సంపాదకీయం

పాకిస్తాన్‌ను శిక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహాదీ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబయిలో జరిపిన భయంకర బీభత్సకాండ పాకిస్తాన్ ప్రభుత్వ పథకమన్న వాస్తవం సోమవారం మరోసారి ధ్రువపడటం ఆశ్చర్యకరం కాదు. మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి ఈ వాస్తవాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేయకపోవడం వల్ల మాత్రమే ఉగ్రవాద బాధితులను దేశ ప్రజలను నిరంతరం దిగ్భ్రాంతికి గురి చేస్తున్న వాస్తవం. అమెరికాలో జైలుశిక్ష అనుభవిస్తున్న డేవిడ్ కాలిమన్ హెడ్లీ అనే నరరూప రాక్షసుడు సోమవారం ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించిన వివరాలు పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూపానికి ధ్రువీకరణ. కాలిన్ హెడ్లీ అసలు పేరు దావూద్ జిలానీ. పాకిస్తాన్ బీభత్స ముఠా లష్కర్ ఏ తయ్యబాకు చెందిన హెడ్లీ ప్రస్తుతం వివిధ నేరాలకు అమెరికాలో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. దృశ్య మాధ్యమ అనుసంధానంతో అమెరికా నుండి ముంబయి న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పిన హెడ్లీ బయటపెట్టిన వివరాల వల్ల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్ రిజీమ్-బీభత్స వ్యవస్థ-గా ప్రకటించడానికి అవసరమైన వౌలిక సాక్ష్యాధారాలు మరింత స్పష్టమైపోయాయి. ముంబయిలో భయంకర రక్తపాతం సృష్టించి నూట అరవై ఆరుమందిని హత్య చేసిన జిహాదీలను పాకిస్తాన్ సైనిక దళాలవారు మన దేశం పైకి ఉసిగొల్పినట్టు హెడ్లీ వెల్లడించాడు. లష్కరే తయ్యబా ముఠాలోని మొదటి హంతకుడు హఫీజ్ సరుూద్‌తో కలిసి పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ ముంబయిపై దాడులను నిర్వహించినట్టు హెడ్లీ వెల్లడించాడు. ముంబయిపై జరిగిన దాడులకు కుట్ర పన్నిన వారిలో ఈ హెడ్లీకూడ ఒకడు. దాడులకు పూర్వరంగంగా హెడ్లీ తొమ్మిది సార్లు మన దేశానికి స్వేచ్ఛగా వచ్చి వెళ్లడం మన నిఘా బండ నిద్దుర పోయిందనడానికి కారణం. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్ రిజీమ్‌గా ప్రకటింపచేయడానకి వీలైన వౌలిక సాక్ష్యాధారాలు 2008 నవంబర్ నాటి మారణకాండ జరగడానికి పూర్వం అనేక ఏళ్లుగా ఉన్నాయి. మన ప్రభుత్వాలు 1993 నుంచి కూడ ఆ పనికి పూనుకోక పోవడం మన మెతకవైఖరికి, పాకిస్తాన్ ప్రభుత్వం ముందు మోకరిల్లే ధోరణికి నిదర్శనం. ఈ మన ప్రభుత్వపు అనాసక్తి వల్ల భద్రతా దళాల నైతిక స్థైర్యం క్రమంగా దిగజారింది. ఇలా దిగజారడం నిఘా నిద్దుర పోవడానికి ఒక ప్రధాన కారణం. కానీ మన నిఘా పదేపదే అప్రమత్తమై బీభత్సకారులను, పాకిస్తానీ తొత్తులను పసికట్టి పట్టుకుంటోంది. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ 1993 నుంచీ, దావూద్ ఇబ్రహీం ముఠావారు ముంబయిలో పేలుళ్లు జరిపినప్పటి నుంచీ అనేక సార్లు ధ్రువపడింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితిలో దోషిగా నిలబెట్టడం లోను, బీభత్స వ్యవస్థగా ప్రకటింపజేయడంలోను మన ప్రభుత్వాలు రెండు దశాబ్దులుగా విఫలం అవుతూనే ఉన్నాయి. డేవిడ్ హెడ్లీ ముంబయి న్యాయస్థానానికి వివరించిన వాస్తవాలు కొత్తవి కావు, హెడ్లీ స్వయంగా అంగీకరించి న్యాయస్థానానికి వివరించడం మాత్రమే కొత్తదనం. ముంబయిలో 2008లో మాత్రమే కాదు, అంతకుముందూ ఆ తరువాత కూడ జిహాదీలు జరిపిన హత్యాకాండకు సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వమన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం. ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం సూత్రధారి కావడం అనేక సార్లు ధ్రువపడినప్పటికీ అధికాధిక దేశాల వారు బహిరంగంగా నిరసించడం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. జిహాదీ ఉగ్రవాదులను పట్టి, విచారించి, శిక్షించమని కోరుతోంది. ఇలా కోరడం వల్ల పాకిస్తాన్ జిహాదీ ముఠాలు జరుపుతున్న బీభత్సకాండలో పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదని మన ప్రభుత్వమే అంగీకరించినట్టవుతోంది. ప్రపంచ దేశాలు కాని, ఐక్యరాజ్య సమితి కాని పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఇది. మనదేశంలో పాకిస్తానీ జిహాదీలు సృష్టించిన భయంకర బీభత్సకాండను ఇస్లాం మతనిష్ఠగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్న దేశాలవారు ఎలాగూ పట్టించుకోరు. 2008 నవంబర్ నాటి ముంబయి హత్యాకాండను పశ్చిమాసియా ప్రాంతంలోని ఇస్లాం మతరాజ్య వ్యవస్థలున్న దేశాలలో అధిక సంఖ్యాకులు సమర్ధించడం పాశ్చాత్య దేశాల సర్వేలలో నిగ్గుతేలిన నిజం. అందువల్ల పట్టించుకోవలసింది మన ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడైనా మన ప్రభుత్వం పట్టించుకోవాలి.
