మెయన్ ఫీచర్

పట్టణాలు కాదు-గ్రామాలు బాగుపడాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం జిల్లా జనాభా 25.6 లక్షలు. మొన్నటి జనవరి చివరి నాటికి వలసబాట పట్టిన జనాభా 4.3 లక్షలు. రాబోయే వేసవిలో ఇది 5 లక్షలు దాటుతుందని అంచనా! జిల్లాలో చిన్నా, చితక పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు దాదాపు 6వేల పైచిలుకే. జిల్లాగుండా పోయే చెన్నై, కోల్‌కతా జాతీయ రహదారి నెం.216 పై అనేక మందుల కంపెనీలున్నాయి. ఇన్ని వున్నా ఈ జిల్లా ప్రజలు బరంపుర్, భువనేశ్వర్, కోల్‌కత్తా, విశాఖ, ముంబాయి లాంటి పట్టణాలకు వలసపోతూనే వుంటారు. తెలంగాణలో మహబూబ్‌నగర్, సీమలో అనంతపురం లాగా ఈ జిల్లా కరువుకాటకాల జిల్లా కాదు. చిత్తడి నేలలతో, మంచినీటి వనరులతో అలరారే ప్రాంతం. మంచినీటి చేపలకు ప్రసిద్ధి. ఇలా సహజసిద్ధ వనరులున్న జిల్లాపై పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల దృష్టిపడింది. విలువైన పంట భూములు వీటికి కేటాయించడం మొదలైంది. సోంపేట మండలంలో థర్మల్, అణువిద్యుత్ కేంద్రాల స్థాపనకై ఈస్టుకోస్టు ఎనర్జీ పవర్ కంపెనీకి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 3334 ఎకరాల పంటలతోపాటు, చేపల పెంపకానికి నిలయమైన బంగారంలాంటి భూమిని అప్పజెప్పింది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి వనరులున్న జిల్లాను వల్లకాడుగా మార్చారు. ఇప్పటికీ ప్రజలు ప్రతిఘటిస్తూనే వున్నారు.
గ్రామ స్వరాజ్యమనేది ఒకప్పటి మాట. నాయకులకు మూటల్ని తెచ్చే పట్టణీకరణ నేటి మాట! అందుకే దృష్టంతా పట్టణీకరణ పైననే!! ఇందులోనుంచి పుట్టిన ఓ విష బీజమే స్మార్ట్‌సిటీల యోచన. మోదీ తలుస్తున్న అనేక పథకాలల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పథకమిది. 100 సిటీలను స్మార్ట్‌గా మార్చాలన్న నినాదం 20 నెలలకు గాని రూపుదాల్చుకోలేదు. గత నెల 28న పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్యనాయుడు ప్రకటించింది 20 మాత్రమే! వచ్చే ఏప్రిల్‌లో మిగతా వాటి ఎంపిక జరుగుతుందట. నిరంతర విద్యుత్, తాగునీరు, ఇ-గవర్నెన్స్, ఐటి సదుపాయంలాంటి తదితర కొలత బద్దలతో ఈ ఎంపిక జరిగిందని, అందుకే 23 కేంద్ర, రాష్ట్ర ప్రాంతాలకు చోటు లభించలేదనేది మంత్రి ఉవాచ!
ఈ లెక్కన దేశంలోగల 465కు పైగాగల మొదటి స్థాయి నగరాల్లో, 8వేలకు పైగా గల పట్టణాల్లో ఏ ఒక్కటి లెక్కల్లోకి రావు. మోడల్ సిటీలుగా నిర్మితమైన చండీగఢ్, భోపాల్, భువనేశ్వర్‌లలో చండీగఢ్‌కు స్థానం దక్కకపోగా భువనేశ్వర్ ఎక్కువ మార్కులు సాధించగా, భోపాల్ చివరన నిలిచింది. దీని తర్వాతనే వరంగల్, తిరుపతిలు వున్నాయి. యూనియన్ కార్బైడ్ గ్యాస్ భోపాల్‌లో ఎలాంటి విధ్వంసాల్ని సృష్టించిందో, దాని పర్యవసానం ఇంకా ఎలా వెంటాడుతుందో తెలిసిందే. దానికి కారకుడైన అండర్సన్‌ను భద్రంగా విమానాల్ని ఎక్కించిన ఘన నేతలు మనవారు. మాదిరి పట్టణాలే ఈ విధంగా వుంటే, మిగతావాటి సంగతి తెలిసిందే!
