ఉత్తరాయణం

చెత్త తీస్తే డబ్బులివ్వాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జంటనగరాల్లో ఇంటినుండి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దానికి రెండు డబ్బాలను ఇంటింటికి ఇచ్చారు. చెత్తను మీ ఇంటినుంచే సేకరిస్తామన్నారు. ఇప్పుడు చెత్త సేకరించిన వారికి ప్రతినెలకి ఇంటికి ఫ్లాట్‌కి రూ.50 ఇవ్వాలని చెత్త తీసేవారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఏదైనా సర్క్యులర్ ఉన్నదా అని అడగాలంటే వీళ్ల బాస్ ఎవరో తెలియదు. అలా ఇవ్వకపోతే చెత్త సేకరించం అంటున్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.
- సి.వి.ఆర్ కృష్ణ, హైదరాబాద్
పేదలకోసం పోరాడాలి
కులం కోసం పోరాటం చేసే రాజకీయ నాయకులను సమాజం నుంచి వెలివేయాలి. తామొక్కరిమే ప్రభుత్వ ఫలాలు అందుకోవాలని కోరడం మంచి సంస్కృతి కాదు. ప్రజలందరి బాగోగులు పట్టించుకునేవాడే రాజకీయ నాయకుడు. అంతే కాని ఏ ఒక్క కులానికో పరిమితమయ్యేవాడు ప్రజా నాయకుడెలా అవుతాడు? ఆమాటకొస్తే ప్రతి కులంలో పేదవారున్నారు. ప్రతి కులం రిజర్వేషన్లకు అర్హమైనదే. ప్రతి కులం వారు తమకు ప్రత్యేక సదుపాయాల కోసం నిరాహారదీక్షలు, సమ్మెలు చేస్తే ఇక ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? కుల రిజర్వేషన్లకు స్వస్తిచెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కేవలం పేదరికం ప్రమాణంగా రిజర్వేషన్ సదుపాయాలు కల్పించాలి. ఏ కులం వారైనా ధనికులైతే వారికి రిజర్వేషన్లు వర్తించకూడదు. పేదరికమే రిజర్వేషన్‌కు గీటురాయి కావాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ కర్తల ఆశయం నెరవేరుతుంది. నేడు అన్నికులాల్లో ధనికులు, పేదలు ఉన్నారన్న సంగతి మరువరాదు.
-జి. శ్రీనివాసులు అనంతపురం
మంచితనం అసమర్థత కారాదు
మనవాళ్లు ఒట్టి వెధవాయిలోయ్ అన్నాడు గిరీశం కన్యాశుల్కంలో. మనవాళ్లు ఎంతమంచిగా ఉంటే ఏం లాభం? దుర్మార్గపు పొరుగుదేశం చేయరాని చేటు చేస్తూనే ఉంది. మోదీ, పాక్‌కు వెళ్లి పెళ్లి విందు ఆరగించి వచ్చిన తర్వాత పఠాన్‌కోట సంఘటనని కానుగ్గా ఇచ్చారు. ఎక్కడ ఏం చేస్తే ప్రకంపనలు వస్తాయో అటువంటి వాటినే విదేశీ ఉగ్రవాదులు అమలు పరుస్తుంటారు. మరి వీటిని అరికట్టే చర్యలు చేపట్టకుండా, ఏదేదో చేస్తున్నామంటే ఎలా? కొన్ని అంశాలపై కఠిన చర్యలే శాశ్వత పరిష్కారాన్నిస్తాయి. ఇటువంటి విషయాల్లో చైనా ఏంచేస్తున్నదో మనం కూడా అదే చేయాలి. కాశ్మీర్ మొత్తానికి యుద్ధ ప్రాతిపదికన రైలు, రోడ్డు కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించాలి. యుద్ధసన్నద్ధతతో పాటు తరలిపోయిన కాశ్మీరీ పండితులకి తగిన నివాసాలు వసతులు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా కాశ్మీర్‌లో నివసిస్తున్న పరాయిదేశాల ముష్కరులను గుర్తించి వారికి ఏరిపారేయాలి. కాశ్మీర్‌లో కూడా భారతీయులు యదేచ్ఛగా నివాసాలు ఏర్పరచుకునే అవకాశాలు కల్పించాలి. భారతీయులకు కాశ్మీర్‌ను నివాస ప్రాంతంగా మార్చాలి. క్రమంగా ఆక్రమిత కాశ్మీర్‌పై దృష్టి సారించి బర్మాలో దాగున్న ఉగ్రవాదుల్ని పరిమార్చినట్టు నిర్మూలించాలి. కాశ్మీర్‌లో చేయాల్సిన పనులు చేయకుండా, ఎవర్నో నిందిస్తే ఏం ప్రయోజనం? ముందు కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు చేయాలి. కాశ్మీర్‌లో కరసేవలు చేసే అవకాశం కల్పించాలి. లక్షల్లో ప్రజల్ని తరలిస్తే ఏ ఉగ్రవాదులూ ఏమీ చేయలేరు. రైలు మార్గాలు విస్తరిస్తే, ప్రజలు కాశ్మీర్‌కు వెళ్లేందుకు వీలవుతుంది. ఆరకమైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. ఇదే మాదిరగా ఆక్రమిత కాశ్మీర్‌లోకి కూడా ప్రజలు వెళ్లడం ప్రారంభిస్తే ఉగ్రవాద భూతాలు పారిపోతాయి.
