరుపవలసిందిగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఆదేశించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. సైనిక దళాలలో లెఫ్టినెంట్ జనరల్ తరువాత ఉన్నత పదవి మేజర్ జనరల్ పదవి. అందువల్ల అవినీతి ఉన్నత స్థాయికి ఎగబాకిందనడానికి ఈ ఆదేశం నిదర్శనం. ఈ ఇద్దరు అధికారుల అవినీతి గురించి పరిశోధించాలంటూ రక్షణ మంత్రిత్వ శాఖవారు కేంద్ర నేర పరిశోధక మండలి-సిబిఐ- వారిని కోరిందట. సిబిఐ ప్రథమ ఆరోపణ పత్రాన్ని-ఎఫ్‌ఐఆర్-నమోదు చేసిన తరువాత ఈ అధికారుల పేర్లు బయటపడనున్నాయట! సైనిక దళాలలో యువకులను చేర్పించడానికై లంచాలు వసూలు చేస్తున్న ముఠాలవారు సైనికులు కాదు, బయటివారు! కానీ పదోన్నతుల కోసం లంచాలను వసూలు చేసిన వారు సైన్యంలోని ఉన్నత అధికారులు. సైనిక వ్యవస్థ లోపలినుండి చెదలెక్కిపోతోందనడానికి సాక్ష్యం! ఈ లంచాలతో ముడివడిన పదోన్నతుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయకుమార్‌సింగ్ మొదట పసిగట్టారట! ఈ నేరస్థులను శిక్షించవలసిందిగా ఆయన రక్షణ మం త్రి మనోహర్ పారికర్‌కు ఉత్తరం రాసినట్టు గత సెప్టెంబర్‌లో ప్రచారమైంది. విజయకుమార్‌సింగ్ సైనిక దళాల ప్రధాన అధికారిగా పనిచేసి 2012 మే 31న పదవీ విరమణ చేసారు. ఒక విదేశీ సంస్థ వారు తమకు పధ్నాలుగు కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపినట్టు విజయకుమార్‌సింగ్ 2012 మార్చిలో ఆరోపించడం ప్రకంనలను సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన ఆ సంస్థ వారు ఆరు వందల నాసిరకం ట్రక్కులను మన సైనిక దళానికి అమ్మడం కోసం ప్రధాన అధికారి అనుమతిని పొందడానికి యత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఈ భారీ లంచం ఇవ్వజూపారన్నదని విజయకుమార్‌సింగ్ సైనిక దళాల ప్రధాన అధికారి పదవిలో ఉన్నప్పుడు చేసిన అభియోగం. అయితే ఏళ్ల తరబడి ఆ విదేశీయ సంస్థవారు మన సైనిక దళాలకు ఏడు వేలకు పైగా ఆ నాసిరకం ట్రక్కులను అమ్మేశారట! అందువల్ల సైనిక దళాలలోని అనేకమంది ఉన్నత అధికారులకు 2012కి పూర్వమే భారీ ఎత్తున ఆ సంస్థవారు లంచాలను చెల్లించి ఉంటారన్నది అనుమానం! అయితే ఈ అనుమాన నివృత్తి ఇప్పటికీ కాలేదు. కానీ నిప్పునకు చెదలు అంటుతోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! కాపాడవలసిన కంచె స్వయంగా కాజేస్తోంది! సైనిక దళం దేశభక్తికి అద్దం. సరిహద్దుల రక్షణకు, ప్రాదేశిక సమగ్రతకు, అంతర్గత భద్రతకు విగ్రహ రూపం! సైనికులు నిరంతర నిర్నిద్రులై ఉన్నారు కనుక దేశప్రజలు నిర్భయంగా నిద్రపోగలుగుతున్నారు. దేశ ప్రజలకు సైనికులపట్ల ఎంతో పవిత్ర భావం ఉంది! కానీ ఈ పవిత్ర స్వరూపంపై కళంకపు మరకలు కనిపించడం ఆరంభం కావడం ఆందోళనకరమైన పరిణామం! మొత్తం స్వరూపాన్ని వికృతపరచడానికి ఒక్క మాలిన్యపు మరక చాలు..మరకల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం దిగ్భ్రాంతికరం!
ఈ ఇద్దరు మేజర్ జనరల్ స్థాయి అధికారులు ఇంతవరకు సైనిక దళాలలో ప్రశంసలకు గురి అయినవారు. అందువల్ల తమపై ఎవ్వరికీ అనుమానం రాదన్న ధీమాతో ఉన్నవారు. ఈ ఇద్దరు అవినీతి పరులలో ఒకరు కొత్త ఢిల్లీలోని సైనిక ఆయుధ విభాగంలో పనిచేస్తున్నాడట. రెండవ అధికారి సైనిక దళాల తూర్పు విభాగంలో కలకత్తాలో నియుక్తుడై ఉన్నాడట! విలక్షణమైన, విశిష్టమైన సేవలను అందించినందుకుగాను ఈ ఇద్దరికీ అతి విశిష్ట సేవాపతకం లభించింది! అంటే ఏమిటి? ఆధికారికంగా వీరిద్దరు కర్తవ్య నిష్ఠకు నైతిక నిబద్ధతకు ప్రతీకలు! అనుమానం ఉన్న చోట నేరం జరగడం ఆశ్చర్యకరం కాదు. కానీ అనుమానం లేని చోట అవినీతి చెదలు విస్తరించి ఉండడమే విస్మయకరం! వీరిద్దరిలో ఒకరు సరిహద్దు రహదారి సంస్థలో జరిగిన అవినీతి ప్రహసనంలో కూడ ముడివడి ఉన్నారట! అయితే అతనిపై అభియోగాలు నమోదు చేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సిబిఐకి లభించలేదట!