ఇలా ఎంపికైన నగరాలే కాదు, ఎంపిక కాబోయే మరో 80 నగరాలు కూడా ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకుంటాయనేది మన ఆలోచన. కాని అయిదు సంవత్సరాలపాటు, సంవత్సరానికి రూ.500 కోట్ల చొప్పున ఖర్చుచేసేది ఈ నగరాల్లోని అప్పటికే అభివృద్ధి చెందిన గర్భగుడి ప్రాంతాన్ని. ఈ విధంగా మొదటి దఫాగా ఖర్చుచేయబోతున్న రూ.50,802 కోట్ల రూపాయలతో మరింతగా సుందరీకరిస్తారు. ఢిల్లీ మహానగరంలోని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్‌ఎండిసి) ఈ కోవలోనిదే. మొత్తం ఢిల్లీలో 3 శాతంతో, 44 చ.కి.మీ. విస్తీర్ణం గల ఈ ప్రాంతంలో వంద కోట్ల చిరాస్తులుగల ప్రైవేట్ వ్యక్తులు దాదాపు 4వేలకు పైగా వుంటారు. 3 లక్షల జనాభాగల ఈ ప్రాంతంలో ప్రతి బడ్జెట్‌లో కేటాయిస్తున్నది మూడువేల కోట్లకు పైగానే! అంటే ప్రతీ స్థానికునిపై ఒక లక్ష అన్నమాట. దీనికి ప్రధాన కారణం- విలాసవంతమైన ఈ ప్రాంతం 90శాతం దాకా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుండడమే! మిగిలిన మూడు మున్సిపాలిటీల పరిధిలో తలసరిగా చేస్తున్న ఖర్చు రూ.7,300 మాత్రమే! దేశంలోని మిగతా పట్టణ ప్రాంతాల్లో చేస్తున్న తలసరి ఖర్చు వెయ్యి దాటడంలేదని ఈ సందర్భంగా గుర్తించాలి. ఇదే ఢిల్లీలో తూర్పుభాగాన వుండే వలస జనాలకు నిలయమైన త్రిలోక్‌పురి స్మార్ట్ జాబితాలో ఎక్కదుగాక ఎక్కదు. స్లమ్‌డాగ్ మిలియనీర్ అన్నమాట!
మొత్తం నగరాన్ని కాకుండా, ఎంపిక చేసిన ప్రాంతం ఈ 20 నగరాల్లో 27వేల ఎకరాలుగా గుర్తించారు. అనగా, పొట్టతిప్పలకై రాజు వేషం వేసే కళాకారులు మొఖానికి రంగు పులుముకున్నట్లు. ఈ నగరాల చుట్టూ వుండే మురికివాడలు గాని, యమ కూపాలుగాని, శివారు ప్రాంతాలుగాని వీటి లెక్కల్లోకి రావు. జిడిపిలో 63 శాతం పట్టణ ప్రాంతాల నుంచే వస్తుందని చెపుతున్న ప్రభుత్వాలు వందకు వంద శాతం నిధుల్ని కేటాయించాయట! పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో 60 శాతం నిధుల్ని వినూత్న ప్రయోగాలు చేసే కంపెనీలనుంచి, వ్యాపారాలు చేసుకునే వ్యక్తుల నుంచి సేకరిస్తారట! మిగతా 40 శాతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా పోగా కేంద్రం వాటా ఎంతనో తెలియదు. సరె! మొదటి దశలో ఈ పథకం సాగినా, తర్వాతి కాలంలో వనరుల కొరత, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కొనసాగుతుందనే నమ్మకం లేదు. ఈ అనుభవం సర్వశిక్షా అభియాన్‌తోపాటు, ఉపాధి హామీ పథకంలో, వైద్యరంగంలో చూస్తూనే వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని కేటాయించకపోవడంతో, కేంద్ర నిధులు వృధాకావడం తెలిసిందే! వీటి నిర్వహణకై, ప్రణాళికా రచనకై, సిటీల ఎంపిక, ఆమోదం, నిధు ల విడుదల, పర్యవేక్షణ, యాజమాన్యంతో పాటుగా మొత్తం ప్రోగ్రాంను మూల్యాంకనం చేయడాన్ని స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) అనే సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నది. దీనికో సీఈవో వుంటాడు. ఈ సీఈవో అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాల్సి వుంటుంది.
మొత్తంగా ఓ అందాల పోటీలా సాగే ఈ స్మార్ట్‌సిటీ పథకం, భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు, మున్సిపల్ పాలనా యంత్రాంగానికి, మొత్తంగా కేంద్ర ప్రభుత్వానికి చిక్కుముళ్ళను తెచ్చిపెట్టదనే నమ్మకం లేదు. అలాగే మంజూరైన నిధు లు ఒక పట్టణంలో ఒక్క ప్రాంతానికే పరిమితంగా ఖర్చుచేస్తే, మిగతా ప్రాంతాలు నిరాదరణకు గురైతే, మరింత ఈ నగరాలు అసమానతలకు గురౌతాయి.