ఇలా పట్టించుకునే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. 2001లో ఆగ్రాలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని, పాకిస్తాన్ మాజీ నియంత పర్వెజ్ ముషారఫ్‌కు మధ్య జరిగిన చర్చలు భగ్నమైన తరువాత మన ప్రభుత్వం నిజంగానే చర్చలు చేపట్టింది. మన పార్లమెంట్ భవంనంపై పాకిస్తానీ జిహాదీలు, ఇక్కడ ఉన్న వారి జిహాదీ తొత్తులు దాడులు జరిపిన తరువాత మన ప్రభుత్వం చర్యలను ఉధృతం చేసింది కూడా. పాకిస్తాన్‌తో తెగదెంపులు చేసుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా గుర్తించవలసిందిగా కోరుతూ అంతర్జాతీయ వేదికలెక్కాలని కూడ నిర్ణయించింది. కానీ 2003 చివరి నుండి మన ప్రభుత్వం మళ్లీ పాకిస్తాన్‌తో చర్చలను ప్రారంభించింది. ఇరవైమంది కరుడుకట్టిన జిహాదీ బీభత్సకారులు పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్నారని మన ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది. వారిని మన దేశానికి అప్పగించవలసిందిగా మన ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. ఈ టెర్రరిస్టు పేర్లు న్న జాబితాను నిరంతర ధ్యాస కొరకు అప్పటి మన ఉప ప్రధాన మంత్రి లాల్ కృష్ణ అద్వానీ తన వెంటనే ఉంచుకొనే వారట. ఇదే సమయంలో పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదులను పట్టి పరిమార్చే హాట్ పర్స్యూట్ కార్యక్రమాన్ని కూడ అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం వారు ప్రచారం చేశారు. కానీ 2003వ సంవత్సరం అంతమయ్యే సరికి పాకిస్తాన్‌తో స్నేహ సంబంధాల గురించి పునఃప్రచారమైంది. భారతీయ జనతాపార్టీ వలె పాకిస్తాన్‌లో కొన్నాళ్లు విరోధం కొన్నాళ్లు స్నేహం తమ విధానం కాదని పాకిస్తాన్‌తో నిరంతరం మైత్రిని పాటించడం తమ విధానమని కాంగ్రెస్ అధిష్టానం అప్పుడు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వం పాకిస్తాన్‌తో నిరంతర మైత్రిని పాటించింది. 2008 నవంబర్‌లో ముంబయిపై హఫీజ్ సరుూద్ ముఠా దాడి చేసిన తరువాత ఏడు నెలలు తిరగకముందే రష్యాలోని ఏకాథరిన్ బర్గ్‌లో అప్పటి మన ప్రధాని మన్ మోహన్ సింగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీతో కరచాలనం చేసి ముంబయి మృతుల కుటుంబాల వారికి దేశ ప్రజలలను విస్మయగ్రస్తులను చేశారు.
టెర్రరిస్టులను పట్టి మన దేశానికి పంపమని కాని, శిక్షించమని కాని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం కోరడం, న్యాయం జరిపించవలసిందిగా హంతకుడిని హతుల కుటుంబాల వారు కోరడం వంటిది. శిక్షించవలసింది పాకిస్తాన్‌లోని జిహాదీ తోడేళ్లను కాదు. వాటిని ఉసిగొల్పుతున్న పాక్ ప్రభుత్వాన్ని! ఐక్యరాజ్య సమితి ఇందుకు పూనుకోవాలి. లేకుంటే మన ప్రభుత్వం పూనుకోవాలి. పూనుకుంటుందా?