- ఎ.ఎన్.ఎస్.కె. చక్రవర్తి, మచిలీపట్నం
ఉద్యోగాలు ఇచ్చే విధానం మార్చాలి
నేడు కొన్ని ప్రభుత్వ సంస్థల్లో, తండ్రి ఉద్యోగాన్ని సంతానానికి ఇచ్చే నిబంధనలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటికి స్వస్తి పలకాలి. ముఖ్యంగా సింగరేణి వంటి సంస్థల్లో కొన్ని ఉద్యోగాలకు ఈ విధానం ఇంకా కొనసాగుతోంది. దీన్ని రద్దు చేయాలి. వంశపారంపర్యంగా ఉద్యోగాలిస్తూ పోతే, ఇతరులకు ఉద్యోగావకాశాలు దక్కవు. ఉద్యోగి విధుల్లో ఉండగా అనారోగ్య లేదా ఇతర కారణావల్ల మరణిస్తే, అతని పిల్లలకు ఉద్యోగావకాశాన్ని కల్పిస్తే తప్పులేదు. అది సమంజసం కూడా.
- అయినం రఘురామారావు గౌడ్, ఖమ్మం
ఇష్టానుసారం ఫీజుల పెంపు
ప్రైవేటు బడులు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేస్తున్నాయి. బడుల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్నది. అదీ నిజమే. కాని కొన్ని ప్రైవేటు గుర్తింపు పొందిన స్కూళ్లలో కనీసం తాగేనీరు ఉండదు. అన్ని సదుపాయాలున్నా కొందరు పిల్లలకు చదువుపై శ్రద్ధ ఉండదు. కాని మార్పు మన చేతిలో ఉంది. ప్రతి బడిలో తాగునీరు, మరుగుదొడ్లు తప్పని సరిగా ఉండాలి. చదవని వారిని పాఠశాలలోంచి తొలగించి, వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం పాఠశాలలు స్థాపించాలి.
- కృపాచారి, కూర్మన్నపాలెం, విశాఖ
ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు
మాతృభాషా దినోత్సవాలు, తెలుగుభాషా దినోత్సవాలు ఏటా జరుపుకుంటారు. తెలుగుభాష పట్ల తమకున్న ప్రేమను ఒలకబోస్తారు. తెలుగుకు పట్టిన అన్యాయాన్ని గురించి ఘోషిస్తారు. ఆ ఉత్సవాలు ముగియగానే ఆ విషయం గురించి మరచిపోతారు. అంతే. 10వ తరగతితోనే విద్యార్థులు తెలుగు భాషను మరచిపోయే దుస్థితి ఏర్పడింది. ఇంటర్, డిగ్రీలలో విద్యార్థులు ద్వితీయ భాషగా చదువుకునేందుకు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూపు తదితర పోటీ పరీక్షల సిలబస్‌లో తెలుగు సాహిత్యం, వ్యాకరణాలను కూడా తప్పనిసరిగా చేర్చాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్