స్మార్ట్ సిటీల కథనం ఈ విధంగా వుంటే, మోదీ ప్రవేశపెట్టిన మరో పథకం అందరికీ ఇళ్ళు. గత జూన్‌లోనే ప్రకటించిన ఈ పథకం ప్రకారం 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇండ్లను, గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల ఇండ్లను నిర్మించాలని. ఈ పథకం కూడా ఏకపక్షంగా పట్టణ ప్రాంతాలకే మొగ్గుచూపడంతో పట్టణ ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టాలని భావించి, గ్రామీణ ప్రాంతాల ఇళ్ళ నిర్మాణాన్ని పక్కన పెట్టింది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇంటి నిర్మాణాలను చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వాలు ఈ ప్రక్రియను నిరంతరంగా కొనసాగించినవే! ఈ పథకాల్ని ప్రకటించిన ప్రతీసారీ, లక్షల సంఖ్యలో జనాలు దరఖాస్తులు పెట్టడం జరుగుతూనే వున్నది. బినామీ పేర్లతో ఉన్నత వర్గాలు, రాజకీయవాదులు స్వంతం చేసుకునేవారు స్వంతం చేసుకుంటూనే వుండగా, దశాబ్దాలుగా ఇళ్ళురానివారు, అసలుకే ఇల్లులేనివారు అన్ని ప్రాంతాల్లో కనపడుతూనే వున్నారు. ఇలా ప్రతీ ప్రభుత్వ హయాంలో కడుతున్న ఇళ్ళు ఏమవుతున్నాయో, కూలితే ఎందుకు కూలుతున్నాయో నిజాయితీగా శే్వతపత్రం విడుదల చేస్తే బయటపడుతుంది.
పట్టణాలకుపోతే ఉపాధితోపాటు, ఇండ్లులేని వారి జాబితాలో చోటు దొరుకుతే, ఓ ఇల్లు దొరుకుతుందని, పట్టణంలో ఇదో పెద్ద ఆస్తిగా భావించే జనాలు గ్రామాల్ని వదులుతున్నారు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న వ్యవసాయం, చేతివృత్తులు, కుల వృత్తులు పట్టణీకరణను మరింత ప్రోత్సహిస్తున్నాయి. దీన్ని నిలువరించాలని తలిచే ప్రభుత్వం ఒక్కటి కూడా కానరాదు. ఇలా నిర్మాణాలవైపు మొగ్గుచూపే ప్రభుత్వాలు, తాము బ్రతుకుతూ, అనుంగు బడా కాంట్రాక్టర్లను బతికించాలని చూడడమే! ఈ విధంగా కాంట్రాక్టర్లకు, పాలక పక్షాలకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది.
ఇక ఈ మధ్యన రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు గ్రామాల్ని దత్తత తీసుకోవడం తెలిసిందే! అలాగే ప్రతీ పార్లమెంట్ సభ్యునికి సంవత్సరానికి రూ.5కోట్ల చొప్పున పదవీ కాలంలో 25 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి నిధులు వస్తున్నాయి. వౌలిక వసతుల కల్పనకై గ్రామానికి కోటి రూపాయల నిధుల్ని సక్రమంగా ఖర్చుచేసినా, ప్రతి ఎంపి 25 గ్రామాల్ని బాగుచేసేవాడు. దేశవ్యాపితంగా 13 వేలకు పైగా గ్రామాలు అధునాతన గ్రామాలుగా రూపుదిద్దుకునేవి. గత రెండు దశాబ్దాలుగా ఈ అభివృద్ధి జరిగితే 50 వేలకు పైగా గ్రామాలు వెలుతురులో బతికేవి. కాని, అప్పుడు, ఇప్పుడు వెలుగొందుతున్నది పాలకవర్గాలు, వీరు అనుంగులు మాత్రమే! అందుకే ఇలాంటి పథకాలు రూపుదిద్దుకుంటూ వుంటాయి. గ్రామాలకు ఉరి బిగుస్తూ, పట్టణాల్ని మురికి కూపంగా మార్చడమే నేటి విధానం. ఈ విధానం మారుతుందనే ఆశ అత్యాశగానే మిగిలిపోతున్నది. అందుకే జనాలు వలసబాట పడుతున్నారు. ఇప్పుడు కావాల్సింది ఈ వలసల్ని నిలువరించే ప్రభుత్వాలు.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162