ఇలా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకం వంటి ఉన్నత పురస్కారాలను పొందినవారు అవినీతి ఆరోపణలకు గురి అవుతుండడం రెండు విషయాలను స్పష్టం చేస్తోంది! ఈ పురస్కారాలను పొందడానికి వీలుగా విశిష్టతను నటిస్తున్న వారు విశిష్టత ముసుగులో విచ్చలవిడిగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఇది మొదటి వైపరీత్యం. పురస్కారాలకు విచక్షణతో కాక నిర్లక్ష్య రీతితో ఎవరినిపడితే వారిని ఎంపిక చేస్తున్నారు. ఇది రెండవ వైపరీత్యం! పదోన్నతులను కల్పించడానికై లంచాలు మరిగినవారు పురస్కార ప్రదానం కోసం వాటిని స్వీకరించరని హామీ ఏమీలేదు! చెదలు సోకనే రాదు, సోకిన తెగులు మాత్రం అదీ ఇదీ అన్న వివక్ష విచక్షణ లేకుండా అన్నింటినీ కబళించి వేయగలదు. ఈ అవినీతి ప్రహసనం వల్ల పదోన్నతుల ద్వారా ముగ్గురు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులను నియమించే కార్యక్రమం కూలబడిపోయి ఉందట! ఈ మూడు పదవుల కోసం నిర్ణాయక మండలివారు ముప్పయి ముగ్గురు మేజర్ జనరల్ స్థాయి అధికారుల అర్హతలను పరిశీలించారట! కానీ వివాదం కారణంగా నియామకాలను ప్రకటించలేదట! ఈ ముప్పయి ముగ్గురిలో ఈ ఇద్దరు అవినీతి పరులు చేరి ఉన్నారు! రక్షణకు సంబంధించిన అవినీతి కలాపాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కొనసాగుతున్నట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఆయా అవినీతి కలాపాలలో రాజకీయ వేత్తలు, వాణిజ్యవేత్తలు ప్రధాన పాత్రధారులు. సైనిక దళాలలో అనర్హులకు సమరాంగణ అనుభవం లేని వారికి అతి పెద్ద పదవులను కట్టబెట్టారని తన హిమాలయన్ బ్లండర్- హిమాలయ మహాపరాధం-అన్న పుస్తకంలో 1960వ దశకంనాటి బ్రిగేడియర్ దాల్వీ ఆరోపించి ఉన్నారు! 1962 నాటి చైనా దురాక్రమణ సమయంలో మనం చతికిలపడిపోవడానికి ఈ అనర్హులైన కొందరు సైనిక అధికారులు కూడ కారణం! సరిహద్దుల రహదారుల సంస్థలో అవినీతి కలాపాలు సంభవించడంకూడ 1950వ దశకం నుండీ మొదలైపోయిందన్నది ప్రచారమైన వాస్తం. రహదారులు వేసినట్టు చిత్రపటాల ద్వారా ప్రచారమైందట! చైనా దురాక్రమణకు పూర్వం ఈ చిత్రపటాలను ఆధారంగా రహదారులను వెదికిన సైనికులకు అవి కన్పించలేదు. నిర్మించని రహదారులను నిర్మించినట్టుగా మ్యాపులలో చూపించారట! 1980 దశకం నాటి బోఫోర్స్ హావిట్జర్ శతఘు్నల కొనుగోలు అవినీతిగ్రస్తం కావడం అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ట తెచ్చిన వ్యవహారం..
అగస్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల కొనుగోలునకు సంబంధించిన అవినీతి ప్రహసనంలో అనేకమంది అధికారులు, మాజీ అధికారులు ఆరోపణలకు గురి కావడం ఇటీవలి విపరిణామం. ఈ అవినీతికి సంబంధించిన ఆరోపణలను నిగ్గుదేల్చడానికై సిబిఐ అధికారులు 2014 జూన్‌లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎమ్.కె.నారాయణన్‌ను ప్రశ్నించింది. సాక్షిగా ప్రశ్నలకు గురైన నారాయణన్ పదవికి రాజీనామా కూడ చేశారు! ఇలా రక్షణ బలాలు అవినీతికి గురి అవుతుండడం అవాంఛనీయ పరిణామ క్రమం...