సంపాదకీయం

దేశాన్ని తిట్టిన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో న్యాయవ్యవస్థలో అంకురించిన అయోమయం విచిత్రమైన గందరగోళంగా విస్తరించిపోతుండటం వర్తమాన దృశ్యం. మదరాసు ఉన్నత న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్ సోమవారం నాడు న్యాయవ్యవస్థను తల్లక్రిందులుగా ఆవిష్కరించడం రాజ్యాంగ కోవిదులను విస్మయ చకితులను చేసిన అద్భుతం. హైకోర్టుల తీర్పులను సమీక్షించే అధికారం, అంగీరించే అర్హత, రద్దు చేసే సామర్ధ్యం, మార్పు చేసే విచక్షణ సుప్రీంకోర్టునకు ఉందన్నది సామాన్యులకు తెలిసిన సత్యం, రాజ్యాంగ వ్యవస్థ ఏర్పరచిన న్యాయ ప్రక్రియ. కాదు..కాదు సుప్రీంకోర్టు నిర్ణయాలను సమీక్షించే అధికారం, రద్దుచేయగల ఔద్ధత్యం తనకుందని ఈ మదరాసు హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఇప్పుడు అంటున్నాడు. సుప్రీంకోర్టు వారు కర్ణన్‌ను మదరాసు నుండి కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. కానీ కర్ణన్ ఈ సర్వోన్నత ఆదేశాన్ని అమలు జరుపరాదని సోమవారం ‘ఆదేశించాడు..’ ‘‘ఉన్నత న్యాయస్థానాలు మా మాట వినడం లేదు. ప్రజలు ఎందుకు వింటారు?’’-అన్నది గతంలో సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు వ్యక్తం చేసిన ఆవేదన. గత ఏడాది మేనెలలో దత్తు అధ్యక్షతన ఏర్పడిన సర్వోన్నత ధర్మాసనం వారు వ్యక్తం చేసిన ఈ ఆవేదన ‘వ్యంగ్యం’! ‘‘ఎందుకంటే మీ మాట మేము పాటించము..’’ అని ఏ హైకోర్టు న్యాయమూర్తి కూడ సుప్రీకోర్టును ధిక్కరించలేదు. కానీ తమ ఆదేశాలను అమలు జరుపడంలో ఉన్నత న్యాయస్థానాలు జాప్యం చేస్తున్నాయన్నది సర్వోన్నత న్యాయమూర్తుల ధర్మాసనం గత మేనెలలో వ్యక్తం చేసిన ఆగ్రహానికి ప్రాతిపదిక. దేశంలోని జిల్లాస్థాయి, కింది స్థాయి న్యాయస్థానాల్లో మూడుకోట్ల వివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి విచారణను వేగవంతం చేయడానికి వీలుగా ఖాళీగా ఉండిన దాదాపు రెండు వేల న్యాయమూర్తుల పదవులను తక్షణం భర్తీ చేయాలన్నది హైకోర్టులకు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పుడు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశం. ఈ ఆదేశాన్ని అమలు జరపడంలో కర్నాటక హైకోర్టువారు జాప్యం చేయడాన్ని సర్వోన్నత న్యాయమూర్తుల ధర్మాసనం గత మే నెలలో తప్పుపట్టింది. జిల్లా న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంలో హైకోర్టు నత్తనడకతో పోటీ పడిందని సుప్రీంకోర్టు అప్పుడు వ్యాఖ్యానించింది. ఇదంతా హైకోర్టుల పని తీరు పట్ల ‘వ్యంగ్యం’ మాత్రమే. అంతేకాని అప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టును ధిక్కరించలేదు. ఇప్పుడు మదరాసు హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ప్రత్యక్షంగానే సుప్రీంకోర్టుపై తిరుగుబాటు చేసి ‘వ్యంగ్యాన్ని’, ‘వాచ్యం’ చేశాడు. అంతేకాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి టిఎస్ థాకుర్‌కు వ్యతిరేకంగాను కేసులు పెడతానని కర్ణన్ బహిరంగంగా బెదిరించడం రాజ్యాంగ నియమాలను గాలికి వదిలే స్వభావానికి నిదర్శనం. సుప్రీంకోర్టు ఏం చేయాలి? కర్ణన్‌కు ఎలాంటి న్యాయ విధులను కాని న్యాయపాలన విధులను కాని కేటాయించరాదని మదరాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించడం మాత్రమే సుప్రీంకోర్టు చేయగలిగిన రాజ్యాంగ విధి!
ఇలా ఒక హైకోర్టు న్యాయమూర్తి బహిరంగంగా సర్వోన్నత న్యాయస్థానం వారిని నిందించడం రాజ్యాంగంలోని 217-1-బి-వ అధికరణ ప్రకారం చర్యకు గురికాగలదా? అన్నది ఇప్పుడు స్పష్టం కావాలి. ఈ అధికరణలో హైకోర్టు న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి వీలైన ప్రక్రియను నిర్దేశించారు. రాజ్యాంగంలో 124వ అధికరణం 4వ ఉప అధికరణంలో నిర్దేశించిన విధంగా సర్వోన్నత న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించడానికి అవలంబించవలసిన ప్రక్రియను ఉన్నత న్యామూర్తులను పదవి నుంచి తొలగించడానికి కూడా పాటించాలన్నది 217-1-బి వ అధికరణ స్ఫూర్తి. 124-4-వ అధికరణ ప్రకారం న్యాయమూర్తి అనుచితంగా ప్రవర్తించినట్టుగాని, న్యాయ నిర్వహణ సామర్థ్యం కోల్పోయినట్టు గాని ధ్రువపడినప్పుడు మాత్రమే అయనను పదవి నుంచి తొలగించే ప్రక్రియను పార్లమెంటు ప్రారంభించవచ్చు. పార్లమెంటు ఉభయసభలు మూడింట రెండువంతుల ఉపస్థితుల మద్దతుతో అభిశంసించినప్పుడు మాత్రమే అటువంటి న్యాయమూర్తిని రాష్టప్రతి పదవినుంచి తొలగించగలడు. కానీ ఇలాంటి ప్రక్రియ పూర్తి కావడానికి నెలలు, ఏళ్లు పట్టవచ్చు. అంతవరకు సర్వోన్నత న్యాయస్థానం ధిక్కరించిన, బహిరంగంగా వెక్కిరించిన ఈ మదరాసు హైకోర్టు న్యాయమూర్తి పదవిలో ఉండవలసిందేనా? ఆయనను సుప్రీంకోర్టు వారు కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. కలకత్తాకు వెళ్లనని ఆయన మొండికెత్తి ఉన్నాడు. మదరాసు హైకోర్టులో ఆయన విధులను నిర్వర్తించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అందువల్ల కర్ణన్ విధులను నిర్వర్తించకుండా వేతనాన్ని ఇతర అధికారిక సౌకర్యాలను పొందుతూ ఉండే విచిత్ర స్థితి ఏర్పడిపోయింది.
సర్వోన్నత న్యాయస్థానాన్ని ధిక్కరించడంలో కర్ణన్ తృప్తి చెందలేదు. తన మాతృదేశాన్ని సైతం నిందించడం భయంకరమైన పరిణామం. తాను ‘దళితుడు’కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తనను వేధిస్తున్నారని కర్ణన్ బహిరంగంగా ఆరోపించడం హిందూ సమాజంలోని కోట్లాది నిజమైన దళితులను తప్పుదారి పట్టించే వ్యవహారం. హైకోర్టు న్యాయమూర్తి పదవిలో ఉన్న ‘ఉన్నతుడు’ ఇలాంటి నిందలకు పూనుకోవడం న్యాయవ్యవస్థకే కళంకం. తనను వేధిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆయన కేసు పెడతాడట.ఎస్‌సిఎస్‌టి-ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్-యాక్ట్- కింద సర్వోన్నత న్యాయమూర్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించగలనని కూడ కర్ణన్ బెదిరించాడు. కర్ణన్ నిజంగా ఈ విధంగా అన్యాయానికి గురి అయి ఉండినట్టయితే సర్వోన్నత న్యాయస్థానం వారిపై రాష్టప్రతికి ఫిర్యాదు చేసి ఉండాలి. అవేం జరగలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాను జారీ చేసిన ఉత్తరువు ప్రతిని మాత్రమే ఆయన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని నరేంద్ర మోదీకి, న్యాయమంత్రి సదానంద గౌడకు పంపించాడట. ఈ విచిత్రమై న్యాయ ప్రక్రియకు రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రాతిపదిక? అంతేకాదు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ఇతరేతర రాజకీయ వేత్తలకు సైతం ఆయన తన ఉత్తరువు ప్రతిని పంపించడం రాజ్యాంగ విరుద్ధం. విలేకర్లను పిలిచి వారికి ఈ మొత్తం ప్రహసనాన్ని వినిపించడం ఈ న్యాయమూర్తి పాల్పడిన మరో న్యాయ వ్యతిరేక చర్య.
ఈ దేశంలో పుట్టినందుకు తనకు తలవంపులుగా ఉన్నదని కర్ణన్ చెప్పడం దేశ వ్యతిరేక చర్య. కుల వివక్ష లేని మరో దేశానికి తరలిపోవడానికి సైతం తాను వెనుకాడబోనని ఆయన చెప్పడం ‘పాలిచ్చిన మాతృమూర్తి వక్షఃస్థలాన్ని ఛేదించే’’ ప్రవృత్తికి నిదర్శనం. ఇలా మాతృభూమి పట్ల, నిర్లజ్జగా వ్యతిరేకతను నింపుకున్న కర్ణన్ ఈ దేశపు రాజ్యాంగ వ్యవస్థకు రక్షణ కల్పిస్తున్న న్యాయ విభాగంలో ఇన్నాళ్లపాటు కొనసాగడమే విచిత్రం. దళితుడైనందువల్ల ఆయనకు అన్యాయం జరగలేదన్న దానికి హైకోర్టు న్యాయమూర్తి పదవి లభించడమే తిరస్కరించలేని సాక్ష్యం. 2009 మార్చిలో ఆయన న్యాయమూర్తిగా నియుక్తుడయ్యాడు. హైకోర్టు న్యాయమూర్తి పదవి అతి విశిష్టమైన రాజ్యాంగ పీఠాలలో ఒకటి. ఈ పదవిని పొందినవాడు దేశాన్ని తిట్టడమే ఘోరమైన విపరిణామం!